ఏం నరేంద్ర మోడీ వివిధ చేస్తుంది?
ఇతరుల కంటే శ్రీ నరేంద్ర మోదీ ఏ రకంగా భిన్నమైన వారని ఎవరైనా అడగడం సహజం. అయితే మీరు శ్రీ నరేంద్ర మోదీ ని కలుసుకొంటే మాత్రం ఆయన తప్పకుండా ఇతరుల కన్నా భిన్నమైన వ్యక్తేనని మీకు మనస్పూర్తిగా అనిపిస్తుంది. దీనికి ఇంకాస్త ముందుకు వెళ్ళి, స్వతంత్ర భారత చరిత్రను గమనించినట్లయితే శ్రీ నరేంద్ర మోదీ విశిష్టమైన వ్యక్తి అని చెప్పడానికి ఎన్నో హేతుబద్ధమైన కారణాలు మీకు గోచరిస్తాయి. అధికారం, ఆకాంక్షలు కలగలసిన నాయకుడాయన. దార్శనిక దృష్టి కలిగిన రాజకీయ నాయకులను మనం చూశాము. సమగ్ర వివరాలపై దృష్టి పెట్టే నాయకులనూ చూశాము. శ్రీ నరేంద్ర మోదీ ఈ రెండు లక్షణాలూ కలిగిన వ్యక్తి. ఆయన చూపు నక్షత్ర మండలంపైన ఉన్నా , ఆయన పాదాలు వాస్తవికతకు ప్రతిరూపంగా భూమిని తాకి ఉంటాయి. ఇతరుల కంటే శ్రీ నరేంద్ర మోదీ ఎలా భిన్నమైన వారో, ఆయన ఎంతటి విశిష్ట వ్యక్తో తెలియజేసే అంశాలను గమనించే ప్రయత్నం చేద్దాము.
జన హృదయ నేత:
శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యారు. దేశంలోని కొద్ది మంది రాజకీయ నాయకులకు మాత్రమే ఇటువంటి అసాధారణ కార్యం సాధ్యం. ప్రజలతో ఆయన బంధం రాజకీయ సంబంధమైంది కాదు, దేశ సామాన్య ప్రజలతో ఆయన ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోగలిగారు.ఆయనను అభిమానించే వారిలో పట్టణ ప్రాంతాలలోని మేధావుల నుండి గ్రామీణ ప్రాంతాలలోని సామాన్య జనం వరకు ఉన్నారు. వీరిలో వయోధికులు, యువకులు, పురుషులు, స్త్రీలు, ఈ దేశ వాసులు, విదేశీయులు సైతం కలిసి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న గుజరాతీలలో ఎక్కువ మంది ఆయనను ఆరాధ్యుడిగా భావిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది ప్రజలతో అనుసంధానానికి శ్రీ నరేంద్ర మోదీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తారు.
నిరంతరం అభివృద్ధి ధ్యాసే:
శ్రీ నరేంద్ర మోదీ మనస్సులో నిరంతరం మెదిలే ఆలోచన అభివృద్ధి. ఇందుకు ఒక ఉదాహరణను చెప్పుకోవచ్చు. కొద్ది సంవత్సరాల క్రితం గుజరాత్ ఎన్నికల ప్రకటనకు ఒక నెల రోజుల ముందు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి స్విట్జర్లాండ్ కు వెళ్లారు. అలాగే 2012లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీ నరేంద్ర మోదీ జపాన్ కు వెళ్ళారు. ఈ పర్యటనలో గుజరాత్, జపాన్ ల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సహకారం పెద్ద ఎత్తున సాకారమైంది. మామూలుగా రాజకీయ నాయకుడికి తిరిగి ఎన్నిక కావడం, అధికారాన్ని కైవసం చేసుకోవడం అనేవి ఎన్నికల సంవత్సరం ముందు ప్రాధాన్య అంశాలుగా ఉంటాయి. కానీ శ్రీ నరేంద్ర మోదీకి మాత్రం ఎన్నికల సంవత్సరంలో కూడా రాజకీయ పనుల కంటే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే అత్యంత ముఖ్యమైన అంశం.
