ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో శ్రీ లంక అధ్యక్షులు శ్రీ మైత్రీపాలా సిరిసేనా ఈ రోజున టెలిఫోన్ లో మాట్లాడారు.
శ్రీ లంక అధ్యక్షుడిని మరియు శ్రీ లంక రక్షణ శాఖ పూర్వ కార్యదర్శి ని హత్య చేయడానికి ఒక కుట్ర ను పన్నడం జరిగిందని, అందులో భారతదేశానికి ప్రమేయం ఉన్నట్టు ప్రసార సాధనాలలో వచ్చిన కథనాలను తాను స్పష్టంగా ఖండించానని శ్రీ సిరిసేన ఈ సందర్భం గా తెలియజేశారు.
దుర్మార్గమైనటువంటి మరియు దురుద్దేశం తో కూడుకొన్నటువంటి కథనాలు ఎంతమాత్రం ఆధారం లేనివి, అసత్యాలే కాక స్నేహపూర్వకమైన రెండు దేశాలకు మధ్య హార్దిక సంబంధాలను నష్టపరచడంతో పాటు ఉభయ నేతల మధ్య అపార్థాన్ని సృష్టించడం కూడా వాటి వెనుక ఉన్న ఉద్దేశం గా తోస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
ఈ కథనాలను బహిరంగంగా తోసిపుచ్చేటందుకు శ్రీ లంక ప్రభుత్వం తో పాటు స్వయంగా తాను కూడా తక్షణ చర్యలను తీసుకొన్నట్లుగా ప్రధాన మంత్రి దృష్టి కి అధ్యక్షుడు తీసుకువచ్చారు. శ్రీ లంక లోని భారతదేశ హై కమిశనర్ తో ఈ రోజు ఉదయం తాను సమావేశమైన సంగతి ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు కు తెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ని శ్రీ లంక కు ఒక నిజమైన మిత్రుని గాను, అంతే కాక తనకు ఓ సన్నిహిత మిత్రుని గాను తాను భావిస్తానని కూడా అధ్యక్షుడు తెలియజేశారు. భారతదేశానికి మరియు శ్రీ లంక కు మధ్య పరస్పర ప్రయోజనకర సంబంధాలను తాను ఎంతగానో గౌరవిస్తానని, వాటిని మరింత పటిష్టపరచేందుకు కృషి చేయడం కోసం నిబద్ధుడినై ఉన్నానని ఆయన నొక్కిపలికారు.
ద్రోహచింత గల కథనాలను తప్పని నిరూపించడానికి ఆ కథనాలపై విషయాన్ని బహిరంగంగా వివరణలిస్తూ అధ్యక్షుడు మరియు ఆయన ప్రభుత్వం సత్వర చర్య లను చేపట్టడాన్ని ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. ‘ఇరుగుపొరుగు దేశాలకు ప్రాధాన్యం’ ఇచ్చే విధానానికి భారతదేశం అగ్రతాంబూలాన్ని కట్టబెడుతుందని కూడా ఆయన పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య మరింత బలోపేతమైనటువంటి సర్వతోముఖ సహకారానికి బాట పరచడం భారత ప్రభుత్వానికి మరియు స్వయంగా తనకు ప్రాథమ్యం గల అంశమని కూడా ఆయన చెప్పారు.