పదిహేడేళ్ల కిశోర ప్రాయంలోని యువతలో అధిక శాతం తమ బాల్య దశ చివరి అంకాన్ని ఆనందంగా గడపాలని లేదా భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలని భావిస్తారు. కానీ, శ్రీ నరేంద్ర మోదీ విషయంలో మాత్రం ఆ వయస్సులో తీసుకొన్న నిర్ణయాలు ఈ వైఖరికి పూర్తిగా భిన్నం. తన 17 ఏళ్ల వయస్సులో తీసుకొన్న అసాధారణ నిర్ణయం ఆయన జీవన గమనాన్నే మార్చివేసింది. అదేమిటంటే... ఇల్లూవాకిలీ వదలి దేశం నలుమూలలూ చుట్టి రావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇది విని ఆయన కుటుంబం దిగ్భ్రాంతికి గురైనా, తమ చిన్న పట్టణ జీవనానికి వీడ్కోలు పలకాలన్న నరేంద్రుని కోరికను అంగీకరించింది. ఆయన ఇల్లు విడచి బయలుదేరే రోజు రానే వచ్చింది. ఆ రోజున ఆయన తల్లి ప్రత్యేక సందర్భాల్లో చేసే తీపి వంటకాన్ని తయారుచేసి తినిపించింది. ఆపైన సంప్రదాయబద్ధంగా నుదుట తిలకం దిద్ది, తన బిడ్డను దేశాటనకు సాగనంపింది
ఆయన ప్రయాణించిన ప్రదేశాల్లో హిమాలయాలు (అక్కడి గరుడ మందిరంలో బస), పశ్చిమ బెంగాల్ లోని రామకృష్ణ ఆశ్రమంతో పాటు ఈశాన్య ప్రాంతాల్లోనూ పర్యటించారు. ఈ ప్రయాణాలు ఆ యువకుడి మనోఫలకంపై చెరగని ముద్ర వేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో భిన్న సంస్కృతులను అధ్యయనం చేస్తూ భరత భూమిలో విస్తృత భాగాన ఆయన పర్యటించారు. తనకెంతో ఆరాధ్యుడైన స్వామి వివేకానందతో ఆత్మీయ బంధం దిశగా ఆయనలో ఆధ్యాత్మిక చైతన్యం పురివిప్పింది ఈ సమయంలోనే.
నరేంద్ర మోదీ బాల్యం
ఆర్ ఎస్ ఎస్ పిలుపు
రెండేళ్ల తరువాత దేశాటన నుంచి తిరిగివచ్చిన నరేంద్ర, అటు పైన రెండు వారాల పాటు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈసారి ఆయన తన గమ్యం, లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని- అహమ్మదాబాద్ కు వెళ్లి అక్కడ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్)తో మమేకమై పనిచేయాలని నిశ్చయించుకున్నారు. ఈ సామాజిక, సాంస్కృతిక సంస్థ 1925లో ప్రారంభం కాగా, నాటి నుండి భారత దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునరుత్తేజం ధ్యేయంగా అవిరళ కృషి చేస్తోంది.
ఎనిమిదేళ్ల వయసులో ఆర్ ఎస్ ఎస్ తొలిసారి ఆయనకు పరిచయమైంది. తమ కుటుంబం నడిపే టీ కొట్టులో పని పూర్తయిన తరువాత స్థానిక యువత పాల్గొనే సమావేశాలకు ఆయన హాజరయ్యే వారు. అయితే, ఇందుకు రాజకీయాలు ఎంత మాత్రం కారణం కాదు. ఈ సందర్భంగానే తన జీవితాన్ని బలంగా ప్రభావితం చేసిన వ్యక్తిని ఆయన కలుసుకొన్నారు. ఆయనే శ్రీ లక్ష్మణ్ రావు ఈనాందార్... స్థానికులు ఆయనను ‘వకీల్ సాహెబ్’గానూ పిలుస్తారు.’
