ఈరోజు, అమెరికా  అధ్యక్షులు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఆతిథ్యమిచ్చిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోఆయనతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో సమావేశమయ్యాం .

 

గత నాలుగేళ్లుగా క్వాడ్‌ లీడర్-స్థాయి ఫార్మాట్‌ మెరుగవుతూ నేడు వ్యూహాత్మకంగా అత్యంత శక్తిమంతంగా ఎదిగింది.  ఇండో-పసిఫిక్‌ ప్రాంతం కోసం వాస్తవిక, సానుకూల, శాశ్వత ప్రభావాన్ని అందించే మంచి శక్తిగా ఎదిగింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే, క్వాడ్ దేశాలు రాబోయే దశాబ్దాల పాటు ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి అండగా ఉండే కీలకమైన, శాశ్వతమైన ప్రాంతీయ సమూహాన్ని నిర్మించుకున్న సందర్భంగా వేడుకలు జరుపుకొన్నాం.



భాగస్వామ్య విలువలను ప్రోత్సహిస్తూ,  చట్టబద్ధమైన నియమాల ఆధారంగా అంతర్జాతీయ వ్యవస్థను రూపొందించాలనుకుంటున్నాము. మొత్తం దాదాపు రెండు బిలియన్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేం , ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో మూడింట ఒక వంతుకు పైగా కలిగి ఉన్నాము. కలిసికట్టుగా, ఉత్సాహంగా ఒక స్వేచ్ఛాయుతమైన, ఓపెన్ ఇండో-పసిఫిక్‌ ప్రాంత ఏర్పాటు పట్ల మా నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నాము. ఇండో-పసిఫిక్ ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించడం ద్వారా ప్రాంత సుస్థిర అభివృద్ధి, స్థిరత్వం, శ్రేయస్సుకు మద్దతునివ్వడానికి, మా పరస్పర సహకారం ద్వారా, ప్రభుత్వాల నుంచి, ప్రైవేట్ రంగం నుంచి అలాగే ప్రజల మధ్య పరస్పర సంబంధాల నుంచి మా సమష్టి బలాలు, వనరులను క్వాడ్ ఉపయోగించుకుంటుంది.

 

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని నాలుగు ప్రముఖ సముద్రతీర ప్రజాస్వామ్య దేశాలుగా, ప్రపంచ భద్రత, శ్రేయస్సు ప్రధాన అంశంగా, ఈ డైనమిక్ ప్రాంత వ్యాప్తంగా శాంతి, సుస్థిరత స్థాపన కోసం నిస్సందేహంగా మా కృషి కొనసాగుతుంది. ప్రస్తుత స్థితిని మార్చడానికి, అస్థిరపరిచేందుకు ప్రయత్నించే ఏవైనా ఏకపక్ష చర్యలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించే ఇటీవలి అక్రమ క్షిపణి ప్రయోగాలను మేము ఖండిస్తున్నాము. సముద్ర తీర ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదకరమైన, దుందుడుకు చర్యల పట్ల మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఏ దేశంపైనా ఆధిపత్యం చలాయించని, ఏదైనా దేశపు ఆధిపత్యాన్ని సహించని ప్రాంతాన్ని మేము కోరుకుంటాము - అన్ని దేశాలూ ఇతరుల ఆధిపత్యం నుంచి విముక్తి పొంది, వారి భవిష్యత్తును నిర్ణయించడానికి వారి స్వీయ మంత్రాంగాలను రూపొందించుకోవచ్చు. మానవ హక్కులు, స్వేచ్ఛ సూత్రం, చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, వివాదాల శాంతియుత పరిష్కారం, ఐక్యరాజ్య సమితి చార్టర్ సహా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా బెదిరింపులను లేదా బలగాల ఉపయోగాన్ని నిషేధించుట కోసం తన బలమైన మద్దతను అందిస్తూ ఒక సుస్థిరమైన, ఓపెన్ అంతర్జాతీయ వ్యవస్థను సమర్థించుట పట్ల మా నిబద్ధత విషయంగా మేము ఐక్యంగా ఉన్నాము.

 

2023 క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో నేతలు జారీ చేసిన దార్శనిక ప్రకటనను ప్రతిబింబిస్తూ, మేము చేసే పనిలో పారదర్శకంగా ఉంటూ, దానిని నిరంతరం కొనసాగిస్తాము. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఎఎస్ఇఎఎన్), పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ (పిఐఎఫ్), ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐవోఆర్ఎ)తో సహా ప్రాంతీయ సంస్థల నాయకత్వాన్ని గౌరవిస్తూ, క్వాడ్ ప్రయత్నాలకు కేంద్రంగా ఉంటాము.

