సహాయ కార్యదర్శులుగా తాము పొందిన శిక్షణ యొక్క ముగింపు సమావేశంలో భాగంగా 2015 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులు ఈ రోజు వారి వారి ప్రతిపాదనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షంలో నివేదించారు.
పాలనకు సంబంధించిన వేరు వేరు ఇతివృత్తాలపై 8 ఎంపిక చేసిన ప్రతిపాదనలను గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఈ ఇతివృత్తాలలో.. ప్రమాదం బారిన పడ్డ బాధితుల పట్ల శీఘ్ర ప్రతిస్పందన, కర్బన పాద ముద్రలను గుర్తించడం, అందరి అందుబాటులోకీ ఆర్థిక సేవలు, గ్రామీణ ఆదాయలను పెంపొందించడం, సమాచార రాశి ఆధారితంగా గ్రామీణ ప్రాంతాల సమృద్ధికి పాటుపడడం, వారసత్వ కట్టడాలు ఊతంగా పర్యాటక అభివృద్ధి, రైల్వేల రంగ సంబంధిత భద్రత మరియు కేంద్ర సాయుధ పోలీసు దళాల పాత్ర.. ల వంటివి ఉన్నాయి.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అత్యంత తక్కువ స్థాయి అనుభవం కలిగిన అధికారులు మరియు అత్యంత సీనియర్ అధికారులు ఒకరితో మరొకరు వారి వారి ఆలోచనలను పంచుకోవడం కోసం ఇంతటి సుదీర్ఘమైన సమయాన్ని వెచ్చించడం నిజంగా ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటి అంశమన్నారు. ఈ తరహా సమావేశాల నుండి సకారాత్మకమైన అన్ని అంశాలను యువ అధికారులు ఆకళింపు చేసుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. జిఎస్‌టి అమలు మరియు డిజిటల్ లావాదేవీల జోరును పెంచడం, ప్రత్యేకించి భీమ్ యాప్ (BHIM App) ద్వారా ఈ తరహా లావాదేవీలు అధికంగా జరిగేలా చూడడం వంటి విషయాల పై శ్రద్ధ వహించవలసిందిగా యువ అధికారులకు ప్రధాన మంత్రి సూచనలు చేశారు.
గవర్నమెంట్ ఇ- మార్కెట్ ప్లేస్ (GeM)ను తమ తమ విభాగాలలో ఆచరణలోకి తీసుకు రావడం కోసం మరింతగా దృష్టి సారించండంటూ అధికారులను ప్రధాన మంత్రి కోరారు. ఇది మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించి, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించగలుగుతుందని ఆయన చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్తు సదుపాయం కల్పన మరియు ఒడిఎఫ్ లక్ష్యాలను ప్రధాన మంత్రి ఉదాహరణలుగా పేర్కొంటూ, 100 శాతం లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర యోధులు కలలు గన్న భారతదేశాన్ని 2022 కల్లా ఆవిష్కరించే దిశగా పని చేయాలని అధికారులకు ఆయన మనవి చేశారు. అణకువ కలిగిన నేపథ్యాల నుండి ఎదిగిన అధికారులు, యువ విద్యార్థులను కలుసుకొని వారిలో ఉత్తేజాన్ని నింపాలని ఆయన చెప్పారు. భావ ప్రసరణ దయాళుత్వానికి బాట వేస్తుందని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.
దేశ ప్రజల మరియు పౌరుల సంక్షేమమే ప్రస్తుతం అధికారుల పరమావధి అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు జట్టు స్ఫూర్తితో పని చేయాలని, ఎక్కడికి వెళ్ళినా వారు దళాలుగా ఏర్పడి ముందుకు సాగాలని ఆయన కోరారు.