ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యుఎస్ రక్షణ మంత్రి శ్రీ జేమ్స్ మాటిస్ ఈ రోజు మధ్యాహ్నం సమావేశమయ్యారు.
ఈ సంవత్సరం జూన్ లో యునైటెడ్ స్టేట్స్ లో తాను పర్యటించిన సందర్భంగా అధ్యక్షులు శ్రీ ట్రంప్ తో అనేక అంశాల పై అరమరికలకు తావు ఉండని విధంగా, ఫలప్రదమైనటువంటి చర్చలను జరిపిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఉభయ పక్షాల మధ్య బలమైన, వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలన్న తమ సంకల్పాన్ని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక కార్యక్రమ పట్టికను ముందుకు తీసుకుపోవడంలో మరియు పర్యటన కాలంలో తీసుకొన్న నిర్ణయాలను అమలుపరచడంలో చోటు చేసుకొన్న పురోగతిని గురించి ప్రధాన మంత్రికి మంత్రి శ్రీ మాటిస్ వివరించారు.
ప్రాంతీయంగాను, ప్రపంచ స్థాయిలోను సహకారాన్ని పెంపొందించుకోవడం, శాంతి కోసం, స్థిరత్వం కోసం కృషి చేయాలన్న మరియు ఉగ్రవాదం పై పోరాటం చేయాలన్న తమ ప్రాథమ్యాలను సంయుక్తంగా అనుసరించడం కూడా వారి చర్చలలో చోటు చేసుకొన్నాయి.
ఉభయ దేశాల ప్రయోజాలతో ముడిపడిన ప్రాంతీయ సంబంధమైన మరియు ప్రపంచ సంబంధ అంశాలపై రెండు దేశాలు సన్నిహితంగా పని చేస్తున్నందుకు ప్రధాన మంత్రి ప్రశంసలు అందజేశారు.