నా మంత్రివర్గ సహచరులు శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ గారు, శ్రీ సి.ఆర్.చౌదరి గారు, యుఎన్ సిటిఎడి సెక్రటరీ జనరల్ డాక్టర్ ముఖీసా కిటూయీ గారు మరియు ఇక్కడ ఉన్న ఇతర ఉన్నతాధికారులారా,
ముందుగా, వినియోగదారుల పరిరక్షణ వంటి ఒక ముఖ్యమైన అంశం పై ఈ ప్రాంతీయ సమావేశం సందర్భంగా మీ అందరికీ ఇవే నా అభినందనలు. ఈ కార్యక్రమంలో దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, ఇంకా తూర్పు ఆసియాలోని అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. మీ అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను.
ఈ కార్యక్రమం దక్షిణ ఆసియాలో జరగడం ఇదే ప్రథమం. భారతదేశం చొరవకు మద్దతిచ్చినందుకు మరియు ఈ కార్యక్రమాన్ని ఈ దశ దాకా తీసుకురావడంలో ఒక క్రియాశీల పాత్రను పోషించినందుకు గాను యుఎన్‌సిటిఎడి కి కూడా నేను కృతజ్ఞత తెలియజేయాలని అనుకొంటున్నాను.
మిత్రులారా, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ముమ్మర చారిత్రక అన్యోన్యత ప్రపంచంలో చాలా కొద్ది ప్రాంతాలకు ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా మనం వ్యాపారంతోను, సంస్కృతితోను మరియు మతంతోను అనుసంధానింపబడ్డాం. ఈ ప్రాంతాన్ని కొన్ని శతాబ్దాలుగా అనుసంధానించడంలో కోస్తా తీరం ప్రాంత ఆర్థిక వ్యవస్థ కూడా ప్రముఖ పాత్రను పోషించింది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రజల రాకపోకలు మరియు ఆలోచనలను, అభిప్రాయాలను పరస్పరం వెల్లడించుకోవడం అనేది రెండు వైపుల నుండి జరుగుతూ వచ్చిన ప్రక్రియ; ఇది ఈ ప్రాంతంలోని ప్రతి దేశానికీ ప్రయోజనం చేకూర్చింది. ఇవాళ మనమంతా ఆర్థికంగానే కాకుండా, సాంస్కృతికంగా కూడా ఒక ఉమ్మడి వారసత్వానికి ప్రతీకలుగా ఉన్నాం.
మిత్రులారా, నేటి ఆధునిక యుగంలో మన సాంప్రదాయక సంబంధాలు ఒక కొత్త పరిమాణాన్ని సంతరించుకొన్నాయి. ఆసియా దేశాలు తమ సొంత వస్తువులు మరియు సేవల విపణుల అవసరాలను తీర్చడంతో పాటు, తమ వ్యాప్తిని ఇతర ఖండాలకు సైతం విస్తరించుకొన్నాయి. ఇటువంటి దృశ్య వివరణలో వినియోగదారుల పరిరక్షణ అనేటటువంటిది ఒక ముఖ్యమైన భాగంగా ఉంటూ, ఈ ప్రాంతంలో వ్యాపారాన్ని పటిష్టపరచి పెంపొందింపజేసేది కానుంది.
ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం మన పౌరుల అవసరాలను ఎంత లోతుగా మనం ఆకళింపు చేసుకొంటున్నాం అన్న దానిని ప్రతిఫలించడమే గాక, వారి ఇబ్బందులను అధిగమింప జేయడానికి మనం ఎంత కఠోరంగా శ్రమిస్తున్నాం అనే దానికి కూడా అద్దం పడుతుంది. ప్రతి పౌరుడు ఒక వినియోగదారు కూడా; కాబట్టి, ఈ కార్యక్రమం మనం సమష్టి సంకల్పానికి సైతం ఒక సంకేతం.
