1. యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని శ్రీమతి థెరెసా మే ఆహ్వానం మేరకు , ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2018 ఏప్రిల్ 18న ప్రభుత్వ అతిథిగా యునైటెడ్ కింగ్‌డమ్ లో పర్యటించారు. ఉభయ నాయకులు విస్తృత స్థాయి అంశాలపై , నిర్మాణాత్మక చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల విషయంలో నానాటికీ పెరుగుతున్న ఏకాభిప్రాయం, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి వాటి గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. 2018 ఏప్రిల్ 19-20 తేదీలలో జరిగే కామన్ వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు.
2. ప్రపంచంలోని అత్యంత పురాతన, పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా యుకె, ఇండియాలు ఉమ్మడి విలువలు, ఒకేరకమైన చట్టాలు, వ్యవస్థలు కలిగి ఉండి, ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకోవాలన్న సహజ సంకల్పాన్ని కలిగి ఉన్నాయి. మనం కామన్‌వెల్త్ లో చిత్తశుద్ధి కలిగిన సభ్య దేశాలము. మనం అంతర్జాతీయ దృష్టిని కలిగి ఉంటాం. అంతర్జాతీయ వ్యవస్థకు అనుగుణమైన నిబంధనలకు కట్టుబడి ఉంటాం. బలప్రయోగం ద్వారా లేదా ఇతర చర్యల ద్వారా వ్యవస్థను తక్కువ చేయడానికి ప్రయత్నించే ఏకపక్ష చర్యలను ఇది వ్యతిరేకిస్తుంది. ఉభయ దేశాల మధ్య వ్యక్తిగత స్థాయిలో, వృత్తిపరమైన స్థాయిలో ఎన్నో రూపాలలో సజీవ బంధం ఉంది.
3. ఉమ్మడి, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు యుకె, ఇండియాలు పరస్పరం సన్నిహితంగా కలిసి పని చేయడమే కాకుండా, ఇతర కామన్‌వెల్త్ సభ్య దేశాలతో, కామన్‌వెల్త్ సెక్రటేరియట్ తో, ఇతర భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేయనున్నాయి. కామన్‌వెల్త్‌కు మరింత శక్తి కల్పించడానికి ప్రత్యేకించి , చిన్న , ఇబ్బందులు ఎదుర్కొనే దేశాలకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దేందుకు, కామన్‌వెల్త్ జనాభాలో 60 శాతంగా ఉన్న యువతకు ఉపయోగపడేట్టు చేసేందుకు కట్టుబడి ఉన్నాం. కామన్‌వెల్త్ దేశాధినేతల సమావేశం ఈ దిశగా సవాళ్లను ఎదుర్కోవడానికి, సమావేశపు నినాదమైన, ఉమ్మడి భవిష్యత్ దిశగా అనే అంశంపై ఏకతాటి పైకి రావడానికి ఇది ఉపకరిస్తుంది. ప్రత్యేకించి, యునైటెడ్ కింగ్‌డమ్, ఇండియా లు కామన్‌వెల్త్ పౌరులకు భద్రమైన, సుసంపన్నమైన, మరింత సుస్థిరతతో కూడిన భవిష్యత్‌ను కల్పించడానికి ప్రత్యేకంగా కింది చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నాయి. అవి:
* ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2018 కి ఆతిథ్యమిచ్చే దేశంగా, ప్లాస్టిక్ ముప్పును ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా సమన్వయంతో కూడిన చర్యలను తీసుకునేందుకు ప్రోత్సహించడం.
* సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాన్ని కామన్‌వెల్త్ సభ్య దేశాల మధ్య పెంపొందింప చేయడానికి మద్దతునివ్వడం;
* ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ ను అమలు చేసే విధంగా, కామన్‌వెల్త్ సభ్య దేశాలకు సహాయపడడం, ఇందుకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడం, కామన్‌వెల్త్‌లోని చిన్న చేశాల కార్యాలయాలకు మరింత మద్దతును ఇవ్వడం.
సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యం
4. మన సంయుక్త దార్శనికతకు, మన సుసంపన్నతకు , ప్రస్తుత భవిష్యత్ తరాలకు యుకె-ఇండియా టెక్నాలజీ భాగస్వామ్యం ఎంతో కీలకమైనది. మన దేశాలు సాంకేతిక పరిజ్ఞాన విప్లవంలో ముందున్నాయి. మనం మన విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకుంటాం. నూతన ఆవిష్కరణలలో, పరిశోధనలలో సహకరించుకుంటాం. మనకు గల ప్రపంచ స్థాయి ఆవిష్కరణల క్లస్టర్లలో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటాం. అత్యున్నత విలువ గల ఉద్యోగాలను సృష్టించడానికి, ఉత్పాదకత పెంచడానికి, వాణిజ్యం, పెట్టుబడులు ప్రోత్సహించడానికి, ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి మన అనుబంధ సాంకేతిక విజ్ఞాన బలాన్ని వినియోగిస్తాం.
5. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ సెక్యూరిటీ రంగాలలో కృత్రిమ మేధస్సుకు గల అవకాశాలను అర్థం చేసుకుంటూ పరిశుభ్రమైన ప్రగతి, మన యువత సామర్ధ్యాలు, నైపుణ్యాల పెంపు ద్వారా నగరాలను మరింత వేగంగా అభివృద్ది చేయడం, భవిష్యత్తులో ఎక్కడికైనా వెళ్లి పని చేసుకోవడానికి వీలు కల్పించడం వంటి వాటికి సంబంధించి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఇరు పక్షాలూ తమ సహకారాన్ని మరింత పెంచనున్నాయి.
6. ఉభయ దేశాల మధ్య నానాటికీ పెరుగుతున్న ద్వైపాక్షిక సాంకేతిక భాగస్వామ్యంలో భాగంగా, ఇండియా లో యుకె- ఇండియా టెక్ హబ్ ను ఏర్పాటు చేసేందుకు యుకె తీసుకున్న చొరవను భారత ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఈ టెక్ హబ్ ఉన్నత స్థాయి టెక్నాలజీ కంపెనీలను ఒకచోటికి తీసుకురావడంతోపాటు, పెట్టుబడి, ఎగుమతుల అవకాశాలను కల్పించనుంది. అలాగే ఇది ఒక కొత్త వేదికగా, ఉపకరిస్తుంది. భవిష్యత్ మొబిలిటీకి, భారత అభివృద్ధి ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం కింద అధునాతన తయారీ, ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. మనం యుకె ప్రాంతీయ, భారతదేశంలో రాష్ట్ర స్థాయి టెక్ క్లస్టర్లను ఎన్నింటినో ఏర్పాటు చేయనున్నాం. ఉమ్మడి పరిశోధన అభివృద్ధి, నవకల్పనలకు వీలు కల్పించనుంది. ఉభయ దేశాల ప్రభుత్వాల మద్దతు తో మనం ఇండియా-యుకె టెక్ సిఇఒ అలయెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాం; నైపుణ్యం, నూతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి టెక్ యుకె-నాస్కామ్ (UK/NASSCOM) ఎంఒయు ను కుదుర్చుకోవడం జరిగింది. ఇది నైపుణ్యాల పైన నూతన సాంకేతిక పరిజ్ఞానాల పైన, పరిశ్రమ ఆధారిత అప్రెంటిస్‌షిప్ పథకాల పైన దృష్టి పెడుతుంది. భారతదేశం లో పెద్ద ఎత్తున వాణిజ్య అవకాశాలను పెంపొందించడానికి ఫిన్‌టెక్‌ను ప్రోత్సహించడానికి కొత్త యుకె ఫిన్‌టెక్ రాకెట్‌షిప్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
7. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి, సైన్సు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మేధావులైన బ్రటిష్, భారత శాస్త్రవేత్తలను ఉభయ దేశాలూ నియమిస్తున్నాయి. పరిశోధన, నవకల్పనల విషయంలో యుకె భారతదేశానికి రెండవ అతిపెద్ద అంతర్జాతీయ భాగస్వామి.
యుకె- ఇండియా న్యూటన్-బాబా కార్యక్రమం సంయుక్త పరిశోధనను 2008 నుంచి 2021 నాటికి సంయుక్త పరిశోధన అవార్డులను 400 మిలియన్ పౌండ్లకు తీసుకువెళ్లనుంది. యుకె, ఇండియాలు సురక్షితమైన, ఆరోగ్యవంతమైన జీవనానుకూల ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు మనం ఆరోగ్య రంగంలో మన సంయుక్త బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నాం. కృత్రిమ మేధస్సు, డిజిటల్ హెల్త్ టెక్నాలజీలను మరింత ముందుకు తీసుకుపోవడం ద్వారా దీనిని సాధించనున్నాం.
