గౌరవనీయులు,
ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు నేను నా హృదయపూర్వక అభినందనలను తెలియ జేస్తున్నాను. తక్కువ ఖర్చులో సమాజంలో అన్ని వర్గాల వారికి అందుబాటులో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలన్న మన అందరి నిబద్ధతకు ఇది అద్దం పడుతున్నది. కోవిడ్ మహమ్మారి కాలంలో ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ‘‘క్వాడ్ టీకా మందు’’ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. మరి ఇక్కడ క్వాడ్ (QUAD)లో గర్భాశయ ముఖద్వారు క్యాన్సర్ వంటి సవాలుకు పరిష్కారాన్ని వెతకాలని మనమంతా కలసి నిర్ణయించాం.
క్యాన్సర్ వ్యాధి నుండి సంరక్షించుకోవడానికి పరస్పర సహకారం అత్యవసరం. వ్యాధి నివారణ, పరీక్షలు, రోగ నిర్ధారణ, చికిత్సలతో కూడిన సమీకృత విధానంతోనే క్యాన్సర్ భారాన్ని తగ్గించుకోగలం. భారతదేశంలో మేం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను గుర్తించేందుకు చాలా తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని అమలు చేస్తున్నాం. దీనికి అనుబంధంగా ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని భారతదేశం నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరికీ వారు భరించ గలిగే ఖర్చులో మందులను కొనుగోలు చేసేందుకు అనువుగా కొన్ని ప్రత్యేక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కోసం ఒక టీకా మందును భారతదేశం సొంతంగా రూపొందించింది. కృత్రిమ మేథస్సు అండదండలతో ఒక కొత్త చికిత్సా విధానాలను దశలవారీగా ప్రవేశపెడుతున్నాం.
గౌరవనీయులారా,
భారతదేశం తాను సంపాదించిన అనుభవాన్ని, ఇంకా ప్రావీణ్యాన్ని వెల్లడించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం, క్యాన్సర్ సంరక్షణ రంగంలో పనిచేస్తున్న అనేక మంది భారతదేశ నిపుణులు చొరవ తీసుకొని ఈ కార్యక్రమంలో మాతో కలిశారు. ‘‘ఒక ధరిత్రి, ఒక ఆరోగ్యం’’ అనేది భారతదేశపు దృష్టికోణం. ఇదే స్ఫూర్తితో, క్వాడ్ మూన్‌షాట్ కార్యక్రమంలో భాగంగా 7.5 మిలియన్ డాలర్ల విలువైన పరీక్ష కిట్లు, వ్యాధి నిర్ధారణ కిట్లతో పాటు టీకాలను మా వంతుగా అందిస్తామని నేను ప్రకటించడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. రేడియేషన్ చికిత్సలో, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు భారతదేశం తన వంతు సాయాన్ని అందిస్తుంది.
గవీ, క్వాడ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం 4 కోట్ల టీకా మోతాదులను ఇండో-పసిఫిక్ ప్రాంత పరిధిలోని దేశాలకు అందించగలదని మీకు చెబుతున్నాను. ఈ 4 కోట్ల టీకా డోసులు కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగును ప్రసాదిస్తాయి. మీరందరూ గమనిస్తున్నట్లుగా, క్వాడ్ తీసుకుంటున్న చొరవ కేవలం దేశాల కోసంకాదనీ, ఆయా దేశాల ప్రజల కోసమేనని తెలిపారు. ఇది పూర్తిగా మానవతే ముఖ్యమన్న దృక్పథం.
ధన్యవాదాలు.