కొత్త స్నేహితులతో దాదాపు ఒక నెల గడిచింది. మీరందరూ విభిన్నమైన వ్యక్తిగత గుర్తింపుతో, విభిన్న నేపథ్యం నుండి ఇక్కడకు వచ్చారు. అయితే ఒక నెల రోజుల్లో ఇక్కడి వాతావరణం మీ మధ్య విడదీయరాని బంధాన్ని ఏర్పరచింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కాడెట్ లను కలిసినప్పుడు మీ మధ్య ఒక విధమైన బంధుత్వం ఏర్పడింది. వారి ప్రత్యేకత గురించి, వారి వైవిధ్యం గురించి తెలుసుకొన్నప్పుడు మీకు ఆశ్చర్యం కలిగివుండవచ్చు. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు దేశాన్ని గురించి, దేశంలోని ప్రతి ప్రాంతాన్ని గురించి, భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వాన్ని గురించి తెలుసుకొన్నప్పుడు భారతదేశంలో ఒక పౌరునిగా మీలో ఉత్సుకత మరింతగా పెరుగుతుంది. ప్రతి ఎన్ సిసి శిబిరంలో ఈ విలువల వ్యవస్థ యొక్క మూలాలు మనలో మనకు గోచరమౌతాయి. మనం ఇక్కడ కవాతులో పాల్గొన్నప్పుడు మనమంతా ఒకే విధమైన దుస్తులను ధరించి, రాజ్ పథ్ దగ్గర కవాతుకు సిద్ధమవుతున్నప్పుడు, ఇంత పెద్ద భారతదేశ రక్షణ మనతోటే ప్రారంభం అవుతోందన్న విషయాన్ని, అలాగే ఈ దేశ పరిపూర్ణత్వంలో మనం ఎలా భాగస్వామ్యం అవుతున్నామన్న విషయాన్ని కనీసం మనం గుర్తించలేదు. భారతదేశానికి ఏదైనా చేయాలన్న దృఢ సంకల్పాన్ని మనం ఎలా వృద్ధి చేసుకోవాలో కూడా మనకు తెలియదు. ఇటువంటి పర్యావరణ వ్యవస్థ, ఇటువంటి వాతావరణం దేశాన్ని గురించి ఆలోచించేటట్టు చేస్తాయి. ఆ సమయంలో ప్రతి కదలిక దేశ భవిష్యత్తు, మన పాత్ర, మన విధులను గురించి ఆలోచింపజేస్తుంది. ఈ విషయాల ద్వారా ప్రేరణ పొందిన అనంతరం మనం మన స్వస్థలాలకు వెళ్తాం. రాజ్ పథ్ లో జరుగుతున్న ఈ కవాతులో పాల్గొంటున్న ఎన్ సి సి కాడెట్ లు, ఈ కవాతులో పాల్గొనే అవకాశం రాని వారు, నేపథ్యంలో పని చేసిన వారు, ఇందుకోసం గత నెల రోజులుగా ఎంతో శ్రమించిన వారు, ఇలా ప్రతి ఒక్కరిని 10 దేశాల నుండి తరలివచ్చిన అతిథులు, యవత్తు దేశం, అలాగే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ప్రవాసి భారతీయులు.. మీరు వేసే ప్రతి అడుగును వారందరూ గర్వంగా భావిస్తారు. మీ ప్రతి అడుగును వారు సగర్వంగా స్వీకరిస్తారు. మీరు అడుగులు వేస్తుంటే, దేశం మొత్తం ముందడుగు వేస్తున్నట్లుగా వారు భావిస్తున్నారు. మీరు పూర్తి సాహసాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటే దేశ సామర్ధ్యం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నట్లు ప్రతి భారతీయుడు భావిస్తున్నాడు. ఈ పర్యావరణం, ఈ వాతావరణం ఈ ప్రదేశానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఆ తరువాతే, అసలైన పరీక్ష ప్రారంభం అవుతుంది.