ఈ యావత్తు ప్రక్రియలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) కూడా ఒక భాగస్వామిగా ముందుకు రావడం చాలా ఉత్సాహాన్నిస్తోంది. మొట్టమొదటిసారిగా వినియోగదారుల పరిరక్షణ అంశం పై ఐరాస మార్గదర్శక సూత్రాలు 1985లో రూపుదిద్దుకొన్నాయి. వాటిని రెండు సంవత్సరాల కిందట సవరించడమైంది. సవరణ ప్రక్రియలో భారతదేశం కూడా క్రియాశీల పాత్రను పోషించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిలకడతనంతో కూడిన వినియోగం, ఇ-కామర్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసుల విషయంలో ఈ మార్గదర్శక సూత్రాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి.
మిత్రులారా, భారతదేశంలో వినియోగదారుల పరిరక్షణ అనేది కొన్ని యుగాలుగా పాలనలో ఒక అంతర్భాగంగా ఉంటూ వచ్చింది. వేల సంవత్సరాల క్రితం లిఖించబడిన మన వేదాలలో వినియోగదారుల పరిరక్షణను గురించిన ప్రస్తావన ఉంది. అధర్వణ వేదంలో-
“इमा मात्रा मिमीम हे यथ परा न मासातै”
అని ఉల్లేఖించబడింది. నాణ్యత మరియు కొలత.. ఈ అంశాలలో ఎవరూ కూడా దురాచారాలకు ఒడిగట్టకూడదని ఈ మాటలకు అర్థం.
వినియోగదారుల పరిరక్షణ సంబంధిత నియమాలను గురించి మరియు దురభ్యాసాలకు ఒడిగట్టిన వ్యాపారికి విధించవలసిన శిక్షను గురించి ఈ పురాతన పత్రాలు వివరించాయి. వ్యాపారాన్ని ఎలా క్రమబద్ధం చేయాలో, వినియోగదారుల ప్రయోజనాలను ఎలా కాపాడాలో ప్రభుత్వానికి వివరించే మార్గదర్శక సూత్రాలు ఉన్నాయని భారతదేశంలో దాదాపు 2500 సంవత్సరాల కింద- కౌటిల్యుడి కాలంలో- తెలిస్తే మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. కౌటిల్యుని కాలంలో వ్యవస్థాగతంగా రూపుదిద్దుకొన్న పదవులను ఈ కాలానికి చెందినటు వంటి డైరక్టర్ ఆఫ్ ట్రేడ్ మరియు ద సూపరింటెండెంట్ ఆఫ్ స్టాండర్డ్స్ గా పరిగణించవచ్చు.
మిత్రులారా, మనం వినియోగదారులను దైవాలుగా పరిగణిస్తున్నాం. చాలా దుకాణాలలో మీరు ఒక సందేశాన్ని– ग्राहक देवो भव: – చూసే ఉంటారు. ఏ వ్యాపారం అన్న దాంతో సంబంధం లేకుండా వినియోగదారుల సంతృప్తే పరమార్థం కావాలి.
మిత్రులారా, 1986లో, ఐరాస మార్గదర్శక సూత్రాల పై అంగీకారం కుదిరిన మరుసటి సంవత్సరంలో, వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చిన మొదటి కొన్ని దేశాలలో భారతదేశం కూడా ఒకటి.
వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ ప్రాథమ్యాలలో ఒకటిగా ఉన్నది. ఇది ‘న్యూ ఇండియా’ దిశగా మేం తీసుకున్న సంకల్పంలోనూ ప్రతిఫలిస్తోంది. వినియోగదారుల పరిరక్షణ కంటే మిన్నగా ‘న్యూ ఇండియా’ ఉత్తమమైన వినియోగదారు అభ్యాసాలు మరియు వినియోగదారుల సమృద్ధిలకు పెద్ద పీట వేస్తుంది.