వాణిజ్యం.పెట్టుబడి, ఫైనాన్స్
8. ఉభయ దేశాల నాయకులు ఇండియా-యుకె మధ్య చైతన్యవంతమైన, నూతన వాణిజ్య భాగస్వామ్యాన్ని కలిగి ఉండడానికి అంగీకరించారు. యుకె తన స్వతంత్ర వాణిజ్య విధానానికి బాధ్యత తీసుకుంటున్నందున ఇరువైపులా పెట్టుబడుల రాకపోకలకు వీలు కల్పించడానికి , ఉభయ దేశాలకు గల సానుకూల అంశాల ఆధారంగా కొలాబరేషన్ ను మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించడం జరిగింది.
ఇటీవలే పూర్తయిన యుకె- ఇండియా సంయుక్త వాణిజ్య సమీక్షకు అనుగుణంగా, మనం కలిసి కట్టుగా వివిధ రంగాల వారీగా రోడ్‌మ్యాప్‌ను ను తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇది వాణిజ్య అవరోధాలు తొలగించడానికి, ఇరు దేశాలలో వ్యాపారం చేయడాన్ని సులభం చేస్తుంది. అలాగే యూరోపియన్ యూనియన్ నుంచి యుకె వైదొలగిన తర్వాత బలమైన ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకు వీలు కల్పిస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి యుకె వైదొలగినందున, యూరోపియన్ యూనియన్ లో ఉన్నప్పటి యుకె-ఇండియా ఒప్పందాలను , వాటి అమలు కాలంలో కొనసాగించడంతోపాటు, ఆ తర్వాత వాటి స్థానంలో యూరోపియన్ యూనియన్- ఇండియా ఒప్పందాలను ఆ తర్వాతి కాలంలో కూడా వాటి స్థానంలో కొనసాగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
9. నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు గల కీలక పాత్ర గురించి ఉభయ దేశాల నాయకులు పునరుద్ఘాటించారు. అలాగే సుస్థిర అభివృద్ధి , ప్రగతి సాధించడానికి స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, బహిరంగ వాణిజ్యం గురించీ వారు ప్రస్తావించారు. ప్రపంచ వాణిజ్య సంస్థలోని సభ్యదేశాలన్నింటితో కలసి పనిచేయడానికి , వాణిజ్యంపై సంయుక్త వర్కింగ్ గ్రూప్ చర్చలను మరింత ముందుకు తీసుకుపోవడానికి వారు అంగీకరించారు. ఇది అంతర్జాతీయ నిబంధనల ఆధారిత వ్యవస్థకు ఉమ్మడిగా మద్దతు తెలపనున్నది.
10. గత పదిసంవత్సరాలలో ఇండియాలో పెట్టుబడి పెడుతున్న అతిపెద్ద జి-20 దేశం యుకె. అలాగే యుకెలో , ఇండియా పెట్టుబడులు నాలుగవ స్థానంలో ఉన్నాయి. మన ప్రాధాన్యతల విషయంలో మన పరస్పర అవగాహనను మెరుగు పరచుకోవడం, సహకారానికి సంబంధించి భవిష్యత్ అవకాశాల సమీక్ష జరుపుకునేందుకు మనం కొత్త చర్చలను ప్రారంభించనున్నాం.
11. యుకె లోకి వచ్చే భారతీయ పెట్టుబడులకు సంబంధించి రెసిప్రోకల్ ఫాస్ట్ ట్రాక్ మెకానిజమ్ ఏర్పాటు చేయడం ద్వారా భారత వ్యాపారాలకు అదనపు మద్దతు కల్పించాలని యుకె తీసుకున్న నిర్ణయాన్ని ఇండియా స్వాగతించింది.
రెగ్యులేటరీ వాతావరణాన్ని మెరుగుపరచడానికి సాంకేతిక సహకార కార్యక్రమం ఉపయోగపడుతుది. ఇరువైపులా వ్యాపారానికి సంబంధించిన సంబంధిత వర్గాలు తీసుకునే చర్యలకు మద్దతు నివ్వనున్నాయి. ఈరోజు సమావేశమైన యుకె- ఇండియా సిఇఒ ఫోరం ప్రతిపాదనలకు కూడా మద్దతు నివ్వనున్నారు.
