ప్రియమైన నా దేశ వాసులారా,
ఈ స్వాతంత్ర్యదినోత్సవ శుభ సమయాన దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.
ఇవాళ రక్షా బంధన్ పండుగ కూడా. శతాబ్దాల నాటి ఈ సంప్రదాయం సోదర సోదరీమణుల ప్రేమ ను వ్యక్తం చేస్తుంది. ఈ పవిత్ర రక్షా బంధన్ శుభ సమయాన నా దేశ వాసులందరికీ, అలాగే సోదర, సోదరీమణులందరి కీ నేను శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. ఈ పండుగ ప్రేమానురాగాలు నిండుగా కలిగి, మన సోదర సోదరీమణులందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని, వారి జీవితాల లో అనురాగాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.
ఇవాళ, దేశం స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ , దేశం లోని పలు ప్రాంతాల లోని ప్రజలు వరదలు, భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్.డి.ఆర్.ఎఫ్ వంటి సంస్థలు ప్రజల ఇబ్బందులు తొలగించి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు.
ఇవాళ, మనం స్వాతంత్ర్య దినోత్సవాన్నిజరుపుకుంటున్నపవిత్ర సమయాన, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాల ను అర్పించిన మహనీయులు, యువకులు గా జైలు జీవితాన్ని గడిపి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి, ఉరికంబాన్ని ఎక్కిన వారికి, సత్యాగ్రహం ద్వారా అహింసాయుత పోరాట ప్రేరణను దేశ ప్రజల లో నింపిన వారందరికీ నేను అంజలి ఘటిస్తున్నాను.
బాపూజీ నాయకత్వం లో దేశం స్వాతంత్ర్యాన్ని పొందింది. అలాగే స్వాతంత్ర్యానంతరం ఎంతో మంది దేశంలో శాంతి, సుసంపన్నత, భద్రతల కు కృషి చేశారు. స్వతంత్ర భారతావని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడాని కీ, అభివృద్ధి కీ, శాంతి, సుసంపన్నత కూ కృషి చేసిన వారందరికీ నేను వందనం చేస్తున్నాను.
నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం, ఎర్రకోట నుంచి మరోసారి మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం నాకు దక్కింది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది వారాలు కూడా కాలేదు. అయినా ఈ పది వారాల స్వల్ప వ్యవధి లో అన్ని రంగాల లో, ప్రతి దిశ లోనూ నూతన కోణాలను ఆవిష్కరించడం జరిగింది. సాధారణ ప్రజలు తమ ఆశలు, ఆకాంక్షలు, నెరవేర్చేలా సేవ చేసేందుకు మనకు అవకాశం ఇచ్చారు. ఒక్క క్షణం కూడా వేచి చూడకుండా, మేం పూర్తి అంకిత భావం తో మీ సేవ లో నిమగ్నమై ఉన్నాం.
అధికారం లోకి వచ్చిన 10 వారాల వ్యవధి లోనే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కలను సాకారం చేసే దిశ గా మేము ముందుకు కదిలి, రాజ్యాంగం లోని 370, 35ఎ అధికరణాలు రద్దు చేశాం.
కేవలం పది వారాల వ్యవధి లోనే ముస్లిం మహిళల హక్కుల కు రక్షణ కల్పించే దిశ గా ట్రిపుల్ తలాక్ విధానానికి వ్యతిరేకంగా చట్టం తీసుకు రావడం తో పాటు, ఉగ్రవాద నిర్మూలన చట్టాన్ని మరింత కఠినం, శక్తిమంతం చేశాం. ‘పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ కింద 90 వేల కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల కు బదిలీ చేశాం.
60 సంవత్సరాల వయస్సు నిండిన తరువాత గౌరవం గా జీవనం సాగించగల విధం గా తాము పింఛన్ అందుకోగలమని మన వ్యవసాయదారులు, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు కలలోనైనా ఊహించి ఉండరు. 60 సంవత్సరాల తరువాత శరీరం బలహీనమవుతుంది. ప్రతి ఒక్కరికీ మద్దతు అవసరం. అందుకే వారి కోసం మేం పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్నాం.
ఈ రోజుల్లో నీటి సంక్షోభం సర్వత్రా వినిపిస్తున్న వార్త. భయంకరమైన జల సంక్షోభం మన ముందున్నదని అందరూ చెబుతున్నారు. దీన్ని ముందుగానే గుర్తించిన మేం జలవనరుల కోసం ప్రత్యేకం గా జల శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం. ఈ శాఖ ద్వారా కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడి గా నీటి సంక్షోభాన్ని ఎదుర్కోగల పథకాలు రూపొందించి, విధానాలు ఆచరణలోకి తీసుకు రాగలుగుతాయి.
మన దేశాని కి విస్తృత ఆరోగ్య సంరక్షణ వసతులు, భారీ సంఖ్య లో వైద్యుల అవసరం ఉంది. ఈ అవసరాన్ని తీర్చాలంటే, యువత ను వైద్య వృత్తి వైపు ఆకర్షించేందుకు అవసరమైన చట్టాలు తీసుకు రావలసిన అవసరం ఉంది. సరికొత్త ఆలోచనా ధోరణి తో కొత్త అవకాశాలు వారి ముందు ఉంచాలి. ఈ లక్ష్యం తోనే మేము వైద్య విద్య లో పారదర్శకత తీసుకు వచ్చేందుకు చట్టాలు రూపొందించడం తో పాటు, పలు కీలక చర్యలు తీసుకున్నాం.
ఈ రోజుల్లో బాలల హక్కుల ఉల్లంఘన ప్రపంచవ్యాప్తం గా చోటు చేసుకుంటున్నాయి. భారతదేశం భావి భారత పౌరులను అలాంటి దుస్థితి లోకి నెట్టదు. బాలల హక్కులను పరిరక్షించేందుకు కఠినమైన చట్టం తీసుకు రావాల్సిన అవసరాన్ని గుర్తించి, అలాంటి చట్టం మేం తీసుకు వచ్చాం.
సోదర సోదరీమణులారా,
మీరు 2014-2019 సంవత్సరాల మధ్య మీకు సేవ చేయడాని కి మరో అయిదు సంవత్సరాలు పని చేయగల అవకాశం నాకు ఇచ్చారు. గత అయిదు సంవత్సరాలు గా మా ప్రభుత్వం సగటు మానవుని రోజువారీ అవసరాలు తీర్చేందుకు ఎంతో శ్రమించింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు, నిరుపేదలు, దోపిడీకీ, నిరాదరణ కు గురవుతున్న వర్గాలు, గిరిజనుల సంక్షేమానికి మేం ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. దేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలో పెట్టే దిశగా మేం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాం. కాలం మారుతోంది. 2014-2019 సంవత్సరాల మధ్య కాలం మీ కనీస అవసరాలు తీర్చే సమయం గా భావిస్తే, 2019 తరువాత మీ ఆశలు, కలలు సాకారం చేసే సమయం గా భావించుకోవాలి.
నా ప్రియమైన దేశవాసులారా,
21 వ శతాబ్దపు ఇండియా చూడడానికి ఎలా ఉండాలి?
ఎంత వేగంగా అది ముందుకు పోవాలి? ఎంత విస్తృతం గా అది పని చేయాలి? అది ఎంత ఎత్తుకు చేరుకునేందుకు కృషి చేయాలి? వీటన్నింటినీ దృష్టి లో ఉంచుకుని మేం రాగల ఐదు సంవత్సరాల కు సంబంధించి రోడ్ మ్యాప్ తయారు చేయడం ద్వారా ఒక దాని తర్వాత ఒకటి గా చర్యలు తీసుకుంటున్నాము.
2014 వ సంవత్సరం లో నేను దేశానికి కొత్త. 2013-2014 ఎన్నికల కు ముందు, నేను దేశవ్యాప్తం గా పర్యటించి దేశ ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాను. అసలు దేశాన్ని మార్చడం సాద్యమవుతుందా? అని ప్రజలు ఆశ్చర్యపోతూ వచ్చారు. ప్రభుత్వం మారితే దేశం మారుతుందా? అని అనుకుంటూ వచ్చారు. ఒకరకమైన నిరుత్సాహం దేశం లోని సామాన్య ప్రజల మనసుల లో ఉండి పోయింది. ఎంతో కాలం గా వారు అలాంటి అభిప్రాయం లో ఉన్నందువల్ల వారి ఆశలు అడుగంటిపోయాయి. ఆ రకం గా వారు అతి త్వరలోనే నిరుత్సాహం లోకి జారుకున్నారు.
కానీ, 2019 కి వచ్చేసరికి, ఐదు సంవత్సరాల కఠోర శ్రమ తో, సామాన్యుల పట్ల అంకిత భావం, గుండెనిండా దేశాన్ని, కోట్లాది మంది దేశ ప్రజల ను మనసునిండా నింపుకుని ఆ భావన తో ముందుకు సాగుతూ వచ్చాం. ప్రతి క్షణం ఆ దిశగా అంకితమవుతూ వచ్చాం.
2019లోకి అడుగు పెట్టేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజల మనోభావాలు మారిపోయాయి. నిరాశ, నిస్పృహల స్థానం లో ఆశలు చిగురించాయి. తమ ఆకాంక్షలను తీర్మానాల కు జత చేశారు. సాధించిన విజయాలు కళ్లెదుట కనిపించడం ప్రారంభించాయి. ఇక సామాన్యుడు ముక్తకంఠం తో ఒకటే మాట అంటున్నాడు.. ‘‘అవును, నా దేశాన్ని మార్చవచ్చు’’ అని.
సామాన్యుడు మరో మాట కూడా అంటున్నాడు- ‘‘అవును, మనం కూడా దేశాన్ని మార్చవచ్చు’’ అని, మనం వెనకబడిపోరాదని.
ఇలా 130 కోట్ల మంది ప్రజానీకం మాట కలిపి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, వారి భావోద్వేగాలు మాకు కొత్త బలాన్నిస్తున్నాయి. సరికొత్త విశ్వాసాన్ని కలుగజేస్తున్నాయి.
‘‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’’ అనే మంత్ర తో మనం ప్రారంభమయ్యాం. అయితే పట్టుమని ఐదు సంవత్సరాల లోనే దేశ ప్రజలు దేశ మొత్తం మూడ్‌ను ‘‘సబ్‌కా విశ్వాస్’’ తో నింపేశారు. ఐదు సంవత్సరాలు గా నిర్మించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం మరింత శక్తి తో దేశ ప్రజలకు సేవ చేసేందుకు మాకు ప్రేరణనిస్తూనే ఉంటుంది.
ఇటీవలి ఎన్నికలలో నేను ఒకటి గమనించాను. ఎన్నికల సమయం లో నా దృష్టి కి వచ్చింది ఏమంటే, ఏ రాజకీయ పార్టీ పోటీ చేయడం లేదని, ఏ రాజకీయ వాదీ పోటీ చేయడం లేదని, మోదీ కానీ, ఆయన స్నేహితులు కానీ ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదని, పోటీలో ఉన్నదల్లా ఈ దేశ ప్రజలని, 130 కోట్ల దేశ ప్రజలు ఎన్నికలలో పోటీ చేస్తున్నారన్న భావన వినిపించింది. ప్రజలు తమ కలల ను సాకారం చేసుకునేందుకు ఎన్నికల లో పోటీ చేస్తున్నట్టుగా భావించారు. ప్రజాస్వామ్య వాస్తవిక స్వభావాన్ని మనం ఈ ఎన్నికల లో గమనించాం.
నా ప్రియమైన దేశవాసులారా,
సమస్యల కు పరిష్కారం విషయం లో మనం ఎంతో కాలం గా కంటున్నకలలు, పట్టుదల, వాటిని సాధించేందుకు కృషి వీటన్నింటి తో కలసికట్టుగా మనం ఇప్పుడు ముందుకు సాగవలసి ఉంది.
