భారత్ లో ఎంతో గుప్తమైన ఔత్సాహిక పారిశ్రామిక శక్తి ఉన్నదని నేను బలీయంగా విశ్వసిస్తున్నాను. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవలసి ఉంది. అలా చేస్తే మన దేశం ఉద్యోగాలను అర్థించే దేశంగా ఉండే కన్నా ఉద్యోగాలను కల్పించే దేశంగా మారుతుంది."
- నరేంద్ర మోదీ
దేశ యువశక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికి తీయడంపై ఎన్డీయే ప్రభుత్వం దృష్టి పెట్టింది. భారత్ లో ఎంటర్ ప్రిన్యూర్ షిప్ నకు ఉత్తేజం కల్పించేందుకు ఉద్దేశించిన 'మేక్ ఇన్ ఇండియా' నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉంది. తయారీ రంగంలోనే కాకుండా ఇతర రంగాలకు కూడా దీన్ని విస్తరించడం ప్రభుత్వ లక్ష్యం.
కొత్త ప్రాసెస్ లు: దేశంలో ఔత్సాహిక పారిశ్రామిక ధోరణులను ప్రోత్సహించడంలో అత్యంత ప్రధానమైన అంశం “వ్యాపారానుకూల వాతావరణ కల్పన” అని 'మేక్ ఇన్ ఇండియా' గుర్తించింది.
నూతన మౌలిక వసతులు: పారిశ్రామిక రంగం వృద్ధికి ఆధునికమైన, అందరికీ ఉపయోగకరమైన మౌలిక వసతులను అందుబాటులో ఉంచడం చాలా కీలకం. అమిత వేగవంతమైన కమ్యూనికేషన్ వసతులను అందుబాటులోకి తేవడం, సమగ్ర లాజిస్టిక్ వసతులు ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచగల పారిశ్రామిక కారిడార్ లు, స్మార్ట్ సిటీలు నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
కొత్త రంగాలు : తయారీ, మౌలిక వసతులు, సేవా కార్యకలాపాలలో 'మేక్ ఇన్ ఇండియా' 25 రంగాలను గుర్తించింది. ఆయా రంగాలతో సంబంధం ఉన్న వారందరికీ సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారు.
నవీన ఆలోచనా దృక్పథం : ప్రభుత్వాన్ని ఒక నియంత్రణ శక్తిగా చూడడం పరిశ్రమకు అలవాటయింది. కానీ దీనిని మార్చాలని 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం తలపోస్తోంది. ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య సంప్రదింపులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలనుకుంటోంది. పరిశ్రమను నియంత్రించే శక్తిగా కన్నా, పరిశ్రమకు ఒక ప్రోత్సాహక శక్తిగా వ్యవహరించాలన్నది ప్రభుత్వ వైఖరిగా ఉండనుంది.
దేశంలో ఔత్సాహిక పారిశ్రామిక ధోరణులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 3సి పేరిట మూడు అంచెల విధానాన్ని అనుసరిస్తోంది. ఆ మూడు సి లు.. కాంప్లయెన్సెస్ (అమలు), కేపిటల్ (పెట్టుబడులు), కాంట్రాక్ట్ ఎన్ ఫోర్స్ మెంట్ (కాంట్రాక్టుల ఆచరణ).
కంప్లయెన్సెస్
ప్రపంచ బ్యాంకు వ్యాపారానుకూలత సూచిలో 130 వ స్థానానికి ఎదగడం ద్వారా వ్యాపారానుకూల వాతావరణంలో భారత్ ఎన్నో అడుగులు ముందుకు వేసింది. ఇప్పుడు దేశంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం గతంలో కన్నా చాలా తేలిక. వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇంతకు ముందు నిర్దేశించిన ఎన్నో అవరోధాలను తొలగించి చాలా వరకు అనుమతులను ఆన్ లైన్ లోనే పొందే వాతావరణం కల్పించారు.
