నమస్కారం!
సమావేశానికి హాజరైన గౌరవనీయ కమిటీ సభ్యులు, సహచరులారా! గురు తేగ్ బహదూర్ గారి 400వ జయంతి (ప్రకాష్ పూరబ్) నిర్వహించే ఈ సందర్భం ఒక ఆధ్యాత్మిక గౌరవంతో కూడినది మాత్రమేగాక ఇది మన జాతీయ కర్తవ్యం. దీనికి సంబంధించి మనవంతు పాత్ర పోషించడం గురుకృపా ప్రసాదమే. ఈ కృషిలో భాగంగా మనం దేశ పౌరులందర్నీ భాగస్వాములను చేయడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.
ఈ వేడుకల జాతీయ నిర్వహణ కమిటీ చైర్మన్ హోదాలో దేశీయాంగ శాఖ మంత్రి తమకు అందిన కొన్ని సూచనలను, కమిటీ అభిప్రాయాలను మనముందుంచారు. పూర్తి ఏడాది కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన సరళమైన చట్రంగా ఇది సమర్పించబడింది. కాబట్టి ఈ ప్రణాళికను మెరుగుపరచేందుకు, కొన్ని కొత్త ఆలోచనలకు ఇందులో చోటుంది. అలాగే సభ్యుల నుంచి అమూల్య, ప్రాథమిక సూచనలు కూడా అందాయి. ఇదొక గొప్ప అవకాశం అనడం వాస్తవం. మన దేశం మౌలిక భావనలను ప్రపంచ ప్రజానీకం స్థాయికి తీసుకెళ్లడంలో ఈ సానుకూల పరిస్థితిని మనం సద్వినియోగం చేసుకోవాలి. గౌరవనీయులైన సభ్యులు చాలామందికి తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లభించలేదు కాబట్టి, వారంతా లిఖితపూర్వకంగా వాటిని తెలియజేస్తారని నేను విశ్వసిస్తున్నాను. తద్వారా మరింత మెరుగైన కార్యాచరణ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించే వీలుంటుంది.
మిత్రులారా!
గడచిన నాలుగు శతాబ్దాలుగా గురు తేగ్ బహదూర్ ద్వారా ప్రభావితం కాని అంశమేదీ మన ఊహకైనా అందదు. మన 9వ గురువుగా ఆయన నుంచి మనకెంతో ప్రేరణ లభిస్తుంది. ఆయన జీవితంలోని అన్ని దశల గురించీ మీకందరికీ బాగా తెలిసే ఉంటుంది. అయితే, దేశంలోని నవతరం కూడా ఆయన గురించి తెలుసుకుని, అర్ధం చేసుకోవడం కూడా అవశ్యం.
మిత్రులారా!
మన సిక్కు గురు సంప్రదాయం గురు నానక్ దేవ్ గారినుంచి గురు తేగ్ బహదూర్ వారిదాకా… చివరగా గురు గోవింద్ సింగ్ వరకూ సంపూర్ణ జీవన తత్త్వాన్ని విశదపరుస్తుంది. ఈ నేపథ్యంలో గురు నానక్ దేవ్ గారి 550వ జయంతి, గురు తేగ్ బహదూర్ గారి 400వ జయంతిసహా గురు గోవింద్ సింగ్ గారి 350వ జయంతిని కూడా నిర్వహించుకునే అవకాశం కలగడం మనకు లభించిన గౌరవం. మన గురువుల జీవితానుసరణతో జీవన ప్రాముఖ్యాన్ని ప్రపంచం మొత్తం సులువుగా అవగతం చేసుకోగలదు. అత్యున్న త్యాగం, అంతులేని సహనంతో నిండిన జీవితం వారిది. జ్ఞానజ్యోతి, ఆధ్యాత్మిక ఔన్నత్యం కూడా వారి జీవితాల్లో భాగమే.
మిత్రులారా!
