“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భారత గిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తున్న ఆది మహోత్సవ్”
“21 వ శతాబ్దపు భారతదేశం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ మంత్రం వైపు సాగుతోంది”
“గిరిజన సమాజపు సంక్షేమం నా వ్యక్తిగత సంబంధానికి, ఉద్వేగానికి సంబంధించిన అంశం”
“గిరిజన సంప్రదాయాలను దగ్గరగా చూశా, వాటితో మమేకమై ఎంతో నేర్చుకున్నా”
“గిరిజన కీర్తితో కనీవినీ ఎరుగనంత గర్వంతో దేశం ముందుకెళుతోంది”
“దేశంలో ఏ మూలన ఉన్నా, గిరిజన పిల్లల విద్య నాకు ప్రధానాంశం”
“ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయటం వల్లనే దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోంది”

   కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అర్జున్ ముండా, శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, శ్రీమతి  రేణుకా సింగ్, డాక్టర్‌ భారతీ పవార్, శ్రీ బిశేశ్వర్ తుడుసహా ఇతర ప్రముఖులు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోగల నా గిరిజన సోదరసోదరీమణులారా! ఆది మహోత్సవం సందర్భంగా మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

   స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నేపథ్యంలో భారతదేశ ప్రాచీన వారసత్వానికి ప్రతీక ఈ ఆది మహోత్సవం. భారత గిరిజన సంప్రదాయంలోని ఈ అందమైన దృశ్యాలను సంగ్రహంగా చూసే అవకాశం నాకిప్పుడు లభించింది- అనేక రుచులు, విభిన్న వర్ణాలు; ఆకర్షణీయ వస్త్రాలు, అద్భుత సంప్రదాయాలు; అనేక కళలు, కళాఖండాలు; వివిధ అభిరుచులు, వైవిధ్యభరిత సంగీతం! ఒక్కమాటలో చెబితే- భారతదేశ వైవిధ్యం, వైభవం భుజంకలిపి కళ్లముందు సాక్షాత్కరించినట్లు అనిపిస్తోంది.

   ఇది భారతదేశపు అనంతాకాశం వంటిది.. దాని వైవిధ్యం ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాల తరహాలో ఆవిష్కృతమవుతుంది. దీని మరొక విశిష్టత ఏమిటంటే- ఈ విభిన్న రంగులు ఏకమైనపుడు ఓ కాంతి పుంజం ఏర్పడి ప్రపంచానికి ఒక దృక్పథాన్ని, దిశను నిర్దేశిస్తుంది. ఈ అనంత వైవిధ్యాలను ‘ఒకే భారతం - శ్రేష్ట భారతం’ అనే దారంతో ముడిపెడితే భారతదేశ విశ్వరూపం ప్రపంచం ఎదుట సాక్షాత్కరిస్తుంది. అది సాధ్యమైనప్పుడే భారతదేశం సాంస్కృతిక కాంతులు వెదజల్లుతూ ప్రపంచానికి మార్గదర్శకం కాగలదు. ఈ ఆది మహోత్సవం మన ‘భిన్నత్వంలో ఏకత్వం’ స్ఫూర్తికి కొత్త ఔన్నత్యాన్నిస్తోంది. ‘అభివృద్ధి-వారసత్వం’ ఆలోచనకు ఇది జీవకళ తెస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజనుల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న నా గిరిజన సోదరసోదరీమణులకు, సంస్థలకు నా అభినందనలు.

మిత్రులారా!

    21వ శతాబ్దపు భారతదేశం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ మంత్రంతో ముందడుగు వేస్తోంది. ఒకనాడు ఎంతో దూరంగా కనిపించిన సమాజంలోని ఒక భాగానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నేరుగా చేరువైంది. సమాజం నుంచి తననుతాను దూరం చేసుకున్నదనే భావనగల ఆ భాగాన్ని ఇప్పుడు ప్రభుత్వం ప్రధాన స్రవంతిలోకి తెచ్చింది. గడచిన 8-9 ఏళ్లలో ఆదివాసీ సమాజ సంబంధిత ఆది మహోత్సవం వంటి కార్యక్రమాలు దేశానికే ప్రాచుర్యం కల్పించేదిగా రూపొందాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో నేనూ పాలుపంచుకున్నాను. ఎందుకంటే- గిరిజన సమాజ ప్రయోజనాలు నా విషయంలోనూ వ్యక్తిగత సంబంధాలు-భావనకు సంబంధించినదే. నేను రాజకీయాల్లో లేని సమయంలో, ఓ సామాజిక కార్యకర్తగా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాలకు వెళ్లాను.. అక్కడి గిరిజన సమాజాలను సందర్శించి, వారితో మమేకమయ్యే అవకాశం నాకు లభించింది.