సమస్యల పరిష్కారంలో శాస్త్రీయ విధానం:
గుజరాత్‌లో శ్రీ నరేంద్ర మోదీ పాలన విజయవంతం కావడానికి కారణం ఏ సమస్య పరిష్కరానికైనా ఆయన అనుసరించిన విధానమే. ముందు ఆయన సమస్య ఏమిటన్నది పరిశీలిస్తారు. ఆ సమస్య ఒక్కదానినే కాకుండా, దానితో ముడిపడిన అన్ని అంశాలను గమనిస్తారు. అన్ని కోణాలలో నుండి సమస్యను అర్థం చేసుకోవడానికి ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తారు. సమస్య బాగా అర్థమైతే, సగం సమస్య పరిష్కారమైనట్టేనన్నది ఆయన భావన. ఆయన ఓపికగా వింటారు. ఆ తరువాతే పరిష్కారాన్ని గురించి ఆలోచిస్తారు. ఏ సమస్య పరిష్కారానికైనా దగ్గరి దారులను కానీ, కంటితుడుపు చర్యలను గాని తాత్కాలిక చర్యలను గాని ఆయన తీసుకోరు. భవిష్యత్ దృష్టితో, మూలం నుండి మార్పును కోరుకొంటూ దీర్ఘకాలికమైన, శాశ్వత పరిష్కారాన్ని కోరుకొంటారు. ఇందుకు స్పష్టమైన లక్ష్యాలతో, పరిశీలించదగిన సూచికలకు రూపకల్పన చేస్తారు. తదనంతరమే కార్యాచరణ యంత్రాంగానికి రూపకల్పన చేస్తారు.
సరైన ప్రక్రియ, సరైన ఏజెన్సీ మాత్రమే కాదు వీటి అమలుకు సరైన వ్యక్తులను కూడా వారు ఎంపిక చేస్తారు. వీటి అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించగల, పరిశీలించగల సామర్ధ్యం ఆయనకు ఉంది. ఆయన మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ కాదు కానీ, ఆయన కొత్త ఆలోచనలు, మేనేజ్‌మెంట్ కళాశాలల్లో బోధించేదాని కంటే ఎంతో ముందున్నాయి.
దేశ వ్యాప్తంగా, ముఖ్యమంత్రిగా గుజరాత్ అంతటా పర్యటించిన శ్రీ మోదీ అనుభవం సామాన్యుల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఉపకరించింది. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రపంచ పరిచయం, విస్తృత పఠనం సరైన అవగాహనను కల్పించడమే కాదు, సమస్యల పరిష్కారానికి సరైన దృక్పథానికి , దార్శనికతకు ఉపకరించాయి.
భారీ ప్రభావాన్ని చూపే ప్రాజెక్టులు:
ప్రాజెక్టుల గురించి ఆలోచించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయించగల వ్యూహకర్త శ్రీ నరేంద్ర మోదీ. వీటి ఫలితాలు మనం గుజరాత్‌లో చూశాము. కొన్ని సందర్భాలలో ఆయా లక్ష్యాల ఫలితాల కోసం వేచి ఉండడంలో అసహనంతో కనిపిస్తారు. దేశం వివిధ ప్రాంతాలలో నదుల అనుసంధానం అనేది ఇంకా చర్చల స్థాయిలోనే ఉంటే శ్రీ నరేంద్ర మోదీ మాత్రం గుజరాత్‌లో సుమారు డజను నదులను విజయవంతంగా అనుసంధానం చేసి, ఎప్పుడో ఎండిపోయాయనుకున్న నదులలోకి జల కళ వచ్చేటట్లు చేశారు. అలాగే ‘సుజలాం సుఫలాం’ లో భాగంగా 3 సంవత్సరాలలోనే 300 కిలోమీటర్ల పొడవైన కాలువను తవ్వించి, మంచినీటి కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాలకు నీరు అందేటట్టు చేశారు. ఇంకా విశేషమైన విషయం ఏమిటంటే, ‘జ్యోతిగ్రామ్ యోజన’లో భాగంగా 30 నెలల్లో 9,681 పల్లె శివార్లు, 18,000కు పైగా గ్రామాలలో 56,599 కిలోమీటర్ల కొత్త విద్యుత్ సరఫరా లైన్ లు, 12,621 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయించగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా వాటర్, గ్యాస్ గ్రిడ్ లను ఏర్పాటు చేయించారు. ఇ -గ్రామ్, విశ్వగ్రామ్ పథకాల కింద అన్ని గ్రామాలను బ్రాడ్ బ్యాండ్‌తో అనుసంధానం చేశారు. ఇవన్నీ పెద్ద ఎత్తున త్వరితగతిన అమలుచేసిన భారీ ప్రాజెక్టులకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