మిత్రులారా, దేశం యొక్క వ్యాపార పద్ధతులను, ఇంకా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చే పనిలో మేం నిమగ్నమై ఉన్నాం. ప్రతిపాదిత చట్టం వినియోగదారుల సాధికారితకు గొప్ప ప్రాధాన్యాన్ని కట్టబెడుతుంది. వినియోగదారుల ఇక్కట్లను నిర్ణీత కాలం లోపల మరియు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పరిష్కరించేటట్లుగా నియమాలను సరళతరం చేస్తున్నాం. పెడదోవను పట్టించే ప్రకటనలపై కఠిన నిబంధనలను రూపొందిస్తున్నాం. సత్వర పరిష్కార చర్యల కోసం కార్యనిర్వాహణ అధికారాలు కలిగిన ఒక కేంద్రీయ వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తాం.
ఇళ్ళ కొనుగోలుదారులను కాపాడటం కోసం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్టు (ఆర్ఇఆర్ఎ) కు మేం చట్టబద్ధతను కల్పించాం. ఇంతకు ముందు వినియోగదారులు వారి ఇళ్ళను స్వాధీనపరచుకోవడం కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండేవారు. ఈ క్రమంలో వారు అన్యాయానికి వెనుకాడని భవన నిర్మాతల బారిన పడవలసిన ప్రమాదం పొంచి ఉండేది. ఒక ఫ్లాట్ యొక్క విస్తీర్ణం విషయంలోనూ అస్పష్టత నెలకొని ఉండేది. ఇప్పుడు ఆర్ఇఆర్ఎ వచ్చిన తరువాత నమోదైన డెవలపర్లు మాత్రమే అవసరమైన అన్ని అనుమతులను పొందిన తరువాతనే బుకింగుల కోసం అభ్యర్థించవలసివుంటుంది. పైపెచ్చు, బుకింగ్ అమౌంటును కేవలం 10 శాతంగా ఖరారు చేయడమైంది.
ఇంతకుముందు, భవన నిర్మాతలు బుకింగుల కోసం స్వీకరించిన సొమ్మును ఇతర పథకాలకు మళ్ళించే వారు. కొనుగోలుదారులు చెల్లించిన మొత్తంలో 70 శాతం మొత్తాన్ని ఒక ‘ఎస్క్రో’ ఖాతాలో ఉంచే విధంగా ఒక కఠినమైన నిబంధనను ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చింది. ఈ సొమ్మును ఆ పథకం కోసమే ఖర్చు చేయవలసి ఉంటుంది.
ఇదే విధంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యాక్ట్‌కు కూడా చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన లేదా వినియోగదారు ప్రయోజనంతో కూడిన వస్తువును లేదా సేవను తప్పనిసరిగా ధ్రువీకరణ పరిధిలోకి తీసుకురావచ్చు. నాసి రకం ఉత్పత్తులను విపణిలో నుండి ఉపసంహరించాలన్న ఉత్తర్వులను ఇచ్చే నిబంధనలు కూడా ఈ చట్టంలో ఉన్నాయి. అంతే కాకుండా, వినియోగదారు నష్టపోయిన లేదా వినియోగదారులకు హాని కలిగిన సందర్భంలో నష్టపరిహారం కోరవచ్చు కూడా.
ఇటీవల భారతేదశం వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్‌టి)ని కూడా అమలు చేసింది. జిఎస్‌టి అమలులోకి వచ్చాక దేశంలో డజన్ల కొద్దీ వేరు వేరు రకాల పరోక్ష పన్నులు రద్దు చేయబడ్డాయి; మరుగుపరచిన పన్నులు ఎన్నో తెరమరుగు అయ్యాయి కూడా. ఇప్పుడు వినియోగదారులు రాష్ట్ర ప్రభుత్వానికి వారు ఎంత పన్ను చెల్లిస్తున్నదీ, కేంద్ర ప్రభుత్వానికి ఎంత పన్ను వెళుతున్నదీ తెలుసుకో గలుగుతున్నారు. సరిహద్దు ప్రాంతాలలో ట్రక్కులు బారులు తీరి ఉండటానికి కాలం చెల్లింది.