ఆర్ ఎస్ ఎస్ తో ఉన్న రోజులలో శ్రీ నరేంద్ర మోదీ
అహమ్మదాబాద్ పయనం.. తదనంతర పరిణామాలు
ఈ నేపథ్యంగల నరేంద్ర సుమారు 20 ఏళ్ల వయస్సులో గుజరాత్ లోని అతిపెద్ద నగరం అహమ్మదాబాద్ కు చేరుకొన్నారు. ఆర్ ఎస్ ఎస్ లో శాశ్వత సభ్యుడయ్యారు. ఆయన అంకితభావం, నిర్వహణ సామర్థ్యం వకీల్ సాహెబ్‌ను ఆకట్టుకోగా, 1972లో ప్రచారక్‌గా నియమితులై, ఆర్ ఎస్ ఎస్ కు జీవితకాల కార్యకర్తగా మారారు. ఇతర ప్రచారక్‌లతో వసతి సదుపాయాలను పంచుకొంటూ అత్యంత కఠిన దైనందిన కార్యకలాపాలను నిర్వర్తించే వారు. తెల్లవారుజామున 5:00 గంటలకల్లా మొదలయ్యే ఈ కార్యకలాపాలు రాత్రి పొద్దుపోయే దాకా సాగుతూ ఉండేవి. ఇంత ముమ్మర కసరత్తు నడుమనే నరేంద్ర రాజకీయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. విద్యార్జనకు, జ్ఞాన సముపార్జనకు ఆయన సదా విలువనిచ్చే వారు. ప్రచారక్ బాధ్యతలలో భాగంగా ఆయన గుజరాత్ అంతటా పర్యటించారు. ఖేడ్ జిల్లాలోని నడియాద్ లో గల సంత్రామ్ మందిరంలో 1972-73 మధ్య ఆయన కొంతకాలం గడిపారు. సిద్ధాపూర్‌లో 1973నాటి భారీ శిఖరాగ్ర సదస్సు నిర్వహణ బాధ్యతలను సంస్థ నరేంద్ర మోదీకి అప్పగించింది. ఆ సదస్సు సందర్భంగా ఆయన సంఘ్ అగ్రనాయకులను కలుసుకున్నారు.
ఓ కార్యకర్తగా శ్రీ నరేంద్ర మోదీ ఎదుగుతున్న ఆ సమయంలో గుజరాత్‌లోనే గాక దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణం నెలకొంది. ఆయన అహ మ్మదాబాద్ చేరే సరికి ఎన్నడూ లేని రీతిలో ఆ నగరం మతకలహాలతో అట్టుడుకుతోంది. ఇక జాతీయ స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉండగా 1967 లోక్ సభ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తిన్న కాంగ్రెస్ పార్టీ కూడా అందులోని వర్గాలు, శ్రీమతి ఇందిరాగాంధీ మధ్య రెండు ముక్కలైంది. శ్రీమతి గాంధీ వ్యతిరేక వర్గంలో గుజరాత్‌కు చెందిన నాటి నాయకుడు శ్రీ మొరార్ జీ దేశాయ్ కూడా ఉన్నారు. అయితే, ‘గరీబీ హఠావో’ (పేదరిక నిర్మూలన) నినాదంతో శ్రీమతి ఇందిరా గాంధీ 1971 లోక్ సభ ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రజల చేత ప్రతినిధులు ఎన్నుకోబడే 518 పార్లమెంట్ స్థానాలకు గాను 352 స్థానాల్లో ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ వర్గం తిరుగులేని ఆధిక్యం సాధించింది.
గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలోనూ 50 శాతం ఓట్ల వాటాతో శ్రీమతి గాంధీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ 182 స్థానాలకు గాను 140 స్థానాలను కైవసం చేసుకొన్నారు.
శ్రీ నరేంద్ర మోదీ... ఓ ప్రచారక్..