పెద్ద పథకాలు, చిన్నపథకాలు రెండూ మంచివే:
భారీ ప్రాజెక్టులు, కోట్లాది రూపాయల ఖర్చు కాగల పథకాల అమలులో ఎలాంటి దార్శనికతను ప్రదర్శించే వారో, అలాగే చిన్న చిన్న పరిష్కారాలను స్థానిక సాంకేతికతలను శ్రీ మోదీ ఏనాడూ విస్మరించే వారు కారు. సైన్స్ విశ్వవ్యాపితమైనదై ఉండాలి, సాంకేతికత మాత్రం స్థానికతను కలిగి ఉండాలి అని ఆయన ఎప్పుడూ అంటూ ఉండే వారు. జల వనరుల రంగంలో వారు స్థానిక పరిష్కారాలకు బోరి బంద్ ల వంటి వాటికి (ఖాళీ గోనె సంచులను రాళ్లు, ఇసుక తో నింపి నీటి ప్రవాహానికి అడ్డుగా వేయడం ద్వారా నీరు వాటి గుండా ప్రవహించేటట్టు చేసే ప్రక్రియకు) ప్రాచుర్యం కల్పించారు. అలాగే పొలంలో నీటి కుంటలకు ప్రాచుర్యం కల్పించారు. వైబ్రంట్ గుజరాత్ సమిట్ సందర్భంగా గమనించిన అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడానికి ప్రజలను ప్రోత్సహించారు. అదే సమయంలో స్థానిక రైతుల పరిశోధనలు ప్రయోగాలను కూడా గౌరవించారు; వారి నైపుణ్యాలను ఆదరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొన్నారు. వారికి రోజూ అందుతూ వచ్చిన వందలాది ఇ-మెయిల్స్ లోను, లేఖ లలోను సామాన్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకూ విలువనిచ్చారు.
పాలన నుంచి రాజకీయాలను వేరు చేసిన ఘనత:
శ్రీ నరేంద్ర మోదీ విశిష్టమైన పాలన విధాన నిర్ణేత. ఆయన ఎన్నడూ రాజకీయ అవసరాలను, పాలనాపరమైన వాటితో ముడిపెట్టరు. పాలనా పరమైన నిర్ణయం వల్ల తలెత్తగల రాజకీయ తదనంతర పరిణామాల గురించి ఆయన దృష్టికి తెచ్చినా, ఆయన ఆ విషయంలో వాస్తవిక దృష్టితొనే వ్యవహరిస్తారు. గుజరాత్ పాలనలో ఆయనకు ఉపయోగపడింది ఇదే. వృత్తిపరమైన నైపుణ్యంతో అంతర్జాతీయంగా అవలంబించే అత్యుత్తమ ప్రమాణాలను పాలనలో అనుసరించడం వల్ల గుజరాత్‌లో ప్రభుత్వ పాలన మెరుగైందిగా రూపుదిద్దుకొంది. గుజరాత్ ప్రభుత్వంలోని చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థలు ఐఎస్ఒ సర్టిఫికేషన్ ను పొందగలిగాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు ఇలాంటి ధ్రువపత్రం అక్కర లేదు.
ప్రజల నాడి తెలిసిన నేత:
శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లో వెనుకబడిన ప్రాంతానికి చెందిన, వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తి. యువకుడిగా ఆయన సామాన్యులు అనుభవించే పలు కష్టాలు.. ముఖ్యంగా విద్యుత్ , మంచినీటికి సంబంధించిన కష్టాలను అనుభవించారు. ఈ రంగాలలో సాయం చేయడానికి తనకు అవకాశం రాగానే ఆయన ఈ సమస్యల పరిష్కార వ్యవస్థకు వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించారు.