సమస్యలు పరిష్కారమైతే ఒకరకమైన స్వావలంబన ను మనం దర్శించవచ్చు. సమస్యల కు పరిష్కారాలు మనల్ని స్వావలంబన ను వేగవంతం చేయడానికి ప్రోత్సహిస్తాయి. స్వావలంబన సాధిస్తే, దానితోపాటే ఆత్మగౌరవం పెరుగుతుంది. ఆత్మగౌరవం ఎంతో శక్తి కలిగినది. ఆత్మగౌరవాని కి మించిన శక్తి మరొకటి లేనే లేదు. ఎప్పుడైతే పరిష్కారం, సామర్ధ్యం, సంకల్పం, ఆత్మగౌరవం ఉంటాయో.. అక్కడ విజయానికి మరేదీ అడ్డు రాలేదు. ఇవాళ దేశం ఈ రకమైన ఆత్మగౌరవ భావన తో ముందుకు పోతున్నది.
ఈ రోజున మనం ఆత్మ గౌరవం తో విజయం లో సరికొత్త శిఖరాలు చేరే దిశ గా అడుగులు వేస్తున్నాం. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటే మనం ఎప్పుడూ ఏకాకిగా ఆలోచించకూడదు. కొన్ని కష్టాలు ఎదురవుతాయి. కేవలం ఇతరుల నుంచి ప్రశంసలు పొందాలనే లక్ష్యం తో చిత్తశుద్ధి లేకుండా కృషి చేసినట్లయితే, దేశం కలలు సాకారం చేయడం సాధ్యం కాదు. సమస్యల ను మూలాల తో సహా తొలగించేందుకు మనం శ్రమించాల్సి ఉంటుంది.
‘త్రిపుల్ తలాక్’ అనే కత్తి నిరంతరం తమ మెడపై వేలాడుతోందనే భయం లోనే మన ముస్లిం సోదరీమణులు, కుమార్తెలు జీవించడం చూశాం. త్రిపుల్ తలాక్ బాధితులు కానివారు కూడా ఏ క్షణం లో అది తమ పై విరుచుకుపడుతుందో అనే భయంతోనే జీవించారు. చాలా ఇస్లామిక్ దేశాలు ఈ దురాచారాన్ని ఎంతో కాలం క్రితమే నిర్మూలించాయి. కానీ, ఏవో కొన్ని కారణాల వల్ల మనం ముస్లిం తల్లులు, సోదరీమణులకు వారికి చెందాల్సిన హక్కు అందించడానికి భయపడుతూ వచ్చాం. సతీ ప్రాత ను మనం నిషేధించినప్పుడు, ఆడ శిశువుల ను పిండం దశ లో అంతమొందించే దుశ్చర్యలను నిర్మూలించేందుకు చట్టం చేయగలిగినప్పుడు, వరకట్న సమస్యకు వ్యతిరేకం గా గట్టి చర్యలు తీసుకోగలిగినప్పుడు త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకం గా మనమందరం ఎందుకు నినదించలేకపోయాం? అందుకే, భారత ప్రజాస్వామ్యం, రాజ్యంగం స్ఫూర్తి తో బాబా సాహెబ్ ఆంబేడ్కర్ ఆలోచనల పట్ల గౌరవం తో ముస్లిం సోదరీమణులకు కూడా సమాన హక్కులు కల్పించేందుకు కీలక నిర్ణయం మేం తీసుకున్నాం. ఈ చర్య వారిలో సరికొత్త విశ్వాసాన్ని పాదుగొల్పింది. భారత అభివృద్ధియానంలో వారు చురుకైన భాగస్వాములు కాగలుగుతున్నారు. ఈ నిర్ణయాలేవీ రాజకీయ లబ్ధిని ఆశించి చేసినవి కావు. మన తల్లులు, సోదరీమణుల కు శాశ్వత భద్రత ను అవి హామీ ఇస్తాయి.
నేను మరో ఉదాహరణ కూడా చెప్పాలనుకొంటున్నాను. రాజ్యాంగం లోని 370, 35ఎ అధికరణాలు రద్దు చేయడం వెనుక కారణం ఏమిటి? ఈ ప్రభుత్వం సాధించిన విజయం ఇది. సమస్యలను నిర్లక్ష్యం చేయడం లేదా కాలయాపన చేయడం తగదు. అందుకే, గత 70 సంవత్సరాల కాలం లో చేయలేని పని కొత్త ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన 70 రోజుల్లోనే చేసింది. రాజ్యాంగం లోని 370, 35ఎ అధికారణాల రద్దు బిల్లు రాజ్య సభ, లోక్ సభ రెండింటి లోను మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించింది. ప్రతి ఒక్కరు ఇలాంటి నిర్ణయం కావాలని కోరుకున్నా, ఎవరో ఒకరు దాన్ని చేపట్టి ముందుకు తీసుకు వెళతారని ఆశిస్తూ, వేచి ఉన్నారని దీని అర్థం. నా దేశవాసులు అప్పగించిన పని పూర్తి చేయడానికే నేను సిద్ధం గా ఉన్నాను. నేను స్వార్ధ రహితం గా పని చేస్తున్నాను.
జమ్ము, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ దిశ గా మేం ముందుకు కదిలాం. గత 70 సంవత్సరాలు గా ప్రతి ఒక్క ప్రభుత్వం, ఎందరో వ్యక్తులు ఈ దిశ గా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూనే ఉన్నారు.
కానీ, ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ఆశించిన ఫలితం సాధించ లేకపోతే సరికొత్త గా ఆలోచించి, సరికొత్త చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ ప్రజల ఆశలు తీర్చడం మనందరి బాధ్యత. వారి కలల కు కొత్త రెక్కలు అందించాల్సిన ఉమ్మడి బాధ్యత మనందరిపై ఉంది. 130 కోట్ల మంది నా దేశవాసులందరూ ఈ బాధ్యత ను తమ భుజాల మీద ఎత్తుకోవాలి. ఈ కట్టుబాటుతోనే అవరోధాల ను తొలగించే దిశ గా మేం విజయవంతం గా చర్యలు తీసుకున్నాం.
గత 70 సంవత్సరాలు గా పని చేసిన వ్యవస్థ వేర్పాటువాదాన్ని తీవ్రతరం చేసి, ఉగ్రవాదానికి పురుడు పోసింది. కుటుంబ పాలన ను ప్రోత్సహించి, అవినీతి, వివక్ష పునాదులు శక్తివంతం చేసింది. జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ మహిళల హక్కులు కాపాడేందుకు మనం కృషి చేయాల్సి ఉంది. అక్కడ నివశిస్తున్న నా దళిత సోదరులు, సోదరీమణుల కు దీర్ఘకాలం గా నిరాకరిస్తున్న హక్కులు అందించాల్సి ఉంది. దేశవ్యాప్తం గా గిరిజనులు అనుభవిస్తున్న హక్కులు కూడా జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ప్రాంతాల గిరిజన సోదరులు, సోదరీమణులకు అందుబాటులోకి తేవాలి. గుజ్జర్లు, బకర్‌వాలా లు, గద్దీ లు, సిప్పీ లు, లేదా బాల్టీ లు వంటి తెగలు కూడా ఎన్నో ఉన్నాయి. వారందరికీ రాజకీయ హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. సఫాయీ కర్మచారీ సోదరులు, సోదరీమణుల పై జమ్ము, కశ్మీర్ లో చట్టపరమైన ఆంక్షలు ఉండటం ఆశ్చర్యకరమైన అంశం. ఈ కారణం గా వారి కలలు సాకారం కావడం లేదు. ఇప్పుడు, వారిని మేం ఆ శృంఖలాల నుండి విముక్తుల ను చేశాం.
భారత విభజన జరిగిన సమయం లో కోట్లాది మంది తమ తప్పు ఏదీ లేకుండానే పూర్వీకుల ఇళ్ళ ను వదులుకోవాల్సి వచ్చింది. జమ్ము, కశ్మీర్ లో స్థిరపడిన వారికి మానవ హక్కులు, పౌరసత్వ హక్కులు ఏవీ లేకుండా పోయాయి. జమ్ము, కశ్మీర్ లోని కొండ ప్రాంతాల్లో ఎందరో నివశిస్తున్నారు. వారందరి సంక్షేమం కోసం కూడా మేము చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం.
నా ప్రియమైన దేశవాసులారా,
జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ల శాంతి, సుసంపన్నత యావత్తు దేశానికి స్ఫూర్తిమంతం అవుతుంది. భారతదేశ అభివృద్ధికి వారంతా అపారమైన వాటా అందించ గలుగుతారు. వారందరికీ పూర్వ వైభవం తిరిగి కల్పించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల తీసుకున్న చర్యల అనంతరం అమలు లోకి వచ్చిన కొత్త వ్యవస్థ, ఆ రాష్ట్ర ప్రజల కు ప్రత్యక్షం గా లాభం చేకూర్చే సదుపాయాలు కల్పించ గలుగుతుంది. ఇప్పుడు జమ్ము, కశ్మీర్ లోని ప్రతి ఒక్కరం దేశం లోని ఇతర భారత పౌరులతో సమానంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని చేరగలుగుతారు. వారికి ఎలాంటి అవరోధాలు ఉండవు. అటువంటి వ్యవస్థ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 370, 35ఎ అధికరణాలు రద్దు చేస్తూ మేం తీసుకు చర్య ను ఎలాంటి మినహాయింపులు లేకుండా దేశం యావత్తు, అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయి. కొందరు బహిరంగం గానే మద్దతు తెలియజేస్తే, మరికొందరు మౌనం గా మద్దతు ఇచ్చారు. కానీ, అధికార కారిడార్ల లో ఉన్న కొంత మంది ఓటు బ్యాంకు రాజకీయాల తో 370వ అధికరణాని కి అనుకూలం గా మాట్లాడుతున్నారు. 370, 35ఎ అధికరణాల కు అంత ప్రాధాన్యం ఏమిటి? అని దేశం యావత్తు వారిని ప్రశ్నిస్తోంది.
370వ అధికరణం అంత కీలకం అయితే, 70 సంవత్సరాలు గా పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ, అధికార పార్టీలు దాన్ని ఎందుకు శాశ్వతం చేయలేదు? ఇప్పటికీ దాన్ని తాత్కాలికం గానే ఎందుకు వదిలేశారు. నిజంగా అంత కట్టుబాటు ఉండి ఉంటే, దానికి శాశ్వత ప్రతిపత్తి కల్పించేందుకు మీరు చర్యలు తీసుకొని ఉండాల్సింది. అది చేయగల, సవరించగల సాహసం మీకు లేదు. రాజకీయ భవిష్యత్తు కు చెందిన ఆందోళనలే దాన్ని అలా నిలిపి ఉంచాయి. నా వరకు వస్తే, దేశ భవిష్యత్తే ప్రధానం. రాజకీయ భవిష్యత్తు కు అర్థం లేదు.
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సహా, మన రాజకీయ నిర్మాతలు, గొప్ప నాయకులు ఎంతో కష్ట సమయం లో కూడా జాతీయ సమగ్రత, రాజకీయ ఐక్యత లక్ష్యం గా సాహసోపేతమైన, కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, 370, 35ఎ అధికరణాల విషయం లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ రోజున, ఈ ఎర్ర కోట బురుజుల నుంచి మాట్లాడుతూ, నేను ఎంతో గర్వం గా ‘ఒకే జాతి, ఒకే రాజ్యాంగం’ గురించి మాట్లాడగలుగుతున్నాను. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అని సర్దార్ సాహబ్ కల సాకారం చేసే దిశ గా అడుగు వేస్తున్నామని చెప్పగలుగుతున్నాను. దేశ ఐక్యత ను పటిష్టం చేయగల, అందరినీ కలిపి ఉంచగల వ్యవస్థ లు అభివృద్ధి కావాలి. ఈ కృషి నిరంతరం కొనసాగాలి. అది కేవలం తాత్కాలిక చర్య కాకూడదు.
జిఎస్‌టి ద్వారా మేం ‘ఒకే జాతి, ఒకే పన్ను’ కలను సాకారం చేశాం. అలాగే, ఇంధన భద్రత కోసం ఇటీవల ‘ఒకే జాతి, ఒకే గ్రిడ్’ కలను విజయవంతం గా చేపట్టాం.