 
ఎ గ్లోబల్ ఫోర్స్ ఫర్ గుడ్

 

ఆరోగ్య భద్రత

 

మన సమాజాలకు, మన ఆర్థిక వ్యవస్థలకు, మన ప్రాంతం సుస్థిరత కోసం ఆరోగ్య భద్రత ఎంత ముఖ్యమో కోవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి గుర్తు చేసింది. 2021, 2022 కాలంలో, ఇండో-పసిఫిక్ దేశాలకు 400 మిలియన్లకు పైగా సురక్షితమైన, ప్రభావవంతమైన కోవిడ్-19 డోస్‌లను, అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మిలియన్ టీకాలను అందించడంలో క్వాడ్ దేశాలు సమష్టిగా కృషి చేశాయి, అల్ప, మధ్యస్థ-ఆదాయ దేశాలకు టీకాల సరఫరా కోసం కోవ్యాక్స్ ముందస్తు మార్కెట్ ఒప్పందం కోసం 5.6 బిలియన్ డాలర్లను అందించాయి. 2023లో, మేము క్వాడ్ ఆరోగ్య భద్రతా భాగస్వామ్యాన్ని ప్రకటించాము, దీని ద్వారా మహమ్మారులకు సన్నద్ధమయ్యే శిక్షణను అందించడంతో పాటుగా ఈ ప్రాంత భాగస్వామ్య దేశాలన్నింటిలో ఆరోగ్య భద్రత కోసం క్వాడ్ కృషిని కొనసాగిస్తున్నది.

 

ప్రస్తుత క్లాడ్ I ఎంపాక్స్ అలాగే కొనసాగుతున్న క్లాడ్ II ఎంపాక్స్ వ్యాప్తిని నిరోధించేందుకు, అల్ప, మధ్యస్థ-ఆదాయ దేశాల్లో టీకాల తయారీని తగినంత విస్తరించడం సహా సురక్షితమైన, ప్రభావవంతమైన, నాణ్యత-హామీతో కూడిన ఎంపాక్స్ టీకాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉంచేందుకు సమన్వయంతో కృషి చేయడానికి మేము ప్రణాళిక చేస్తున్నాము..

 

ఇండో-పసిఫిక్ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఒక అద్భుతమైన భాగస్వామ్యంగా క్వాడ్ క్యాన్సర్ మూన్‌షాట్‌ను ఈరోజు ప్రకటించడం మాకు గర్వంగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో క్వాడ్ విజయవంతమైన భాగస్వామ్యాన్ని నిర్మించడం, ఈ ప్రాంతంలో క్యాన్సర్‌ను పరిష్కరించడానికి మా సమష్టి కృషి, మా శాస్త్రీయ, వైద్యపరమైన సామర్థ్యాలు, మా ప్రైవేట్, లాభాపేక్షలేని రంగాల సహకారంలతో, మేము ఈ ప్రాంతంలో క్యాన్సర్ భారాన్ని తగ్గించేందుకు మా భాగస్వామ్య దేశాలతో కలిసి కృషి చేస్తాము.

 

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, అనేక మంది ప్రాణాలను బలిగొనే ఒక నివారించదగిన క్యాన్సర్  అయిన గర్భాశయ క్యాన్సర్‌ను ఎదుర్కోవడంపై క్వాడ్ క్యాన్సర్ మూన్‌షాట్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఈ ప్రాంతంలోని ఇతర రకాల క్యాన్సర్‌ల పరిష్కారానికీ ఇది పునాది వేస్తుంది. యు.ఎస్. నేవీ వైద్యపరమైన శిక్షణలను అలాగే ఈ ప్రాంతంలో గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం నైపుణ్యాలను పంచుకోవడం ద్వారా 2025 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని అమెరికా భావిస్తోంది. గర్భాశయ క్యాన్సర్‌తో సహా క్యాన్సర్‌ నివారణ, నిర్ధారణ, చికిత్స కోసం పనిచేసే అర్హత కలిగిన ప్రైవేట్ రంగ ఆధారిత ప్రాజెక్ట్‌లకు యు.ఎస్. ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డిఎఫ్‌సి) ద్వారా ఆర్థిక సహాయం అందించనుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని పదకొండు దేశాల్లో గర్భాశయ క్యాన్సర్‌ను నిర్మూలించడంతో పాటు క్యాన్సర్ నివారణ, రోగనిర్ధారణ, చికిత్సపై దృష్టి సారించే పరిపూర్ణ కార్యక్రమాలకు మద్దతు కోసం ఇండో-ఫసిఫిక్ ప్రాంతాల్లో గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన భాగస్వామ్య కార్యక్రమం (ఈపీఐసీసీ)ని విస్తరించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం, మిండెరూ ఫౌండేషన్ మద్దతుతో ఆర్థిక సాయాన్ని 29.6 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచనున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది.