12. అంతర్జాతీయ విలువలో 75 శాతం రుపీ డినామినేటెడ్ మసాలా బాండ్ల రూపంలో ఉన్నాయి. వీటిని లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో జారీ చేయబడ్డాయి. ఇందులో మూడవ వంతు గ్రీన్ బాండ్లు.
13. అంతర్జాతీయ ఫైనాన్స్, పెట్టుబడి విషయంలో లండన్ సిటీ నిర్వర్తించిన పాత్రను ఉభయ పక్షాలూ స్వాగతించాయి.
భారతదేశపు ముఖ్యమైన జాతీయ పెట్టుబడి , మౌలిక సదుపాయాల ఫండ్ కింద భారత ప్రభుత్వం, యుకెలు సంయుక్తంగా గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్ (జిజి ఇఎఫ్) భారతదేశంలో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక ఇంధన రంగానికి నిధులు సమకూర్చనుంది. ఇరువైపులా 120 మిలియన్ పౌండ్ల ను సమకూర్చనున్నారు. దీనితో జిజిఇఎఫ్ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 500 మిలియన్ పౌండ్లు సమకూర్చనుంది. జిజిఇఎఫ్ 2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ఉపకరిస్తుంది. అలాగే పరిశుభ్రమైన రవాణా, నీరు, వ్యర్థాల నిర్వహణ రంగాలలో కూడా పెట్టుబడులకు ఇది ఉపకరిస్తుంది. ఇంధనం, మౌలిక సదుపాయాల విధానానికి సంబంధించి భవిష్యత్ సహకారానికి మనం ఎదురు చూస్తున్నాం. స్మార్ట్ అర్బనైజేషన్ లో కూడా ఉభయ దేశాలూ కలసి పనిచేయడానికి అంగీకరించాయి.
14. మన రెండు దేశాల మధ్య ఫైన్‌టెక్ చర్చను నిర్వహించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే, ప్రతిపాదిత కొత్త రెగ్యులేటరీ సహకార ఒప్పందాన్నీ స్వాగతిస్తున్నాం. దివాలా, పెన్షన్‌లు, ఇన్సూరెన్స్‌కు సంబంధించి మార్కెట్‌లు అభివృద్ధి చేయడానికి టెక్నికల్ సహకార కార్యక్రమం ద్వారా మన ఫైనాన్షియల్ కొలాబరేషన్లను విస్తరించడం జరుగుతుంది. మరోవైపు, ఈ రంగాలలో సహకారాన్ని ఆర్థిక మంత్రులు ఈ ఏడాది చివరలో నిర్వహించనున్న పదవ ఎకనమిక్, ఫైనాన్షియల్ డైలాగ్‌లో చర్చించనున్నారు.
15. ప్రస్తుత ప్రపంచీకరణ సమాజంలో ఇండియా, యుకెలు కనెక్టివిటీ ప్రాధాన్యతను గుర్తించాయి. సుపరిపాలన, చట్టబద్ధ పాలన, పారదర్శకత, బాహాటత, సామాజిక పర్యావరణ ప్రమాణాలను పాటించడం, ఫైనాన్షియల్ బాధ్యతా సూత్రాలను పాటించడం, బాధ్యతాయుత రుణ పైనాన్సింగ్ విధానాలు పాటించడం వంటి కీలక సూత్రాల ఆధారంగా కనెక్టివిటీ ఉండాలని ఇవి స్పష్టం చేశాయి. ఇవి:
బాధ్యతాయుత అంతర్జాతీయ నాయకత్వం
16. ఉభయ నాయకులు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు. వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, భద్రమైన , నిరంతరాయ సరఫరా, అందుబాటు ధరలో సరఫరాలు వంటివి ఉమ్మడి ప్రాధాన్యతలుగా ఉభయ దేశాలూ గుర్తించాయి. పరిశుభ్రమైన ఇంధనానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఖర్చు తగ్గించుకునే విషయంలో సహకారానికి పరస్పరం అంగీకరించాయి. నూతన సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణలు, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, సామర్ధ్యాల నిర్వహణ, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా దీనిని సాధించేందుకు అంగీకరించారు.
17. అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఎ) ఏర్పాటులో ఇండియా తీసుకున్న చొరవను యుకె స్వాగతించింది. కామన్‌వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశ వారంలో భాగంగా ఇరు ప్రభుత్వాల సహకారంతో ఐఎస్ఎ, లండన్ స్టాక్ ఎక్చేంజ్ (ఎల్ఎస్ఇ) మధ్య జాయింట్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడాన్ని ఉభయ నేతలు ప్రస్తావించారు. ఈ ఈవెంట్ లో యుకె ఈ అలయెన్సులో చేరికను ప్రముఖంగా ముందుకు తెస్తోంది. తదుపరి తరం సోలార్ టెక్నాలజీల అభివృద్ధిలో , సోలార్ ఫైనాన్సింగ్‌లో యుకె సోలార్ బిజినెస్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి , ఐఎస్ఎ లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్రతిపాదిత యుకె, ఐఎస్ఎ కొలాబరేషన్‌ను ఇది ప్రముఖంగా ముందుకు తెస్తోంది. ఈ ఈవెంట్, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్‌గా ఎల్‌ఎస్‌ఇ పాత్రనూ ప్రముఖంగా తెలియజేసింది. ఇది ఐఎస్ఎ సంకల్పాలను నెరవేర్చడానికి, 2030 నాటికి వెయ్యి బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఐఎస్ఎ దేశాల నుంచి సమకూర్చుకోవాలన్న ఐఎస్ఎ లక్ష్యాలకు ఇది కీలక పాత్ర వహించనుంది.
18. అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యాలుగా, మనం సన్నిహితంగా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తాం. అలాగే మన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నవారు, నిబంధనలతో కూడిన అంతర్జాతీయ పాలనకు మద్దతు పలికే వారు, అంతర్జాతీయ శాంతి , సుస్థిరత లను కాంక్షించే వారితో కలిసి పనిచేయాలని కాంక్షిస్తాం. అనిశ్చిత ప్రపంచంలో యు.కె, ఇండియాలు ఉమ్మడిగా మంచి కోసం ఉన్న ప్రధాన శక్తిగా చెప్పుకోవచ్చు. మనం మన అనుభవాలు, మన విజ్ఞానాన్ని అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడానికి ఇచ్చిపుచ్చుకుంటున్నాం. ఇండియా కు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డిబిటి), కాన్సర్ రీసెర్చ్ యుకె 10 మిలియన్ పౌండ్ల వ్యయంతో ద్వైపాక్షిక పరిశోధన చర్యలు ప్రారంభించనున్నాయి. కాన్సర్ చికిత్స లో తక్కువ ఖర్చు కాగల విధానాల పై ఈ పరిశోధనలు దృష్టి పెట్టనున్నాయి. యుకె కు చెందిన బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్స్ రిసెర్చ్ కౌన్సిల్, డిబిటి లు ఫార్మర్ జోన్ కు సంబంధించిన కార్యకలాపాలు చేపట్టనుంది. స్మార్ట్ అగ్రికల్చర్‌కు ఇది ఓపెన్ డాటా ప్లాట్‌ఫారంగా ఉంటుంది. ప్రపంచంలోని ఏప్రాంతంలోనైనా గల చిన్న, సన్నకారు రైతుల జీవితాలను మెరుగుపరచడానికి బయోలాజికల్ రిసెర్చ్, డాటాను ఈ ప్లాట్‌ఫాం వాడనుంది. డిబిటి యుకెకి చెందిన నాచురల్ ఎన్విరాన్‌మెంటల్ రిసెర్చ్ కౌన్సిల్ (ఎన్.ఇ.ఆర్.సి) తో భాగస్వామ్యం ఏర్పరచుకోనుంది. సుస్థిర మానవ అభివృద్ధి కి నూతన ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టేందుకు, సుస్థిర ధరిత్రికి అవసరమైన చర్యలను ఇది తీసుకుంటుంది.
19. 2030 నాటికి పేదరికంతో బాధపడేవారు లేకుండా చేయడానికి అభివృద్ధిని వేగవంతం చేయడానికి మన భాగస్వామ్యాన్ని అంతర్జాతీయ అభివృద్ధి ప్రాతిపదికగా బలోపేతం చేసుకుంటాం. పెరిగిన రాబడులు, కొత్త మార్కెట్‌లు, వాణిజ్యం,పెట్టుబడులు, కనెక్టివిటి, ఆర్థిక సమగ్రత, తదితరాల వల్ల ఒనగూరిన ప్రయోజనాలు వీలైనన్ని ఎక్కువ దేశాలు , సమాజంలోని నిరుపేదలు, అందిపుచ్చుకునేలా, మరింత భద్రమైన భవిష్యత్తును సుసంపన్న సమాజాన్ని నిర్మితమయ్యేలా మనం చూస్తాం.
డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ
20. 2015లో, మనం కొత్త రక్షణ, అంతర్జాతీయ సెక్యూరిటీ పార్టనర్‌షిప్ (డిఐఎస్‌పి) కోసం ప్రతిజ్ఞబూనాం. మన సంబంధాలలో భద్రత, రక్షణ కీలక మలుపు అయ్యేందుకు ఈ ప్రతిజ్ఞ చేశాం. మనం ఎదుర్కొంటున్న ముప్పులు మారనున్నాయి. అందువల్ల మన బాధ్యతల విషయంలో మనం అప్రమత్తంగానూ, వినూత్న ఆలోచనలతోనూ ఉండాలి. మనం ఈ ముప్పులకు థీటుగా వివిధ టెక్నాలజీలకు రూపకల్పన చేయగలం, తయారు చేయగలం. మన భద్రతా బలగాలు, సైనిక దళాలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామర్ధ్యాలను, పరికరాలను ఇచ్చిపుచ్చుకోనున్నాయి.
21. భద్రమైన, స్వేచ్ఛాయుత, సమ్మిళిత సుసంపన్న ఇండో -పసిఫిక్ , ఇండియా, యుకె, అంతర్జాతీయ కమ్యూనిటీ కి ఎంతైనా అవసరం. యు.కె, ఇండియా లు పైరసీ, నావిగేషన్ స్వేచ్ఛను రక్షించడం, ఒపెన్ యాక్సస్, మారిటైమ్ డొమైన్ చైతన్యాన్ని ఈ ప్రాంతంలో తీసుకురావడం తదితర అంశాలలో ముప్పును ఎదుర్కోవడంలో ఇండియా, యుకెలు కలిసి పనిచేయగలవు.
22. సైబర్ స్పేస్ లో అంతర్జాతీయ భద్రత, సుస్థిరత ను మరింత పెంపొందించడానికి పరస్పర సహకారానికి మేం అంగీకరించాం. దీనిని ఒక ఫ్రేమ్‌వర్క్ ద్వారా గుర్తించాలని, అది అంతర్జాతీయ చట్ట అమలుకు అనుగుణంగా స్వేచ్ఛాయుత , శాంతియుత , భద్రమైన సైబర్ స్పేస్ కు వీలు కల్పించాలని నిర్ణయించడం జరిగింది.
ఉగ్రవాద వ్యతిరేక పోరాటం
23. ఉభయ నాయకులు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, ఇండియా, యుకె లలో ఉగ్రవాద సంబంధిత చర్యలు ఏ రూపంలోనివైనా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఎవరూ ఏ రకంగానూ సమర్ధించుకోజాలరని, ఏ మతం, వర్గం, జాతి, ఆధారంగా ఏ రూపంలోనూ ఎవరూ సమర్థించుకోజాలరని పేర్కొన్నారు.
24. ఉగ్రవాద సంస్థలు, అమాయకులపై దాడులు చేసేందుకు తమ దళాలలో రిక్రూట్‌మెంట్ జరపకుండా చూడాలని, వారి కార్యకలాపాలకు స్థానం లేకుండా చూడాలని, ఇందుకు అన్ని దేశాలూ కలసికట్టుగా పనిచేసి ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అంతం చేయాలని, వారి ఆర్థిక మూలాలను, దెబ్బతీయాలని, ఉగ్రవాదులు ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లకుండా చూడాలని విదేశీ ఉగ్రవాద శక్తులను సైతం నిరోధించాలని అంగీకరించారు.
25. మన ప్రజలను రక్షించడానికి , లష్కర్-ఇ-తోయిబా, జైష్-ఇ-మొహమ్మద్ , హిజ్-బుల్-ముజాహిదీన్, హక్కానీ నెట్‌వర్క్, అల్ ఖాయిదా, ఐఎస్ఐఎస్ ఇతర అనుబంధసంస్థలు, అంతర్జాతీయ నిషేధానికి గురైన ఉగ్రవాద సంస్థలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు, ఈ విషయంలో పరస్పర సహకారానికి ఉభయదేశాల నాయకులు అంగీకరించారు. అలాగే ఆన్‌లైన తీవ్రవాదాన్ని కూడా అరికట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు.