అలాగే, ‘ఒకే జాతి, ఒకే మొబిలిటీ కార్డు’ వ్యవస్థ ను కూడా అభివృద్ధి చేశాం. ఇప్పుడు దేశవ్యాప్తం గా సమాంతరం గా ఎన్నికలు నిర్వహించే అంశం పై జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభించాం. ప్రజాస్వామిక విధానం లో ఆ చర్చ చేపట్టాలి. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అనే కల నిజం చేయడానికి ఎన్నో కొత్త ఆలోచనలు మేం ప్రవేశ పెట్టాల్సి ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా,
దేశం సరికొత్త శిఖరాలు చేరాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తం గా తన ముద్ర వేయాల్సి ఉంది. ఇది సాధించాలంటే, దేశం లో పేదరిక నిర్మూలన విషయం లో వైఖరిని మార్చవలసి ఉంది. దాన్ని కొన్ని వర్గాల కోసం చేస్తున్న ఉపకారంగా భావించకుండా, జాతి భవిష్యత్తు ను ఉజ్వలం గా తీర్చిదిద్దే బాధ్యత గా చేపట్టాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పేదరికం కోరల నుంచి మనం స్వేచ్ఛ పొందాల్సి ఉంది. గత అయిదు సంవత్సరాల కాలం లో పేదరికాన్ని తగ్గించేందుకు ఎన్నో ప్రయత్నాలు విజయవంతం గా జరిగాయి. గతం తో పోల్చితే, మేం త్వరితగతిన ఎక్కువ విజయం సాధించాం. పేదవారికి ఒక చిన్న సహాయ హస్తం అందిస్తే వారి ఆత్మ గౌరవం ఇనుమడించి, ప్రభుత్వ సాయం లేకుండానే పేదరికం కోరల నుండి తమంత తాముగా బయటకు వచ్చేందుకు కృషి చేసే స్ఫూర్తి లభిస్తుంది.
తన సొంత బలం తోనే పేదరికాన్ని ఓడించ గలుగుతాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అత్యంత శక్తిమంతంగా ఎదుర్కొనేవారు ఎవరన్నా ఉన్నారంటే, వారంతా పేద సోదర, సోదరీమణులే. పేదవారు గుప్పిళ్ళు గట్టిగా మూసుకొనైనా, తీవ్రమైన చలిని కూడా తట్టుకొని జీవించ గలుగుతారు. వారందరి బలాని కి శిరస్సు వంచి అభివాదం చేసేందుకు, వారందరి నీ రోజువారీ సవాళ్ళ నుంచి వెలుపలికి తీసుకు వచ్చేందుకు సహాయం అందించేందుకు నాతో కలిసి రండి…
పేద ప్రజల కు మరుగుదొడ్లు ఎందుకు ఉండకూడదు? ఇంటి లో విద్యుత్తు, నివసించడాని కి ఇల్లు, నీటి సరఫరా, బ్యాంకు ఖాతా వంటివి ఎందుకు ఉండకూడదు? తమ దగ్గర ఉన్నది ఏదో ఒకటి తాకట్టు పెట్టి, అప్పులు చేసేందుకు వడ్డీ వ్యాపారుల ముందుకు వెళ్ళే పరిస్థితి ఎందుకు కల్పించాలి? వారందరిలో ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం పెంపొందించేందుకు మనమందరం చేతులు కలుపుదాం.
సోదర, సోదరీమణులారా,
స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 70 సంవత్సరాల కాలం లో అన్ని ప్రభుత్వాలు తమదైన మార్గం లో ఎంతో కృషి చేశాయి. కేంద్రంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు పార్టీ తో ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క ప్రభుత్వం తనదైన మార్గం లో ఎంతో కృషి చేసింది. కానీ, ఈ రోజు కీ దేశం లో సగం ఇళ్ళ కు త్రాగునీటి వసతి లేదన్నది వాస్తవం. త్రాగునీటి కోసం ప్రజలు ఎంతో పోరాడాల్సి వస్తోంది. ఎంతో బరువైన నీటి కుండలు తలపై పెట్టుకొని మన తల్లులు, సోదరీమణులు 2, 3, 5 కిలో మీటర్లు కూడా ప్రయాణిస్తున్నారు. నీరు తేవడం లోనే వారు జీవితం లో అధిక సమయం వెచ్చిస్తున్నారు. అందుకే, మా ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీటి వసతి కల్పించే దిశ గా ప్రత్యేక చర్య చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి ఒక్క ఇంటికి నీరు, సురక్షితమైన త్రాగునీరు ఎలా లభిస్తుంది? అందుకే, ఈ రోజున ‘జల్-జీవన్’ ఉద్యమం ముందుకు నడిపించనున్నట్లు నేను ఎర్ర కోట బురుజుల నుంచి ప్రకటిస్తున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ‘జల జీవన్’ కార్యక్రమాన్ని ఉమ్మడి గా చేపడతాయి. రానున్న సంవత్సరాలలో 3.5 లక్షల కోట్లు దీనిపై ఖర్చు చేస్తామని మేం హామీ ఇచ్చాం. జల వనరుల సంరక్షణ, నీటి పారుదల వసతుల కల్పన, వాన నీటి సంరక్షణ, సముద్ర జలాలు లేదా వృధా జలాల శుద్ధి, రైతులకు మైక్రో ఇరిగేషన్ ద్వారా ప్రతి ఒక్క చుక్క నీటి కి అధిక దిగుబడి సాధించే వసతి కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. సామాన్య పౌరులు నీటి ప్రాధాన్యత ను అర్థం చేసుకొనేందుకు వీలుగా వారి లో చైతన్యం కల్పించేందుకు జల సంరక్షణ ప్రచారోద్యమాలు చేపట్టాలి. బాల్య దశ లోనే విద్యాభ్యాసం లో భాగంగా జల వనరుల సంరక్షణ గురించి పిల్లలందరి కీ బోధించాలి. నీటి వనరుల సంరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ పై గత 70 సంవత్సరాల కాలం లో జరిగిన ప్రయత్నాలకు నాలుగు రెట్లు అధిక కృషి, వచ్చే అయిదేళ్ళ కాలం లో చేయాల్సి ఉంటుందన్న నమ్మకం తో ముందుకు సాగాలి. ఇక ఎంతో కాలం ఉపేక్షించడం సాధ్యం కాదు. సుమారు వంద సంవత్సరాల క్రితమే అసలు జల సంక్షోభం గురించి ఏ ఒక్కరూ ఆలోచించని కాలం లో తిరువళ్ళువార్ జీ స్వామి ఒక ముఖ్యమైన విషయం చెప్పారు.
మరి అప్పుడు ముని తిరువళ్లువర్ గారు అన్నారు కదా నీర్ ఇండ్రి అమియదు ఉళగనేన్ అని. ఈ మాటల కు- జలం గనక మాయం కావడం ఆరంభించిందా అంటే, అప్పుడు ప్రకృతి యొక్క ప్రక్రియ లకు అంతరాయం ఏర్పడుతుంది; క్రమేణా అంతా సమసిపోతుంది. ఇది మొత్తం వినాశాని కి దారి తీస్తుంది- అని భావం.
నేను గుజరాత్ లో పుట్టాను. ఉత్తర గుజరాత్ లో మహుడీ అని ఒక జైన తీర్థ స్థలం ఉన్నది. రమారమి 100 సంవత్సరాల క్రితం అక్కడ ఒక జైన ముని ఉండే వారు. ఆయన ఒక రైతు కుటుంబం లో జన్మించారు. ఆయన పొలాల్లో పని చేసే వారు; అయితే జైన మతం యొక్క ప్రభావం ఆయన పై పడింది. ఆయన బుద్ధి సాగర్ జీ మహారాజ్ అనే పేరు తో పిలవబడే ఒక జైన ముని గా మారిపోయారు. 100 సంవత్సరాల క్రితం ఆయన కొన్ని పవిత్ర గ్రంథాల ను వదలి వెళ్లారు. వాటి లో -నీటి ని కిరాణా దుకాణాల లో విక్రయించే కాలం ఒకటి వస్తుంది సుమా – అంటూ ఒక పూర్వ సంకేతాన్ని వెల్లడి చేశారు. 100 సంవత్సరాల క్రితం ముని వ్రాసిన మాటలు ప్రస్తుతం వాస్తవం గా మారిన సంగతి ని మీరు ఊహించగలరా. ఒక శతాబ్ది కిందట చెప్పబడినటువంటి జోస్యం ప్రస్తుతం వాస్తవ రూపాన్ని దాల్చింది; మరి నేడు, మనం నిజంగానే పచారీ కొట్ల లో నీళ్ల ను కొనుక్కొని తెచ్చుకొంటున్నాము.
ప్రియమైన దేశ వాసులారా, మనం చేసే మన ప్రయత్నాల లో అలసట కు లోనవడం గాని, లేదా ఆగిపోవడం గాని, లేదా ముందుకు సాగిపోయేందుకు సంశయించడం గాని చేయనే చేయకూడదు.
జల సంరక్షణ కు సంబంధించినటువంటి ఈ ప్రచార ఉద్యమం కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం గా మిగిలిపోరాదు. ఇది స్వచ్ఛ్ భారత్ అభియాన్ వలెనే ఒక ప్రజా ఆందోళన గా రూపొందాలి. మనం సామాన్య మానవుడి ఆదర్శాలు, ఆకాంక్షలు మరియు ప్రయాస ల సాయంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవలసివున్నది.
సవాళ్ల తో మనం ప్రత్యక్షంగా డీకొనాల్సిన సమయం వచ్చేసింది. అప్పుడప్పుడు రాజకీయ ప్రయోజనాన్ని దృష్టి లో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వాటి ని మన దేశ భవిష్యత్తు తరం యొక్క వృద్ధి కి మూల్యాన్ని చెల్లిస్తూ తీసుకోవడమవుతుంది. నేను ఈ రోజు న ఎర్ర కోట ఛత్రచ్ఛాయ నుండి ఒక దేశం లో జనాభా విస్ఫోటం తాలూకు సమస్య ను ప్రముఖం గా ప్రస్తావించదలచుకొన్నాను.
శరవేగం గా పెరిగిపోతున్నటువంటి ఈ జనాభా మన పైకి, మన ముందు తరాల కు వివిధాలైన కొత్త సవాళ్ల ను రువ్వుతున్నది .
మన సమాజం లో, నియంత్రణ అంటూ లేని జనాభా పెరుగుదల తాలూకు పరిణామాలు ఏమిలో బహు బాగా తెలిసిన వర్గం అంటూ ఒకటి ఉన్నది. వారంతా గౌరవాని కి మరియు మన్నన కు అర్హులు. దేశం అంటే వారికి ఉన్న ప్రేమ కు ఇది కూడా ఒక అభివ్యక్తే. ఒక పాపాయి ని కోరుకొనే కన్నా ముందు, వారు- ఆ చిన్నారి అవసరాల పట్ల శ్రద్ధ వహించగలుగుతారా, మరి బాధ్యత కలిగిన తల్లి లేదా తండ్రి యొక్క పాత్ర ను పోషిస్తూ బాబు యొక్క లేదా పాప యొక్క కలల ను నెరవేర్చడం గురించి ఎంతో ఆలోచన చేసి మరీ- ఒక నిర్ణయాన్ని తీసుకొంటారు.
ఈ పరామితుల ను దృష్టి లో పెట్టుకొని, బాధ్యత గల పౌరులతో కూడినటువంటి ఈ చిన్న వర్గాలు వారి యొక్క కుటుంబాన్ని చిన్న కుటుంబం గా అట్టేపెట్టుకోవడానికి స్వీయ ప్రేరణ ను పొందుతారు. వారు కేవలం వారి యొక్క కుటుంబ శ్రేయానికే కాకుండా దేశం యొక్క బాగు కోసం కూడాను తోడ్పాటు ను అందిస్తున్నారు.
వారు దేశం పట్ల భక్తి ని వ్యక్తం చేస్తున్నారు. వారి జీవితాల ను నిశితం గా గమనిస్తూ, మరి వారు వారి యొక్క కుటుంబాన్ని పెంచుకోవడానికి పరిమితి ని విధించుకోవడం ద్వారా తమ పరివారానికి వారు ఎంత సేవ ను చేశారనేది మన సమాజం లోని వారందరు గ్రహించాలని నేను కోరదలచుకొన్నాను. ఇది ఆ కుటుంబం ఏ విధం గా కేవలం ఒకటి లేక రెండు తరాల లోనే పురోగమించిందనే దాని ని గురించి, పిల్లలు ఎలాగ విద్య ను ఆర్జించారనే దాని ని గురించి, కుటుంబం ఏ విధం గా వ్యాధి బారిన పడకుండా ఉండగలిగిందనే దాని ని గురించి, కుటుంబం వారి యొక్క ప్రాథమిక అవసరాల ను ఎంత చక్క గా నెరవేర్చుకొంటోందన్న దాని ని గురించి సూచిస్తుందన్న మాట.
మనం వారి వద్ద నుండి నేర్చుకోవాలి. ఒక శిశువు మన కుటుంబం లోకి వచ్చే కన్నా ముందు మనం ఆలోచించాలి – ఆ చిన్నారి యొక్క అవసరాల ను తీర్చడానికి నేను సిద్ధం గా ఉన్నానా ? అనేది. లేదా, ఆ చిన్నారి ని సమాజం మీద ఆధారపడేటట్టు నేను వదలివేస్తానా ? అనేది. నేను ఆ చిన్నారి ని పోషణ లేకుండా వదలిపెడతానా ? ఏ తల్లి గాని లేదా ఏ తండ్రి గాని ఈ తరహా జీవనాన్ని గడపక తప్పని స్థితి లో పిల్లల కు జన్మ ను ఇస్తూ పోజాలరు. కాబట్టి ఒక సామాజిక చైతన్యం అనేది ఎంతయినా అవసరం.
ఇటువంటి బృహత్తరమైన పాత్ర ను పోషించిన అటువంటి వారి ని గౌరవించుకోవలసిందే. మరి వారి ని ఉదాహరణలు గా పెట్టుకోవడం ద్వారా ఈ కోవ లో ఇప్పటికీ ఆలోచనలు చేయని సమాజం లోని ఒక వర్గాని కి మనం ప్రేరణ ను అందించవలసిన అవసరం ఉన్నది. మనం జనాభా విస్ఫోటాన్ని గురించి ఆందోళన చెందవలసిన ఆవశ్యకత ఉంది.
ప్రభుత్వాలు కూడా వివిధ పథకాల ను ప్రవేశపెట్టడం ద్వారా ముందుకు పయనించవలసివున్నది. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చును, లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చును – ప్రతి ఒక్కరు ఈ బాధ్యత ను భుజాన వేసుకోవడం కోసం కలసికట్టుగా సాగాలి. మనం ఒక అనారోగ్యకరమైనటువంటి సమాజాన్ని గురించిన ఆలోచన చేయలేం, మనం ఒక అవిద్యావంతమైనటువంటి సమాజాన్ని గురించిన ఆలోచన చేయలేం. 21వ శతాబ్దపు భారతదేశం లో, కలల ను పండించే సామర్థ్యం ఒక వ్యక్తి తో, ఒక కుటుంబం తో ఆరంభం అవుతుంది. జనాభా చదువుకోనిది కాకపోయినట్లయితే, ఆరోగ్యం గా లేకపోయినట్లయితే, అటువంటప్పుడు ఇల్లు గాని లేదా దేశం గాని సంతోషం గా ఉండలేదు. జనాభా చదువుకొన్నది అయినప్పుడు, సాధికారిత కలది అయినప్పుడు, మరి నైపుణ్యం కలది అయినప్పుడు, ఇంకా వారి యొక్క అవసరాలను, కోరిక లను తీర్చుకోగలిగేందుకు అనువైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుకొనేందుకు చాలినన్ని సాధనాలను కలిగినది అయినప్పుడు, అటువంటప్పుడు ఆ దేశం ఇటువంటి వాటి ని నెరవేర్చుకోగలుగుతుంది అని నేను భావిస్తాను.
ప్రియమైన నా దేశ వాసులారా, అవినీతి, బంధు ప్రీతి మరియు ఆశ్రిత పక్షపాతం మన దేశాన్ని ఊహ కు కూడా అందనంతగా నాశనం చేశాయని, మరి మన జీవితాల లోకి చెదల వలె చొరబడ్డాయన్న సంగతి మీకు చాలా బాగా తెలిసిందే. వాటి ని ఏరివేయాలని మేము అదే పని గా పెట్టుకొని కృషి చేస్తున్నాము. సాఫల్యాలు కూడా ఉన్నాయి, అయితే ఈ వ్యాధి ఎంత లోతు గా పాతుకుపోయింది అంటే, ఈ వ్యాధి ఎంత విశాలం గా కమ్ముకుపోయింది అంటే, మనం మరిన్ని ప్రయాస లను చేస్తూ పోవాలి; అది కూడాను ప్రతి ఒక్క స్థాయి లోనూ. ఒక్క ప్రభుత్వం స్థాయి లోనే కాదు, మరి మనం ఈ పని ని నిరంతరం గా చేస్తూ పోవలసిన అవసరం ఉంది.
ఒక్క సారితోనే పని అంతటి నీ పూర్తి చేసివేయలేము, చెడు అలవాట్లు అనేవి దీర్ఘ కాలికమైన వ్యాధి వంటివి. ఒక్కొక్క సారి అది నయం అవుతుంది, కానీ ఒక్కొక్క సారి ఆ రోగం తిరగబెడుతూ ఉంటుంది. ఇది కూడాను ఒక వ్యాధే, దీని కై మేము అనేక చర్యల ను తీసుకొన్నాము. సాంకేతిక విజ్ఞానాన్ని నిరంతరం వినియోగిస్తూ దీని ని నిర్మూలిస్తున్నాము. అన్ని స్థాయిల లోనూ పారదర్శకత్వాన్ని మరియు నిజాయితీ ని బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేయడం జరుగుతున్నది.
మీరు చూసే ఉంటారు.. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వెను వెంటనే, అలాగే గడచిన అయిదు సంవత్సరాల కాలం లోనూ ఎంతో మంది ఉన్నతాధికారుల ను ప్రభుత్వం తొలగించింది. అవరోధాల ను సృష్టిస్తున్న అటువంటి వారు అందరి కీ కూడాను, దేశాని కి అటువంటి వారి యొక్క సేవలను ఇక ఇంత మాత్రం అక్కర లేదని, మరి వారి ని తొలగించివేస్తున్నామన్న సంగతి ని తెలియజేయడం జరిగింది.
వ్యవస్థ లో మార్పు రావాలి అని నేను నమ్ముతున్నాను, అయితే అదే కాలం లో సామాజిక స్రవంతి లో కూడాను ఒక పరివర్తన చోటు చోసుకోవాలి. ఆ పరివర్తన తో పాటే, వ్యవస్థల ను నిర్వహిస్తున్నటువంటి ప్రజల విశ్వాసాల లో మరియు ఆలోచన సరళి లో మార్పు రావడం కూడా అత్యంత అవసరమే. అప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాల ను సాధించగలుగుతాము.
సోదరీమణులు మరియు సోదరులారా, దేశం- ఒక రకం గా చూస్తే- స్వాతంత్ర్యం సిద్ధించిన చాలా సంవత్సరాల తరువాత పరిణతి చెందింది.
మనం స్వాతంత్ర్యం యొక్క 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నాము. ఈ స్వేచ్ఛ మనకు మన నైతిక విలువలు, మన దృక్పథాలు మరియు సూక్ష్మగ్రాహ్యత ల మాదిరి గానే అమూల్యమైంది. నేను అధికారుల తో సమావేశాల ను నిర్వహించినప్పుడల్లా ప్రస్తావించేది ఏమిటి అంటే, దీని ని గురించి బహిరంగం గా నేను మాట్లాడను గాని ఈ రోజు న దాని ని గురించి మాట్లాడాలి అని నాకు అనిపిస్తోంది.. నేను అధికారుల ను పదే పదే ప్రోత్సహిస్తుంటాను, అది ఏమిటి అంటే- స్వాతంత్ర్యం అనంతరం ఇన్ని సంవత్సరాల తరువాత పని లో జాప్యాన్ని తగ్గించివేయడానికి, అలాగే సామాన్య మానవుని దైనందిన జీవనం లో ప్రభుత్వం యొక్క ప్రమేయాన్ని తగ్గించడానికి మనం ఏమైనా చేయగలమా- అని.
నా దృష్టిలో స్వతంత్రభారతదేశానికి అర్థం, ప్రజల జీవితాల విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని క్రమంగా తగ్గించే వాతావరణం కల్పించడం.ఇది సకనళరే తమ స్వీయ గమ్యాన్ని తామే నిర్ణయించుకునే అవకాశం ఇస్తుంది. అలాగే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని , వారి కుటుంబాలకు మేలు జరిగే విధంగా , వారి కలలను సాకారం చేసుకునే విధంగా వారు కోరుకున్న మార్గంలో పయనించడానికి వీలు కలుగుతుంది.
పౌరులు ప్రభుత్వం నుంచి ఒత్తిడికి గురికాకూడదు. అదే సమయంలో సంక్షోభసమయాలలో ప్రభుత్వం కోసం వేచిచూసే పరిస్థితి ఉండకూడదు. ప్రభుత్వం ఒత్తిడి పెట్టేది గా లేదా దాని కోసం వేచి చూసేదిగా కాకుండా ఉండాలి. ఆ దిశగా మనమందరం మన కలలను సాకారం చేసుకునే దిశగా కదలాలి. ప్రభుత్వం ఎల్లవేళలా మనకు తోడుగా ఉండాలి. ఏదైనా అవసరం ఏర్పడిన సందర్భాలలో , ప్రజలకు అండగా నిలవడానికి ఎల్లప్పుడూ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న హామీ ఇవ్వాలి. మనం అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయగలమా? మనం కాలం చెల్లిన, ఎన్నో అనవసర చట్టాలను, నిబంధనలను రద్దుచేశాం. గడచిన ఐదు సంవత్సరాలలో సగటున రోజుకొక పనికిరాని చట్టాన్ని నేను రద్దుచేశాను. బహుశా సాధారణ ప్రజలకు ఇది తెలిసిఉండకపోవచ్చు. రోజుకొక పనికిరాని చట్టాన్ని రద్దు చేయడమంటే దాదాపు 1450 చట్టాలను తొలగించడం. ఆ మేరకు సామాన్య ప్రజల జీవితాలనుంచి భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కొత్త ప్రభుత్వం అధికారం లోకి వచ్చి పట్టుమని పది వారాలేపూర్తి అయ్యాయి. ప్రజల సులభతర జీవనానికి ఇప్పటికే కాలం చెల్లిన మరో 60 చట్టాలను రద్దు చేయడం జరిగింది. సులభతర జీవనం అనేది స్వతంత్ర భారతావనికి అత్యావశ్యకం. సులభతరజీవనానికి మేం కట్టుబడి ఉన్నాం. దీనిని మేం మరింత ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం.
ఇవాళ,మనం సులభతర వాణిజ్యం దిశగా ఎంతో ప్రగతి సాధించాం. అంతర్జాతీయ ర్యాంకింగ్‌లోని అత్యున్నత ఐదు స్థానాలను అదుకోవడానికి మనం లక్ష్యం గా నిర్ణయించుకున్నాం. ఇందుకు పలు సంస్కరణలు అవసరమౌతాయి. ఎవరైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలన్నా, పరిశ్రమ ఏర్పాటుచేయాలన్నా పలుచిన్న,పెద్ద అంశాలు ఎదురౌతుంటాయి. అంటే పలు రకాల ఫారాలు నింపి సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్లాలి. ఎన్నో కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరగాల్సిఉంటుంది. అయినా అతనికి అవసరమైన అనుమతులు లభించకపోవచ్చు. ఇలాంటి సాలెగూడును చెదరగొట్టే క్రమంలో మేం కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను, నగరాలను , మునిసిపాలిటీలను కలసికట్టుగా ముందుకు తీసుకువెళ్లగలిగాం. దీనితో మేం సులభతర వాణిజ్యానికి సంబంధించి చాలా వరకు విజయం సాధించగలిగాం.