ఇండో-పసిఫిక్ ప్రాంతానికి $7.5 మిలియన్ల విలువైన హెచ్‌పివి శాంప్లింగ్ కిట్‌లు, డిటెక్షన్ కిట్‌లు, గర్భాశయ క్యాన్సర్ టీకాలను అందించడానికి భారతదేశం కట్టుబడి ఉంది. డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్‌ కోసం 10 మిలియన్ల డాలర్ల సాయాన్ని భారత్ అందిస్తుంది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్, సంరక్షణలో సహాయపడే తన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను స్వీకరించడం, అమలు చేయడం కోసం ఆసక్తిగల ఇండో-ఫసిఫిక్ దేశాలకు భారత్ సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. జపాన్ సీటీ, ఎమ్ఆర్ఐ స్కానర్‌లతో సహా వైద్య పరికరాలను అందిస్తోంది. కంబోడియా, వియత్నాం, తైమూర్-లెస్టేతో కలిసి సుమారు 27 మిలియన్ డాలర్ల విలువైన ఇతర సహాయం చేస్తున్నది. అలాగే గవి వ్యాక్సిన్ అలయన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలకు సహకరిస్తోంది. ఆయా దేశాల్లో క్యాన్సర్ రంగంలో పరిశోధన, అభివృద్ధి పురోగతికి సహకరిస్తూ ఈ ప్రాంతంలో గర్భాశయ క్యాన్సర్ భారాన్ని తగ్గించడానికి మద్దతుగా ప్రైవేట్ రంగం, ప్రభుత్వేతర రంగాల కార్యకలాపాలను పెంచడానికి క్వాడ్ భాగస్వామ్య దేశాలు కృషి చేస్తున్నాయి. అవసరమైన ఆమోదాలకు లోబడి, డిమాండ్‌ను బట్టి పెంచే విధంగా, ఇండో-పసిఫిక్ ప్రాంతానికి 40 మిలియన్ల వరకు హెచ్‌పీవీ టీకాల ఆర్డర్‌లకు మద్దతు ఇచ్చే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, గవీల భాగస్వామ్యం సహా అటువంటి  ప్రభుత్వేతర సంస్థల నుంచి అనేక కొత్త, ప్రతిష్టాత్మకమైన ఒప్పందాలను మేము స్వాగతిస్తున్నాము. ఆగ్నేయాసియాలో గర్భాశయ క్యాన్సర్‌ పరిష్కారం కోసం మహిళల ఆరోగ్యం, సాధికారత యంత్రాంగం ద్వారా 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాము. మొత్తంగా, క్వాడ్ క్యాన్సర్ మూన్‌షాట్ రాబోయే దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుందని మా శాస్త్రీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

మానవతా సాయం,  విపత్తు సాయం (హెచ్ఏడీఆర్)

 

2004లో హిందూ మహాసముద్రంలో భూకంపం, సునామీ విలయం సంభవించిన సమయంలో మానవతా సాయం కోసం క్వాడ్ మొదటిసారి కలిసి పనిచేయడం ప్రారంభమైంది. నాటి నుంచి ఇరవై సంవత్సరాలుగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే వినాశనం నుంచి ప్రజలను ఆదుకునేందుకు మేము ప్రతిస్పందిస్తూనే ఉన్నాము. "ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మానవతా సాయం, విపత్తు సహాయంలో క్వాడ్ భాగస్వామ్యాన్ని" 2022లో క్వాడ్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో హెచ్‌ఎడిఆర్‌ విషయంలో క్వాడ్ భాగస్వామ్యం కోసం రూపొందించిన మార్గదర్శకాలపై సభ్య దేశాలు సంతకాలు చేశాయి. ఇది ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో క్వాడ్ దేశాలు వేగంగా సమన్వయం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు అవసరమైన సహాయక సామాగ్రిని ముందస్తుగా సిద్ధంగా ఉంచడంతో పాటు, వేగంగా ప్రతిస్పందించడానికి సన్నద్ధతతో ఉండేలా పనిచేస్తున్న క్వాడ్ ప్రభుత్వాలను మేము స్వాగతిస్తున్నాము. ఈ ప్రయత్నం హిందూ మహాసముద్ర ప్రాంతం నుంచి ఆగ్నేయాసియా, పసిఫిక్ ప్రాంతాల వరకు విస్తరించింది.

 

2024, మే నెలలో పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగిపడిన విషాద  సంఘటన సమయంలో, క్వాడ్ భాగస్వాములు మానవతా సాయంగా 5 మిలియన్ డాలర్లరు పైగా సాయాన్ని సమష్టిగా అందించారు. టైఫూన్ యాగీ వినాశకరమైన పరిణామాలతో కకావికలమైన వియత్నాం ప్రజలను ఆదుకోవడానికి క్వాడ్ భాగస్వాములు 4 మిలియన్ డాలర్లకు పైగా మానవతా సాయం అందించేందుకు క్వాడ్ దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రాంత భాగస్వాములు దీర్ఘకాలం పాటు విపత్తులను ఎదుర్కొనేలా సన్నద్ధం అయ్యేందుకు జరుగుతున్న ప్రయత్నాల కోసం క్వాడ్ తన మద్దతును కొనసాగిస్తూనే ఉంది.