పారిశ్రామిక లైసెన్సు (ఐఎల్)లకు దరఖాస్తు చేయడం, పారిశ్రామిక ఎంటర్ ప్రిన్యూర్ మెమొరాండం (ఐఇఎం) సమర్పించడం వంటివి వారంలో అన్ని రోజులూ, రోజులో 24 గంటలూ (24X7) ఆన్ లైన్ లోనే నిర్వహించే స్వేచ్ఛ అందుబాటులోకి తెచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి సింగిల్ విండో ద్వారా అనుమతులు పొందేందుకు 20 రకాల సర్వీసులను సమీకృతం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో అమలుపరుస్తున్నవ్యాపార సంస్కరణలపై మదింపునకు ప్రపంచ బ్యాంకు, కెపిఎంజి ల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మదింపు ఆధారంగా అందించే ర్యాంకింగుల వల్ల రాష్ట్రాలు ఒకరి అనుభవాల నుంచి మరొకరు పాఠాలు నేర్చుకుని ఒకరి విజయ గాథలను మరొకరు అనుసరించే వాతావరణం ఏర్పడుతుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా నియంత్రణ వాతావరణం త్వరితంగా మెరుగుపడుతుంది.
భిన్న రంగాల్లోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఎఫ్ డి ఐ నిబంధనలను కూడా సరళం చేసింది.
కేపిటల్
దేశంలో 58 మిలియన్ నాన్ కార్పొరేట్ సంస్థలు 128 మిలియన్ ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. వాటిలో 60 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటిలో 40 శాతానికి పైబడి వెనుకబడిన తరగతులు, 15 శాతం షెడ్యూల్డ్ కులాలు, జాతుల పారిశ్రామికుల యాజమాన్యంలో ఉన్నాయి. కాని ఆయా సంస్థలకు బ్యాంకుల ద్వారా అందిన ఆర్థిక సహాయం నామమాత్రమే. వారిలో చాలా మందికి బ్యాంకు రుణాలు అందుబాటులో లేవు. మరో మాటలో చెప్పాలంటే, అత్యధిక ఉపాధి అవకాశాలు అందిస్తున్న రంగానికి అతి తక్కువ స్థాయిలో రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన, ముద్ర బ్యాంకులను ప్రారంభించింది.
అవ్యవస్థీకృత రంగం నుంచి రుణాలు తీసుకుని భారీ వడ్డీలు చెల్లిస్తున్న చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీపై ఎలాంటి హామీలతో పని లేకుండా రుణం అందుబాటులో ఉంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. ముద్రా యోజన, ముద్రా బ్యాంకు ప్రారంభించిన కొద్ది రోజుల వ్యవధిలోనే రూ.65 వేల కోట్ల విలువ గల 1.18 కోట్ల రుణాలను మంజూరు చేసింది. రూ.50,000 కన్నా తక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే వారి సంఖ్య 2015 ఏప్రిల్-సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 555 శాతం పెరిగింది.
కాంట్రాక్ట్ ఎన్ ఫోర్స్ మెంట్
కాంట్రాక్టుల అమలు సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఆర్బిట్రేషన్ చట్టంలో మార్పులు చేశారు. దీని వల్ల ఆర్బిట్రేషన్ కార్యకలాపాల వ్యయం తగ్గడంతో పాటు వేగం కూడా పెరుగుతుంది. నిర్ణయాలు సత్వరం అమలుపరిచేందుకు వీలుగా కేసుల పరిష్కారానికి ఈ చట్టం గడువు విధించడంతో పాటు ట్రిబ్యునల్స్ కు సాధికారత కల్పిస్తుంది.
అలాగే వ్యాపారాల నుంచి వైదొలగడాన్ని మరింత తేలిక చేసేందుకు ప్రభుత్వం ఆధునిక దివాలా చట్టాన్ని కూడా రూపొందించింది.