

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకొని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ అశ్ రఫ్ ఘనీ 2018వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీ నాడు భారతదేశం లో పర్యటించారు.
బహుళ పార్శ్వాలు కలిగిన భారతదేశం-ఆఫ్గానిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు పురోగతి ని ఉభయ నేతలు ఈ సందర్భంగా సమీక్షించారు. ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల మైలు రాయి ని అధిగమించిన ద్వైపాక్షిక వ్యాపారం లోని పురోగతి పట్ల వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు. అలాగే, 2018వ సంవత్సరం సెప్టెంబరు 12వ తేదీ-15 వ తేదీ ల మధ్య కాలంలో ముంబయి లో జరిగిన భారతదేశం-అఫ్గానిస్తాన్ వ్యాపారం మరియు పెట్టుబడి ప్రదర్శన విజయవంతంగా ముగియడాన్ని వారు ప్రశంసించారు. చాబహార్ నౌకాశ్రయం, ఇంకా ఎయర్-ఫ్రైట్ కారిడోర్ ల గుండాను, ఇతరత్రా సంధానాన్ని బలపరచుకోవాలనే దృఢ నిశ్చయాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్ లో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల వికాసం, ఇంకా సామర్ధ్య నిర్మాణ సంబంధిత ఇతర పథకాల వంటి అధిక ప్రభావాన్ని ప్రసరించే రంగాల లో నూతన అభివృద్ధియుత భాగస్వామ్యాన్ని గాఢతరం చేసుకోవాలన్న అంగీకారం వ్యక్తం అయింది.
అఫ్గానిస్తాన్ లోను, ఆ దేశ ప్రజల పైన ఉగ్రవాదం, ఇంకా తీవ్రవాదం రువ్వుతున్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం లో మరియు శాంతి స్థాపన దిశ గా తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అధ్యక్షులు శ్రీ ఘనీ ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకువచ్చారు.
అఫ్గానిస్తాన్ సమైక్యమైన, శాంతియుతమైన, సమ్మిళితమైన మరియు ప్రజాస్వామ్యయుతమైన దేశం గా కొనసాగడంతో పాటు ఆర్థికం గా చైతన్యశీలం గా ఉండే ఒక దేశం గా ఆవిర్భవించేందుకు కూడా తగినటువంటి శాంతియుత, రాజీ యుతమైన ప్రక్రియ అఫ్గాన్ నాయకత్వం లో, అఫ్గాన్ యాజమాన్యం లో మరియు అఫ్గాన్ నియంత్రణ లో చోటుచేసుకొనేటట్లుగా భారతదేశం మద్దతిస్తుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాన్ని చేరుకొనే దిశ గా, మరి అంతేకాక ఆఫ్గానిస్తాన్ భద్రత కోసం, ఆఫ్గానిస్తాన్ సార్వభౌమత్వం కోసం కూడాను అఫ్గానిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న కృషి కి భారతదేశం తోడ్పాటు ను ఇచ్చేందుకు మొక్కవోని వచనబద్ధతను కలిగివుటుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్ లో అసంఖ్యాక స్థాయి లో ప్రాణ నష్టానికి దారితీసిన ఉగ్రవాద దాడులను, హింస ను ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చుతూ, ఉగ్రవాదానికి ఎదురొడ్డి నిలచి పోరాడడం లో అఫ్గానిస్తాన్ జాతీయ రక్షణ బలగాల కు మరియు అఫ్గాన్ ప్రజల కు సంఘీ భావాన్ని సైతం వ్యక్తం చేశారు.
వివిధ అంతర్జాతీయ వేదిక లలో జరిగే కార్యకలాపాలలో కనబరుస్తున్న సమన్వయం, సహకారం పట్ల ఇరు పక్షాలు సంతృప్తి ని వెలిబుచ్చాయి. ఈ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం తో పాటు సమృద్ధి కి, శాంతి కి, స్థిరత్వాని కి, ఇంకా ప్రగతి కి తమ ప్రాంతీయ భాగస్వాముల తోను, అంతర్జాతీయ భాగస్వాముల తోను మరింత సన్నిహితంగా పని చేయాలనే సంకల్పాన్ని ఉభయ పక్షాలు వ్యక్తం చేశాయి.