భారత్, అమెరికా మధ్య సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలకు అనుగుణంగా ఉన్నతమైన సాంస్కృతిక అవగాహనను పెంపొందించుకోవడానికి జూలైలో సాంస్కృతిక సంపద ఒప్పందం కుదిరింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్య, సాంస్కృతిక వ్యవహారాల బ్యూరో, భారత ప్రభుత్వంలోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల భారతీయ పురావస్తు సర్వేక్షణ విభాగం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు సహకారాన్ని పెంపొందించుకోవాలని 2023 జూన్‌లో జరిగిన సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధానమంత్రి మోదీ చేసిన ఉమ్మడి ప్రకటనలోని లక్ష్యాలను నెరవేర్చడంలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది.
భారత్ నుంచి చోరీ అయిన, అక్రమంగా రవాణా అయిన 297 పురాతన వస్తువులను తిరిగి భారత్‌కు అప్పగించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా మార్గం సుగమం చేసింది. ఇవి త్వరలోనే మళ్లీ భారత్‌కు చేరనున్నాయి. డెలావేర్‌లోని విల్మింగ్‌టన్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో భాగంగా పలు పురాతన వస్తువులను అధ్యక్షుడు బైడెన్ ప్రధానమంత్రికి లాంఛనంగా అందించారు. ఈ కళాఖండాలను తిరిగి ఇవ్వడానికి సహకరించిన అధ్యక్షుడు బైడెన్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ వస్తువులు కేవలం భారతదేశ చారిత్రక వస్తు సాంస్కృతిలో మాత్రమే భాగం కాదని, ఇవి దేశ నాగరికత, చైతన్యంలో అంతర్భాగమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఈ పురాతన వస్తువులు దాదాపు 4000 ఏళ్ల మధ్య కాలానికి చెందినవి. భారత్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన క్రీస్తు పూర్వం 2000 నుంచి క్రీస్తుశకం 1900 మధ్య కాలానికి చెందిన వస్తువులు ఇవి. ఈ పురాతన వస్తువుల్లో చాలావరకు తూర్పు భారత్‌కు చెందిన టెర్రాకోట కళాఖండాలు. మిగతావి రాయి, లోహాలు, కలప, దంతాలతో సృష్టించిన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాఖండాలు ఉన్నాయి.
భారత్‌కు అందిస్తున్న పురాతన వస్తువుల్లో ప్రధానమైనవి కొన్ని:
- మధ్య భారతానికి చెందిన క్రీస్తుశకం 10-11వ శతాబ్దాల నాటి ఇసుకరాతి అప్సర,
- మధ్య భారతానికి చెందిన క్రీస్తు శకం 15-16వ శతాబ్దాల నాటి కాంస్య జైన తీర్థంకర విగ్రహం,
- తూర్పు భారతానికి చెందిన క్రీస్తు శకం 3-4 శతాబ్దాల నాటి టెర్రాకోట పాత్ర,
- దక్షిణ భారతదేశానికి చెందిన క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం- క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటి రాతి శిల్పం,
- క్రీస్తు శకం 17-18 శతాబ్దాల నాటి దక్షిణ భారతదేశానికి చెందిన వినాయకుడి విగ్రహం,
- క్రీస్తు శకం 15-16 శతాబ్దాల నాటి ఉత్తర భారతదేశానికి చెందిన ఇసుకరాయితో చేసిన నిలబడి ఉన్న బుద్ధుడి విగ్రహం,
- క్రీస్తు శకం 17-18 శతాబ్దాల నాటి తూర్పు భారతదేశానికి చెందిన కాంస్యంతో చేసిన విష్ణు భగవానుడి విగ్రహం,
- క్రీస్తు పూర్వం 2000-1800 కాలం నాటి ఉత్తర భారతానికి చెందిన రాగితో చేసిన సగుణవాది విగ్రహం,
- క్రీస్తు శకం 17-18 శతాబ్దాల నాటి దక్షిణ భారతానికి చెందిన కాంస్యంతో చేసిన కృష్ణ భగవానుడి విగ్రహం,
- క్రీస్తు శకం 13-14 శతాబ్దాల నాటి దక్షిణ భారతానికి చెందిన నల్లరాతి కార్తికేయ భగవానుడి విగ్రహం.
భారత్ - అమెరికా సాంస్కృతిక అవగాహన, మార్పిడిలో సాంస్కృతిక ఆస్తి పునరుద్ధరణ ఇటీవలి కాలంలో కీలకమైన అంశంగా మారింది. అక్రమ రవాణా, చోరీకి గురైన కళాఖండాలను పెద్ద ఎత్తున తిరిగి పొందేందుకు 2016 నుంచి అమెరికా ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. 2016 జూన్‌లో ప్రధానమంత్రి అమెరికా పర్యటన సందర్భంలో పది, 2021 సెప్టెంబర్ పర్యటన సందర్భంగా 157, గత ఏడాది జూన్‌లో జరిపిన పర్యటన సమయంలో 105 పురాతన వస్తువులు భారత్‌కు తిరిగొచ్చాయి. 2016 నుంచి ఇప్పటివరకు 578 పురాతన వస్తువులు తిరిగి దేశానికి అందాయి. భారత్‌కు వివిధ దేశాల నుంచి తిరిగొచ్చిన కళాఖండాల్లో అమెరికా నుంచి వచ్చినవే అధికం.
Deepening cultural connect and strengthening the fight against illicit trafficking of cultural properties.
— Narendra Modi (@narendramodi) September 22, 2024
I am extremely grateful to President Biden and the US Government for ensuring the return of 297 invaluable antiquities to India. @POTUS @JoeBiden pic.twitter.com/0jziIYZ1GO