జిఎస్‌టి రాకతో ఒక కొత్త వ్యాపార సంస్కృతి వ్యాపిస్తున్నది. దీర్ఘ కాలంలో వినియోగదారులు అతి పెద్ద లబ్దిదారులుగా అవుతారు. ఇది ఒక పారదర్శకమైన వ్యవస్థ. ఇందులో వినియోగదారుల ప్రయోజనాలను ఎవరూ దెబ్బతీయ జాలరు. జిఎస్‌టి కారణంగా స్పర్ధ పెరిగి ధరలు దిగి రావడం సాధ్యపడనుంది. ఇవి పేదలకు మరియు మధ్యతరగతి వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చగలదు.
మిత్రులారా, చట్టం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడాన్ని పటిష్టపరచడమే కాకుండా, ప్రజల ఇక్కట్లను త్వరిత గతిన బాపడం కూడా అవసరమే. గత మూడు సంవత్సరాలలో మా ప్రభుత్వం సాంకేతిక విజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకొంటూ ఇక్కట్ల పరిష్కారానికి ఒక కొత్త యంత్రాంగాన్ని ఆవిష్కరించింది.
నేషనల్ కన్ స్యూమర్ హెల్ప్‌లైన్ సామర్థ్యాన్ని 4 రెట్లకు పెంచడమైంది. వినియోగదారుల పరిరక్షణతో ముడిపడిన పోర్టల్స్ మరియు సోషల్ మీడియా కూడా సమ్మిళితం చేయబడ్డాయి. పెద్ద సంఖ్యలో ప్రైవేటు కంపెనీలు ఈ పోర్టల్‌కు జోడించబడ్డాయి. దాదాపు 40 శాతం ఫిర్యాదులను నేరుగా ఆయా కంపెనీలకు శీఘ్ర గతిన పరిష్కారం కోసమని పోర్టల్ ద్వారా బదలాయించడం జరుగుతుంది. ‘‘జాగో గ్రాహక్ జాగో’’ ప్రచారోద్యమం ద్వారా కూడా వినియోగదారులలో చైతన్యాన్ని మేల్కొల్పడం జరుగుతోంది. ఈ ప్రభుత్వం భారతదేశంలో వినియోగదారుల పరిరక్షణ కోసం సోషల్ మీడియాను ఇంతకుముందు ఎన్నడూ జరుగని విధంగా సకారాత్మంగా వినియోగించుకొందని నేను నమ్మకంగా చెప్పగలను.
మిత్రులారా, నా ఉద్దేశంలోను, నా ప్రభుత్వం దృష్టిలోను వినియోగదారుల పరిరక్షణకు ఉన్న పరిధి చాలా విస్తృతమైనటువంటిది. ఏ దేశంలోనైనా అభివృద్ధి మరియు వినియోగదారుల పరిరక్షణ.. ఈ రెండూ పరస్పర పూరకాలుగా ఉంటాయి. అభివృద్ధి తాలూకు ప్రయోజనాలను ప్రతి పౌరుడికీ అందించడంలో సుపరిపాలన అనేది ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
వంచనకు గురైన వారికి హక్కులను మరియు సేవలను అందించేలా చూడటం కూడా ఒక విధంగా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే అవుతుంది. స్వచ్ఛ శక్తి కోసం ఉద్దేశించిన ‘ఉజ్జ్వల యోజన’, ఆరోగ్యం మరియు పారిశుధ్యం కోసం ఉద్దేశించిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’, అందరికీ ఆర్థిక సేవల లభ్యతకు ఉద్దేశించిన ‘జన్ ధన్ యోజన’ లు ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయి. 2022 కల్లా దేశంలోని ప్రతి పౌరుడు ఒక ఇంటి స్వంతదారు అవ్వాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది.
దేశంలోని ప్రతి కుటుంబానికి విద్యుత్ కనెక్షన్ ను సమకూర్చాలని ఒక పథకాన్ని కూడా ఇటీవలే ప్రారంభించడమైంది. ఈ ప్రయత్నాలు అన్నీ కూడాను ప్రజలకు మౌలిక జీవన రేఖ సంబంధిత తోడ్పాటును సమకూర్చడానికి మరియు వారి జీవితాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించినటువంటివి.
