ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. ఇన్-స్పేస్ నేతృత్వంలో అంతరిక్ష రంగంలో పెట్టుబడుల కోసం రూ.1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఆర్థిక ప్రయోజనాలు:
ఫండ్ కార్యకలాపాలు ప్రారంభమైన వాస్తవ తేదీ నుంచి అయిదు సంవత్సరాల వరకు ఈ ప్రతిపాదిత రూ.1000 కోట్లను పెట్టుబడులుగా పెట్టనున్నారు. పెట్టుబడి అవకాశాలు, అవసరాలను బట్టి ఏడాదికి సగటున రూ.150-250 కోట్లను అంకుర సంస్థలకు అందించనుంది. ఆర్థిక సంవత్సరం వారీగా ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి:
వరుస సంఖ్య
|
ఆర్థిక సంవత్సరం
|
అంచనా (కోట్ల రూపాయల్లో)
|
I
|
2025-26
|
150.00
|
2
|
2026-27
|
250.00
|
3
|
2027-28
|
250.00
|
4
|
2028-29
|
250.00
|
5
|
2029-30
|
100.00
|
|
మొత్తం పెట్టుబడి (వీసీ)
|
1000.00
|
కంపెనీ దశ, వృద్ధి తీరు, జాతీయ అంతరిక్ష ప్రణాళికల్లో దాని ప్రభావాన్ని బట్టి ఒక్కో అంకుర కంపెనీలో రూ.10-రూ.60 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించారు. అంకుర సంస్థ దశను బట్టి పెట్టుబడులు ఈ విధంగా ఉంటాయి.
* వృద్ధి దశ: రూ.10 కోట్లు - రూ.30 కోట్లు
* పరిపక్వ దశ (లేట్ గ్రోత్ స్టేజ్): రూ.30 కోట్లు - రూ.60 కోట్లు
ఈ స్థాయి పెట్టుబడులతో సుమారు 40 అంకురాలకు మద్దతు ఇవ్వనున్నారు.
వివరాలు:
సృజనాత్మకత, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి.. జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా భారత అంతరిక్ష రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ ఫండ్ వ్యూహాత్మకంగా పనిచేయనుంది. దీని కోసం ఈ చర్యలను తీసుకోనుంది.
A. మూలధనాన్ని అందించటం.
b. కంపెనీలు బయటకు వెళ్లకుండా భారతదేశంలోనే ఉండేలా చూడటం
c. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయటం
d. అంతరిక్ష సాంకేతికత అభివృద్ధిని వేగవంతం చేయడం
e. ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంచడం.
f. ఆత్మనిర్భర్ భారత్‌కు మద్దతు
g. గొప్ప ఆవిష్కరణల వ్యవస్థను సృష్టించటం
h. ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పనకు ఊతమివ్వడం
i. దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించడం
ఈ చర్యల ద్వారా ప్రముఖ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ను వ్యూహాత్మక స్థానంలో నిలబెట్టాలని ఈ ఫండ్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రయోజనాలు:
1. తరువాతి దశ అభివృద్ధికి అదనపు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఎన్నో రెట్ల ప్రభావాన్ని సృష్టించడానికి కావాల్సిన మూలధనాన్ని సమకూర్చడం. ప్రైవేట్ పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని కల్పించడం.
2. భారత్‌లో ఉన్న అంతరిక్ష కంపెనీలు బయటకుపోకుండా చూడటం. విదేశాల్లో భారతీయ కంపెనీల పెరుగుదలను నివారించటం.
3. వచ్చే పదేళ్లలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అయిదు రెట్లు పెరగాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమ వృద్ధిని వేగవంతం చేయటం.
4. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి సాధించడం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో భారతదేశ నాయకత్వాన్ని బలోపేతం చేయడం.
5. ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించటం.
6. ఆత్మనిర్భర్ భారత్‌కు మద్దతు
ఉపాధి కల్పన సామర్థ్యంతో పాటు ఇతర ప్రభావాలు:
ప్రతిపాదిత వెంచర్ క్యాపిటల్ ఫండ్ మొత్తం అంతరిక్ష సరఫరా గొలుసు (అప్‌స్ట్రీమ్, మిడ్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్)లోని అంకురాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత అంతరిక్ష రంగంలో ఉపాధిని పెంచుతుందని భావిస్తున్నారు. ఇది పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడానికి.. వ్యాపారాన్ని పెంచుకోవటానికి, మానవ వనరులను పెంచుకునేందుకు సహాయపడుతుంది. ప్రతి పెట్టుబడి ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, డేటా విశ్లేషణ, తయారీ వంటి రంగాలలో వందలాది ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించగలదు. అంతేకాకుండా సరఫరా గొలుసులు, సరకు రవాణా, వృత్తి నిపుణుల సేవల విభాగాల్లో వేలాది పరోక్ష ఉద్యోగాలను సృష్టించగలదు. బలమైన అంకుర వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా ఈ ఫండ్ ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేస్తుంది. దీనితో పాటు సృజనాత్మకతను ప్రేరేపించటమే కాకుండా.. అంతరిక్ష మార్కెట్లో ప్రపంచ స్థాయిలో భారత్ పోటీతత్వాన్ని పెంచుతుంది.
నేపథ్యం:
2020 అంతరిక్ష రంగ సంస్కరణలలో భాగంగా అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, పర్యవేక్షించడానికి ఇన్-స్పేస్‌ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలలనే లక్ష్యంతో రూ.1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఇన్-స్పేస్ ప్రతిపాదించింది. ఈ అత్యాధునిక రంగంలోని అంకురాలకు మూలధనాన్ని అందించేందుకు సంప్రదాయ రుణదాతలు సంకోచిస్తుంటారు. ఈ సమస్యను పరిష్కరించి, కీలకమైన మూలధన అవసరాన్ని తీర్చాలని ఈ ఫండ్ లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్ష రంగ సరఫరా గొలుసులో వస్తోన్న దాదాపు 250 అంకురాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటి వృద్ధిని నిర్ధారించడానికి, విదేశాలకు ప్రతిభ తరలివెళ్లటాన్ని నివారించడానికి సకాలంలో ఆర్థిక సహాయం అందించటం కీలకం. ప్రభుత్వ మద్దతుతో వస్తోన్న ఈ ఫండ్.. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచి, ప్రైవేట్ పెట్టుబడిని ఆకర్షించటమే కాకుండా అంతరిక్ష సంస్కరణలను ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోంది. ఇది సెబీ నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిగా పనిచేస్తుంది. అంకురాలకు ప్రారంభ దశలో పెట్టుబడులను అందించటంతోపాటు అంకురాలు మరిన్ని ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు పొందేందుకు వీలు కల్పిస్తుంది.