 

సముద్ర సంబంధమైన భద్రత

 

ఈ ప్రాంతంలోని భాగస్వాములకు దాదాపుగా సరైన సమయంలో, సమీకృతమైన, తక్కువ ఖర్చుతో కూడిన సముద్ర ప్రాంత అవగాహన సమాచారాన్ని అందించడానికి మేము 2022లో సముద్ర ప్రాంత అవగాహన కోసం ఇండో-పసిఫిక్ భాగస్వామ్యం (ఐపిఎండిఎ)ను ప్రకటించాము. అప్పటి నుంచి, భాగస్వాములతో సంప్రదింపులతో, మేము ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా —పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ ఫిషరీస్ ఏజెన్సీ ద్వారా, ఆగ్నేయాసియాలోని భాగస్వాములతో, ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్-ఇండియన్ ఓషన్ రీజియన్, గురుగ్రామ్‌కు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశాము. అలా చేయడం ద్వారా, రెండు డజన్లకు పైగా దేశాలకు డార్క్ వెసెల్ మారిటైమ్ డొమైన్ అవగాహన డేటాను అందుబాటులో ఉంచడంలో క్వాడ్ ఎంతగానో సహాయపడింది, తద్వారా అ దేశాలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు సహా తమ ప్రత్యేక ఆర్థిక మండళ్లలో జరుగుతున్న కార్యకలాపాలను మెరుగ్గా పర్యవేక్షించగలుగుతాయి. శాటిలైట్ డేటా, శిక్షణ, సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రాంతీయ సముద్ర ప్రాంత అవగాహనను పెంపొందించడానికి పసిఫిక్ దీవుల ఫోరమ్ ఫిషరీస్ ఏజెన్సీతో తన సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఆస్ట్రేలియా కట్టుబడి ఉంది.

 

ఐపీఎమ్‌డీఏ, ఇతర క్వాడ్ భాగస్వాముల కార్యక్రమాల ద్వారా అందించే సాధనాలను పెంచడానికి, వారి జలాలను పర్యవేక్షించడానికి, సురక్షితంగా ఉంచడానికి, వారి చట్టాలను అమలు చేయడానికి, చట్టవిరుద్ధమైన ప్రవర్తనను అరికట్టడానికి ఈ ప్రాంతంలోని మా భాగస్వాములకు వీలు కల్పించడం కోసం ఈరోజు మేము మారిటైమ్ ఇన్షియేటివ్ ఫర్ ట్రేనింగ్ ఇన్ ద ఇండో-పసిఫిక్ (మైత్రీ) అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాము. 2025లో మైత్రీ ప్రారంభ వర్క్‌షాప్ కోసం ఆతిథ్యమివ్వడానికి మేము ఎదురుచూస్తున్నాము. ఇంకా, ఇండో-పసిఫిక్‌లో నియమాల ఆధారిత సముద్ర క్రమాన్ని సమర్థించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి, క్వాడ్ సముద్ర చట్టపరమైన చర్చలను ప్రారంభించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదనంగా, ఈ ప్రాంతానికి అత్యాధునిక సామర్థ్యం, సమాచారాన్ని అందించుట కొనసాగించడానికి క్వాడ్ భాగస్వాములు రాబోయే సంవత్సరంలో ఐపీఎమ్‌డీఏలో కొత్త సాంకేతికతను, డేటాను జోడించాలనుకుంటున్నారు.

 

పరస్పర చర్యను మెరుగుపరిచేందుకు, సముద్ర సంబంధ భద్రతను పెంపొందించడానికి, రాబోయే సంవత్సరాల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చేపట్టబోయే తదుపరి మిషన్స్ కొనసాగించేందుకు యు.ఎస్. తీరరక్షక దళం, జపాన్ తీరరక్షక దళం, ఆస్ట్రేలియన్ సరిహద్దు బలగాలు, భారత తీరరక్షక దళం 2025లో మొట్టమొదటి క్వాడ్-ఎట్-సీ షిప్ అబ్జర్వర్ మిషన్‌ను ప్రారంభించడానికి ప్రణాళిక చేస్తుందని ఈరోజు మేము ప్రకటిస్తున్నాము.

 

ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా ప్రకృతి వైపరీత్యాలకు పౌర ప్రతిస్పందన మరింత వేగంగా, సమర్ధవంతంగా ఉండేందుకు మద్దతివ్వడానికి, మన దేశాల మధ్య భాగస్వామ్య ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యాన్ని కొనసాగించడానికి,  మా సమష్టి లాజిస్టిక్స్ బలాలను ఉపయోగించుకోవడానికి గానూ క్వాడ్ ఇండో-పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్ పైలట్ ప్రాజెక్ట్‌ ప్రారంభాన్ని కూడా మేము ఈ రోజు ప్రకటిస్తున్నాము

 