ఇండియా వంటి పెద్దదేశం , వర్థమాన దేశం గొప్పగా కలలు కనగలదని, వాటిని సాకారం చేసుకుని పెద్ద ముందడుగు వేయగలదన్న ఆలోచన ప్రపంచవ్యాప్తంగా నానాటికీ బలపడుతోంది. సులభతర వాణిజ్యం అనేది ఒక మైలురాయి వంటిది. నా అంతిమ లక్ష్యం సులభతర జీవనం. ఇలాంటి స్థితిలో సామాన్యుడు ప్రభుత్వ, అధికారిక క్లియరెన్సుల కోసం ప్రయత్నించాల్సిన పని లేదు. అతడు తన హక్కులను తాను సులభంగా పొందగలుగుతాడు. సరిగ్గా ఈ దిశగా ముందుకు పోవలసిన అవసరం ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా,
మన జాతి ఎంతో పురోగమించాల్సి ఉంది. ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగడాన్ని దేశం ఏ మాత్రం సహించగల స్థితిలో లేదు. మనం ఆలోచన ధోరణి మార్చుకుని, అతిపెద్ద అడుగు వేసేందుకు సంసిద్ధులం అవ్వాలి. భారతదేశం అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలంటే, అత్యాధునిక మౌలిక వసతులు నిర్మించడం చాలా అవసరం.
దేశ ప్రజలు ఎప్పుడూ మంచి వ్యవస్థ రావాలని కోరుకుంటారు. మంచిని ఆశిస్తూ, ఆ దిశగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ప్రదర్శిస్తారు. అందుకే, ఆధునిక మౌలిక వసతుల కల్పన పై 100 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని మేం నిర్ణయించాం. ఇది ఉపాధి అవకాశాలు పెంచుతుంది. కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. ఎన్నో ఆశలను సాకారం చేస్తుంది. సాగర మాల ప్రాజెక్టు, లేదా భారత మాల ప్రాజెక్టు ఏదైనా కావచ్చు, ఆధునిక రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టులు కావచ్చు, ఆధునిక ఆసుపత్రులు, లేదా ప్రపంచ శ్రేణి విద్యా సంస్థలు సహా అన్ని రకాల మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని మేం నిర్ణయించాం. ఇప్పుడు, మన దేశానికి నౌకాశ్రయాలు కూడా ఎంతో అవసరం. సగటు మానవులు ఎంతో మారారు. మనం దానిని అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు రైలు ఆగితేనే ఆనందం పొందేవారు ‘‘అది సరే, విమానాశ్రయం ఎప్పుడు ప్రారంభం అవుతుంది’’ అని అడుగుతున్నారు. ఒకప్పుడు మా ప్రాంతానికి ‘‘మెటల్ రోడ్డు ఎప్పుడు నిర్మాణం అవుతుంది’’ అని అడిగేవారు. కానీ, ఇప్పుడు రోడ్డు ‘‘నాలుగు లేన్లా, ఆరు లేన్లా’’ అని అడుగుతున్నారు. వారు కేవలం స్తంభాలు, వైర్లతో సంతృప్తి చెందడం లేదు.
గతంలో, ఒక ప్రదేశంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని, కాగితాలపై నిర్ణయం తీసుకున్నట్లయితే, ఎన్నో సంవత్సరాలపాటు దానికి అనకూలమైన భావన ప్రజల్లో ఉండేది. ఏదో ఒక సమయంలో తమకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తుందని ఆశించేవారు. కానీ, కాలం మారింది. సాధారణ పౌరులు కేవలం రైల్వే స్టేషన్లతో సంతృప్తి చెందడం లేదు. వారు తక్షణం “వందే భారత్ ఎక్స్ ప్రెస్ మా ప్రాంతానికి ఎప్పుడు వస్తుంది?” అని అడుగుతారు. ఒక అందమైన బస్ స్టేషన్, లేదా ఫైవ్ స్టార్ రైల్వే స్టేషన్ నిర్మించినట్లయితే “బాగా చేశారు, అని మెచ్చుకుంటారు.’’ కానీ, ‘‘మాకు విమానాశ్రయం ఎప్పుడు సిద్ధమవుతుంది అని అడుగుతారు’’ అంటే వారి ఆలోచనా ధోరణి ఆ రకంగా మారింది.
పూర్వం నేల మీద, ఇంకా పాతవి విద్యుత్తు సంభాలను చూసి విద్యుత్తు సౌకర్యం ఉన్నట్టే జనం సంతోషపడేవారు. కానీ, ఇప్పుడు విద్యుత్తు వైర్లు, మీటర్లు అమర్చినా, ‘‘ఇరవై నాలుగు గంటల కరెంటు ఎప్పుడు వస్తుంది’’ అని అడుగుతున్నారు. కేవలం స్తంభాలు, వైర్లూ చూసి వారు సంతోషపడటంలేదు.
పూర్వం మొబైల్ ఫోన్లు చూసి తృప్తి చెందేవారు. కానీ, ఇప్పుడు డేటా స్పీడ్ గురించి చర్చిస్తున్నారు. మారుతున్న ఈ మనస్తత్వాలను, కాలాన్నీ మనం అర్థం చేసుకోవాలి. అనేక రంగాలలో మనం అభివృద్ధి సాధించవలసి ఉంది. ఆధునికమైన మౌలిక సదుపాయాలూ, పరిశుభ్రమైన ఇంధనం, గ్యాస్ – ఆధారిత ఆర్థిక వ్యవస్థ, గ్యాస్ గ్రిడ్ ఇ-మొబిలిటీ, ఇలా అనేక రంగాలలో ప్రపంచ దేశాలకు ధీటుగా అభివృద్ధి సాధించవలసి ఉంది.
నా దేశ పౌరులారా,
సాధారణంగా మన దేశంలో ప్రభుత్వాలు వారు ఒక రంగానికో, లేదా ఒక వర్గానికో చేసిన మేలు ఆధారంగా గుర్తంచుకొనేవారు. ప్రభుత్వం ఎవరికి, ఎంత ఇచ్చింది అనే కొలబద్ధ ఆధారంగా ప్రభుత్వాలను గుర్తుంచుకొనేవారు. ఇది సరిపోయేది. ఆ కాలానికి అది సరైన సంగతే కావచ్చు.
అయితే ఏది ఏమైనప్పటికీ గతంలో ఏమి లబ్ది పొందారో, ఎలా పొందారో, ఎప్పుడు పొందారో, ఎవరు పొందారో ఇప్పుడు మనం ఐక్యంగా ఆలోచించాలి. ఒక జాతిగా మనం ఏ కలలను సాకారం చేసుకోవాలో ఆలోచించాలి. కాలక్రమంలో అవసరమనుకటే పోరాటం చేయడానికి సిద్ధంగా వుండాలి. ఏకోన్ముఖులమై ఈ కలల్ని సాకారం చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశ ఆర్ధిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికిగాను లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. 130 కోట్ల మంది చిన్న చిన్న మొత్తాలతో కలిసి ముందడుగు వేయవచ్చు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను దేశంలో నెలకొల్పడమనేది కొంతమందికి కష్టంగా అనిపించవ్చు. వారు అలా భావించడంలో తప్పేమీ లేదు. అయితే కష్టమైన పనులను సాధించకపోతే దేశం ఎలా ముందుకు పోతుంది? కష్టతరమైన సవాళ్లను చేపట్టకపోతే ప్రగతి సాధించాలనే ఆలోచనా దృక్పథాన్ని ఎలా అలవరచుకోగలం? మాసనికంగా కూడా మనల్ని మనం సిద్ధం చేసుకొని ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలి. ఇప్పుడు మేం చేసింది అదే. ఇది ఏదో ఊహలకు పరిమితమైంది కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లకు మన దేశ ఆర్ధిక వ్యవస్థ రెండు ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఏడు దశాబ్దాలపాటు అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తే మనం సాధించింది కేవలం రెండు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థను. అయితే ౨౦౧౪నుంచి ౨౦౧౯ నాటికి మన ఆర్ధిక వ్యవస్థ మూడు ట్రిలియన్లకు చేరుకుంది. అంటే ఈ ఐదేళ్లేళలో మనం ఒక ట్రిలియన్ డాలర్లను సాధించగలిగాం. ఇదే ఊపులో రాబోయే ఐదు సంవత్సరాలలో పని చేస్తే మన ఆర్ధిక వ్యవస్థ తప్పకుండా ఐదు ట్రిలియన్లకు చేరుకుంటుంది. దీన్ని ప్రతి భారతీయుడు తన కలగా భావించాలి.
ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందితే అది ప్రజల నాణ్యైమన జీవన ప్రమాణాలకు దోహదం చేస్తుంది. సమాజంలో అట్టడుగున వున్నవారి కలలను కూడా సాకారం చేయడానికి అవకాశాలను సృష్టించాలి. వారికి ఈ అవకాశాలను సృష్టించడానికిగాను మన దేశ ఆర్ధిక రంగానికి సంబంధించి మన ఆలోచనా దృక్పథం ఇలాగే వుండాలి.
మన అన్నదాతల ఆదాయాలను రెట్టింపు చేయాలని కలలు కంటున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయి ఐదేళ్లయే నాటికి దేశంలో అత్యంత పేదవారు పక్కా ఇళ్లు ఇవ్వాలని కలలు కంటున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయి ఏళ్లయ్యేనాటికి దేశంలో ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం అందించాలని కలలు కంటున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయి ఐదేళ్లయ్యేనాటికి దేశంలోని ప్రతిగ్రామానికి ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్, బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, దూరవిద్యా సౌకర్యం వుండాలని కలలు కంటున్నాం. ఇవి కేవలం కలలుగానే మిగిలిపోవు.
మనకున్న సముద్ర ప్రాంత వనరులపైన, సముద్ర ఆధారిత ఆర్ధిక రంగంపైన మనం తప్పకుండా దృష్టి కేంద్రీకరించాలి. మన మత్స్యకార సోదరులను సాధికారులను చేయాలి. మనకు అన్నం పెడుతున్న అన్నదాతలు దేశానికి శక్తిని అందించేవారుగా రూపొందాలి. మన రైతులు ఎందుకు ఎగుమతులు చేయకూడదు? వారి వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ లో ఆధిపత్యం ఎందుకు సాధించకూడదు? ఇలాంటి కలలతో మనం ముందడుగు వేయాలి. మన దేశ ఎగుమతులు పెరగాలి. అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోవడానికి ఎలాంటి కృషి చేయాలో అంతా చేద్దాం. మనదేశంలోని ప్రతి జిల్లాకు ఒక దేశానికి వున్నంత సామర్థ్యం వుంది. అంటే దేశంలోని ఏ చిన్న దేశాన్ని తీసుకున్నా మన దేశంలోని ప్రతి జిల్లాకు ఆ చిన్న దేశం స్థాయిలో సామర్థ్యం వుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఈ సామర్థ్యాలను చక్కగా ఉపయోగించుకోవాలి.
దేశంలోని ప్రతిజిల్లా ఒక ఎగుమతుల కేంద్రంగా ఎందుకు మారకూడదు? దేశంలోని ప్రతి జిల్లాకు చేతివృత్తుల కళలున్నాయి. అంతే కాదు ప్రతిజిల్లా తనదైన ప్రత్యేకతలతో అలరారుతోంది. సుగంధపరిమళానికి ఒక జిల్లా ప్రసిద్ధి చెందితే మరో జిల్లా చీరలకు ప్రసిద్ధి చెందింది. మరో జిల్లా పనిముట్లకు ప్రసిద్ధి చెందితే ఇంకో జిల్లా స్వీట్లకు ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా దేశంలోని ప్రతి జిల్లా వైవిధ్యమైన అస్థిత్వాన్ని కలిగి అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్లగలిగే సత్తా కలిగి వుంది.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా వస్తువులను తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. మన దేశంలోని వైవిధ్యం గురించి ప్రపంచం తెలుసుకునేలా చేయడంద్వారా ఎగుమతుల మీద దృష్టి పెడితే ఆ విధంగా అంతర్జాతీయ మార్కెట్‌ను కైవసం చేసుకుంటే అప్పుడు దేశంలోని యువతకు ఉపాధి లభిస్తుంది. దీనివల్ల దేశంలోని చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు బలోపేతమవుతాయి. వీటిని మరింతగా బలోపేతం చేయాల్సి వుంది.
