భారతీయులకు లక్ష్యం, బలం వుండాలని వాటినుంచి స్ఫూర్తిని పొంది మన దేశాన్ని మనమే ధైర్యసాహసాలతో పరిపాలించుకోవాలంటూ శ్రీ నేతాజీ సుభాష్ చేసిన ప్రకటనను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగంలో గుర్తు చేశారు. ఆయన చెప్పిన ప్రకారమే ప్రస్తుతం కొనసాగుతున్న ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంలో భారతీయులకు ఆ లక్ష్యాలు, బలం వున్నాయని ప్రధాని అన్నారు. మనలో వున్న స్వీయ బలం, పట్టుదలతో ఆత్మనిర్భర్ భారత్ సాధనకోసం పెట్టుకున్న లక్ష్యాలను అందుకుకోవచ్చని ప్రధాని అన్నారు. శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రకటనల్ని పేర్కొంటూ మాట్లాడిన ప్రధాని భారతీయులు స్వేదాన్ని చిందించి దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. కష్టపడే తత్వంతో, నూతన ఆవిష్కరణలతో భారతదేశాన్ని ఆత్మనిర్భర్గా తీర్చిదిద్దాలని ప్రధాని ఆకాంక్షించారు. కొలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన పరాక్రమ్ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
బ్రిటన్ పాలకులనుంచి అత్యంత ధైర్యసాహసాలతో తప్పించుకునే క్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన సోదరుని కుమారుడు శ్రీ సిసిర్ బోసును అడిగిన ప్రశ్నను ప్రధాని శ్రీ మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ రోజున ప్రతి భారతీయుడు తన గుండె మీద చేతులు వేసుకొని, నేతాజీ గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటే ఆ రోజున సిసిర్ బోసును నేతాజీ అడిగిన ప్రశ్న గుర్తుకొస్తుంది. నీవు నాకు ఈ సాయం చేస్తావా? ఈ పని, ఈ కార్యక్రమం, ఈ లక్ష్యం ఎందుకంటే భారతదేశాన్ని స్వావలంబన దేశంగా చేయడానికే. భారతదేశ ప్రజలు, దేశంలోని ప్రతి ప్రాంతం, దేశంలోని ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో భాగం అని ప్రధాని అన్నారు.
ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తులను అవి ఎలాంటి లోటుపాట్లు లేకుండా తయారు చేయగలిగే తయారీ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ప్రధాని పిలుపునిచచారు. స్వతంత్ర భారతాన్ని సాధించలేమనే భావన కలలో కూడా రాకూడదని, భారతదేశాన్ని దాస్యశృంఖలాలతో బంధించగలిగే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు అని సుభాష్ చంద్రబోస్ అనేవారని ప్రధాని తన ప్రసంగంలో గుర్తు చేశారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు స్వయంసమృద్ధి సాధించకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని ప్రధాని స్పష్టం చేశారు.
దేశం అభివృద్ధి సాధించకుండా పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం అనేవి అతి పెద్ద సమస్యలుగా వున్నాయని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పేర్కొన్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. నేతాజీ నిత్యం దేశంలోని పేదలగురించి ఆలోచించేవారని విద్యారంగంపై దృష్టి పెట్టేవారని ప్రధాని అన్నారు. దేశంలో ఇంకా పేదరికం, నిరక్షరాస్యత, రోగాలు, వైజ్ఞానిక ఉత్పత్తి లోపం వున్నాయని అన్న ప్రధాని ప్రజలందరూ సమైక్యంగా నిలిచి ఈ సమస్యలను పరిష్కరించుకోవాల్సి వుందని అన్నారు.
దేశంలోని బడుగు బలహీన వర్గాలకోసం, రైతులకోసం, మహిళలకోసం కేంద్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధాని అన్నారు. ఈ రోజున దేశంలోని పేద ప్రజలు ఉచిత వైద్య చికిత్సలు పొందుతున్నారని, ఆరోగ్య సౌకర్యాలు ఉచితంగా అందుతున్నాయని ప్రధాని అన్నారు. రైతులకు ఆధునిక సౌకర్యాలు లభిస్తున్నాయని, విత్తనందగ్గరనుంచి మార్కెట్ వరకూ వారు పెట్టే ఖర్చులు తగ్గాయని ప్రధాని అన్నారు. విద్యారంగంలో ప్రాధమిక సౌకర్యాల కల్పన ఆధునీకరించడం జరిగిందని, యువతకు ఆధునిక విద్య లభిస్తోందని అన్నారు. నూతన ఐఐటీలు, ఐఐఎంలూ, ఏఐఐఎంఎస్ లు ఏర్పాటు చేస్తున్నామని దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం 21వశతాబ్ద అవసరాలకు అనుగుణంగా వుందని అన్నారు.
దేశవ్యాప్తంగా వస్తున్న ప్రగతిశీల మార్పులను చూస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గర్వపడతారని ప్రధాని అన్నారు. ఆదునిక సాంకేతికత సాయంతో భారతదేశం స్వావలంబన సాధించడాన్ని చూస్తే నేతాజీ సంతోషిస్తారని ప్రధాని స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలతో భారతదేశం పోటీపడడాన్ని చూస్తే నేతాజీ ఆనందిస్తారని ప్రధాని అన్నారు. భారతదేశ రక్షణ రంగంలో రఫేల్ లాంటి ఆధునిక యుద్ధ విమానాలున్నాయని, అంతే కాదు భారతదేశం స్వయంగా తేజాస్ లాంటి ఆధునిక యుద్ధ విమానాలను తయారు చేస్తోందని ప్రధాని అన్నారు. భారతీయ సైనిక దళాలు సాధించిన శక్తియుక్తులను చూస్తే నేతాజీ తప్పకుండా తన ఆశీస్సులను అందిస్తారని ప్రధాని అన్నారు. అంతే కాదు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికిగాను దేశీయంగానే టీకాలను తయారు చేసుకుంటున్నామని ఇతర దేశాలకు ఈ విషయంలో సాయం చేస్తున్నామని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఎల్ ఏసి నుంచి ఎల్ ఓ సి దాకా బలోపేతమైన భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుసుకుంటున్నారని, తన సార్వభౌమత్వానికి ఎలాంటి హాని జరిగినా సరే భారతదేశం తగిన విధంగా బదులిస్తోందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.
బంగారు బంగ్లా సాధనకు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ తోపాటు, ఆత్మనిర్భర్ భారత్ సాధించాలనే కల దోహదం చేస్తాయని ప్రధాని అన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్రలాగానే ఆత్మనిర్భర్ భారత్ సాధించడానికి పశ్చిమ బెంగాల్ కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ కారణంగా ఆత్మనిర్భర్ బెంగాల్, సోనార్ బంగ్లా ఏర్పడతాయని ప్రధాని స్పష్టం చేశారు. బెంగాల్ ముందడుగు వేసి అటు రాష్ట్రానికి ఇటు దేశానికి పూర్వవైభవాన్ని తేవాలని చెబుతూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
The positive changes taking place in India today would make Netaji Subhas Bose extremely proud. #ParakramDivas pic.twitter.com/mdemUH4tey
— Narendra Modi (@narendramodi) January 23, 2021
The positive changes taking place in India today would make Netaji Subhas Bose extremely proud. #ParakramDivas pic.twitter.com/mdemUH4tey
— Narendra Modi (@narendramodi) January 23, 2021