వినియోగదారులకు హక్కులను ప్రసాదించినంత మాత్రాననే వారి ప్రయోజనాలను పరిరక్షించినట్లు కాదు. భారతదేశంలో మేం వినియోగదారుల సొమ్మును ఆదా చేసే పథకాలను రూపొందించే దిశగా కూడా కృషి చేస్తున్నాం. ఈ పథకాల ద్వారా దేశంలోని పేదలు మరియు మధ్యతరగతి ప్రజలు అత్యంత లబ్ధిని పొందగలుగుతారు.
భారతదేశంలో నిర్వహించిన ఒక సర్వేక్షణ ఫలితాలను యూనిసెఫ్ ఇటీవల ప్రకటించడం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ సర్వేక్షణ పేర్కొన్న ప్రకారం, స్వచ్ఛ భారత్ అభియాన్ అమలులోకి రావడంతో నివారించబడిన వైద్య సంబంధ ఖర్చులు, తప్పించబడిన మరణాలు మరియు కాలయాపన తాలూకు విలువల పరంగా చూస్తే ఆరుబయలు ప్రదేశాలలో మల మూత్రాదుల విసర్జన రహితంగా ప్రకటితమైనటువంటి సముదాయాలలో ప్రతి కుటుంబానికి ఏటా 50,000 రూపాయలు ఆదా అవుతోంది.
మిత్రులారా, పేదలకు అందుబాటు ధరలలో మందులను అందించడానికి భారతీయ జన్ ఔషధి పరియోజన ను ప్రారంభించాం. 500కు పైగా ఔషధాలను అత్యవసర ఔషధాల జాబితా లో చేర్చి వాటి ధరలను తగ్గించడమైంది. గుండె చికిత్సలో వాడే స్టెంట్ ల ధరలకు కళ్లెం వేయడంతో ఇప్పుడు అవి 85 శాతం వరకు చౌక అయ్యాయి. ఇటీవలే కృత్రిమ మోకాలి చిప్పల ధరలను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకురావడమైంది. ఈ చర్య కూడా పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కోట్ల రూపాయలు ఆదా చేస్తోంది.
వినియోగదారుల పరిరక్షణను వినియోగదారుల ప్రయోజనాల రక్షణ స్థాయికి చేర్చాలన్నది మా ఆలోచన.
మేం ప్రవేశపెట్టిన ఉజాలా మరో పథకం వినియోగదారులకు ధనం ఆదా చేసే మరో ఉదాహరణ. దేశంలో ప్రజలందరికీ ఎల్ఇడి బల్బుల పంపిణీ కోసం చేపట్టిన ఈ సులభ పథకం అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఎల్ఇడి బల్బు ధర 350 రూపాయలుంది. ఎల్ఇడి బల్బుల పంపిణీకి ప్రభుత్వం రంగంలోకి దిగడంతో అవి ఇప్పుడు 40 రూపాయలు- 45 రూపాయల ధరకే అందుబాటులోకి వచ్చాయి. ఎల్ఇడి బల్బుల ధరలు తగ్గడంతో పాటు విద్యుత్ బిల్లుల భారం సయితం తగ్గడంతో ఈ ఒక్క పథకమే ప్రజలకు 20 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసి పెడుతోంది.
మిత్రులారా, ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవడం పేదలు, మధ్యతరగతి వినియోగదారులకు ఆర్థికంగా ప్రయోజనకరమైంది. గత ప్రభుత్వ హయాంలో పెరిగిన తీరులో ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఉంటే, సగటు ప్రజల వంట ఇంటి బడ్జెటు భారీగా పెరిగిపోయి ఉండేది.
సాంకేతిక విజ్ఞానం సహాయంతో ప్రభుత్వ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అందుబాటు ధరల్లో ఆహారధాన్యాలు పొందే హక్కు గల పేదలు ప్రయోజనం పొందారు.
