ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశాన్ని ఉద్దేశించి 2014 సెప్టెంబరులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారతీయ సమున్నత సంప్రదాయంలో వేళ్లూనుకున్న యోగాభ్యాస ప్రక్రియకు తగిన గౌరవం కల్పిస్తూ ‘అంతర్జాతీయ యోగా దినం’ పాటించేందుకు ప్రపంచం ముందుకు రావాలంటూ ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఆ తరువాత 177 దేశాలు ఒక్క తాటి పైకి వచ్చి ఈ ప్రతిపాదనకు మద్దతు పలికాయి. జూన్ 21వ తేదీని ‘అంతర్జాతీయ యోగా దినం’గా ప్రకటించాలని తీర్మానించాయి. ఆ మేరకు 2014 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి సదరు ప్రతిపాదనను ఆమోదించింది. ప్రధాన మంత్రి ప్రతిపాదనను బలపరచిన 177 దేశాల్లో అన్ని ఖండాలకు చెందిన దేశాలుండటం విశేషం.
ఏటా జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నిర్వహించాలన్న ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ప్రజాదరణ ఇనుమడిస్తుంది. ప్రధాన మంత్రి శ్రీ మోదీ స్వయంగా ఔత్సాహిక యోగాభ్యాసకులు. జ్ఞానం, భక్తి, కర్మల అద్భుత సమ్మేళనమైన యోగాభ్యాస ప్రక్రియ ‘రోగముక్తి’నేగాక ‘భోగముక్తి’ని కూడా ప్రసాదిస్తుందని ఆయన వివరిస్తారు. వాస్తవానికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే యోగాకు యువతలో మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం ప్రత్యేకంగా యోగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు.