గౌరవనీయ యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని థెరిసా మే,
నా మంత్రివర్గ సహచరుడు, శాస్త్ర విజ్ఞానం & సాంకేతిక విజ్ఞానం, అర్త్ సైన్సెస్ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్,
సి ఐ ఐ అధ్యక్షుడు డాక్టర్ నౌషద్ ఫోర్బ్ స్,
విద్యారంగ ప్రముఖులు,
ప్రముఖ శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు,
భారతదేశం, యుకె లకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు,
సోదర సోదరీమణులారా
1. ఇండియా- యుకె టెక్ శిఖరాగ్ర సమావేశం 2016ను ఉద్దేశించి ప్రసంగించడం నాకు ఆనందాన్ని ఇస్తోంది.
2. గత నవంబర్ లో నేను యుకె పర్యటనకు వెళ్ళినప్పుడు భారతదేశం, యుకె ల మధ్య మైత్రిని బలోపేతం చేసే లక్ష్యంతో టెక్ సమిట్ ను నిర్వహించారు. 2016 సంవత్సరాన్ని విద్య, పరిశోధన మరియు నవకల్పనలలో భారత- యుకె సంవత్సరంగా పాటిస్తున్న నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని మరోసారి గుర్తు చేసుకునే క్రమంలో ఈ సమావేశం కీలకమైంది.
3. ఈ సమావేశానికి గౌరవనీయ యుకె ప్రధాని థెరిసా మే హాజరు కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. మేడమ్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశం ఎప్పుడూ మీ హృదయాలకు ఎంతో సన్నిహితమైందన్న విషయం నాకు తెలుసు. మీరు భారత్ కు మంచి మిత్రులు. ఇటీవల మీరు భారతీయ సంతతి ప్రజలతో కలిసి దీపావళి వేడుక జరుపుకొన్నారు.
4. మీరు ఇక్కడకు రావడం ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా వచనబద్ధతను తిరిగి ప్రకటించడంలో ఎంతో కీలకమైంది. మీ తొలి విదేశీ పర్యటనకు భారత్ ను ఎంచుకోవడం మాకు ఎంతో గౌరవప్రదం. మీకు హార్దిక స్వాగతం పలుకుతున్నాను.
5. ఈ రోజు ప్రపంచం పరివర్తనకు సాంకేతిక విజ్ఞానమే కీలకమవుతోంది. చారిత్రకంగా ఎంతో సన్నిహిత దేశాలైన యునైటెడ్ కింగ్ డమ్, భారతదేశం 21వ శతాబ్దిని మేధోసంపత్తి శతాబ్దిగా నిర్వచించడంలో కలిసి పని చేయడం అత్యంత అవసరం.
6. వర్తమాన ప్రపంచీకరణ వాతావరణంలో మన రెండు దేశాలు ఎన్నో ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. అవి నేరుగా మన వర్తక, వాణిజ్యాలను ప్రభావితం చేస్తున్నాయి. కాని శాస్త్రీయంగాను, సాంకేతికంగాను మనకు గల బలాన్ని ఉపయోగించుకొని కొత్త అవకాశాలు సృష్టించగలమన్న విశ్వాసం నాకుంది.
7. భారతదేశం ప్రస్తుతం పెట్టుబడులకు మరింతగా తెరిచిన ద్వారాలతో త్వరిత గతిన అభివృద్ధి చెందుతున్నపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలచింది. నవకల్పనను ఆవిష్కరించగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రతిభావంతులైన కార్మిక శక్తి, పరిశోధన/అభివృద్ధి సామర్థ్యాలు, జనాభాపరమైన చక్కని ప్రయోజనం, పెద్ద మార్కెట్, నానాటికీ ఆర్థికంగా పెరుగుతున్న పోటీతత్వంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త వృద్ధి అవకాశాలను ఆవిష్కరిస్తోంది.
8. యుకె కూడా ఇటీవల కాలంలో సవాళ్ళను ఎదుర్కొని దీటుగా నిలచి వృద్ధిని నమోదు చేయగలిగింది. విద్యాపరమైన ప్రతిభ, సాంకేతిక నవకల్పనలకు ఆలవాలంగా నిలచింది.
9. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఐదు సంవత్సరాలుగా ఒకే స్థాయిలో ఉన్నప్పటికీ రెండు వైపుల నుండి పెట్టుబడులు విశేషంగా పెరిగాయి. యుకెలో భారతదేశం మూడో పెద్ద ఇన్వెస్టర్ గా నిలవగా, భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన జి20 దేశాలలోనే అతి పెద్ద ఇన్వెస్టర్ గా యుకె నిలచింది.
10. భారత-యుకె శాస్త్ర, సాంకేతిక సహకారానికి కూడా అత్యున్నత నాణ్యత, అత్యున్నత ప్రభావంతో కూడిన పరిశోధన భాగస్వామ్యాలు కీలకంగా ఉన్నాయి. న్యూటన్ భాభా ప్రోగ్రామ్ ప్రారంభించిన రెండు సంవత్సరాల కాలంలోనే సామాజిక సవాళ్ళను దీటుగా ఎదుర్కొనగల శాస్త్రీయ పరిష్కారాలపై విస్తృత భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకున్నాము.
11. మన శాస్ర్తవేత్తలు అంటు వ్యాధులకు కొత్త టీకా మందులు కనుగొనడంలోను, సరికొత్త స్మార్ట్ మెటీరియల్స్ అన్వేషణలోను, పరిశుభ్ర ఇంధనాలకు, వాతావరణ మార్పు నిరోధానికి కావలసిన సొల్యూషన్లు తయారుచేయడంలోను, వ్యవసాయం సహా పంటల ఉత్పాదకతను పెంచడానికి, ఆహార భద్రత కల్పనకు కలిసి పని చేస్తున్నారు.
12. 10 మిలియన్ పౌండ్ల ఉమ్మడి పెట్టుబడితో సౌర ఇంధనంపై భారత్ -యుకె స్వచ్ఛ ఇంధనాల ఆర్ అండ్ డి సెంటర్ ఏర్పాటుకు ఉభయులు అంగీకరించాము. 15 మిలియన్ పౌండ్ల పెట్టుబడితో కొత్త యాంటి మైక్రోబియల్ రెసిస్టెన్స్ కార్యక్రమాన్ని చేపట్టాము.
13. వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ విభాగంలో సంప్రదాయక పరిజ్ఞానాన్ని, ఆధునిక అన్వేషణలను కలగలిపి చక్కని పరిష్కారాలు అందించే ప్రాజెక్టులో భారతదేశం, యుకె భాగస్వాములుగా నిలవగలవని నేను భావిస్తున్నాను. దీని వల్ల మనం ఎదుర్కొంటున్న జీవనశైలితో వచ్చే వ్యాధుల్లో కొన్నింటి నుంచైనా పరిష్కరించే ప్రయత్నం మనం చేయగలుగుతాం.
14. పారిశ్రామిక పరిశోధన విభాగంలో యుకెతో భారత భాగస్వామ్యం అత్యంత ఉత్సుకతతో కూడిన కార్యక్రమాల్లో ఒకటిగా ఉంది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సి ఐ ఐ), శాస్త్ర సాంకేతిక శాఖ ల ఉమ్మడి సహకారంలో యుకె సహకారంతో చేపట్టిన గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అలయన్స్ (గీతా) ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనాలు, తయారీ, ఐ సి టి రంగాలలో అందుబాటు ధరలలో ఆర్ అండ్ డి ప్రాజెక్టులను చేపట్టడానికి సహాయకారిగా ఉంటుంది.
15. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సాంకేతికత మద్దతు గల ఔత్సాహిక పారిశ్రామిక సంస్థలుగా (ఎంటర్ ప్రైజ్ లు) తీర్చిదిద్దే కొత్త అవకాశం ఈ రంగాలు మనకు అందిస్తున్నాయి. నవ్యతకు పట్టం కట్టి సాంకేతికత మూలాధారం అయిన సంస్థలను రూపొందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో చురుకైన భాగస్వాములుగా ఉండి విలువను జోడించాలని ఈ శిఖరాగ్రంలో పాల్గొన్న వారందరికీ నేను పిలుపు ఇస్తున్నాను.
16. శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల విభాగాలు చక్కని వృద్ధి అవకాశాలు కలిగినవని, మన బంధంలో కీలకమైన పాత్రను పోషించగలవని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఉమ్మడి సాంకేతిక బలం, శాస్త్రీయ పరిజ్ఞానం మూలాధారంగా పరస్పర లాభదాయకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకోవడం ఈ టెక్ సమిట్ లక్ష్యం.
17. శాస్త్రీయ పరిజ్ఞానం అనేది సార్వజనీనమైందని, సాంకేతిక విజ్ఞానం స్థానికమైందని నేను ఎప్పుడూ చెబుతూ వస్తాను. ఆ దృష్టికోణంలో నుండి చూస్తే ఇటువం సమావేశాలు ఉభయుల అవసరాలు తెలుసుకుని చక్కని అవగాహనతో భవిష్యత్ ప్రాజెక్టులు రూపొందించుకొనేందుకు చక్కని సేతువుగా నిలుస్తాయి.
18. నా ప్రభుత్వం చేపట్టిన ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలు, మా సాంకేతిక విజ్ఞానం సాధించిన విజయాలు, ఆశల సమాహారం, బలీయమైన మన ద్వైపాక్షిక బంధం భారత, బ్రిటిష్ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు ముందుకు తెస్తుంది.
19.
‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం, సమాచారంతో దానిని అనుసంధానం చేయడం, ప్రజలే కీలక శక్తులుగా ఉండే ఇ -గవర్నెన్స్ విస్తరణలో భారత్, యుకె ల మధ్య సహకారానికి చక్కని అవకాశం ఉంది.
20. పట్టణ ప్రాంతాల టెలి డెన్సిటీ 154 శాతంతో భారతదేశం త్వరలో ఒక బిలియన్ ఫోన్ కనెక్షన్లు గల దేశంగా అవతరించనుంది. 350 మిలియన్ ఇంటర్ నెట్ వినియోగదారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాలకు కనెక్టివిటీని కల్పించే కృషి జరుగుతోంది. ఇంత త్వరిత వృద్ధిలో కొత్త డిజిటల్ హైవేలు అధిక సంఖ్యలో ఏర్పాటు కానున్నాయి. భారతదేశం, యుకె కంపెనీలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.
21. భారతదేశంలో త్వరితగతిన విస్తరిస్తున్న ఆర్థిక సేవల రంగం కూడా అపారమైన సహకారానికి అవకాశాలు తెర పైకి తెచ్చింది. 220 మిలియన్ కుటుంబాలను జన్ ధన్ యోజన పేరిట ఒకే ఛత్రం కిందకు తీసుకుని రావడంలో ఫిన్ టెక్ పరివర్తిత శక్తిగా నిలవనుంది. అతి పెద్దదైన ఈ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ స్కీమ్ ను మొబైల్ టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నాము. అలాగే ప్రపంచంలోనే అతి పెద్దదైన సామాజిక భద్రతా కార్యక్రమానికి యునీక్ ఐడెంటిఫికేషన్ కార్డ్ కీలకంగా నిలవనుంది.
22. ఫైనాన్షియల్ టెక్నాలజీ, అంతర్జాతీయ ఫైనాన్స్ విభాగాల్లో నాయకత్వ స్థానంలో ఉన్న యుకె ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్న మా సంస్థలు నేర్చుకోవలసింది చాలా ఉంది.
23. ద్వైపాక్షిక సహకారంలో ‘మేక్ ఇన్ ఇండియా’ ఒక కీలక విభాగంగా నిలుస్తుందని మేము భావిస్తున్నాం. తయారీ రంగంలో అడ్వాన్స్ డ్ ధోరణ/లకు ఇది పట్టం కడుతుంది. ఈ విభాగంలో తిరుగులేని శక్తిగా నిలచిన యుకె రక్షణ తయారీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ రంగంలకు సంబంధించిన మా సరళీకృత ఎఫ్ డి ఐ నిబంధనల ప్రయోజనాన్ని పొందవచ్చు.
