ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధానమంత్రి కట్టుబాటును సాకారం చేసే దిశగా ఒక అడుగు రోజ్ గార్ మేళా
కర్మయోగి ప్రారంభ్ ఆన్ లైన్ మాడ్యూల్ ద్వారా స్వయంగానే శిక్షణ పొందనున్న కొత్త రిక్రూటీలు
ప్రభుత్వ సర్వీసులకు కొత్తగా ఎంపికైన 51,000 మందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 28వ తేదీన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నియామక పత్రాలు అందచేస్తారు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
ఇందుకోసం దేశంలోని 37 ప్రాంతాల్లో రోజ్ గార్ మేళాలు నిర్వహిస్తారు. ఇందుకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియామకాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా నియమితులైన వారు రైల్వే మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ, హోం మంత్రిత్వ శాఖ, రెవిన్యూ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ; పాఠశాల, అక్షరాస్యత విద్యా శాఖ; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా చేరతారు.
దేశంలో ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధానమంత్రి కట్టుబాటును తీర్చే దిశగా ఒక ముందడుగు రోజ్ గార్ మేళా. మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనకు, తద్వారా యువత సాధికారతకు, వారు జాతీయాభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు కావడానికి రోజ్ గార్ మేళా ఒక సాధనంగా నిలుస్తుంది.
కొత్తగా నియమితులైన వారందరూ ఐగాట్ కర్మయోగి పోర్టల్ కు చెందిన ఆన్ లైన్ మాడ్యూల్ కర్మయోగి ప్రారంభ్ సహాయంతో స్వయంగానే శిక్షణ తీసుకునే అవకాశం పొందుతారు. ‘‘ఎక్కడ నుంచైనా, ఏ డివైస్ నుంచైనా’’ నేర్చుకునే ఫార్మాట్ లో 750కి పైగా ఇ-లెర్నింగ్ కోర్సులు ఈ ఆన్ లైన్ మాడ్యూల్ లో అందుబాటులో ఉన్నాయి.