అయితే, కాంగ్రెస్ పార్టీతో పాటు శ్రీమతి గాంధీ విజయంతో ఎగసిన ఉత్సాహం అంతే వేగంగా చల్లారిపోయింది. సత్వర సంస్కరణలు, పురోగతిపై ప్రజల కలల నేపథ్యంలో గుజరాత్ లోని సామాన్య ప్రజానీకంలో భ్రమలు తొలగిపోయాయి. అవినీతి, దురాశాపూరిత రాజకీయాల ఫలితంగా శ్రీ ఇందూలాల్ యాజ్ఞిక్, శ్రీ జీవ్‌రాజ్ మెహతా, శ్రీ బల్వంత్‌రాయ్ మెహతా వంటి రాజకీయ దిగ్గజాల పోరాటాలు, త్యాగాలు వృథా అయ్యాయి. కాంగ్రెస్ పాలనలో 1960 దశకం చివరన, 1970 దశకం తొలినాళ్లలో గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, దుష్పరిపాలన తారస్థాయికి చేరాయి. నాటి అతి గొప్ప హామీ ‘గరీబీ హఠావో’ (పేదరిక నిర్మూలన) కాస్తా శుష్క వాగ్దానంగా మిగిలి చివరకు ‘గరీబ్ హఠావో’ (పేదల నిర్మూలన) అనే దు:స్థితికి చేరింది. పేదల జీవనం దుర్భరంగా తయారైంది. గుజరాత్‌లో కరువు ఫలితంగా ధరలు పెరిగిపోయి రెట్టింపు స్థాయిలో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాథమిక నిత్యావసరాల కోసం కిలోమీటర్ల మేర జనం బారులు తీరిన దృశ్యాలు రాష్ట్రం అంతటా సర్వసాధారణం అయ్యాయి. పేదల బాధలకు ఉపశమనమే కరువైంది.
నవనిర్మాణ ఉద్యం... యువశక్తి
రాష్ట్ర ప్రజానీకంలోని అసంతృప్తి మోర్బిలోగల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు కొందరు 1973 డిసెంబరులో తమ ఆహార బిల్లుల విపరీత పెరుగుదలపై నిరసన ప్రారంభించడంతో ప్రజాగ్రహంగా రూపుదిద్దుకొంది. గుజరాత్ అంతటా ఇలాంటి నిరసనలే వెల్లువెత్తాయి. ఈ నిరసనలకు సర్వత్రా మద్దతు లభించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ప్రజా ఉద్యమానికి ఆజ్యం పోసింది. అదే ‘నవనిర్మాణ ఉద్యమం.’
సమాజంలోని అన్నివర్గాలనూ ఆకర్షించిన ఈ ఉద్యమం శ్రీ నరేంద్ర మోదీని కూడా తన వైపు తిప్పుకొంది. ఆపైన అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు, అపార ప్రజాదరణను చూరగొన్న నాయకుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ మద్దతు లభించడంతో ఉద్యమం మరింత బలోపేతమైంది. ఆ మహా నాయకుడు అహమ్మదాబాద్ కు విచ్చేసిన సందర్భంగా ఆయనను కలుసుకొనే అరుదైన అవకాశం శ్రీ నరేంద్ర మోదీకి లభించింది. కాకలుతీరిన ఆయనతో అనేక మంది ఇతర నాయకులు పలుమార్లు జరిపిన చర్చలు యువ నరేంద్రునిపై బలమైన ముద్ర వేశాయి.
చరిత్రాత్మక నవనిర్మాణ ఉద్యమంలో ఓ దృశ్యం
అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న నాటి ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడంతో విద్యార్థి శక్తి విజయం సాధించింది. కానీ, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు... ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అర్ధరాత్రి వేళ ‘ఆత్యయిక స్థితి’ (ఎమర్జెన్సీ)ని ప్రకటించడంతో నిరంకుశత్వపు కారుమబ్బులు దేశాన్ని కమ్ముకున్నాయి.