ఎన్ సిసి అంటే క్రమశిక్షణకు, ఐక్యత కు మారుపేరు. ఎన్ సిసి అంటే ఒక విధానం కాదు; ఎన్ సిసి అంటే ఒక ఉద్యమం. ఎన్ సిసి అంటే కేవలం ఒకే రకమైన దుస్తులో లేదా ఏకరూపతో కాదు. ఎన్ సిసి అనే పదానికి ఐకమత్యం అని అర్థం చెప్పుకోవాలి. అందువల్లనే, ఆ భావంతోనే, చివరకు ఈ కవాతులు, ఈ శిబిరాలు, ఈ క్రమశిక్షణ, ఇలా కష్టపడి పనిచేయడం అనేవి ఏమి సాధించడానికి ? ఇవన్నీ ఎందుకు ? ఈ దేశానికి చెందిన పేద ప్రజల ధనం ఎందుకు ఇటువంటి వాటి పైన ఖర్చు చేయడం ? ఈ రకంగా పెట్టుబడి పెట్టడం వల్ల ఒక ఆశయంతో, ఇతరులలో స్ఫూర్తిని నింపగల ఒక రకమైన వ్యక్తులు దేశంలో తయారవుతారు. దానివల్ల దేశమంటే అంకిత భావం క్రమంగా వృద్ధి చెందుతుంది. ఈ రకంగా అభివృద్ధి చెందిన వ్యక్తుల ద్వారా ఇతర ప్రజలను, దేశాన్ని అభివృద్ధి చేసే కృషిలో భాగంగానే ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. వీటన్నింటినీ ఇక్కడే వదలిపెట్టి, ఈ అనుభవాలను జీవితాంతం స్నేహితులతో పంచుకోవడానికి మాత్రమే ఉపయోగించినట్లయితే మనం ఏదో పోగొట్టుకొన్నట్లే అవుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే సాయుధ దళాల నియమ నిబంధనలను రూపొందించక ముందే, ఎన్ సి సి చట్టం రూపొందించబడిందన్న వాస్తవాన్ని మనం గుర్తించి, గర్వపడాలి. దేశానికి చెందిన యువతరంతో దేశ నిర్మాణం ముడిపడి ఉంది. అలాగే దేశ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.
ఈ రోజు, ఎన్ సిసి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. ఈ ఏడు దశాబ్దాల పయనంలో, నా వలెనే మిలియన్ ల కొద్దీ ఎన్ సి సి కాడెట్ లు దేశ భక్తి విలువలతో కూడిన జీవన మార్గాన్ని కొనసాగిస్తున్నారు.
మిత్రులారా, ఎన్ సిసి నుండి మనం ఒక ఉద్యమ అనుభూతిని పొందుతాం. ఎన్ సిసి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా మనం కొన్ని విషయాలను గురించి ఆలోచించాలి: మనం ఎక్కడ నుండి వచ్చాం, ఎక్కడకు వచ్చాం, మన దేశాన్ని ఎక్కడకు తీసుకు వెళ్లాలని అనుకొంటున్నాం. ఈ ఎన్ సిసి రూపం ఏమిటి ? ఈ ఎన్ సిసి లో ఏ యే కొత్త విషయాలను జోడించాలి ? ఇది ఎంత వరకు విస్తరించగలదు ? ఈ విషయాలకు సంబంధించిన వ్యక్తులను నేను సంప్రదిస్తాను. ఎన్ సిసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొనే సమయానికి వారు ఒక ప్రణాళికను తయారుచేయాలి. దేశం లోని ప్రతి చోట ఏదో ఒక ప్రత్యేకత ను, ఏదో ఒక మార్పు ను తీసుకు వచ్చే విధంగా ఆ ప్రణాళిక ను అమలు చేసి ఎన్ సిసి ని అగ్ర భాగాన నిలిపేందుకు మనం కృషి చేయాలి. ఎన్ సిసి విధులు, ఎన్ సిసి కాడెట్ల పని తీరు మనందరికీ గర్వ కారణం కావాలి. ఈ రోజు మనం 70 సంవత్సరాలు పూర్తి చేసుకొంటున్న సందర్భంగా 75 సంవత్సరాలకు ఒక ప్రణాళిక ను రూపొందించుకోవాలి. నా దేశానికి చెందిన ఏ యువకుడు అవినీతిని భరించడానికి అంగీకరిస్తాడని నేను భావించను. సమాజం అవినీతి పట్ల ద్వేష భావం కలిగివుంది. అయితే, అవినీతికి వ్యతిరేకంగా మనం కేవలం ద్వేష భావాన్ని కలిగివుండడంతోనే ఎందుకు పరిమితం అవుతున్నాం ? అవినీతికి వ్యతిరేకంగా మన ఆవేదనను, కోపాన్ని ఎందుకు వ్యక్తం చేయలేకపోతున్నాము ? ఆలా చేస్తే సరిపోతుందా ? అలా అయితే, మనం ఈ పోరాటాన్ని ఇలాగే చాలా కాలం కొనసాగించవలసి వస్తుంది, ఇది ఎప్పటికీ అంతం కాదు. నా దేశ యువత భవిష్యత్తు లక్ష్యంగా అవినీతికి, నల్ల ధనానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలి. నా దేశ యువత భవిష్యత్తు సురక్షితంగా ఉంటేనే, అది మన దేశ భవిష్యత్తును సురక్షితంగా ఉంచగలుగుతుంది.
అయితే, నేను, ఈ దేశ ప్రధాన మంత్రిగా భారతదేశపు యువత ను, ఎన్ సిసి కాడెట్ లను ఒకటి అడుగుదామని అనుకొంటున్నాను. మీరు నన్ను నిరుత్సాహపరచరని నాకు తెలుసు.. నా దేశ యువత నన్ను నిరుత్సాహపరచదు. మనం రాజకీయంగా ఎదగాలనే ఉద్ద్యేశంతో నేను మిమ్మల్ని వోట్లు కావాలని గానిచ, మీ సహాయం కావాలని గాని అడగడం లేదు. నేను మీ సహాయాన్ని.. నా దేశ యువత సహాయాన్ని కోరాలని అనుకొంటే అప్పుడు ఒక చెద పురుగు లాగా పట్టి పీడిస్తున్న అవినీతి నుండి ఈ దేశానికి విముక్తి కలిగించండని నేను మీ సహాయం కోరుతాను. అందుకు మేం ఏమి చేయగలం అని మీరు అనుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా ‘‘మేం ఎవరికీ లంచం ఇవ్వం, అదేవిధంగా మేం ఎటువంటి లంచాన్ని స్వీకరించం’’ అని నిర్ణయం తీసుకోవాలి. ఇది మీరు తప్పకుండా చేస్తారు. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇది ఒకటి అయితే, మీరు మరొక ప్రతిజ్ఞ స్వీకరించాలి. ప్రతి సంవత్సరం కనీసం 100 కొత్త కుటుంబాలను ఈ విషయంలో భాగస్వాములను చెయ్యాలని నియమంగా పెట్టుకోవాలి. మరి ఏమిటా విషయం ? జవాబుదారుతనం ఉంటే, పారదర్శకత ఉంటే పరిస్థితిలో మార్పు దానంతట అదే వస్తుంది. వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కడకు వెళ్లినా, ఎక్కడ డబ్బు లావాదేవీలు జరిగినా, వాటిని నగదుతో చేయను అని మీరు ప్రతిజ్ఞ తీసుకోగలరా ? మనం బిహెచ్ఐఎమ్ (భీమ్) యాప్ (BHIM App) ను డౌన్ లోడ్ చేసుకొని, ప్రతి కొనుగోలును భీమ్ యాప్ ద్వారా చేయగలమా ? మీరు ఎక్కడ కొనుగోలు చేస్తే అక్కడ భీమ్ యాప్ వినియోగం కోసం పట్టు పట్టారంటే, అది చిన్న దుకాణమైనా, లేక అతి పెద్ద దుకాణ సముదాయం అయినా సరరే, మీరు అక్కడ ఈ యాప్ వినియోగం కోసం పట్టు పట్టగలరా, లేదా ? ఇది మీరు తప్పకుండా చేయాలి. దయచేసి దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడు మనం కోరుకొన్నటువంటి పారదర్శకత ఇక్కడ దర్శనమిస్తుంది; జవాబుదారుతనాన్ని నిర్ణయించడం చాలా సులభం అవుతుంది. తద్వారా అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకోడానికి వీలు కలుగుతుంది. నా యువత సహాయం లేకుండా ఇది చేయలేం. నా ఎన్ సి సి కాడెట్ లు ఈ ఉద్యమాన్ని ఒక దీక్షగా చేపట్టినట్లయితే, అప్పుడు ఈ దేశాన్ని అవినీతి దిశగా మరల్చడానికి ఎవరికీ ధైర్యం ఉండదు. ఒకవేళ ఒక అత్యంత అవినీతిపరుడైన వ్యక్తి ఒక అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ, అతను కూడా తప్పనిసరి పరిస్థితులలో నిజాయతీ బాట పట్టవలసి వస్తుంది.
ఒక్కొక్క సారి దేశంలో అంతులేని నిరాశ నెలకొంటుంది. అవినీతికి వ్యతిరేకంగా ఎన్నో ఉన్నతమైన విషయాలను మనం చర్చిస్తూ ఉంటాము. అయితే బలమైన వ్యక్తులకు వ్యతిరేకంగా ఏమీ చేయలేక పోతున్నాం. ఈ రోజు మీరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎటువంటి పరిస్థితులలో మీరు ఉన్నారంటే, అవినీతి కారణంగా కనీసం ముగ్గురు ముఖ్యమంత్రులు కారాగారంలో ఉన్నారు. భగవంతుడు లేడని ఎవరు చెప్పగలరు ? భగవంతుని రాజ్యంలో న్యాయం లేదని ఎవరు చెప్పగలరు ? ఇప్పుడు వారిని రక్షించే వారు ఎవరూ లేరు. అందువల్లనే నేను ఈ రోజు ఎన్ సిసి కాడెట్ ల ముందు ఈ విషయం చెప్పాలని అనుకొంటున్నాను. వారి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఎన్ సిసి కాడెట్ లకు, అలాగే ఎన్ఎస్ఎస్ కు చెందిన యువతకు గాని లేదా నెహ్రూ యువ కేంద్రాలకు చెందిన యువతకు గాని, అలాగే పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులకు గాని, లేదా దేశ యువతకు గాని- ఎవరైతే దేశం కోసం జీవిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నారో- వారికి చెప్తున్నాను. నేను మీ సహాయాన్ని కోరుకొంటున్నాను. దయచేసి ఒక సైనికుడిలా ముందుకు వచ్చి నాతో చేతులు కలపండి. దయచేసి కలిసికట్టుగా ముందుకు రండి. ఈ చెద పురుగుల నుండి దేశాన్ని కాపాడుదాం. అప్పుడు దేశంలోని పేద ప్రజల హక్కుల కోసం చేసే పోరాటంలో మనం విజయం సాధించగలుగుతాం.
ఈ దుశ్చర్యలను నిర్మూలించినట్లయితే అప్పుడు దేశంలో అనేక మంది పేద ప్రజలకు అది ప్రయోజనం చేకూరుస్తుంది. ధనాన్ని సక్రమంగా వినియోగించిన్నప్పుడు పేద కుటుంబాలకు అందుబాటులో మందులు లభిస్తాయి. ధనాన్ని సక్రమంగా వినియోగించినప్పుడు అది పేద ప్రజల పిల్లలకు మంచి పాఠశాలలను, మంచి ఉపాధ్యాయుల వంటి సదుపాయాలను కల్పిస్తుంది. ధనాన్ని సక్రమంగా వినియోగించినప్పుడు గ్రామాలకు రహదారులు వేయవచ్చు; దేశంలో అణగారిన, దోపిడీకి గురి అయిన, వెలివేయబడిన ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయడానికి అవకాశం లభిస్తుంది.