గురు తేగ్ బహదూర్ ఇలా చెప్పారు: ‘‘సుఖ్ దుఃఖ్ దోనో సమ్ కరి జానే ఔర్ మాను అప్‌మానా’’… అంటే- మన జీవితాల్లో ‘‘సుఖదుఃఖాలతోపాటు అభిమానం-అవమానాలను కూడా సమానంగా పరిగణనలోకి తీసుకోవాలి’’ అని అర్థం. జీవిత పరమార్థమేమిటో ఆయన మనకు తెలిపారు… జీవితానికే కాకుండా జాతి కోసం సేవాపథాన్ని నిర్దేశించారు. సమానత్వం, సామరస్యం, పరిత్యాగం అనే తారకమంత్రాలను ఉపదేశించారు. ఈ మంత్రాలను మన జీవితంలో ఒక భాగం చేసుకుంటూ విస్తృతంగా వ్యాపింపజేయడమే మన కర్తవ్యం.
మిత్రులారా!
మనమిక్కడ చర్చించిన మేరకు ఏడాది పొడవునా 400వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించాలి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మందికి ఈ సందేశం చేరేందుకు కృషిచేయాలి. ఈ కార్యకలాపాల కోసం సిక్కు సంప్రదాయం, విశ్వాసంతో ముడిపడిన అన్ని యాత్రాకేంద్రాలు మరింత శక్తినిస్తాయి. గురు తేగ్ బహదూర్ ‘షబద్’లు, కీర్తనలు, ఆయనతో ముడిపడిన సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా ఈ సందేశాలను ప్రపంచవ్యాప్తంగా నవతరానికి చేరువ చేయవచ్చు. డిజిటల్ సాంకేతికత గరిష్ఠ వినియోగంపై చాలామంది సభ్యులు ఇవాళ సూచించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. అంతేగాక ఇది పరివర్తనాత్మక భారతదేశం గురించి కూడా విశదం చేస్తుంది. ఈ ప్రయత్నాలన్నింటిలో భాగంగా వీలైనంత ఎక్కువ మందిని మనం ఈ కార్యక్రమాలో సంధానించాలి.
మిత్రులారా!
గురు తేగ్ బహదూర్ బోధనలుసహా గురు సంప్రదాయాన్ని ప్రపంచమంతటా విస్తరింపజేసే దిశగా మనం ఈ వేడుకలను సద్వినియోగం చేసుకోవాలి. సిక్కు సమాజంతోపాటు మన గురువుల లక్షలాది అనుయాయులు వారి అడుగుజాడలలో నడుస్తున్న తీరును, సిక్కులు చేస్తున్న ఎనలేని సామాజిక సేవను, మన గురుద్వారాలు చైతన్య కేంద్రాలుగా వెలుగొందటాన్ని వివరించే సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేయగలిగితే మానవాళిని మరింతగా ప్రేరేపించగలం. వాస్తవానికి వీటన్నిటిపైనా పరిశోధన నిర్వహించి, నమోదు చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ కృషి భవిష్యత్తరాలకూ మార్గనిర్దేశం చేస్తుంది. గురు తేగ్ బహదూర్ సహా అందరు గురువుల పాదాలకూ ఇది మనం అర్పించే నివాళి మాత్రమేగాక వారికి నిజమైన సేవ కూడా కాగలదు. ఈ కీలక సమయంలో మన 75 ఏళ్ల స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను కూడా దేశం నిర్వహించుకోవడం విశేషం. గురువుల ఆశీర్వాదంతో ప్రతి అంశంలోనూ మనం కచ్చితంగా విజయం సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను. మీరంతా ఎంతో గొప్ప సలహాలిచ్చినందుకు మీకెంతో కృతజ్ఞుణ్ని. మీరందిస్తున్న సహకారం రానున్న కాలంలో మన గొప్ప సంప్రదాయాన్ని భవిష్యత్తరాలకు చేర్చడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఈ పవిత్ర వేడుకల సందర్భంగా మన గురువులకు సేవచేసే భాగ్యం లభించడం మనకెంతో గర్వకారణం.
ఈ సందర్భంగా శుభాకాంక్షలతో… అందరికీ చాలా ధన్యవాదాలు!
బాధ్యత నిరాకరణ ప్రకటన: ఇది ప్రధానమంత్రి హిందీ వాస్తవ ప్రసంగానికి సమీప తెలుగు అనువాదం.