ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం లోక్ కల్యాణ్ మార్గ్ 7లో సెమీకండక్టర్ రంగంలోని కార్య నిర్వహణాధికారులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సెమీకండక్టర్ల రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై వారితో ప్రధానమంత్రి విస్తృతంగా చర్చించారు. ప్రపంచ అభివృద్ధిపథాన్ని ఈ రంగం ఎలా ముందుకు తీసుకెళ్లగలదో శ్రీ మోదీ వివరించారు. భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు దేశంలో తీసుకుంటున్న సంస్కరణలను సైతం ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
సెమీకండక్టర్ రంగ అభివృద్ధి పట్ల భారతదేశ నిబద్ధతను సీఈఓలు ప్రశంసించారు. యావత్తు సెమీకండక్టర్ రంగంలోని ప్రముఖులు అందరినీ ఒక్క చోటకు చేర్చడం అపూర్వమైనదని పేర్కొన్నారు.
భారత్‌లో సెమీకండక్టర్ల అభివృద్ధి, దేశాన్ని స్వయం సమృద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం తమను చాలా ఉత్సాహపరుస్తోందని మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్ర అన్నారు. భారత్‌లో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మోదీ తీసుకువచ్చిన విధానం ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. “సెమికండక్టర్ అవకాశాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన భారతదేశ సెమీకండక్టర్ మిషన్‌కు ఇది సరైన సమయం. ఏఐ వృద్ధి చెందుతోంది. అవకాశాలూ పెరుగుతాయి. అయితే, జరగాల్సింది ఇంకా ఎంతో ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నాయకత్వానికి సరిపోలేది ఎక్కడా లేదని, ఆయన నాయకత్వం అపూర్వమైనదని సెమి సీఈఓ అజిత్ మనోచా ప్రశంసించారు. ఇది కేవలం భారత్‌నే కాకుండా మొత్తం ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ‘‘ప్రపంచం మొత్తం ఆయనతోపాటు నడుస్తుందన్న నమ్మకం మోదీ నాయకత్వంలో కనిపిస్తోంది” అని పేర్కొన్నారు.
భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన సంకల్పం, స్థిరత్వం, దూరదృష్టి ప్రధానమంత్రి మోదీకి ఉండటం తనకు ఉత్సాహాన్నీ, సంతోషాన్నీ ఇస్తోందని ఎన్ఎక్స్‌పీ సీఈఓ కర్ట్ సీవెర్స్ పేర్కొన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రధానమంత్రికి ఉన్నంత లోతైన జ్ఞానం కలిగిన మరే ప్రపంచ నాయకుడినీ తాను ఇప్పటివరకు చూడలేదని అన్నారు.
ప్రధానమంత్రి సంకల్పం, మన దేశ భవిష్యత్తు కోసం డిజిటల్ రంగపు మౌలిక సదుపాయాల పట్ల ఆయన ఆలోచన విధానం సెమీకండక్టర్ పరిశ్రమను ఉత్తేజపరుస్తోందని టీఈపీఎల్ సీఈఓ రణ్‌ధీర్ ఠాకూర్ తెలిపారు. వికసిత్ భారత్‌లో సెమీకండక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
భారతదేశాన్ని ప్రపంచస్థాయికి చేర్చడానికి ప్రధానమంత్రి చేస్తున్న కృషి కేవలం భారత్‌కే కాకుండా ప్రపంచానికి అవసరమని జాకబ్స్ సీఈఓ బాబ్ ప్రగడ అన్నారు. “తయారీ రంగ పునరుజ్జీవంలో భారత్ ముందంజలో ఉండాలి. ఇది జరగబోతోంది. వచ్చే దశాబ్దంలోగా భారత్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఉంటుందని భావిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి సందేశం ఎప్పుడూ సరళంగా, స్పష్టంగా ఉంటుందని, కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నారో తమకు తెలుసునని రెనెసాస్ సీఈఓ హిదెతోషి షిబాటా అన్నారు. “చురుకైన, వేగవంతమైన పురోగతికి సంపూర్ఱమైన స్పష్టత సహాయపడుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి చూపిన నాయకత్వానికి తాను ముగ్ధుడిని అయ్యానని ఐఎంఈసీ సీఈఓ లుక్ వాన్ డెన్ హోవ్ పేర్కొన్నారు. సెమీకండక్టర్ సాంకేతికత రంగంలో భారత్‌ను కేంద్రంగా మార్చేందుకు ప్రధానమంత్రి నిబద్ధత, అంకితభావాన్నీ ఆయన ప్రశంసించారు. కేవలం తయారీనే కాకుండా పరిశోధన, అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి దూరదృష్టి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశోధన, అభివృద్ధిలో భారత్ బలోపేతంగా మారేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఆయన వచ్చారు.