సమ్మిళిత అభివృద్ది:
ప్రధాన పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనే దృష్టి సారిస్తారని, వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలను పట్టించుకోరని కొందరు ఆయనపై విమర్శలు చేస్తుంటారు. నిజానికి ఇటువంటి విమర్శల కంటె పెద్ద తప్పిదం మరొకటి లేదు. ఆయన గుజరాత్ రాష్ట్రంలో ‘జ్యోతిగ్రామ్ యోజన’ను ప్రారంభించినపుడు ఒక ప్రాంతాన్నో, ఒక వర్గాన్నో ఎంపిక చేయలేదు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసినపుడు ఏ ఒక్క ప్రాంతానికో మేలు చేసే విధంగా కాకుండా సమ్మిళిత అభివృద్దికి చర్యలు చేపట్టారు. ‘వన బంధు యోజన’, ‘సాగర్ ఖేడు యోజన’, ఉమీద్’ ల వంటి ప్రధాన పథకాలను ప్రత్యేకించి సమాజంలో వెనుకబడిన ప్రజలకు అందేలా చూశారు. అంతే కాదు సమాజంలోని ఏ వర్గాన్నీ , ఏ ప్రాంతాన్నీ మినహాయించకుండా మేలు చేకూర్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 55 మిలియన్ గుజరాతీల అభ్యున్నతి కోసం శ్రీ మోదీ కృషి చేశారు.
పాలనలో, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం:
ప్రజలలో ఒకరిగా పెరిగి, వారి మధ్యే పని చేసిన వ్యక్తిగా ప్రజలే నిజమైన మార్పునకు ప్రతినిధులని శ్రీ నరేంద్ర మోదీ విశ్వసిస్తారు. ఏ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన నిజమైన ఫలాలైనా ప్రజలకు అందాలంటే, అది ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవాలి గాని కేవలం ప్రభుత్వ పథకంగా మిగిలిపోరాదు. ఆయన సరదాగా జన్మాష్టమి రోజు అర్ధరాత్రి ఆలయాలలో వేడుకలకు గుమికూడాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వం నుండి ఏదైనా ఉత్తర్వు ఉందా ? అని అంటారు.
అందువల్ల అభివృద్ధి పథకాల అమలులో ప్రజలను ఆయన భాగస్వాములను చేస్తారు. గుజరాత్‌లో జల సంరక్షణకు సంబంధించిన లక్షలాది నిర్మాణాలు ప్రజల భాగస్వామ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంతే కాదు, ప్రభుత్వ పథకాలను ప్రజల భాగస్వామ్యంతో మహోద్యమాలుగా మలిచారనడానికి ఉదాహరణగా గుజరాత్‌లో అమలైన ‘కృషి మహోత్సవ్’, బాలికల విద్య కోసం ‘కన్యా కేలవణీ యాత్ర’ వంటి వాటి విజయాన్ని చెప్పుకోవచ్చు.
సులభమైన, సమర్థమైన , పారదర్శకమైన పాలన:
ఎంత సులభమైన పరిపాలన ఉంటే అంత మంచి పరిపాలన అవుతుందని శ్రీ నరేంద్ర మోదీ ఎప్పుడూ చెబుతూ ఉండే వారు. ఇందుకోసం పాలన ప్రక్రియను సులభతరం చేసేందుకు, సమర్ధంగా రూపుదిద్దేందుకు ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీని ఆయన ఉపయోగించుకున్నారు. 2001నాటికి ఐటిఇఎస్, ఇ- గవర్నెన్స్ లను ఏమాత్రం అనుసరించని రాష్ట్రం ఇప్పడు అత్యుత్తమ ఇ- గవర్నెన్స్ అమలు చేస్తున్న రాష్ట్రంగా ఎదిగింది. ఇది ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ పరిశ్రమకు లబ్ధిని చేకూర్చడం కోసం కాక, సామాన్యుడు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో పాలుపంచుకొనేటపుడు సౌకర్యవంతంగా ఉండేలా రూపుదిద్దారు. రాష్ట్రంలోని పలు ప్రధాన విభాగాలలో వన్ డే గవర్నెన్స్‌సెంటర్ లను ఏర్పాటు చేసి వీటి ద్వారా వేగవంతంగా దస్తావేజు పత్రాలు, ధ్రువపత్రాలు అందించే కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పంచాయతీలను కంప్యూటరైజ్ చేసేందుకు , వాటికి బ్రాడ్ బ్యాండ్ అనుసంధానాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. ఇ- గవర్నెన్స్ వల్ల పారదర్శకతకు కూడా అవకాశం ఉంటుంది.