ఎమర్జెన్సీ చీకటి రోజులు
తన ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో అత్యున్నత పదవిని కోల్పోక తప్పదని శ్రీమతి ఇందిరాగాంధీ భయపడ్డారు. ఆ సమయానికి ఎమర్జెన్సీ విధించడమే సరైన చర్యగా ఆమె భావించారు. ఫలితంగా ప్రజాస్వామ్యం చెరలో చిక్కింది. వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు మొదలయ్యాయి. ప్రతిపక్ష అతిరథ మహారథులైన శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి, శ్రీ ఎల్.కె. అద్వానీ, శ్రీ జార్జి ఫెర్నాండెజ్, శ్రీ మొరార్ జీ దేశాయ్ వంటి వారు అరెస్టయ్యారు
ఎమర్జెన్సీలో శ్రీ నరేంద్ర మోదీ మారువేషం
ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో శ్రీ నరేంద్ర మోదీ కీలకపాత్ర పోషించారు. నియంతృత్వాన్ని ఎదిరించేందుకు ఏర్పాటైన గుజరాత్ లోక్ సంఘర్ష్ సమితి (జి ఎల్ ఎస్ ఎస్)లో భాగస్వామి అయ్యారు. అటుపైన త్వరలోనే జి ఎల్ ఎస్ ఎస్ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగి, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల మధ్య సమన్వయంలో ప్రధాన పాత్ర వహించారు. కాంగ్రెస్ వ్యతిరేక నాయకులు, కార్యకర్తలపై సునిశిత నిఘా ఉన్న ఆ కాలంలో ఇదెంతో క్లిష్టమైన బాధ్యత.
ఎమర్జెన్సీ కాలంలో ఈ కర్తవ్య నిర్వహణలో ఆయన చాతుర్యాన్ని గురించిన అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అటువంటి వాటిలో ప్రభుత్వం అరెస్ట్ చేయజూస్తున్న కీలక ఆర్ ఎస్ ఎస్ నాయకుడొకరిని స్కూటర్‌పై సురక్షిత ప్రాంతానికి చేరవేసిన ఉదంతం ఒకటి. అదే విధంగా అరెస్టయిన ఓ నాయకుడి వద్ద గల కొన్ని కీలక పత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకు చిక్కకుండా తీసుకు రావలసిన బాధ్యత శ్రీ నరేంద్ర మోదీపై పడింది. అప్పటికే స్టేషన్‌లో నిర్బంధితుడైన సదరు నాయకుడి వద్ద నుండి ఆ పత్రాలను పోలీసుల కళ్లెదుటే ఎంతో చాకచక్యంతో ఆయన వెనక్కు తీసుకురాగలిగారు. శ్రీ నానాజీ దేశ్‌ముఖ్ అరెస్టయినపుడు సంఘ్ సానుభూతిపరుల పేర్లున్న ఓ పుస్తకం ఆయన వద్దే ఉండిపోయింది. దీంతో సదరు సానుభూతిపరులలో ప్రతి ఒక్కరినీ సురక్షిత ప్రదేశాలకు చేర్చే బాధ్యతను శ్రీ నరేంద్ర మోదీ స్వీకరించి, విజయవంతంగా నెరవేర్చారు.
అలాగే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట కార్యకర్తలు గుజరాత్ నుండి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేసే బాధ్యతను కూడా శ్రీ నరేంద్ర మోదీ నిర్వర్తించారు. ఇటువంటి కార్యకలాపాలలో భాగంగా ఆయన కొన్నిసార్లు మారువేషాల్లో సంచరించాల్సి వచ్చింది. ఆ మేరకు ఓసారి సిక్కు యువకుడిలా, మరోసారి గడ్డం లేని వృద్ధుడిలా.. రక రకాల వేషాల్లో తిరిగేవా రు.