నాణ్యమైన మౌలిక సదుపాయాలు

నాణ్యమైన, విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంత కనెక్టివిటీని మెరుగుపరచడానికి క్వాడ్ కట్టుబడి ఉంది.
ప్రాంతీయ భాగస్వాముల సహకారంతో, ఇండో-పసిఫిక్ అంతటా స్థిరమైన, విపత్తులను తట్టుకునే ఓడరేవు మౌలిక వసతుల అభివృద్ధికి మద్దతు కోసం క్వాడ్ నైపుణ్యాన్ని ఉపయోగించుకునే భవిష్యత్ భాగస్వామ్య క్వాడ్ నౌకాశ్రయాలను ప్రకటించడానికి  మేము సంతోషిస్తున్నాము. 2025లో, క్వాడ్ ప్రాంతీయ నౌకాశ్రయాలు, రవాణా సదస్సుకు ముంబైలో ఆతిథ్యమివ్వాలని భారత్ భావిస్తోంది ఈ కొత్త భాగస్వామ్యం ద్వారా, క్వాడ్ భాగస్వాములు ఈ ప్రాంత భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ, సమాచార మార్పిడి, అత్యుత్తమ పద్ధతులను పంచుకోవాలని, అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా నాణ్యమైన నౌకాశ్రయ మౌలిక వసతుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పెట్టుబడులను సమీకరించడానికి వనరులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

క్వాడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెలోషిప్‌లను 2,200 కంటే ఎక్కువ మంది నిపుణులకు విస్తరించడాన్ని మేము అభినందిస్తున్నాము. గత సంవత్సరం సదస్సులో ఈ కార్యక్రమాన్ని ప్రకటించినప్పటి నుంచి క్వాడ్ భాగస్వాములు ఇప్పటికే 1,300 కంటే ఎక్కువ ఫెలోషిప్‌లను అందించడం గమనార్హం. విద్యుత్ రంగం పునరుద్ధరణను బలోపేతం చేయడానికి ఇండో-పసిఫిక్ అంతటా భాగస్వాములను శక్తివంతం చేయడానికి కృషి చేస్తూనే భారతదేశంలో విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి నిర్వహించిన వర్క్‌షాప్‌ను కూడా మేము అభినందిస్తున్నాము.

 

కేబుల్ కనెక్టివిటీ, విపత్తులను తట్టుకునే సామర్థ్యం కోసం క్వాడ్ భాగస్వామ్యం ద్వారా, మేము ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నాణ్యమైన సముద్రగర్భ కేబుల్ నెట్‌వర్క్‌లకు మద్దతు ఇవ్వడం, వాటిని బలోపేతం చేయడం కొనసాగిస్తున్నాము. వీటిలో సామర్థ్యం, మన్నిక, విశ్వసనీయత అనేవి ఈ ప్రాంత, ప్రపంచ భద్రత, శ్రేయస్సుతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. ఈ ప్రయత్నాలకు మద్దతుగా, ఆస్ట్రేలియా జూలైలో కేబుల్ కనెక్టివిటీ అండ్ రెసిలెన్స్ సెంటర్‌ను ప్రారంభించింది, దీని ద్వారా ఈ ప్రాంత అభ్యర్థనలకు ప్రతిస్పందనగా వర్క్‌షాప్‌లు, విధాన, నియంత్రణపరమైన సహాయాన్ని అందిస్తున్నారు. నౌరు, కిరిబాటిలో సముద్రగర్భ కేబుల్ కోసం పబ్లిక్ ఐసీటీ మౌలిక సదుపాయాల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి జపాన్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది.  ఇండో-పసిఫిక్‌లోని 25 దేశాలకు చెందిన టెలికమ్యూనికేషన్ అధికారులు, ఎగ్జిక్యూటివ్‌ల కోసం 1,300 కంటే ఎక్కువ సామర్థ్య నిర్మాణ శిక్షణలను యునైటెడ్ స్టేట్స్ నిర్వహించింది. ఈ శిక్షణా కార్యక్రమాలను పొడగించుటకు, విస్తరణకు అదనంగా 3.4 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలనే ఉద్దేశాన్ని ఈరోజు యు.ఎస్. ప్రకటించింది.


క్వాడ్ భాగస్వాములు కేబుల్ ప్రాజెక్టుల్లో పెట్టిన పెట్టుబడులు, 2025 చివరి నాటికి ప్రాథమిక టెలికమ్యూనికేషన్ కేబుల్ కనెక్టివిటీని సాధించడంలో అన్ని పసిఫిక్ ద్వీప దేశాలకు సహాయపడతాయి. గత క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు నుంచి, భావసారూప్య భాగస్వాముల సహకారంతో పాటు, క్వాడ్ భాగస్వాములు పసిఫిక్‌లో సముద్రగర్భ కేబుల్ నిర్మాణాలకు 140 మిలియన్ డాలర్లకు పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇండో-పసిఫిక్‌లో సముద్రగర్భ కేబుల్ నిర్వహణ, మరమ్మత్తు సామర్థ్యాల విస్తరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి భారతదేశం ఒక అధ్యయనాన్ని చేపట్టింది.

మేము పసిఫిక్ ప్రాంత నాణ్యమైన మౌలికసదుపాయాల సూత్రాలకు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాము, ఇవి మౌలిక సదుపాయాల గురించి పసిఫిక్ ప్రాంత దేశాల అభిప్రాయాలను తెలియజేస్తాయి.