ప్రత్యక్ష ప్రయోజన పథకం కింద నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా 57వేల కోట్ల రూపాయలకు పైగా ధనం దుర్వినియోగాన్ని అదుపుచేయగలిగింది.
మిత్రులారా, వినియోగదారులు సమాజం తమకు గల బాధ్యతను కూడా గుర్తించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు వీలుగా తమపై గల విధులు నిర్వర్తించడం అవసరం.
ఈ సందర్భంగా ఇతర దేశాల్లోని మిత్రులకు గివ్ ఇట్ అప్ (వదులుకోండి) ప్రచారోద్యమాన్ని గురించి తెలియచేయాలనుకుంటున్నాను. మా దేశంలో ఎల్‌పిజి సిలిండర్లపై సబ్సిడీ అందిస్తూ ఉంటాం. ఆ సబ్సిడీని వదులుకోవాలని నేను ఇచ్చిన పిలుపు ఆధారంగా ఏడాది సమయంలో కోటి మందికి పైగా ప్రజలు తమ సబ్సిడీని వదులుకున్నారు. అలా ఆదా అయిన సొమ్మును ఇంతవరకు 3 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ లను అందించేందుకు ఉపయోగించాం.
ఒక్కో వినియోగదారు తన బాధ్యతను గుర్తించి తన వంతు సహాయం అందించడం వల్ల ఇతర వినియోగదారులు ఏ రకంగా ప్రయోజనం పొందగలుగుతారు, అది సమాజంలో ఎంత సానుకూల వైఖరిని విస్తరింపచేస్తుందనేందుకు ఇది చక్కని ఉదాహరణ.
మిత్రులారా, గ్రామీణ ప్రాంతాలలో నివసించే వినియోగదారులకు డిజిటల్ సాధికారిత కల్పనకు ప్రభుత్వం ప్రధాన మంత్రి డిజిటల్ అక్షరాస్యత ప్రచార ఉద్యమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం కింద ప్రతి 6 కోట్ల కుటుంబాలలో ఒకరిని డిజిటల్‌గా అక్షరాస్యునిగా తీర్చి దిద్దుతున్నాం. ఈ ప్రచారోద్యమం వల్ల గ్రామీణ ప్రజలు ఎలక్ట్రానిక్ లావాదేవీలు నిర్వహించుకునేందుకు, ప్రభుత్వ సేవలను డిజిటల్‌గా పొందేందుకు వీలు కలుగుతుంది.
దేశంలోని గ్రామాల్లో డిజిటల్ చైతన్యం తీసుకురావడం వల్ల భవిష్యత్తులో అతి పెద్ద ఇ-కామర్స్ విపణి అవతరిస్తుంది. యుపిఐ చెల్లింపుల విధానం ఇ-కామర్స్ పరిశ్రమకు ఎనలేని బలాన్ని అందించింది. నగరాలు, గ్రామాలు రెండింటిలోనూ డిజిటల్ చెల్లింపులను విస్తరించేందుకు ఇటీవలే భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ- BHIM App ను కూడా ఆవిష్కరించాం.
మిత్రులారా, 125 కోట్ల జనాభా, త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి బలంతో భారతదేశం ప్రపంచం లోని అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. మా ఆర్థిక వ్యవస్థలోని బహిరంగ తత్వం ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి స్వాగతం పలుకుతూ భారతీయ వినియోగదారులను ప్రపంచ తయారీదారులకు చేరువ చేసింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రపంచ స్థాయి కంపెనీలు భారతదేశంలోనే ఉత్పత్తులు తయారుచేసి భారతదేశంలోని భారీ మానవ వనరులను మరింత మెరుగ్గా వినియోగంలోకి తెచ్చుకునే వీలు కలిగింది.