ఎమర్జెన్సీ రోజులనాటి శ్రీ నరేంద్ర మోదీ విశేషానుభవాలలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పనిచేయడం అత్యంత ప్రధానమైనది. దీనిపై శ్రీ నరేంద్ర మోదీ తన బ్లాగ్‌లో 2013 జూన్‌లో ఇలా రాశారు.. :
‘‘నా వంటి అనేక మంది యువకులకు ఎమర్జెన్సీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఆనాడు ఒకే లక్ష్యంతో పోరాడుతున్న అనేక సంస్థలు, పలువురు నాయకులతో కూడిన విస్తృత శ్రేణిలో పనిచేయడం మరపురాని అనుభవం. మేమంతా ఏయే సంస్థల నుండి వచ్చామన్న దానితో నిమిత్తం లేకుండా కలిసి పనిచేసే అవకాశం లభించింది. మా సంఘ్ పరివారం లోని దిగ్గజాలు అటల్ జీ, అద్వానీ జీ, స్వర్గీయ శ్రీ దత్తోపంత్ ఠేంగ్డీ , స్వర్గీయ నానాజీ దేశ్‌ముఖ్ ల నుండి, సోషలిస్ట్ నేత శ్రీ జార్జి ఫెర్నాండెజ్‌తో పాటు శ్రీ మొరార్ జీ దేశాయ్ సన్నిహితుడు, ఎమర్జెన్సీపై అసంతృప్తుడైన కాంగ్రెస్ సభ్యుడు శ్రీ రవీంద్ర వర్మ దాకా పలువురు నాయకుల నుండి వివిధ సిద్ధాంత మూలాలు ఉన్న సంస్థలకు చెందిన మేమంతా స్ఫూర్తి పొందాము. గుజరాత్ విద్యాపీఠం పూర్వ ఉప కులపతి శ్రీ ధీరూభాయ్ దేశాయ్, మానవతావాది శ్రీ సి.టి. దారూ, మాజీ ముఖ్యమంత్రులు శ్రీ బాబూభాయ్ జశ్ భాయ్, శ్రీ చిమన్‌భాయ్ పటేల్, ప్రముఖ ముస్లిం నేత కీర్తిశేషుడైన శ్రీ హబీబుర్ రహ్మాన్ ల వంటి పెద్దలతో పనిచేస్తూ ఎంతో నేర్చుకొనే అదృష్టం నాకు లభించింది. కాంగ్రెస్ పార్టీలో నిరంకుశత్వాన్ని మొక్కవోని సాహసంతో నిరసించి, చివరకు పార్టీనే వదిలిపెట్టిన స్వర్గీయ మొరార్ జీ భాయ్ దేశాయ్ సంఘర్షణ, దృఢనిశ్చయం గుర్తుకొస్తున్నాయి.
విస్తృత శ్రేయస్సు కోసం అనేక ఆలోచనలు, సిద్ధాంతాల ఉత్తేజకర కలబోత చోటుచేసుకొన్న సమయమది. కుల, మత, వర్గ, సామాజిక విభేదాలకు అతీతంగా దేశ ప్రజాస్వామ్య విలువలను సమున్నతంగా నిలిపే ఉమ్మడి లక్ష్యం కోసం సామూహిక సమరం చేసిన కాలమది. గాంధీనగర్‌లో 1975 డిసెంబర్ నాటి ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుల అత్యంత ముఖ్యమైన సమావేశం కోసం మేమంతా కలిసి పనిచేశాము. స్వతంత్ర సభ్యులైన స్వర్గీయ శ్రీ పురుషోత్తం మౌలంకర్, శ్రీ ఉమాశంకర్ జోషి, శ్రీ కృష్ణకాంత్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.’’
రాజకీయ పరిధికి వెలుపల వివిధ సామాజిక సంస్థలు, గాంధీవాదులతో కలిసి పనిచేసే అవకాశం కూడా శ్రీ నరేంద్ర మోదీకి లభించింది. శ్రీ జార్జి ఫెర్నాండెజ్ (ఆయనను ‘జార్జి సాహెబ్’గా మోదీ వ్యవహరిస్తారు), శ్రీ నానాజీ దేశ్‌ముఖ్ వంటి నేతలను కలుసుకోవడాన్ని స్పష్టంగా గుర్తు చేసుకొంటుంటారు. నాటి చీకటి రోజుల అనుభవాలను ఆయన అక్షరబద్ధం చేస్తూ రాగా, అనంతరం కాలంలో అవి ‘ఆపత్కాల్ మే గుజరాత్’ (ఎమర్జెన్సీ కాలంలో గుజరాత్) పేరిట పుస్తక రూపం సంతరించుకొన్నాయి
ఎమర్జెన్సీ అనంతర కాలంలో..