ఇండో-పసిఫిక్ అంతటా మా భాగస్వామ్య శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి. సమగ్రమైన, ఓపెన్, సుస్థిరమైన, న్యాయమైన, భద్రమైన, విశ్వసనీయమైన, సురక్షితమైన డిజిటల్ భవిష్యత్తు పట్ల మా నిబద్ధతను మేము స్పష్టం చేస్తున్నాము. ఈ సందర్భంలో, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, విస్తరణ కోసం క్వాడ్ సూత్రాలను మేము స్వాగతిస్తున్నాము.

కీలకమైన, అభివృద్ధి చెందిన సాంకేతికలు

 
ఈ రోజు, విస్తృత ఇండో-పసిఫిక్ ప్రాంతానికి విశ్వసనీయ సాంకేతిక పరిష్కారాలను అందించడానికి మా భాగస్వామ్య ప్రతిష్టాత్మక విస్తరణను ప్రకటించినందుకు మేము గర్విస్తున్నాము.
సురక్షితమైన, విపత్తులను తట్టుకునే సామర్థ్యం గల, పరస్పరం అనుసంధానితమైన టెలికమ్యూనికేషన్స్ పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా గత సంవత్సరం, క్వాడ్ భాగస్వాములు పసిఫిక్‌ ప్రాంతంలోని పలావ్‌లో మొదటి ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (ఆర్ఏఎన్)ని అమలు చేయు ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి, ఈ ప్రయత్నం కోసం క్వాడ్ 20 మిలియన్ డాలర్ల సాయానికి హామీ ఇచ్చింది.

 

ఆగ్నేయాసియాలో అదనపు ఓపెన్ ఆర్ఎఎన్ ప్రాజెక్ట్‌లకు అవకాశాలను అన్వేషించుటను కూడా క్వాడ్ భాగస్వాములు స్వాగతించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్, జపాన్‌లు హామీ ఇచ్చిన 8 మిలియన్ డాలర్ల సాయంతో కొనసాగుతున్న ఓపెన్ ఆర్ఎఎన్ ఫీల్డ్ ట్రయల్స్‌ కోసం, ఫిలిప్పీన్స్‌లోని ఆసియా ఓపెన్ ఆర్ఎఎన్ అకాడమీ (ఎఓఆర్ఎ)కోసం మద్దతును విస్తరించుటకు మేము ప్రణాళిక చేస్తున్నాము. భారతీయ సంస్థల భాగస్వామ్యంతో దక్షిణాసియాలో అమలు కోసం ఈ రకం మొదటి ఓపెన్ ఆర్ఏఎన్ సిబ్బంది శిక్షణ కార్యక్రమ రూపకల్పన సహా, ఏఓఆర్ఏను ప్రపంచవ్యాప్తంగా విస్తరించుటలో మద్దతు కోసం, యునైటెడ్ స్టేట్స్ కూడా 7 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది.

 

దేశవ్యాప్తంగా 5జీ విస్తరణ కోసం దేశ సన్నద్ధతను నిర్ధారించడానికి క్వాడ్ భాగస్వాములు తువాలు టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్‌తో సహకారాన్ని కూడా అన్వేషిస్తారు.

 

వైవిధ్యభరితమైన, పోటీతో కూడిన మార్కెట్‌ను నిర్మించడానికి, క్వాడ్ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో నిలదొక్కుకునేందుకు మా పూర్తి సామర్థ్యాన్ని ఉఫయోగిస్తూ సెమీకండక్టర్లపై మా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మేము కట్టుబడి ఉన్నాము. సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థ కోసం క్వాడ్ దేశాల మధ్య సహకార విజ్ఞాపనను మేము స్వాగతిస్తున్నాము.

గతేడాది జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించిన అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్స్ ఫర్ ఎంపవరింగ్ నెక్స్ట్ జెన్ అగ్రికల్చర్ (ఏఐ-ఎంగేజ్) ద్వారా, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, సెన్సింగ్‌ ఉపయోగించుకునేందుకు వీలుగా మన ప్రభుత్వాలు సంయుక్త పరిశోధనలను మరింత పెంచుతున్నాయి. ఉమ్మడి పరిశోధనా అవకాశాల కోసం మొదటిసారి 7.5 మిలియన్ల డాలర్ల నిధులను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాం. అలాగే పరిశోధనా సంస్థలను అనుసంధానించడానికి, భాగస్వామ్య పరిశోధన సూత్రాలను అభివృద్ధి చేయడానికి మా సైన్స్ ఏజెన్సీల మధ్య ఇటీవల కుదిరిన సహకార మెమోరాండంను స్వాగతిస్తున్నాము.

 

అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ దేశాలు క్వాడ్ బయోఎక్సప్లోర్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నాయి. ఇది నాలుగు దేశాల్లోని విభిన్న మానవేతర జీవసంబంధమైన డేటాపై ఉమ్మడి ఏఐ ఆధారిత అన్వేషణకు మద్దతునిచ్చే యంత్రాంగంగా వ్యవహరిస్తుంది..