ప్రపంచానికే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా మన దేశాన్ని రూపొందించవచ్చు. అయితే కొన్ని కారణావల్ల మనం ఆశించిన స్థాయిలో ఆ పనిని చేయలేకపోతున్నాం. కాబట్టి దేశంలోని పౌరులందరూ ముందుకు కదిలి దేశంలోని పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలి.
పర్యాటక రంగం అభివృద్ధి చెందితే పెట్టుబడులు పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజలు మన దేశాన్ని సరికొత్త దృక్పథంతో సందర్శించాలని భావిస్తున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వున్న పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఏం చేయాలో అందరమూ కలిసి ఆలోచిద్దాం. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ఎలాగో ఆలోచిద్దాం. ఆయా పర్యాటక కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో ఆలోచిద్దాం. అంతే కాదు సామాన్య పౌరుల ఆదాయాన్ని పెంచడం గురించి కూడా మాట్లాడుకోవాలి. వారికి మెరుగైన విద్యను అందించాలి. అంతే కాదు నూతన ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే విషయాల మీద మనం మాట్లాడుకోవాలి. దేశంలోని మధ్యతరగతివారికి వారి కలలను నెరవేర్చుకోవడానికి వీలుగా వేదికలు వుండాలి. మన దేశ శాస్త్రవేత్తలకు ఉత్తమ సౌకర్యాలు, వనరులు అందుబాటులో వుండాలి. మన బలగాలకు అత్యాధునిక ఆయుధాలుండాలి. అంతే కాదు అవి దేశీయంగా తయారుకావాలి. దేశ ఆర్ధిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చడానికిగాను దేశంలో అనేక రంగాలు సరికొత్త శక్తిని అందించడానికి సిద్ధంగా వున్నాయని నేను నమ్ముతున్నాను. నా ప్రియమైన సోదర సోదరీమణులారా దేశం ఆర్ధికంగా విజయం సాధించడానికిగాను ఈ రోజున దేశంలో చక్కటి అనుకూలమైన వాతావరణం వుంది. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వముంటే ఆ ప్రభుత్వ విధానాలు సరిగా వుంటాయి. అంతే కాదు వ్యవస్థలు స్థిరంగా పని చేస్తాయి. అప్పుడు ప్రపంచానికి మన మీద విశ్వాసం కలుగుతుంది. ఇది దేశ ప్రజల కారణంగా సాధ్యమైంది. మన దేశం సాధించిన రాజకీయ స్థిరత్వానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం లభిస్తోంది. ఈ విజయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వున్న అనేక దేశాలు మనతో వ్యాపారం చేయడానికి సంసిద్దంగా వున్నాయి. అనేక దేశాలు మనతో కలిసి నడవడానికి ఉబలాడపడుతున్నాయి. ఒక వైపున ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో పెడుతూనే మరోసక్క వృద్ధి రేటును పెంచే ముఖ్యమైన పనిలో ప్రగతి సాధిస్తున్నాం. ఇది మనందరం ఎంతగానో గర్వించదగ్గ విషయం. కొన్ని సార్లు వృద్ధి రేటు పెరగవచ్చు, కానీ ద్రవ్యోల్బణం నియంత్రణలో వుండదు. కొన్ని సార్లు ద్రవ్యోల్బణం నియంత్రణలో వుంటుంది కానీ వృద్ధి రేటు దెబ్బతింటుంది. అయితే మా ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో పెడుతూనే మరో పక్క వృద్ధి రేటును పెంచింది.
మన ఆర్థిక వ్యవస్థ మూలాలు అత్యంత దృఢమైనవి. మనం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు తోడ్పడుతున్నది ఈ బలమే. అదేవిధంగా వస్తుసేవల పన్ను వ్యవస్థకు రూపకల్పన, ఆర్థిక అశక్తత-దివాలా స్మృతి వంటి సంస్కరణలు తేవడంద్వారా విశ్వాసపూరిత పర్యావరణ కల్పించాలని మేం ఆకాంక్షించాం. దేశంలో ఉత్పాదకత పెరగాలి… మన సహజ సంపద సృష్టి పెరగాలి… విలువ జోడింపు ఇనుమడించాలి… విలువ జోడించిన ఉత్పత్తుల ఎగుమతులు పెరగాలి. ప్రపంచంలోని ప్రతి దేశం ఏదో ఒక భారతీయ ఉత్పత్తిని దిగుమతి చేసుకునేలా ఎదగాలన్న స్వప్నం మనకు ఎందుకు ఉండకూడదు? భారతదేశంలోని ప్రతి జిల్లా ఏదో ఒక వస్తువును ఎగుమతి చేసే స్థితి రావాలని ఎందుకు ఆకాంక్షించరాదు? ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటే మనం కూడా ఆదాయాన్ని పెంచుకోగలం. మన కంపెనీలు, పారిశ్రామికవేత్తలు కూడా అంతర్జాతీయ విపణి తమకు అందుబాటులోకి రావాలని కలలుగంటున్నారు. ప్రపంచ మార్కెట్‘ను అందిపుచ్చుకోవడం ద్వారా మన పెట్టుబడిదారులు భారతదేశ హోదాను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లగలరు… మన పెట్టుబడిదారులు మరింతగా ఆర్జించనూగలరు… మన పెట్టుబడిదారులు మరింతగా పెట్టుబడులు పెట్టగలరు. మన పెట్టుబడిదారులు మరింత ఉపాధి అవకాశాలను సృష్టించగలరు. ఉపాధి అవకాశాల సృష్టి దిశగా మన పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి మేం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాం.
మన దేశంలో కొన్ని దురభిప్రాయాలు మనుగడ సాగిస్తున్నాయి. అటువంటి ఆలోచనా ధోరణినుంచి మనం బయటపడాలి. దేశం కోసం సంపదను సృష్టించేవారు, జాతి సంపద సృష్టిలో తమవంతు తోడ్పాటును అందించేవారు దేశం కోసం సేవ చేస్తున్నారు. అలాంటి సంపద సృష్టికర్తలను మనం సందేహించరాదు. మన దేశంలోని సంపద సృష్టికర్తలను గుర్తించాల్సిన తరుణమిది. వారికి మరింత గౌరవం దక్కాలి. సంపద సృష్టి జరగకపోతే సంపద పంపిణీ కూడా సాధ్యం కాదు. అంతేకాకుండా సంపద పంపిణీ జరగకపోతే మన సమాజంలోని నిరుపేదవర్గ అభ్యున్నతి అసాధ్యం. దేశం కోసం సంపద సృష్టికిగల ప్రాధాన్యం అటువంటిది కాబట్టి అందుకు మనం మరింత వెసులుబాటు కల్పించడం తక్షణావసరం. నా అభిప్రాయం ప్రకారం… సంపద సృష్టికి కృషి చేస్తున్నవారే దేశానికి ఎనలేని ఆస్తిగనుక వారికి మరింత సాధికారత అవసరం.
నా ప్రియమైన దేశవాసులారా!
ప్రగతితోపాటు శాంతిభద్రతలకు మనం నేడు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రపంచంలో పలు దేశాలు అనేకానేక అభద్రతల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట మరణదేవత నిరంతరం విహరిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల నడుమ ప్రపంచ శాంతికి భారత్ కీలకపాత్ర పోషించాల్సి ఉంది. ప్రపంచ పర్యావరణం విషయంలో మనం మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోలేం. ఉగ్రవాద సంస్థలపై మనం తీవ్రంగా పోరాడుతున్నాం. ప్రపంచంలోని ఏ మూలనైనా ఉగ్రవాద దుశ్చర్య ఎలాంటిదైనా దాన్ని మానవాళిపై దాడిగానే పరిగణించాలి. అందువల్ల ఉగ్రవాద మూకలకు ఆశ్రయమిచ్చి, ప్రోత్సహిస్తున్నవారికి వ్యతిరేకంగా సకల శక్తులూ ఏకం కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి మానవాళి వ్యతిరేక కార్యకలాపాలను ఎండగట్టడంలో భారత్ తనవంతు పాత్ర పోషించాలి. అదే సమయంలో ఉగ్రవాదం అంతానికి ప్రపంచ శక్తులను కృతనిశ్చయంతో ఏకతాటిపైకి తేవాలి.
ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం కీలకపాత్ర పోషించాలని మేం ఆకాంక్షిస్తున్నాం. ఉగ్రవాదులకు అండదండలు అందించేవారిని, ప్రోత్సహించేవారిని, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసేవారిని ఎండగట్టే దిశగా అన్ని శక్తులనూ ఏకం చేయడంలో భారత్ చొరవ చూపాల్సి ఉంది. కొన్ని ఉగ్రవాద సంస్థలు భారతదేశాన్ని లక్ష్యం చేసుకోవడమే కాకుండా మన పొరుగు దేశాల్లోనూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ కూడా ఉగ్రవాద దుశ్చర్యల ఫలితంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. శ్రీలంకలోని ఓ చర్చిలో అమాయక ప్రజలు సామూహిక మారణకాండకు బలికావడం విచారకరం. అది మనసును మెలిపెట్టిన ఉదంతం. కాబట్టే ఉపఖండంలో శాంతి, భద్రత, సామరస్యాలకు భరోసా ఇచ్చేవిధంగా మనమంతా ఏకమై చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది. మన మిత్రదేశం ఆఫ్ఘనిస్థాన్ కూడా మరో నాలుగు రోజుల్లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు చేసుకోబోతోంది. ఈ పవిత్ర సందర్భంలో ఆ దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
భయాన్ని, హింసను వ్యాపింపజేసే శక్తులను మట్టికరిపించాలన్నది మన సుస్పష్ట విధానం. అటువంటి దురుద్దేశపూరిత చర్యల నిరోధం దిశగా మేం రూపొందించిన విధానాలు, వ్యూహాలు ఈ విషయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఈ విషయంలో మేం వెనుకాడేది లేదు. ఆ మేరకు మన సైన్యం, సరిహద్దు భద్రత బలగాలు, భద్రత సంస్థలు ప్రశంసనీయంగా పనిచేస్తున్నాయి. అన్ని ప్రతికూలతల నుంచి మనను రక్షించడంలో వారు సదా ముందు వరుసలో ఉన్నారు. మన ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసి, ఎందరో అమరులయ్యారు. వారికి శిరసాభివందనం చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సంస్కరణల దిశగానూ మనం సకాలంలో ముందుకు వెళ్లడం కూడా అంతే ముఖ్యం. సైనిక మౌలిక సదుపాయాలు, సైనిక బలగాలు, సైనిక వనరుల విషయంలో సంస్కరణలపై చాలాకాలం నుంచీ చర్చలు సాగుతుండటాన్ని మీరు గమనించే ఉంటారు. మునుపటి ప్రభుత్వాలు కూడా ఇలాగే చేశాయి. అనేక కమిషన్లు ఏర్పాటైనప్పటికీ వాటి నివేదికలన్నీ వెలుగులోకి తెచ్చిన అంశాల్లో తేడా ఏమీలేదు. చెప్పిన విషయాన్నే పదేపదే నివేదించాయి.
మన నావికాదళం, సైన్యం, వాయుసేనల మధ్య సమన్వయంపై సందేహాలకు తావే లేదు. మన సైనికదళాల అమరిక మనకెంతో గర్వకారణం. హిందూస్థానీ ఎవరైనా భారత సైన్యాన్ని తలచుకుంటే గర్వపడతారు. అదే సమయంలో ఆధునికీకరణపై తమదైన శైలిని అనుసరించేందుకు వారు కృషిచేస్తారు. కానీ, ప్రపంచం ఇవాళ చాలా మారిపోతోంది. యుద్ధ సంభావ్య పరిస్థితులు మారుతున్నాయి.. యుద్ధ శైలి కూడా మారుతోంది. నేడు ఇవన్నీ సాంకేతిక పరిజ్ఞాన చోదితంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల నడుమ భారతదేశం కూడా చెదురుమదురు విధానాలు అనుసరించరాదు. మన సైనికశక్తి మొత్తం ఏకీకృతమై ముందుకు సాగాలి. నావికాదళం, సైన్యం, వాయుసేనలలో ఏదో ఒకటి మిగిలిన రెండింటికన్నా ఒక అడుగు ముందుకు వెళ్లేట్లయితే పరిస్థితులు సజావుగా ఉండవు. ఈ మూడు సైనిక శక్తులూ ఒకే వేగంతో, ఏకకాలంలో ముందుకు కదలాలి. చక్కని సమన్వయంతోపాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్రివిధ దళాలు మెలగాలి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న యుద్ధ, భద్రత పర్యావరణానికి అనుగుణంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఎర్రకోట నుంచి నేనొక ముఖ్యమైన ప్రకటన చేయదలిచాను. ఈ అంశంలో నిపుణులైనవారు కూడా చాలాకాలం నుంచీ దీనికోసం డిమాండ్ చేస్తున్నారు. అందుకే మనకూ త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్- CDS) ఒకరుండాలని మేం నిర్ణయించాం. ఈ హోదాను సృష్టించాక త్రివిధ దళాలకూ సమర్థ అగ్ర నాయకత్వం అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలో హిందూస్థాన్ వ్యూహాత్మక వేగాన్ని సంస్కరించే స్వప్న సాకారం దిశగా సీడీఎస్ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది.. తప్పనిసరైనది.
నా ప్రియమైన దేశవాసులారా!
మనం చేసుకున్న అదృష్టంకొద్దీ ఏదైనా చేయగలిగిన కాలంలో మనం జన్మించాం… జీవిస్తున్నాం. మనం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కాలంలో భగత్ సింగ్, సుఖ్‘దేవ్, రాజ్‘గురు వంటి యోధానుయోధులు తమ జీవితాలను త్యాగం చేసేందుకు పోటీపడటం నాకు అప్పుడప్పుడూ గుర్తుకొస్టూంటుంది. మహాత్మాగాంధీ నాయకత్వాన దేశవిముక్తి స్వప్న సాకారం దిశగా ప్రజల్లో అవగాహన పెంచడం కోసం స్వాతంత్ర్య సమరయోధులు ఇంటింటికీ వెళ్తుండేవారు. ఆ కాలంలో మనం పుట్టలేదు. దేశంకోసం త్యాగం చేసే అవకాశం మనకు దక్కలేదు… కానీ, మన దేశం కోసమే జీవించే అవకాశం మనకిప్పుడు లభించింది. ఈ కాలంలో ఇలాంటి అవకాశం దక్కడం ఒక అదృష్టం. ఈ ఏడాది మనకెంతో ముఖ్యమైనది. ఇది బాపూజీ మహాత్మగాంధీ 150వ జయంతి సంవత్సరం కావడమే దీని ప్రత్యేకత.
మనకు అటువంటి అవకాశం రావడం అదృష్టం. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, దేశ విముక్తి కోసం పోరాడిన త్యాగధనులందరినీ ఒకసారి గుర్తుచేసుకోవడం వల్ల ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తి మనకు కూడా కలుగుతుంది. ఈ అవకాశాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. మహాత్మా గాంధీ, ఎంతో మంది స్వాతంత్య్ర యోధుల కలలను సాకారం చేసే దిశగా మనమందరం ముందుకు సాగాలి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీజీ 150వ జయంతి రెండింటిని మనం వేడుకగా నిర్వహించుకోవాలి. చక్కని స్ఫూర్తి పొందడానికి మనకు ఇది అతి పెద్ద అవకాశం.
2014వ సంవత్సరంలో నేను ఇదే ఎర్రకోట బురుజుల నుండి స్వచ్ఛతా నినాదం చేశాను. 2019వ సంవత్సరం లోనే మరికొద్ది వారాల వ్యవధిలో భారతదేశం బహిరంగ మలమూత్ర విసర్జన దేశంగా అవతరించనుంది. రాష్ట్రాలు, గ్రామాలు, మున్సిపాలిటీలు, మీడియా, ప్రతి ఒక్కరూ ఒడిఎఫ్ ను ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టారు. ప్రభుత్వ ప్రమేయం పెద్దగా లేకుండానే ప్రజలు ఈ స్వచ్ఛతా ఉద్యమం లో పాల్గొన్నారు. ఫలితంగానే అది చక్కని ఫలితాలు అందించగలిగింది.
నా ప్రియమైన దేశవాసులారా,
ఒక చిన్న అభ్యర్థన మీ అందరి ముందు ఉంచుతున్నాను. రాబోయే అక్టోబరు 2వ తేదీ నుంచి మనం భారత్ ను ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని ప్రతిన పూనుదాం. మనమందరం వెలుపలికి వద్దాం. బృందాలుగా ఏర్పడదాం. ఇళ్ళు, పాఠశాలలు, కళాశాలల నుంచి వెలుపలికి వద్దాం.
బాపూజీ ని గుర్తు చేసుకుంటూ, మనమందరం వెలుపలికి వచ్చి, ఇళ్ళు, వీధులు, దుకాణాలు, మురుగు కాలువల నుంచి ఒక్కసారి వినియోగించిన ప్లాస్టిక్ ను కూడా ఏరివేద్దాం. మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లు, గ్రామపంచాయతీలు ఈ ప్లాస్టిక్ ను సేకరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. అలా ఏక వినియోగ ప్లాస్టిక్ నుంచి భారత్‌ను విముక్తం చేసే దిశగా అక్టోబరు 2న ఒక పెద్ద అడుగు ముందుకు వేయగలమా?
దేశవాసులారా అందరూ కలసి రండి. ఈ దిశగా అడుగు వేద్దాం.
ఈ ప్లాస్టిక్ అంతటినీ రీసైకిల్ చేసేందుకు మనం ఏ విధంగా కృషి చేయగలమనేది పరిశీలించాలని స్టార్ట్-అప్ లు, టెక్నీషియన్లు, పారిశ్రామికవేత్తలను నేను అభ్యర్ధిస్తున్నాను. ఇలాంటి పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి. కానీ, వాటిని నుంచి విముక్తి పొందడానికి ప్రజా ఉద్యమాలు ప్రారంభించాలి. అలాగే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా ఆలోచించాలి. దుకాణదారులు అందరూ మీ దుకాణాల్లో సైన్ బోర్డులతో పాటుగా, ప్లాస్టిక్ వినియోగించవద్దని, వస్త్రంతో చేసిన సంచులు తెచ్చుకోవాలని లేదా కొనుగోలు చేయాలని వినియోగదారులను అందరినీ కోరండి. మనమందరం అటువంటి వాతావరణ ఏర్పాటుచేద్దాం. సాధారణంగా మనం దీపావళి పర్వదినాన అందరికీ కానుకలు ఇస్తాం. అలాంటి కానుకలు ఈ ఏడాది నుంచి, ప్రతీసారి చేతి సంచుల్లోనే ఎందుకు ఇవ్వకూడదు? ప్రతి ఒక్కరు క్లాత్ బ్యాగ్ తో మార్కెట్ కు వెళితే, అది మీ కంపెనీకి ఒక ప్రచారంగా మారుతుంది. మీరు ఒక డైరీ, లేదా క్యాలెండర్ బహుమతి గా ఇస్తే ఒరిగేది ఏమీ ఉండదు. ఒక జూట్ బ్యాగ్ కనుకగా ఇస్తే, అదే ఒక ప్రచార మాధ్యమంగా మారుతుంది. ఇది రైతులకు కూడా సహాయకారిగా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. కానీ, కుట్టుపనుల్లో నిమగ్నమయ్యే పేద వితంతువులకు ఎంతో సహాయకారిగా ఉండే చర్యలు. మనం వేసే చిన్న అడుగులే సగటు ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తెస్తాయి. మనం ఆ దిశగా కృషి చేయాలి.
ప్రియమైన దేశవాసులారా,
మనం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనేది కావచ్చు, స్వయం సమృద్ధ భారతంగా మారాలన్నది కావచ్చు, ఏదైనా మనకు మహాత్ముని సిద్ధాంతాలే మార్గదర్శకం. మహాత్మా గాంధీ బోధనలు నేటి కాలానికి కూడా చక్కగా సరిపోతాయి. మనమందరం ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యమాన్ని ముందుకు నడిపిద్దాం. దేశంలో తయారైన ఉత్పత్తులు వినియోగించడమే మన ప్రాధాన్యతగా చేసుకోలేమా? దేశంలోనే తయారై, అందుబాటులో ఉన్నవే ప్రాధాన్యతా క్రమంలో ఉపయోగించుకోవాలని మనమందరం నిర్ణయించుకోవాలి. ఆనందమయమైన రేపటికి స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇద్దాం. సముజ్వలమైన భవిష్యత్తుకు స్థానికత సూత్రంతోనే ముందుకు సాగుదాం. మన గ్రామాల్లో తయారైనవే ప్రాధాన్యతా క్రమంలో ఉపయోగిద్దాం. ఒకవేళ గ్రామాల్లో అవి అందుబాటులో లేకపోతే, తహసీల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అన్వేషిద్దాం. ఒక ప్రయోగం చేయడానికి మనమందరం రాష్ట్రం వెలుపలికి వెళ్ళాలని నేను భావించడంలేదు. ఇలా చేస్తే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, చిన్న చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుంది. మన సాంప్రదాయిక వస్తువులే ఆ లోటు పూడుస్తాయి.
సోదర, సోదరీమణులారా,
మనం మొబైల్ ఫోన్లు, వాట్స్ అప్ సందేశాలు, ఫేస్‌బుక్ – ట్విటర్ సందేశాలను ఎంతో ఇష్టపడతాం. ఈ మాధ్యమాల ద్వారా మనం దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సహాయం చేయగలం. ఎలా ఉపయోగించాలో తెలిసినవారికి టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. ఆధునిక భారత అభివృద్ధికి టెక్నాలజీ సహాయకారిగా ఉంటుంది. మనం డిజిటల్ చెల్లింపుల దిశగా ఎందుకు అడుగు వేయలేం? మన రూపే కార్డు సింగపుర్ లో కూడా చెల్లుబాటు అవుతున్నందుకు ఈ రోజు మనమందరం గర్వించాలి. మన డిజిటల్ వ్యవస్థ నిలకడగా విస్తరిస్తోంది. గ్రామాలు, చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న షాపింగ్ మాల్స్ లో కూడా డిజిటల్ చెల్లింపులకు మనం ప్రాధాన్యం ఇవ్వలేమా? దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, పారదర్శకతకు, గౌరవానికి దోహదపడే విధంగా మనమందరం డిజిటల్ చెల్లింపులకు సిద్ధపడదాం. మనం గ్రామాలకు వెళితే, ప్రతి చోటా దుకాణాల్లో “కేవలం డబ్బు చెల్లించండి, అప్పు అడగవద్దు” అనే బోర్డులు ప్రతిచోటా కనిపిస్తాయి. వాటితో పాటుగా, “డిజిటల్ చెల్లింపులే చేయండి, నగదు వద్దు” అనే బోర్డులు కూడా ప్రదర్శించాలని వ్యాపారవేత్తలను నేను కోరుతున్నాను. ఇటువంటి వాతావరణం మనమందరం కల్పించాలి. బ్యాంకింగ్ రంగం, వ్యాపార ప్రపంచంలోని వారందరూ ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుతున్నాను.