ప్రధానమంత్రి సంకల్పం, అమలు చేసే విధానం సాటిలేనిదని, ఇది నిజంగా అభినందించతగ్గదని టవర్ సీఈఓ రస్సెల్ సీ ఎల్‌వాంగర్ పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా ప్రధానమంత్రి మోదీ నాయకత్వం ముచ్చట గొలుపుతున్నదని కాడెన్స్ సీఈఓ అనిరుధ్ దేవ్‌గన్ అన్నారు. అన్ని డిజిటల్ పరిశ్రమల్లో సెమీకండక్టర్ సాంకేతికత తప్పనిసరి అని పేర్కొన్నారు. గత మూడేళ్లతో పోలిస్తే మోదీ నాయకత్వం ఇప్పుడు వేగం పుంజుకుందని అన్నారు. ఆరంభం నుంచి ఇందులో భాగం కావడం తన అదృష్టమనీ, ఏటేటా భారీగా అభివృద్ధి కనిపిస్తోందనీ వ్యాఖ్యానించారు.
గత రెండు, మూడేళ్ల నుంచి ఈ రంగంలో డిజైన్ నుంచి తయారీ వరకు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టుబడి పెట్టాలనే అనే కోణంలో స్పష్టత వచ్చిందని సినాప్సిస్ ప్రెసిడెంట్, సీఈఓ సాస్సైన్ ఘాజీ పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కేంద్రం నుంచి స్థానిక, అంతర్జాతీయ వినియోగానికి అవసరమయ్యే ఉత్పత్తుల తయారీ దిశగా ఆసక్తి పెరగడం తాను ఇప్పుడు చూస్తున్నానని అన్నారు.
సెమీకండ్టర్ పరిశ్రమ దిశగా భారత్ భారీ అడుగు వేసిందని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ గౌరవాచార్యుడు ప్రొఫెసర్ ఆరోగ్యస్వామి పాల్‌రాజ్ పేర్కొన్నారు. “చాలా శక్తి, చాలా పురోగతి కనిపిస్తోంది. ఇది నిజంగా గౌరవ ప్రధానమంత్రి సంకల్పం, ప్రేరణతోనే సాధ్యమైంది” అని అన్నారు.
సెమీకండక్టర్ పరిశ్రమకు ఇది నిజంగా ఉత్తేజం నింపే సమయమని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని సీజీ పవర్ చైర్మన్ వెల్లయన్ సుబ్బయ్య పేర్కొన్నారు. భారత్ అపూర్వమైన స్థాయికి చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ప్రభుత్వం, పరిశ్రమ మధ్య సహకారం ముందెన్నడూ చూడలేదని ప్రశంసించారు.
సెమీకండక్టర్ మిషన్‌లో ప్రధానమంత్రి ఆశ్చర్యపరిచే సంకల్పాన్ని చూపారని యూసీఎస్‌డీ చాన్స్‌లర్ ప్రోఫెసర్ ప్రదీప్ ఖోస్ల పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ల రంగానికి సరైన విధానాన్ని రూపొందించేందుకు ఇప్పటి వరకు చరిత్రలో ఏ పాలనాయంత్రాంగం కూడా ధైర్యం చేయలేదన్నారు. ప్రధానమంత్రికి సంకల్పం ఉండటం సంతోషకరమని, ఆయనలో నిబద్ధత ఉందని, కచ్చితంగా మనం విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.