26. సలిస్‌బరి లో జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకొని యుకె, ఇండియా లు రసాయన ఆయుధాల వ్యాప్తికి వ్యతిరేకంగా నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధాన్ని బలోపేతం చేసే విషయంలో ఉమ్మడి ప్రయోజనాలను పునరుద్ఘాటించారు. సిరియా అరబ్ రిపబ్లిక్ లో ఇప్పటికీ రసాయన ఆయుధాలు వినియోగిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఉభయ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడ, ఎవరు, ఏరూపంలో ఏ పరిస్థితులలో అయినా రసాయన ఆయుధాలను వాడడానికి వారు వ్యతిరేకం. రసాయన ఆయుధాల కన్వెన్షన్ పకడ్బందీ అమలును బలోపేతం చేసేందుకు వారు కట్టుబడి ఉన్నారు. ఇందుకు సంబంధించి సత్వర దర్యాప్తు జరగాలని, రసాయన ఆయుధాల వాడకానికి సంబంధించిన అన్ని రకాల దర్యాప్తులు ఈ కన్వెన్షన్ ప్రకారమే జరగాలని అభిప్రాయపడ్డారు.
విద్య, ప్రజలకు-ప్రజలకు మధ్య సంబంధాలు
27. అత్యున్నత ప్రతిభ గలవారు, మెరికల్లాంటి వారు యుకె లో చదువుకోవడాన్ని, పనిచేయడాన్ని ప్రత్యేకించి ఉభయ దేశాల సుసంపన్నతకు వీలు కల్పించే సబ్జెక్టులు, రంగాలలో నైపుణ్యాలు, సామర్ధ్యాలను పెంచే వాటిని మేం స్వాగతిస్తాం.
28. ఇండియా-యుకె సాంస్కృతిక సంవత్సరం 2017 విజయవంతంగా పూర్తి కావడం పట్ల ఇరువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏడాది పొడవునా జరిగిన కార్యక్రమాల ద్వారా వివిధ కళా సాహిత్య సాంస్కృతిక రూపాలను ఇరు దేశాలలో ప్రదర్శించడానికి మంచి అవకాశం దక్కింది. ఇండియా-యుకె ల మధ్య లోతైన సాంస్కృతిక బంధానికి ఈ ఉత్సవాలు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
29. ఉభయ నాయకులు బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 70 వ వార్షికోత్సవాలను స్వాగతించారు. అది ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ, యువతలో నైపుణ్యాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సాంస్కృతిక మార్పిడికి అది ఇచ్చిన మద్దతు ను ప్రస్తావించారు.
30. ఇది ఉభయ దేశాల ప్రజల మధ్య సజీవ వారధి వంటిదని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. రాబోయే తరం మరింత ఎక్కువగా మరింత బలంగా దీనిని మరింత ముందుకు తీసుకుపోగలదన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ సజీవ వారధిని ప్రోత్సహించాలని, దీనికి మద్దతునివ్వాలని ఇరువురు నాయకులు అంగీకరించారు.
ముగింపు
31. మేం, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం. ప్రపంచానికి, శతాబ్దాలకు విస్తరించిన మా ప్రత్యేక బంధం రాగల సంవత్సరాలలో మరింత మెరుగుపడనుంది. మేం మా వ్యాపార, సాంస్కృతిక, మేధోపరమైన నాయకత్వాన్ని కోట్లాది చర్చల స్థాయికి తీసుకుపోవడాన్ని ప్రోత్సహిస్తాం. ఇప్పటికే ఇవి ఇండియా-యుకె లను కుటుంబం నుంచి ఫైనాన్స్, వ్యాపారం నుంచి బాలీవుడ్ కు, క్రీడల నుంచి సైన్స్ కు అనుసంధానం చేశాయి. అందువల్ల మరి కొన్ని కోట్ల మంది బ్రటిష్ వారు, భారతీయులు రాకపోకలు సాగించడం, పరస్పరం అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడం, ఇరుదేశాలలో పర్యటనలు, వాణిజ్యం వంటి కార్యకలాపాల ద్వారా వృద్ధి చెందుతారు.
32. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, తనకు, తన ప్రతినిధి వర్గానికి హృదయ పూర్వక ఆతిధ్యం ఇచ్చినందుకు యుకె ప్రధాన మంత్రి థెరెసా మేకు, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు భారత్ లో స్వాగతం చెప్పేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.