ప్రియమైన నా దేశ యువజనులారా, ఈ కారణంగా ఈ రోజుల్లో మీరంతా ‘ఆధార్’ ను గురించి చర్చించుకొంటున్నారు. సాంకేతిక ప్రపంచం గురించి ఎవరైతే అవగాహనను కలిగివున్నారో, ఎవరైతే మారుతున్న కాలమాన పరిస్థితులను గురించి అవగాహన ను కలిగివున్నారో, వారు ప్రపంచానికి ఈ సమాచారం భవిష్యత్తులో ఎంత శక్తివంతంగా ఉపయోగపడుతుందో తెలుసుకొంటారు. సమాచారాన్ని శక్తివంతమైందిగా పరిగణించే ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఈ డిజిటల్ ప్రపంచంలో, ఈ సమాచార ప్రపంచంలో- ఈ రంగంలో భారతదేశం గొప్ప పేరు పొందడానికి ‘ఆధార్’ ఒక గర్వ కారణమైంది.
ఇప్పుడు ఈ ‘ఆధార్’ వల్ల పేద ప్రజలకు, సామాన్య ప్రజానీకానికి చెందుతున్న ప్రయోజనాలు గతంలో వేరే వారి చేతులలోకి వెళ్ళేవి. ఇది కూడా ఒక విధమైన అవినీతే. అసలు జన్మించని ఒక బాలిక పెరిగి పెద్దది అయింది. వివాహం చేసుకొంది. ప్రభుత్వ కార్యాలయ రికార్డులలో వితంతువుగా నమోదు అయింది. ప్రభుత్వ ఖజానా నుండి వితంతు పింఛను కూడా చెల్లించబడుతోంది. ఈ రకమైన వ్యవహారం కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ‘ఆధార్’ ద్వారా చట్టబద్దమైన లబ్ధిదారులను గుర్తించడం జరుగుతోంది. లబ్ధిదారులు వారి ప్రయోజనాలను నేరుగా అందుకోవడం మొదలైంది. నా దేశ యువజనులారా, కొన్ని పథకాలలో ఈ పద్ధదిని అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది ఇంకా 100 శాతానికి చేరుకోలేదు. ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయితే దీనివల్ల అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్న దాదాపు 60 వేల కోట్ల రూపాయలను ఆదా చేయడం జరిగింది. ఇది అంతా సాధ్యమే. అందువల్ల, నా యువజనులందరూ క్రయ, విక్రయాలన్నింటికీ భీం యాప్ ను అతి ఎక్కువగా ఉపయోగించడం ద్వారా నగదు రహిత మంత్రంతో నగదు రహిత సమాజం దిశగా ముందుకు నడవాలి. రుసుములు చెల్లించవలసి వచ్చినా అపుడు కూడా మనం వాటిని భీం యాప్ ద్వారా చెల్లించాలి. అప్పుడు ఈ దేశంలో మార్పులు ఎలా వస్తాయో మీరు చూడవచ్చు.
నా యువ మిత్రులారా, మీ జీవితంలో ఒక మంచి అనుభవాన్ని పొందారు. అతి కొద్ది సమయంలో, దేశం లోని విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులతో కలిసి జీవించడం ద్వారా మీరు ఒక మంచి అనుభవాన్ని చవి చూసే అవకాశాన్ని పొందారు. భారతదేశాన్ని ఒక కొత్త కోణంలో చూశామన్న అనుభూతిని మీరు పొందారు. ఈ కొత్త స్పూర్తితో, ఈ కొత్త తీర్మానంతో, ఈ కొత్త ఆకాంక్షతో ఒక నూతన భారతదేశాన్ని రూపొందించడానికి మనం అందరమూ సమష్టిగా ముందుకు పోవడానికి ఒక గంభీరమైన ప్రతిజ్ఞ చేద్దాం. మనం ఈ దేశాన్ని ముందుకు తీసుకు పోదాం. ఒక నూతన భారతదేశాన్ని రూపొందిద్దాం.
మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ధన్యవాదాలు.