హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( హెచ్ఏఎల్ ) నుంచి 70 హెచ్ టీ టీ -40 ప్రాథమిక శిక్షణ విమానాలు, లార్సెన్అండ్ టుబ్రో లిమిటెడ్ (ఎల్‌అండ్‌టి) నుంచి మూడు క్యాడెట్ ట్రైనింగ్ షిప్‌లను కొనుగోలు చేయడానికి ఈ రోజు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందాలపై సంతకం చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, హెచ్ఏఎల్, ఎల్‌అండ్‌టి ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించడానికి 2023 మార్చి 1న జరిగిన మంత్రివర్గం సమావేశం 6,800 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి హెచ్ఏఎల్ నుంచి 70 హెచ్ టీ టీ - శిక్షణ విమానాలు కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. 3,100 కోట్ల రూపాయల విలువ చేసే మూడు క్యాడెట్ ట్రైనింగ్ షిప్‌లను ఎల్‌అండ్‌టి నుంచి కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
హెచ్ టీ టీ - 40
హెచ్ టీ టీ - 40 టర్బో ప్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్. తక్కువ వేగం నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండే హెచ్ టీ టీ - 40 మెరుగైన శిక్షణ అందించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. పూర్తి ఏరోబాటిక్ టెన్డం సీట్ టర్బో ట్రైనర్ అయిన హెచ్ టీ టీ - 40 ఎయిర్ కండిషన్డ్ కాక్‌పిట్, ఆధునిక పరికరాలు, , హాట్ రీ-ఫ్యూయలింగ్ సౌకర్యంతో , రన్నింగ్ చేంజ్ ఓవర్, జీరో-జీరో ఎజెక్షన్ సీట్లు కలిగి ఉంటుంది.
కొత్తగా చేరిన పైలట్లకు శిక్షణ కోసం భారత వైమానిక దళం ఎదుర్కొంటున్న ప్రాథమిక శిక్షణ విమానాల కొరతను ఈ విమానం తీరుస్తుంది. విమానం తో పాటు సిములేటర్ సహా అనుబంధ పరికరాలు మరియు శిక్షణ సహాయ పరికరాలను హెచ్ఏఎల్ సరఫరా చేస్తుంది.స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ విమానం భారత సాయుధ దళాల భవిష్యత్తు అవసరాలను తీరుస్తుంది. సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా నవీకరణ చేయడానికి వీలుగా ఉండే విమానాన్నిహెచ్ఏఎల్ ఆరేళ్ల వ్యవధిలో అందిస్తుంది.
హెచ్ టీ టీ - 40ని దాదాపు 56% స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తారు. ప్రధాన భాగాలు ఉపవ్యవస్థ లతో కలిపితే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం దాదాపు 60%కి పెరుగుతుంది. అవసరమైన భాగాలు, పరికరాలను ఎంఎస్ఎంఈలతో సహా దేశీయ ప్రైవేటు రంగం నుంచి హెచ్ఏఎల్ సమకూర్చుకుంటుంది. దీనివల్ల 100 కి పైగా ఎంఎస్ఎంఈ లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్న వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
క్యాడెట్ శిక్షణ నౌకలు
భారత నౌకాదళం భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి క్యాడెట్ శిక్షణ నౌకలు ఉపయోగపడతాయి. ప్రాథమిక శిక్షణ తర్వాత సముద్రంలో మహిళలతో సహా ఆఫీసర్ క్యాడెట్‌లకు ఈ నౌకల ద్వారా శిక్షణను అందిస్తారు. దౌత్య సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో స్నేహపూర్వక దేశాలకు చెందిన క్యాడెట్‌లకు కూడా నౌకల్లో శిక్షణను ఇస్తారు. ఆపద ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం, గాలింపు, తరలింపు కార్యక్రమాలు చేపట్టడానికి, మానవతా దృక్పధంతో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ఈ నౌకలను మోహరించవచ్చు. ఓడల డెలివరీ 2026 నుంచి ప్రారంభం అవుతుంది.
చెన్నైలోని కట్టుపల్లిలోని ఎల్‌అండ్‌టి షిప్‌యార్డ్‌లో ఈ నౌకలను దేశీయంగా డిజైన్ చేసి, అభివృద్ధి చేసి నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా నాలుగున్నరేళ్ల కాలంలో 22.5 లక్షల పనిదినాల ఉపాధి లభిస్తుంది.ఎంఎస్ఎంఈ లతో సహా భారతీయ నౌకా నిర్మాణం, అనుబంధ పరిశ్రమల క్రియాశీల భాగస్వామ్యాన్నిఎల్‌అండ్‌టి ప్రోత్సహిస్తుంది.