వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కార్యక్రమ ఏర్పాటు గురించి తెలుసుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రపంచం నలుమూలల నించి వచ్చిన ప్రతినిధులందరికీ నా అభివాదాలు, అభినందనలు.
వరల్డ్ ఫుడ్ ఇండియా 2024లో అనేక దేశాలు పాల్గొనడం, కార్యక్రమ ప్రాముఖ్యానికి నిదర్శనం. ప్రపంచ ఆహార రంగానికి చెందిన అత్యంత ప్రతిభావంతులు, మేధోవర్గం, పరిశోధకులు ప్రతినిధులుగా వచ్చారు, వీరంతా పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకుని, ఒకరి అనుభవాలను మరొకరితో పంచుకుని పరస్పరం లబ్ధి పొందే అవకాశాన్ని ఈ వేదిక కల్పిస్తోంది.
భారత్ అద్భుతమైన వైవిధ్యమైన ఆహార సంస్కృతికు ఆలవాలం. ఇంతటి విస్తృతమైన ఆహార సంపద నిర్మాణం వెనుక రైతే వెన్నెముకగా నిలిచాడు. రుచికరమైన పౌష్టికాహారం ఆహార పద్ధతుల్లో భాగమవ్వడం వెనుక వ్యవసాయదారుడి కృషే మూలకారణం. నూతన విధానాల ప్రవేశం, కచ్చితమైన అమలు ద్వారా రైతుల కష్టానికి బాసటగా నిలుస్తున్నాం.
ఆహార రంగంలో నూతన సృజనాత్మక పద్ధతులు, నిలకడైన లక్ష్యాలు, సురక్షితమైన ఆహార అందజేతల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పేందుకు భారత్ కృషి చేస్తోంది, ఇందుకోసం ఈ అధునాతన యుగంలో లభ్యమౌతున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులు, తాజా సాంకేతికత, దృఢమైన ప్రభుత్వ విధానాలను వినియోగించుకుంటాం.
ఆహార తయారీ రంగంలో సమూలమైన మార్పుల కోసం గత పదేళ్ళ కాలంలో మేము విస్తృతమైన సంస్కరణలని ప్రవేశపెట్టాం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, సూక్ష్మ తరహా ఆహార పరిశ్రమలకు ప్రత్యేక పథకాల ద్వారా సహకారం, ఆహార తయారీ పరిశ్రమలకు ఉత్పత్తి-ఆధారిత ప్రోత్సాహకాలు తదితర చర్యల ద్వారా స్థిరమైన నవీన వసతులను, బలమైన సరఫరా వ్యవస్థలను తయారుచేస్తూ, దేశంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం.
చిన్న పరిశ్రమలకు సాధికారత కల్పించడం మా ముఖ్యోద్దేశాలలో ఒకటి. మహిళలు సూక్ష్మ పరిశ్రమలకు సారధులు కావాలని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) దినదినాభివృద్ధి చెంది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భాగమవ్వాలని కోరుకుంటున్నాం.
ఇటువంటి సమయంలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా మా ఆశయాలకు సరైన వేదికగా భావిస్తున్నాం. వివిధ దేశాల వ్యాపారవేత్తలు/సంస్థలతో నేరుగా సంభాషణ, సహ ప్రదర్శనలు, రివర్స్ బయర్ – సెల్లర్ మీట్ ద్వారా మా దేశ వ్యాపారవేత్తల ఆశయాలు/అవసరాలను తెలియచెప్పడం, ఒక్కో దేశం/రాష్ట్రం/రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టే సదస్సుల ఏర్పాటు మా కార్యాచరణ కానుంది.
అదనంగా, భారత ఆహార భద్రతా సంస్థ - ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏర్పాటు చేసిన ప్రపంచ ఆహార నియంత్రణ ప్రతినిధుల సదస్సు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ఐరాస ఆహార వ్యవసాయాల సంస్థ (ఎఫ్ఏఓ)లే కాక, ప్రముఖ స్థానిక సంస్థలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ఆహార భద్రత, ప్రమాణాలు, ఉత్తమ పద్ధతులు వంటి అంశాలను చర్చించే అవకాశం కల్పిస్తోంది.
ఫుడ్ ఇర్రేడియేషన్ వంటి రసాయనిక చర్యల ద్వారా ఆహార భద్రత పెంపు, వృధా నివారణ; ఆహారంలో పౌష్ఠికత మెరుగయ్యేందుకు వృక్ష-ఆధారిత మాంసకృత్తులు, ఆహార వృధాని తగ్గించే రీతలో వనరుల సద్వినియోగం వంటి అంశాలు కూడా సదస్సులో చర్చకు వస్తాయని భావిస్తున్నాను.
సురక్షితమైన, పుష్టికర, సమ్మిళిత ప్రపంచ సమాజ నిర్మాణం అనే ఆశయం సాకారమయ్యే దిశగా పయనిద్దాం.