 

 

ఈ ప్రాజెక్టు విమర్శనాత్మకమైన, కొత్తగా వస్తున్న టెక్నాలజీలను పరిశోధించి అభివృద్ధి చేయడంలో క్వాడ్ నియమాలను ద్వారా కూడా సాయం పొందుతుంది.

 

వాతావరణం, పర్యావరణహిత విద్యుత్

వాతావరణ సంక్షోభం వల్ల ఎదురయ్యే తీవ్రమైన ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ పర్యవసానాలను ప్రస్తావిస్తూనే, వాతావరణాన్ని మెరుగుపరచడానికి, పర్యావరణహిత విద్యుత్‌లో సహకారాన్ని మెరుగుపరచడానికి, వాటిని స్వీకరించి, స్థిరత్వాన్ని పెంచడానికి క్వాడ్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ ప్యాకేజీ (క్యు-ఛాంప్)తో సహా ఇండో-పసిఫిక్ భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాము. మన ప్రజలు, భూమి, సంక్షేమం కోసం క్లీన్ ఎనర్జీ ఎకానమీకి మారడం వల్ల కలిగే ప్రయోజనాలను మేము ప్రధానంగా తెలియజేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సామూహిక ఇంధన భద్రతను పెంపొందించి, కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించే, స్థానిక కార్మికులు, సంఘాలకు ప్రయోజనం చేకూర్చేలా అధికనాణ్యత కలిగిన విభిన్నమైన, స్వచ్ఛమైన ఇంధన సరఫరా వ్యవస్థలను రూపొందించడానికి, విధానాలు, ప్రోత్సాహకాలు, ప్రమాణాలు, పెట్టుబడులను సమతౌల్యం చేయడానికి అందించే సహకారాన్ని పెంచాలని మా దేశాలు భావిస్తున్నాయి.

క్లీన్ ఎనర్జీ భాగస్వామ్య, అనుబంధ సరఫరా వ్యవస్థల్లో ఉన్నత ప్రమాణాలున్న ప్రైవేట్ రంగ పెట్టుబడిని, భాగస్వామ్యాన్ని పెంచడానికి మా విధానాలతో ప్రభుత్వ ఆదాయం ద్వారా కలసి పనిచేసేందుకు నిబద్ధులై ఉన్నాము. దీనిలో భాగంగానే నవంబర్‌లో క్వాడ్ క్లీన్ ఎనర్జీ సప్లై చైన్స్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ కోసం ఆస్ట్రేలియా దరఖాస్తులను తెరుస్తుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సోలార్ ప్యానెల్, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్, బ్యాటరీ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసే వినూత్న ప్రాజెక్టులకు మద్దతుగా 50 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లను సైతం అందిస్తుంది. ఫిజీ, కొమొరోస్, మడగాస్కర్, సీషెల్స్ దేశాల్లో కొత్త సోలార్ ప్రాజెక్టుల్లో 2 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది. ఇండో-పసిఫిక్ దేశాలలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో 122 మిలియన్ డాలర్ల గ్రాంట్లు, రుణాలు ఇచ్చేందుకు జపాన్ కట్టుబడి ఉంది. డీఎఫ్‌సీ ద్వారా, ప్రైవేట్ మూలధనాన్ని సౌర, వాయు విద్యుత్తు, శీతలీకరణ, బ్యాటరీలు, కీలకమైన ఖనిజాలకు సరఫరా వ్యవస్థకు విస్తరించి, వైవిద్యమైన అవకాశాలను మెరుగుపరిచేందుకు అమెరికా తన కృషిని కొనసాగిస్తుంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఉండే విధానాలు అవలంభించడంతో పాటు విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడిని తగ్గించేలా అధిక సామర్థ్యం గల తక్కువ ధరలో లభించే శీతలీకరణ వ్యవస్థలను అభివృద్ధి, రూపకల్పన చేసి ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు క్వాడ్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రకటిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము.

వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి, నౌకాశ్రయాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మేము సంయుక్తంగా కట్టుబడి ఉన్నాం. కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్‌ఐ) ద్వారా సహా స్థిరమైన మౌలిక సదుపాయాల వైపు నౌకాశ్రయాలను విస్తరించే దిశగా మార్గాన్ని రూపొందించడానికి  మా అభ్యాస నైపుణ్యాలను ఉపయోగించుకుంటాం.

 

 

సైబర్

సైబర్ డొమైన్‌లో క్షీణిస్తున్న భద్రతా వాతావరణం నేపథ్యంలో, మోసగాళ్లు, సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కొనేందుకు సైబర్ సెక్యూరిటీలో భాగస్వామ్యాన్ని మెరుగుపరచాలని క్వాడ్ దేశాలు భావిస్తున్నాయి. సామూహిక నెట్‌వర్క్ భద్రతను పెంచడం, ముప్పు కలిగించే సమాచారాన్ని పంచుకోవడం,  వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నాయి. లోపాలు గుర్తించి జాతీయ భద్రతా నెట్‌వర్క్‌లు, కీలకమైన మౌలిక సదుపాయాల నెట్‌వర్కులను రక్షించడానికి, క్వాడ్ భాగస్వామ్య ప్రాధాన్యతలను ప్రభావితం చేసే ముఖ్యమైన సైబర్‌ సెక్యూరిటీ సంఘటనలకు స్పందించేలా సమన్వయం చేసుకోవడానికి ఉమ్మడి ప్రయత్నాలు చేస్తున్నాము.
2023లో క్వాడ్ ఆమోదించిన సురక్షిత సాఫ్ట్వేర్ సంయుక్త నియమావళి  2023 ప్రకారం సురక్షిత సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రమాణాలు, సర్టిఫికేషన్  పొందడానికి సాఫ్ట్వేర్ తయారీదారులు, పరిశ్రమల, వాణిజ్య సంస్థలు, పరిశోధనా కేంద్రాలతో కలసి క్వాడ్ దేశాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ నెట్వర్క్‌ ల కోసం సాఫ్ట్వేర్ అభివృద్ధి, స్వీకరణ, అంతిమ వినియోగం సురక్షితమైనవని నిర్ధారించడానికి మాత్రమే కాకుండా, మా సరఫరా వ్యవస్థలు, డిజిటల్ ఎకానమీలు, సొసైటీల సైబర్ భద్రత మెరుగుపడేలా ప్రమాణాలను సమష్టిగా సమన్వయం చేయడానికి మేము పని చేస్తాము.

ఈ ప్రయాణంలో వార్షిక క్వాడ్ సైబర్ ఛాలెంజ్ కు ప్రతీకగా ప్రచార కార్యక్రమాలు  నిర్వహించాలని క్వాడ్ దేశాలు యోచిస్తున్నాయి. బాధ్యతాయుతమైన సైబర్ పర్యావరణ వ్యవస్థలు, ప్రజావనరులు, సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన పెంచేలా ఈ కార్యక్రమాలు ఉంటాయి. క్వాడ్ సీనియర్ సైబర్ గ్రూప్ అభివృద్ధి చేసిన వాణిజ్య, సముద్రగర్భ టెలికమ్యూనికేషన్స్ కేబుళ్లను రక్షించే క్వాడ్ కార్యాచరణ ప్రణాళిక అమలులో నిర్మాణాత్మకంగా పాల్గొంటున్నాం. ఇది కేబుల్ అనుసధానం, పునరుద్ధరణ కోసం క్వాడ్ భాగస్వామ్యానికి సంపూర్ణ ప్రయత్నంగా ఉంటుంది. కార్యాచరణ ప్రణాళిక ద్వారా మార్గనిర్దేశం చేసిన గ్లోబల్ టెలికమ్యూనికేషన్ల మౌలిక వసతులను రక్షించడానికి, భవిష్యత్తులో డిజిటల్ కనెక్టివిటీ, గ్లోబల్ కామర్స్ మరియు శ్రేయస్సు కోసం మా భాగస్వామ్య దృష్టిని మేం చేపడుతున్న సమన్వయ చర్యలు ముందుకు తీసుకువెళతాయి.

 

అంతరిక్షం

ఇండో-పసిఫిక్‌లో అంతరిక్ష సంబంధిత అప్లికేషన్‌లు, టెక్నాలజీల సహకార అవసరాన్ని గుర్తించాం. ముందస్తు వాతావరణ హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఇండో-పసిఫిక్ అంతటా ఉన్న దేశాలకు సహాయం చేయడానికి మా నాలుగు దేశాలు భూపరిశీలన డేటా, ఇతర అంతరిక్ష సంబంధిత అప్లికేషన్‌లు అందించే ప్రక్రియను కొనసాగించాలని భావిస్తున్నాయి. ఈ సందర్భంలో, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ ప్రభావంపై అంతరిక్ష ఆధారిత పర్యవేక్షణ కోసం ఓపెన్ సైన్స్ భావనకు మద్దతు ఇచ్చేలా మారిషస్ కోసం భారతదేశం అంతరిక్ష ఆధారిత వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము.

క్వాడ్ ఇన్వెస్టర్స్ నెట్ వర్క్

 
క్వాడ్ ఇన్వెస్టర్స్ నెట్ వర్క్  (క్యూయుఐఎన్)తో సహా ప్రైవేట్ రంగ కార్యక్రమాలను మేము స్వాగతిస్తున్నాము, ఇది క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలు, క్వాంటంతో సహా వ్యూహాత్మక టెక్నాలజీల్లో పెట్టుబడులను సులభతరం చేస్తుంది. క్యూయుఐఎన్ సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి, ఉమ్మడి పరిశోధన, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త సాంకేతికతలను వాణిజ్యీకరించడానికి, భవిష్యత్  అవసరాల దృష్ట్యా మానవవనరులను మెరుగుపరిచేందుకు అనేక పెట్టుబడులను సమీకరిస్తోంది.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”