మిత్రులారా, ప్రపంచంలోనే ఇది మొదటి తరహా సమావేశం. ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్క కంపెనీ తనదైన శైలిలో ఆ దేశానికి చెందిన వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు పాటు పడుతోంది. కాని ప్రపంచీకరణ పుణ్యమా అని మొత్తం ప్రపంచం ఒక్క చిన్న విపణిగా మారిపోయిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. భాగస్వామ్య దేశాలు ఒకరి అనుభవాల నుండి ఒకరు నేర్చుకుని ఉమ్మడి అవగాహన అవసరమైన అంశాలను గుర్తించి వినియోగదారుల రక్షణకు ప్రాంతీయ సహకారాన్ని నిర్మించుకొనే అవకాశాలను అన్వేషించి చర్చించడం అవసరం.
మిత్రులారా, 4 బిలియన్ జనాభా, పెరుగుతున్న కొనుగోలు శక్తి, జనాభాలో యువత సంఖ్య అధికంగా ఉండడం వంటి లక్షణాల ద్వారా ఆసియా దేశాలు భారీ వ్యాపారావకాశాలను అందిస్తున్నాయి. ప్రజలు సరిహద్దులు దాటి తిరుగుతూ ఉండడంతోను, ఇ-కామర్స్ విపణి వల్లనూ సీమాంతర లావాదేవీలు పెరిగాయి. ఈ పూర్వరంగంలో వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్క దేశం బలమైన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, సమాచారం పంచుకోవడం అవసరం. ఇతర దేశాలకు చెందిన వినియోగదారుల కేసులను సత్వరం పరిష్కరించేందుకు ఒక సహకార వ్యవస్థ ఏర్పాటు కావలసి ఉంది. పరస్పర విశ్వాసాన్ని పెంచుకొనేందుకు, వాణిజ్యాన్ని విస్తరించుకొనేందుకు ఇది సహాయకారిగా ఉంటుంది.
పరస్పర ప్రయోజనం లక్ష్యంగా సమాచారాన్ని అందించుకునేందుకు చక్కని వ్యవస్థ ఏర్పాటు చేయడం, ఉత్తమ విధానాలు పరస్పరం పంచుకోవడం, సామర్థ్యాల నిర్మాణానికి కొత్త చొరవలు తీసుకోవడం, ఉమ్మడి ప్రచారోద్యమాలు చేపట్టడం వంటివి మనం దృష్టి సారించదగిన అంశాలు.
మిత్రులారా, భావోద్వేగపూరితమైన బంధాన్ని మనం పటిష్ఠం చేసుకోవడం వల్ల మన సాంస్కృతిక, చారిత్రక బంధం కూడా బలపడుతుంది. మా సంస్కృతి పట్ల గర్వపడుతూనే ఇతర సంస్కృతులను కూడా గౌరవించడం మా సంప్రదాయం. శతాబ్దాలుగా మనం ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటున్నాం. వాణిజ్యం, వినియోగదారుల రక్షణ కూడా ఈ ప్రక్రియలో అంతర్భాగమే.
భవిష్యత్తులో ఎదురు కానున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకొని స్పష్టమైన ముందుచూపు గల ఒక ప్రణాళిక ఈ సమావేశంలో రూపు దిద్దుకొంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ సమావేశం ద్వారా ప్రాంతీయ సహకారాన్ని వ్యవస్థాత్మకం చేసుకోవడంలో మనం విజయం సాధిస్తామని నేను విశ్వసిస్తున్నాను.
ఈ సదస్సులు పాలుపంచుకొన్నందుకు మీకు అందరికీ నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు.
This conference is important because it seeks to discuss how we understand and try to fulfil the aspirations of the consumers: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 26, 2017
In our vision for a new India, we want to move ahead from only consumer protection towards best consumer practices and consumer prosperity. The focus is on consumer empowerment and ensuring consumer faces no difficulties: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 26, 2017
We have recently implemented GST. Due to GST, the various indirect and hidden taxes have ceased to exist. The biggest beneficiaries of GST will be the consumers, middle class: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 26, 2017
Effective grievance redressal systems are vital for a democracy. We are integrating technology and ensuring stronger grievance redressal mechanisms: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 26, 2017
The Government's efforts ensured inflation has been kept under check and the consumer saves money: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 26, 2017
The Government has devoted effort and resources towards digital empowerment of the rural consumer: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 26, 2017