విధానాల ఆధారిత పాలన:
నా పాలన ఏ ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలపైన ఆధారపడి నడవదు. మా ప్రగతి సంస్కరణల ఆధారితం. మా సంస్కరణలు విధాన ఆధారితం, మా విధానాలు ప్రజల ఆధారితంగా ఉంటాయి అని శ్రీ నరేంద్ర మోదీ అంటారు. ఈ తరహా విధానం అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేయడమే కాక, సత్వర సరైన నిర్ణయాలను తీసుకోవడానికి తద్వారా పారదర్శకతకు, వ్యవస్థలో ఏకరూపతకు వీలు కల్పిస్తుంది.
ఫిర్యాదుల పరిష్కారం:
సామాన్యుల ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యమివ్వడం జరిగింది. ‘గుజరాత్ స్వాగత్’ కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా పాలుపంచుకొనే వారు. ఇది అధికార యంత్రాంగానికి సరైన సందేశాన్ని పంపగలిగింది. పాలన యంత్రాంగం ఫిర్యాదుల పరిష్కారంలో నిష్పాక్షికంగా , చిత్తశుద్ధితో వ్యవహరించేలా చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విధంగా ఆయన చర్యలు తీసుకొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ముఖ్యమంత్రి మాత్రమే కాక మొత్తం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత, జవాబుదారుతనం కలిగి ఉందన్న విశ్వాసం ప్రజలలో కలిగించేందుకు చర్యలు తీసుకోవడం దీని వెనుక ఉన్న ప్రధాన తాత్వికత.
వినూత్న వైఖరి:
ప్రజలు , పాలన యంత్రాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి పాలన యంత్రాంగంలోని నిపుణులు, యాజమాన్య నిపుణులు ఇన్నేళ్లుగా ఆలోచించని రీతిలో శ్రీ నరేంద్ర మోదీ వినూత్న మార్గాన్ని చూపారు. భూ కంప అనంతర పునర్నిర్మాణ పనులను ప్రజా కమిటీల ఆధ్వర్యంలో చేపట్టారు. అలాగే అధికారులను నిబంధనల మేరకు మాత్రమే పనిచేసే వారిగా కాకుండా పునర్నిర్మాణ కార్యకలాపాలలో పాల్గొనే చురుకైన వ్యక్తులుగా తీర్చిదిద్దారు. ఇది ఆయన వినూత్న వైఖరికి ఒక నిదర్శనం. అలాగే న్యాయస్థానాలు, కారాగారంలో విచారణలో ఉన్న వారికి మధ్య వీడియో కాన్ఫరెన్సింగ్ విచారణ ద్వారా సత్వర న్యాయ సహాయానికి బాటలు వేశారు. సాయంకాలపు న్యాయస్థానాలు, ‘నారీ అదాలత్’లు, తాగు నీరు, సాగునీరు కోసం ఏర్పాటు చేసిన జల వనరుల నిర్వహణకు ప్రజా సంఘాల ఏర్పాటు, పేదరిక రేఖకు దిగువన ఉన్న మహిళలకు ప్రైవేటు మహిళా వైద్యులతో ప్రసవ సమయ వైద్య సేవలు అందించేందుకు చిరంజీవి యోజనను తీసుకువచ్చారు. ఇంకా రోమింగ్ రేషన్ కార్డులు, భూ సార పరీక్షల కార్డులు, ఇంకా మరెన్నో సదుపాయాలను కల్పించారు.
తన కోసం ఏమీ కోరని నేత:
అధికారంలో ఉన్న వారిపై సాధారణంగా బంధు ప్రీతి, పక్షపాతం వంటి ఆరోపణలు వస్తుంటాయి. తమ బంధువుల కోసం వారు ఇలా చేస్తారని ఆరోపణలు వస్తుంటాయి. అయితే శ్రీ నరేంద్ర మోదీపై ఇలాంటి ఆరోపణలు ఏవీ లేవు. అంతే కాదు నిష్పాక్షికతకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాలనూ పక్కన పడేసే స్థితికి చేరుకొన్నారు. ఒక రాజనీతిజ్ఞుడుగా ఆయన సేవలు సమాజగతం. ఆయన బద్ధ వ్యతిరేక శక్తులు కూడా శ్రీ నరేంద్ర మోదీ హయాంలో అన్నిస్థాయిలలో అవినీతి స్థాయి తగ్గుముఖం పట్టిందని అంగీకరిస్తారు.