24. త్వరిత గతిన విస్తరిస్తున్న పట్టణీకరణలో డిజిటల్ టెక్నాలజీని కీలక భాగస్వామిని చేసేదే ‘స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టు. పూణె, అమరావతి, ఇండోర్ ప్రాజెక్టుల్లో యుకె సంస్థలు ఇప్పటికే అత్యున్నత స్థాయి ఆసక్తి కనబరచడం ఆనందంగా ఉంది. 9 బిలియన్ పౌండ్ల విలువ గల ఒప్పందాల పై యుకె కంపెనీలు ఇప్పటికే సంతకాలు చేయడం చాలా ఆనందదాయకమైన అంశం.
25. సాంకేతిక విజ్ఞానంపై అమితాసక్తి గత మా యువతకు నవ్యత, సాంకేతికల కలబోతను అందుబాటులోకి తేవడం ‘స్టార్ట్-అప్ ఇండియా’ కార్యక్రమ లక్ష్యం. ఇన్వెస్టర్లకు, ఇన్నోవేటర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉంచగల ప్రపంచంలోని అతి పెద్ద స్టార్ట్-అప్ హబ్ లు మూడింటిలోనూ భారతదేశం, యుకె లు అగ్ర స్థానాలలో నిలచాయి.
26. విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాలతో కొత్త వాణిజ్య అప్లికేషన్ లు ఆవిష్కరించగల చక్కని చలనశీల వాతావరణం మనం ఉభయులం ఉమ్మడిగా కల్పించగలుగుతాం.
27. ఈ సదస్సులో చర్చకు ఎంచుకున్న అడ్వాన్స్ డ్ మాన్యుఫాక్చరింగ్, బయోమెడికల్ ఉపకరణాలు, డిజైన్, ఇన్నోవేషన్, ఆంట్రప్రనర్ షిప్ అంశాలు ఉభయ దేశాల పారిశ్రామిక వేత్తలు కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పరచుకొనే వాతావరణం ఆవిష్కరిస్తాయి.
28. ప్రపంచ సవాళ్ళను దీటుగా ఎదుర్కొనగల సాంకేతిక విజ్ఞానాలు ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అత్యున్నత నాణ్యత గల మౌలిక పరిశోధనకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు భారత, బ్రిటన్ కలిసి పని చేయగలవని నేను విశ్వసిస్తున్నాను.
29. ఉన్నత విద్యపై కూడా ఈ టెక్ సమిట్ దృష్టి సారిస్తుండడం నాకు ఆనందంగా ఉంది. విద్యార్థుల భవితకు విద్య ఎంతో కీలకం. ఉమ్మడి భవిష్యత్తు కోసం ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టడానికి కూడా ఇది చాలా అవసరం. విద్య, పరిశోధన రంగాల్లోని యువతకు అవకాశాల అన్వేషణ కోసం మరింత చలనశీలత, భాగస్వామ్యం గల వాతావరణం కల్పించడంపై మనం దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను.
30. బ్రిటన్ భాగస్వామ్య దేశంగా ఇంత చక్కని ప్రత్యేకత సంతరించుకున్న కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సిఐఐని, శాస్త్రసాంకేతిక శాఖను నేను అభినందిస్తున్నాను. భారత, యుకె తదుపరి దశ భాగస్వామ్యానికి ఈ టెక్ సదస్సు ఒక వేదిక ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం నాకుంది. ఉమ్మడి సాంకేతిక బలం, శాస్త్రీయ పరిజ్ఞానం దిశగా మనని ఈ టెక్ సమిట్ నడిపించగలుగుతుంది.
31. ఈ టెక్ సమిట్ విజయానికి కారకులైన భారతదేశం,యుకె లకు చెందిన భాగస్వాములందరికీ నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్నందుకు, భారత-యుకె భాగస్వామ్యంపై తన ఆలోచనా ధోరణులను తెలియచేసినందుకు ప్రధాని థెరిసా మే కు మరోసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.