గౌరవనీయులైన ప్రధానమంత్రి కిషిదా,
గౌరవ ప్రతినిధులారా,
నమస్కార్ !
తొలిసారిగా భారతదేశంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి కిషిదాకు స్వాగతం పలకడం నాకెంతో ఆనందదాయకం.
కొద్ది రోజుల క్రితం జపాన్ లో సంభవించిన భూకంపంలో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తినష్టం పట్ల యావత్ భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
మిత్రులారా,
ప్రధానమంత్రి కిషిదా భారతదేశానికి పాత మిత్రుడే. గతంలో విదేశాంగమంత్రి హోదాలో ఆయన ఎన్నో సార్లు భారతదేశాన్ని సందర్శించారు. ఆయా సందర్భాల్లో ఆయనతో పరస్పర అభిప్రాయాలు తెలియచేసుకునే అవకాశం కలిగింది. గత కొద్ది సంవత్సరాల్లో భారత-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్య, ప్రపంచ స్థాయి భాగస్వామ్యం అసాధారణంగా వృద్ధి చెందడంలో కిషిదా కీలక పాత్ర పోషించారు.
నేడు అత్యంత కీలకమైన సమయంలో ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ప్రపంచం ఇప్పటికీ కోవిడ్-19, దాని అనంతర పరిణామాలతో అతలాకుతలం అవుతోంది.
ప్రపంచ ఆర్థిక రికవరీ ఇప్పటికీ అంతంతమాత్రంగానే ఉంది.
భౌగోళిక, ఆర్థిక పరిణామాలు కూడా కొత్త సవాళ్లు విసురుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత-జపాన్ భాగస్వామ్యం మరింత లోతుగా విస్తరించుకోవడం ఉభయ దేశాలకు మాత్రమే ప్రధానం కాదు, ఇండో-పసిఫిక్ ప్రాంతం, యావత్ ప్రపంచ శాంతి, సుసంపన్నత, సుస్థిరతలకి ఎంతో కీలకం.
మన పరస్పర విశ్వాసం, నాగరిక భాగస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, దేశీయ చట్టాలు అన్నీ ఉభయ దేశాల సంబంధాలకు, సంబంధాల పటిష్ఠతలకు కీలకం.
ఉభయ దేశాల పరస్పర సహకారం మరింత కొత్త శిఖరాలకు చేర్చేందుకు మా చర్చలు దోహదపడతాయి.
మేం ఈ చర్చల సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై సాగింది.
ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ వేదికలపై కూడా సమన్వయం విస్తరించుకోవాలని మేం నిర్ణయించాం.
మిత్రులారా,
గత కొన్నేళ్లుగా భారత-జపాన్ ఆర్థిక భాగస్వామ్యం అసాధారణంగా పురోగమించింది. ఉభయ దేశాల వ్యాపార వర్గాల్లోను ఎంతో నమ్మకం, ఉత్సుకత కనిపిస్తోంది. భారతదేశంలో అతి పెద్ద పెట్టుబడి దేశం జపాన్, ప్రపంచ శ్రేణి భాగస్వామి.
భారతదేశానికి అందించిన సహకారానికి ధన్యవాదాలు.
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు వేగంగా పురోగమిస్తోంది. ఉభయ దేశాలు “ఒకే బృందం, ఒక ప్రాజెక్టు” ధోరణిలో దీనిపై కృషి చేస్తున్నాయి.భారత-జపాన్ భాగస్వామ్యానికి పెద్ద ఉదాహరణ ఈ ప్రాజెక్టు.
2014 సంవత్సరంలో 3.5 లక్షల జపాన్ యెన్ ల పెట్టుబడి లక్ష్యాన్ని అధిగమించామని తెలియచేయడానికి నేనెంతో ఆనందిస్తున్నాను.
మేం ఆకాంక్షలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించాం. వచ్చే ఐదేళ్లలో 5 లక్షల యెన్ ల పెట్టుబడి లక్ష్యం నిర్దేశించుకున్నాం. అంటే రూ.3 లక్షల 20 వేల కోట్ల రూపాయలన్న మాట.
గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశం సమగ్ర ఆర్థిక సంస్కరణలు అమలుపరిచింది. వ్యాపార సరళీకరణలో పెద్ద అడుగు వేసింది.
నేడు “ప్రపంచం కోసం భారతదేశంలో తయారీ”లో అపరిమిత అవకాశాలను అందిస్తోంది.
జపాన్ కంపెనీలు సుదీర్ఘ కాలం నుంచి మా బ్రాండ్ రాయబారులుగా ఉన్నాయి.
టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యానికి కొత్త కోణాలు కూడా జోడయ్యాయి.
దేశంలో జపాన్ కంపెనీలకు అనుకూల వాతావరణం కల్పించడానికి మేం కట్టుబడి ఉన్నాం.
నేడు ఆవిష్కరించిన భారత-జపాన్ పారిశ్రామిక పోటీ భాగస్వామ్యం ప్రణాళిక ఇందుకు సమర్ధవంతమైన యంత్రాంగంగా నిలుస్తుంది.
జపాన్ తో మా నైపుణ్యాల భాగస్వామ్యం కూడా ఈ దిశగా సమర్థవంతంగా నిలుస్తుంది.
మిత్రులారా,
సురక్షితమైన, విశ్వాసంతో కూడిన, ఊహలకు అందే, స్థిరమైన ఇంధన సరఫరా అత్యంత కీలకం అన్న విషయం ఉభయదేశాలు గుర్తించాయి.
సుస్థిర ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని చేరడం, వాతావరణ మార్పుల సమస్యను సమర్థవంతగా పరిష్కరించడం కూడా అత్యంత కీలకం.
మా స్వచ్ఛ ఇంధన భాగస్వామ్యం ఈ దిశగా నిర్ణయాత్మక అడుగు అని నిరూపించుకుంటుంది.
ఈ రోజు మేం ఇంకా ఎన్నో ఇతర అంశాలపై కూడా అంగీకారానికి వచ్చాం, వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా వెలువరించాం.
భారత-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యానికి కొత్త దిశ కల్పించే దిశగా ప్రధానమంత్రి కిషిదా పర్యటన విజయం సాధించింది.
నేను మరోసారి ప్రధానమంత్రి కిషిదాకు, ఆయన బృందానికి హార్థిక స్వాగతం పలుకుతున్నాను.
ధన్యవాదాలు!