ఫిన్ లాండ్ ప్రధాని సనా మరిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16 న, వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు.
భారతదేశాని కి, ఫిన్ లాండ్ కు మధ్య ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యం మరియు నియమాల పై ఆధారపడిన అంతర్జాతీయ వ్యవస్థ పునాదులు గా ఆప్యాయమైన, మైత్రిపూర్వక సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల లో వ్యాపారం, పెట్టుబడి, విద్య, నూతన ఆవిష్కరణ లు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం లతో పాటు పరిశోధన, అభివృద్ధి రంగాల లో విస్తృత సహకారం కొనసాగుతున్నది. ఇరు పక్షాలు సామాజిక సవాళ్ల ను పరిష్కరించడానికి ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని ఒక క్వాంటమ్ కంప్యూటర్ ను సంయుక్తం గా అభివృద్ధి పరిచే అంశం లో ప్రస్తుతం కలసి పని చేస్తున్నాయి. ఫిన్ లాండ్ కు చెందిన ఇంచుమించు 100 కంపెనీ లు భారతదేశం లో టెలికమ్యూనికేశన్స్, ఎలివేటర్స్, యంత్ర సామగ్రి, నవీకరణ యోగ్య శక్తి సహా శక్తి రంగం వంటి వివిధ రంగాల లో క్రియాశీల కార్యకలాపాల ను నిర్వహిస్తున్నాయి. దాదాపు 30 భారతదేశ కంపెనీలు ఫిన్ లాండ్ లో ప్రధానం గా ఐటి, వాహన ఉపకరణాలు, ఆతిథ్య రంగం ల లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
శిఖర సమ్మేళనం లో భాగం గా, ఉభయ నేత లు ద్వైపాక్షిక సంబంధాల తో పాటు పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ అంశాల పై, ప్రపంచ అంశాల పై తమ తమ అభిప్రాయాల ను పరస్పరం వెల్లడించుకోనున్నారు. ఈ వర్చువల్ సమిట్ భారతదేశం-ఫిన్ లాండ్ భాగస్వామ్యాన్ని రాబోయే కాలం లో మరేయే రంగాల కు విస్తరించాలో అనే అంశం లో ఒక నమూనా ను కూడా ఆవిష్కరించనుంది.