శ్రీ నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి హోదాలో వచ్చే బహుమతులను నిబంధనల ప్రకారం తోఫాఖానాలో జమ చేస్తారు. ఆ తరువాత దానిని వేలం వేలం వేసి, ఆ వచ్చిన డబ్బును రాష్ట్ర ఖజానాలో జమ చేస్తారు. ఇదొక్కటే కాదు, ఈ నిధులను వినియోగించే కొత్త పద్ధతిని కూడా ఆయన రూపొందించారు. ఈ నిధులను బాలికా విద్య కోసం ఏర్పాటు చేసిన పథకం ‘కన్యా కేలవణీ నిధి’కి కేటాయించాలని నిర్ణయించారు. ఫలితంగా, తమ ప్రియతమ నేత చిత్తశుద్ధికి ఎంతో ప్రభావితులైన ప్రజలు, ఈ బాలికా నిధి కోసం ఆయనను లక్షల రూపాయల విలువచేసే చెక్కులతో ఆయనను సన్మానిస్తున్నారు.
పాలనలో వైవిధ్యం:
గుజరాత్‌లో శ్రీ నరేంద్ర మోదీ రూపొందించిన పాలన నమూనా పనితీరు ఆధారంగా రూపొందించిందే గాని బుజ్జగింపుల ఆధారంగా సిద్ధమైంది కాదు. ఉదాహరణకు విద్యుత్తు రుసుముల హేతుబద్దీకరణ విషయాన్నే తీసుకొంటే, ఆయన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లోని నిపుణుల సలహాలను తీసుకొని అందుకు అనుగుణంగా వ్యవహరించారు. రైతులు ఆందోళన చేసినా ఆయన వెనునకకు తగ్గలేదు. ఇందుకు బదులుగా ఆయన రైతుల అవసరాలేమిటో తనకు తెలుసునంటూ వారికి నచ్చజెప్పారు. రైతులకు కావలసింది విద్యుత్ ఒక్కటే కాదని, వారికి పొలాలకు నీటిసరఫరా కూడా అవసరమన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ తరువాతి సంవత్సరాలలో ఆయన సుజలాం సుఫలాం పేరుతో భూ ఉపరితల జల సరఫరా పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు భూగర్భ జల మట్టాలు పెరగడంతో రైతులు సేద్యం కోసం తక్కువ ధరకే నీటిని పొందగలుగుతున్నారు. అర్బన్ సంవత్సరంలో పెద్ద ఎత్తున ఆక్రమణలను తొలగించారు. విద్యుత్ చౌర్యాన్ని పెద్ద ఎత్తున అరికట్టి విద్యుత్ చౌర్యం చేసే వారిపై కేసులు పెట్టేలా చేశారు. కానీ ఎక్కడా ఆందోళనలు లేవు. చెడుగా ఆలోచించే వారూ లేరు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ దీర్ఘకాలికంగా తమకు మేలు చేసేవేనని గుర్తించారు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన దూరదృష్టి, వృత్తినైపుణ్యం, సామాన్యుడి పట్ల ఆయనకు ఉన్న సానుభూతి.. ఇవన్నీ ఇతర నాయకుల కన్న శ్రీ మోదీ ని భిన్నంగా నిలబెట్టే అంశాలు. ఆయన చిత్తశుద్ధి కారణంగా గుజరాత్‌లోనే పేరున్న నాయకుడిగా కాక దేశంలోనే పేరున్న నాయకుడిగా ఎదిగారు. వరుసగా నాలుగో సంవత్సరం దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యారు. అలాగే గుజరాత్‌లో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా శ్రీ నరేంద్ర మోదీయే. సుపరిపాలనే మంచి రాజకీయాలని ఆయన రుజువు చేశారు. బుజ్జగింపు రాజకీయాల నుండి అభివృద్ధి రాజకీయాల వైపు దేశాన్ని మళ్లించిన సరళిని ఏర్పాటు చేసిన వ్యక్తిగా శ్రీ నరేంద్ర మోదీ నిలుస్తారు.
ఇతర రాజకీయ నాయకులకంటే శ్రీ నరేంద్ర మోదీ భిన్నమైన వారని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి మార్పు కోసమే భారతదేశం ఆతృతతో ఎదురుచూస్తోంది.