నవనిర్మాణ ఉద్యమం తరహాలోనే ఎమర్జెన్సీ తర్వాత ప్రజా విజయం సిద్ధించింది. లోక్‌సభకు 1977లో నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి ఇందిరాగాంధీ దారుణ పరాజయం పాలయ్యారు. ప్రజలు సంపూర్ణ మార్పును కోరుకోగా జనతా పార్టీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన సంఘ్ నాయకులైన అటల్ జీ, అద్వానీ జీ ల వంటి ముఖ్యమైన కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
అదే సమయంలో తన చురుకుదనం, నిర్వహణ పటిమను పలుసార్లు నిరూపించుకున్న శ్రీ నరేంద్ర మోదీ ‘సంభాగ్ ప్రచారక్’ (ప్రాంతీయ కార్యనిర్వాహకుడితో సమానం)గా నియమితులయ్యారు. ఆయనకు దక్షిణ, మధ్య గుజరాత్‌లో సంఘ్ బాధ్యతలను అప్పగించారు. అలాగే ఆయనను ఢిల్లీ కి పిలిపించి ఎమర్జెన్సీ కాలపు ఆర్ ఎస్ ఎస్ కార్యకలాపాలను అధికారికంగా సంకలనం చేసే కర్తవ్యం అప్పజెప్పారు. అంటే... ప్రాంతీయ, జాతీయ స్థాయి బాధ్యతలను సమతూకం చేసుకొంటూ మరింతగా కృషిచేయడమన్న మాట. ఆ రెండు బాధ్యతలనూ శ్రీ నరేంద్ర మోదీ ఎంతో సులభంగా, సమర్థంగా నెరవేర్చారు.
గుజరాత్‌లోని ఓ గ్రామంలో నరేంద్ర మోదీ
గుజరాత్‌లో ఆయన పర్యటన కొనసాగుతూ 1980 దశకం తొలినాళ్ల నాటికి మరింత విస్తృతమైంది. తద్వారా రాష్ట్రంలోని దాదాపు ప్రతి తాలూకాను, ప్రతి గ్రామాన్ని సందర్శించే అవకాశం లభించింది. ఒక నిర్వాహకుడుగా, ఓ ముఖ్యమంత్రిగా ఈ అనుభవం ఆయనకు కలిసివచ్చింది. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రత్యక్ష అవగాహనవల్ల వాటిని పరిష్కరించేందుకు శ్రమించాలన్న దృఢనిశ్చయం ఏర్పడింది. కరువులు, వరదలు, కల్లోలాలు విరుచుకుపడిన సమయాల్లోనూ ఆయన ముందుండి సహాయ చర్యలను నడిపించారు.
తనకు అప్పగించిన బాధ్యతలతో శ్రీ నరేంద్ర మోదీ పూర్తిగా మమేకం అయినప్పటికీ ఆర్ ఎస్ ఎస్ పెద్దలతో పాటు కొత్తగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతలు మరో విధంగా ఆలోచించారు. మరిన్ని బాధ్యతలను భుజాలకెత్తుకోవాల్సిందిగా 1987లో కోరారు. దీంతో శ్రీ నరేంద్ర మోదీ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఆనాటి నుండి నిరంతర పార్టీ వ్యూహ రచనతో పాటు అధిక సమయం వీధులలోనే గడిపారనవచ్చు. అంటే.. అటు పార్టీ నాయకులతోను, ఇటు కార్యకర్తలతోను కలిసి పనిచేసుకొంటూ వస్తున్నారన్న మాట.
జాతి సేవాభిలాషతో వాద్‌నగర్‌లో ఇల్లొదిలిన బాలుడు మరొక భారీ అంగ వేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే, దేశ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు సాగుతున్న నిరంతర పయనంలో ఆయనకు ఇది మరొక కొనసాగింపు మాత్రమే. ఆ మేరకు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లివచ్చిన తరువాత బిజెపి గుజరాత్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు.