నమస్కారం.
విధానాలు సక్రమంగా ఉంటేనే దేశం ఉన్నత శిఖరాలను చేరుకోగలదు. ఆ భావనకు ఈ రోజు గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, డ్రోన్ అనేది సైన్యానికి సంబంధించిన సాంకేతికత లేదా శత్రువులను ఎదుర్కోవడానికి ఉపయోగించే సాంకేతికత గా పరిగణలో ఉండేది. మన ఆలోచనలన్నీ ఆ నిర్దిష్ట వినియోగానికి సంబంధించి మాత్రమే పరిమితమై ఉండేవి. అయితే, ఈరోజు మనం మనేసర్ లో కిసాన్ డ్రోన్ సౌకర్యాలను ప్రారంభిస్తున్నాం. 21వ శతాబ్దపు ఆధునిక వ్యవసాయ విధానం దిశలో ఇదొక కొత్త అధ్యాయం. ఈ ప్రయోగం డ్రోన్ రంగం అభివృద్ధి లో ఒక మైలురాయిగా నిలవడంతో పాటు, అంతులేని అవకాశాలకు ద్వారాలను తెరుస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. గరుడ ఏరోస్పేస్ సంస్థ వచ్చే రెండేళ్లలో ఒక లక్ష 'భారతదేశంలో తయారైన' డ్రోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కూడా నాకు చెప్పారు. ఇది అనేక మంది యువకులకు కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఈ ఘనత సాధించినందుకు గరుడ ఏరోస్పేస్ బృందంతో పాటు, నా యువ స్నేహితులందరినీ నేను అభినందిస్తున్నాను.
ప్రియమైన స్నేహితులారా,
దేశానికి ఇది 'ఆజాదీ-కా-అమృత్-కాల్' సమయం. ఈ కాలం యువ భారతావనికి చెందినది; ఇది భారతదేశ యువతకు చెందినది. గత కొన్నేళ్లుగా దేశంలో అమలవుతున్న సంస్కరణలు యువతకు, ప్రైవేట్ రంగానికి బలం చేకూర్చాయి. అలాగే, డ్రోన్లకు సంబంధించి భారతదేశం ఎలాంటి భయాందోళనలతో సమయాన్ని వృథా చేయలేదు. యువ ప్రతిభను విశ్వసించి కొత్త ఆలోచనతో ముందుకు సాగాం. ఈ బడ్జెట్‌లో చేసిన ప్రకటనలు, ఇతర విధాన నిర్ణయాల కింద, దేశం సాంకేతికత మరియు ఆవిష్కరణలకు పూర్తి ప్రాధాన్యతనిస్తోంది. దాని ఫలితాలు నేడు మన ముందు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, డ్రోన్ల విభిన్న ఉపయోగాలను మనం చూస్తున్నాము. "బీటింగ్ రిట్రీట్" కార్యక్రమంలో భాగంగా, దేశం మొత్తం 1000 డ్రోన్ల అద్భుతమైన ప్రదర్శనను తిలకించింది.
నేడు స్వామిత్వ పథకం కింద గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా భూమి, గృహాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు టీకాలు చేరుతున్నాయి. పలు ప్రాంతాల్లో పొలాల్లో పురుగు మందులు చల్లేందుకు కూడా డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కిసాన్ డ్రోన్ ఇప్పుడు ఈ దిశగా, నవయుగ విప్లవానికి నాంది గా నిలిచింది. ఉదాహరణకు, రాబోయే కాలంలో, అధిక సామర్థ్యం గల డ్రోన్ల సహాయంతో, రైతులు తమ పొలాల నుండి తాజా కూరగాయలు, పండ్లు, పువ్వులను మార్కెట్లకు తరలించవచ్చు. చేపల పెంపకం చేపట్టిన వ్యక్తులు చెరువులు, నదులు, సముద్రం నుండి పట్టుకున్న తాజా చేపలను నేరుగా మార్కెట్ కు పంపవచ్చు. మత్స్యకారులు, రైతుల ఉత్పత్తులు అతి తక్కువ సమయంలో, ఎక్కువగా పాడవకుండా మార్కెట్ కు చేరుకుంటాయి. తత్ఫలితంగా, నా రైతు, మత్స్యకార సోదర సోదరీమణుల ఆదాయం కూడా పెరుగుతుంది. ఇలాంటి ఎన్నో అవకాశాలు మనకు అందుబాటులోకి వస్తాయి.
దేశంలో ఇంకా చాలా కంపెనీలు ఈ దిశగా వేగంగా ముందుకు సాగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. డ్రోన్లను తయారు చేసే అంకుర సంస్థల కొత్త పర్యావరణ వ్యవస్థ భారతదేశంలో ప్రారంభమవుతోంది. ప్రస్తుతం, దేశంలో 200 కంటే ఎక్కువ సంఖ్యలో డ్రోన్లను తయారు చేసే అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి. అతి త్వరలో ఈ సంఖ్య వేలకు చేరనుంది. దీనివల్ల లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి. డ్రోన్ల రంగంలో పెరుగుతున్న భారతదేశ సామర్ధ్యం, సమీప భవిష్యత్తులో, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని కొత్త నాయకత్వ పాత్రలో నిలబెడుతుందని నేను విశ్వసిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు. యువకుల పరాక్రమానికి నా ప్రత్యేక అభినందనలు. నష్టాలకు భయపడకుండా, ధైర్యంగా ఈ రోజు అంకుర సంస్థలను ప్రారంభించిన నేటి యువతను నేను అభినందిస్తున్నాను. ప్రభుత్వ విధానాల ద్వారా మీతో భుజం భుజం కలిపి ముందుకు సాగుతూ, భారత ప్రభుత్వం మీకు నిరంతర మద్దతు ఇస్తుంది. ఇది మీ మార్గంలో ఎటువంటి అవరోధాలను రానివ్వదు.
మీ అందరికీ నా శుభాకాంక్షలు!
మీకు అనేక కృతజ్ఞతలు!