మన దేశంలో మధ్యతరగతి, ఉన్నత శ్రేణి మధ్యతరగతి పెరుగుతోంది. ఇది మంచి పరిణామమే. ప్రజలందరూ ఏడాదికి ఒక్కసారన్నా కుటుంబంతో కలసి వివిధ దేశాలను సందర్శిస్తున్నారు. అలాంటి కుటుంబాలను అందరినీ నేను ఒక్కటే కోరుతున్నాను. 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి తమ పిల్లలు దేశం గురించి కూడా తెలుసుకోవాలని, మన దేశ విముక్తి కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఎంతో మంది మహోన్నతులు అయిన వారిని గుర్తు చేసుకోవాలని ఎందుకు కోరకూడదు. మన దేశ మట్టి, మన దేశ చరిత్ర, మన నీరు, మన గాలితో పిల్లలకు భావోద్వేగపూరితమైన అనుసంధానం కల్పించాలని ఆశించని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? ఇలాంటి అంశాలన్నింటి నుంచి తమ పిల్లలు కొత్త శక్తిని పునికిపుచ్చుకోవాలని కోరని వారు ఎవరైనా ఉంటారా? ఈ బాటలో మనం ముందుకు సాగాలి. మనం ఎంత పురోగమించినా, మన మూలాలను విస్మరించనట్లయితే మనుగడ సాగించడం సాధ్యం కాదు. ఈ ఎర్రకోట బురుజుల నుంచి మీ అందరినీ నేను ఒక్క విషయం అభ్యర్ధిస్తున్నాను. దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారతదేశం సాధించగలదు అని ప్రపంచానికి చాటిచెప్పేందుకు 2022వ సంవత్సరంలో మనం 75వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకొనేనాటికి కుటుంబాలతో కలసి కనీసం దేశంలో 15 పర్యాటక స్థలాలు సందర్శించాలని కోరుతున్నాను. అలాంటి ప్రదేశాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చు. కానీ, మనం వెళ్ళి తీరాలి. అక్కడ మంచి హోటళ్ళు ఉండకపోవచ్చు.ఒక్కోసారి అలాంటి కష్టాలే అవకాశాలను మన ముందు ఉంచుతాయి. మనం అలాంటి పర్యాటక ప్రాంతాలు సందర్శించినప్పుడు మన దేశం అంటే ఏమిటో పిల్లలకు తెలుస్తుంది. పర్యాటకుల కోసం సదుపాయాలు కల్పించేవారు అక్కడికి తరలి వస్తారు. అది పెద్ద ఉపాధి అవకాశం అందుబాటులోకి తెస్తుంది. దేశంలో 100 చక్కని పర్యాటక గమ్యాలను మనం ఎందుకు అభివృద్ధి చేయకూడదు, ప్రతి ఒక్క రాష్ట్రం 2, 5, 7 ఉన్నత శ్రేణి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఎందుకు నిర్ణయించుకోకూడదు? ఈశాన్య భారతంలో ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ, ఎన్ని విశ్వవిద్యాలయాలు అలాంటి ప్రదేశాలను పర్యాటక గమ్యంగా చేసుకుంటున్నాయి? మీరు ఎంతో ఖర్చు చేయలేకపోవచ్చు; ఎంతో సమయం వెచ్చించలేకపోవచ్చు; కానీ, 7 నుంచి 10 రోజుల వ్యవధిలోనే దేశంలో అంతర్గతంగా ప్రయాణించగలరు.
మీరు పర్యటించన ప్రదేశాల్లో ఒక క్రొత్త ప్రపంచం ఆవిష్కరిస్తుంది. ఈశాన్యంలోని పర్యాటక ప్రాంతాలు సందర్శించినట్లయితే అక్కడి ప్రజా జీవనంలో ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. విదేశీయులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. దేశం వెలుపల మీరు పర్యటనకు వెళ్ళినప్పుడు తమిళనాడు లో ఒక దేవాలయాన్ని సందర్శించారా, అని ఎవరైనా అడిగితే ‘లేదు’ అని చెప్పడం ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. విదేశీయులు అయినప్పటికీ, తాము ఆ దేవాలయాన్ని సందర్శించామని, కానీ భారతీయులు అయిన మీరే వెళ్ళలేదా? అని వారు ఆశ్చర్యపోతారు. అందుకే, విదేశాలకు వెళ్ళే ముందు మన దేశం గురించి మనం చక్కగా తెలుసుకోవాలి.
రైతన్నలు అయిన నా సోదరులను కూడా ఒక విషయం అడగాలనుకొంటున్నాను. రైతులు అందరికీ ఈ దేశం మాతృభూమి. మనమందరం ‘భారత్ మాతా కీ జయ్” అని నినదించినప్పుడు మన హృదయాలు ఉప్పొంగుతాయి.
“వందే మాతరం’’ అని నినదించినప్పుడు దేశం కోసం ఏదో ఒకటి చేయాలన్న త్యాగ నిరతి మన హృదయాల్లో నిండుతుంది. సుదీర్ఘమైన చరిత్ర మన కళ్ళ ముందు నిలుస్తుంది. కానీ, మనం ఏరోజైనా మన మాతృభూమి ఆరోగ్యం గురించి ఆలోచించామా? మనం రసాయనిక ఎరువులు, కీటక నాశనులు వినియోగిస్తే, భూసారం నష్టం అవుతుంది. ఈ భూమి పై జన్మించిన శిశువుగా, ఒక రైతుగా భూసారాన్ని నాశనం చేసే హక్కు నాకు లేదు. మన భూమాతను విచారించేలా చేసే హక్కు, రోగగ్రస్తగా చేసే హక్కు మనకు లేదు.
మనం త్వరలో స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకోగలుగుతున్నాం.
గౌరవ బాపూజీ మనందరికీ మార్గం చూపించారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని 10 శాతం, లేదా 20 శాతం లేదా 25 శాతానికి మనం తగ్గించలేమా? అందుకోసం ఒక ఉద్యమం చేపట్టడం సాధ్యం కాదా? ఇదే జాతికి పెద్ద సేవ. మన భూమాతను కాపాడే పెద్ద అడుగు. భారతమాతకు విముక్తి కలిగించేందుకు ..వందే మాతరం.. నినాదాలతో ప్రాణాలను పణంగా పెట్టిన ఎందరో త్యాగధనుల ఆశీస్సులు కూడా భూమాత పరిరక్షణతో మనకు లభిస్తాయి. దీన్ని దేశవాసులు అందరూ సాధించి తీరగలరని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
నా ప్రియమైన సోదర, సోదరీమణులారా,
మన వృత్తి నిపుణులు ప్రపంచాన్నే శాసించగల స్థాయిలో ఉన్నారు. వారి శక్తి ఎంతో గుర్తింపు పొందింది. ప్రజలు వారిని గౌరవిస్తున్నారు. అంతరిక్ష పరిజ్ఞానం కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, భిన్న రంగాల్లో మనం నూతన శిఖరాలు చేరాం. ఇంతవరకు ఎవరూ చేరని గమ్యాలకు మన చంద్రయాన్ త్వరితంగా చేరుతూ ఉండటం అందరికీ ఎంతో ఆనందదాయకం. మన శాస్త్రవేత్తల శక్తి అది.
క్రీడా రంగంలో మన పాత్ర చాలా తక్కువగా ఉంది. ఈ రోజున 18 నుంచి 22 సంవత్సరాల మధ్యవయస్కులు అయిన మన కుమారులు, కుమార్తెలు భారత త్రివర్ణ పతాకం వివిధ క్రీడా స్టేడియమ్‌లలో రెప రెపలాడిస్తున్నారు. అది మనకు ఎంత గర్వకారణం! మన క్రీడాకారులు దేశానికి ఎంతో గౌరవం ఆర్జించి పెడుతున్నారు.
ప్రియమైన దేశవాసులారా,
మనం దేశాన్ని ముందుకు నడిపించాలి. దేశంలో పరివర్తన తీసుకురావాలి. దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చాలి. ఇందుకు మనమందరం కలసికట్టుగా అడుగు వేయాలి. ప్రజలు, ప్రభుత్వం కలసికట్టు ఉమ్మడి కృషితోనే ఇది సాధ్యం అవుతుంది. 130 కోట్ల మంది దేశవాసులు ఇది సాధించాలి. ప్రధాన మంత్రి కూడా మీ అందరివలెనే ఈ భరతమాత పుత్రుడే. ఆయన కూడా ఈ దేశ పౌరుడే. మనమందరం కలసికట్టుగానే ఇందుకు కృషి చేయాలి.
రానున్న రోజుల్లో దేశంలో 1.5 లక్షల వెల్‌నెస్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుకావాల్సి ఉంది. ప్రతి మూడు లోక్ సభ నియోజక వర్గాలకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా వైద్యులు కావాలనే యువత కలలను నిజం చేయగలుగుతాం. 2 కోట్ల మంది పైగా పేద ప్రజలకు ఇళ్ళు నిర్మించాలి. 15 కోట్ల గ్రామీణ గృహాలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో 1.25 లక్షల కిలో మీటర్ల రహదారులు నిర్మించాలి. ప్రతి ఒక్క గ్రామానికి బ్రాడ్ బ్యాండ్ అనుసంధానత కల్పించాలి. ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ విస్తరించాలి. 50,000 లకు పైగా కొత్త స్టార్ట్-అప్ లను ఏర్పాటు చేయాలి. ఈ కలలన్నింటితో మనం ముందుకు కదలాల్సి ఉంది.
అందుకే సోదర, సోదరీమణులారా, దేశవాసులు అందరూ సంఘటితంగా దేశాన్ని ముందుకు నడిపించి, ఈ కలలను సాకారం చేయాలి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఇదే పెద్ద స్ఫూర్తి కావాలి.
130 కోట్ల భారతీయులకు వారి వారి కలలు, సవాళ్ళు ఉంటాయి. ప్రతీ కలా, ప్రతీ సవాలూ ముఖ్యమైనదే. కొన్ని ముఖ్యమైనవి. కొన్ని ప్రాముఖ్యం లేనివని కాదు. నా ప్రసంగంలో అన్నింటి గురించీ మాట్లాడటం సాధ్యపడకపోవచ్చు. అందువలన, ఈ రోజు నేను మాట్లాడిన, మాట్లాడని అంశాలు, రెండూ ముఖ్యమైనవే. మనం ముందుకు సాగాలంటే, మన దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలన్న సంగతిని మనం విస్మరించరాదు.
బాబా సాహబ్ ఆంబేడ్కర్ కలలను సాకారం చేస్తూ స్వాంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు, 150వ గాంధీ జయంతి, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ ఏడాది మనం గురు నానక్ దేవ్ 550వ గురు పర్వ్ జరుపుకొంటున్నాము. ప్రపంచ దేశాలు మన నుంచి ఆశిస్తున్న విధంగా, బాబా సాహబ్ ఆంబేడ్కర్, గురు నానక్ దేవ్ బోధనల ద్వారా, మెరుగైన సమాజాన్నీ, మెరుగైన దేశాన్నీ నిర్మించుకోవాల్సి ఉంది.
సోదర, సోదరీమణులారా,
మన లక్ష్యాలు హిమాలయాలంత సమున్నతమైనవే. నక్షత్రాల కంటే లెక్కకు మిక్కిలైనవి మన కలలు. ధైర్యంగా ఎంతో ఎత్తుకు ఎగురుతున్న మనకు ఆకాశం కూడా హద్దులు చూపలేదు.
ఇది మన సంకల్పం. హిందూ మహా సముద్రం వలె కొలవడానికి వీలు లేనిది మన సామర్ధ్యం. మనం నిరంతరం కొనసాగించే ప్రయత్నాలు. మనం నిరంతరం కొనసాగించే ప్రయత్నాలు, మన దేశంలో ప్రవహిస్తున్న గంగానది వలె పవిత్రమైనవి. వీటన్నిటికంటే, మన ప్రాచీన సంస్కృతి నుంచీ, మన రుషులు, మునుల తపస్సు నుంచీ స్ఫూర్తి పొంది ఏర్పరచుకొన్నవి మన విలువలు. మన దేశ పౌరుల త్యాగాలూ, కఠిన శ్రమ మనకు ప్రేరణగా ఉన్నాయి.
రండి, ఈ ఆశయాలనూ, సంకల్పాలనూ, మనసులో ఉంచుకొని నూతన భారతదేశాన్ని నిర్మిద్దాం. బాధ్యతలను నెరవేరుస్తూ, నూతన విశ్వాసంతో, నూతన సంకల్పంతో నవ భారత నిర్మాణం మన మంత్రం కావాలి. ఈ ఒక్క ఆకాంక్షతోనే మనం కలసి మన దేశాన్ని ముందుకు తీసుకు వెళదాం. మన దేశం కోసం జీవించి, పోరాడి, మరణించిన వారికి నేను మరలా అంజలి ఘటిస్తున్నాను.
జయ్ హింద్ ,
జయ్ హింద్ ,
భారత్ మాతాకీ జయ్,
భారత్ మాతాకీ జయ్,
వందే మాతరం,
వందే మాతరం,
అందరికీ అనేకానేక ధన్యవాదాలు.