   దేశంలోని నలుమూలలా ఉన్న గిరిజన సమాజాలు, కుటుంబాలతో కొన్ని వారాలపాటు గడిపేవాడిని. ఆ విధంగా మీ సంప్రదాయాలను నిశితంగా గమనించాను.. వాటిని అనుసరించాను, వాటినుంచి ఎంతో నేర్చుకున్నాను. గుజరాత్‌లోనూ ఉమర్‌గావ్‌ నుంచి అంబాజీ వరకూ రాష్ట్ర తూర్పు ప్రాంతంలోని గిరిజన సోదరసోదరీమణుల సేవలో నా జీవితంలోని అత్యంత కీలక కాలం గడిపే అదృష్టం నాకు లభించింది. దేశం గురించి, మన సంప్రదాయాలు-వారసత్వం గురించి గిరిజనుల జీవనశైలి నాకెంతో నేర్పింది. అందుకే మీ మధ్య ఉన్నప్పుడు నాకు ఒక విభిన్న ఆర్ద్రత కలుగుతుంది. మనకు ప్రియమైన వారితో ఇదొక ప్రత్యేక బంధమనే భావన కలుగుతుంది.

మిత్రులారా!

   నేడు దేశం గిరిజన సమాజంతో సగర్వంగా మమేకమై ముందడుగు వేస్తున్న తీరు మునుపెన్నడూ ఎరుగని పరిణామం. వివిధ దేశాల అధినాయకులను కలిసిన సందర్భాల్లో  గిరిజన సోదరసోదరీమణులు తయారుచేసిన వస్తువులను వారికి బహూకరించే ప్రయత్నం చేస్తుంటాను. నేడు ప్రపంచవ్యాప్త ప్రధాన వేదికలపై ప్రాతినిధ్యం సందర్భంగా గిరిజన సంప్రదాయాన్ని భారతదేశం తన వారసత్వంగా ఎంతో గర్వంగా ప్రదర్శిస్తుంది. వాతావరణ మార్పు, భూతాపం పెరుగుదల వంటి ప్రపంచ సవాళ్లకు పరిష్కారం నా గిరిజన సంప్రదాయాల జీవనశైలిలోనే ఉందని నేడు భారతదేశం ప్రపంచానికి చాటుతోంది. వారి జీవనశైలిని గమనించడం అన్నది మనకు మార్గాన్వేషణలో తోడ్పడుతుంది. ఇవాళ సుస్థిర ప్రగతి విషయానికొస్తే మన గిరిజన సమాజం నుంచి ప్రపంచం నేర్చుకోవలసింది ఎంతో ఉందని మనం సగర్వంగా చెప్పగలం. ప్రస్తుత తరం చెట్లు, అడవులు, నదులు, పర్వతాలతో కూడిన ప్రకృతితో మమేకం కావడంపై మన గిరిజన సోదరసోదరీమణులు స్ఫూర్తినిస్తున్నారు. ప్రకృతి వనరుల వినియోగంతోపాటు వాటి సంరక్షణ-పరిరక్షణ గురించి వారినుంచి నేర్చుకోవాలి. ఈ వాస్తవాన్నే నేడు ప్రపంచం మొత్తానికీ భారతదేశం చాటి చెబుతోంది.

మిత్రులారా!

   భారతదేశ సంప్రదాయ ఉత్పత్తులకు.. ముఖ్యంగా గిరిజన సమాజం తయారుచేసే వస్తువులకు ఇవాళ దేశదేశాల్లో డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఆ మేరకు ఈశాన్య రాష్ట్రాల ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వెదురు ఉత్పత్తులకు ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో వెదురు నరకడం, ఉపయోగించడంపైగల చట్టపరమైన ఆంక్షలు మీకు గుర్తుండే ఉంటాయి. ఆ పరిస్థితిని చక్కదిద్ది వెదురును గడ్డి జాతులలో చేర్చడం ద్వారా ఆనాటి ఆంక్షలన్నింటినీ రద్దుచేశాం. అందుకే వెదురు ఉత్పత్తులు ఇప్పుడు భారీ పరిశ్రమలో భాగం కాగలిగాయి. గిరిజన ఉత్పత్తులు గరిష్ఠ సంఖ్యలో మార్కెట్‌లకు చేరుతున్నాయి. వాటికి గుర్తింపుతోపాటు డిమాండ్ పెరగడం లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.

   దీనికి మనముందున్న ప్రత్యక్ష నిదర్శనం ‘వన్‌ధన్‌’ పథకం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 3000కుపైగా ‘వన్‌ధన్‌ వికాస్’ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక 2014కు ముందు  కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పరిధిలోకి వచ్చే చిన్నతరహా అటవీ ఉత్పత్తుల సంఖ్య చాలా స్వల్పం కాగా, ఇప్పుడు 7 రెట్లు పెరిగింది. ఆ మేరకు దాదాపు 90 చిన్నతరహా అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం కనీస మద్దతు ధర పరిధిలోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా 50,000కుపైగా వన్‌ధన్‌ స్వయం సహాయ సంఘాల ద్వారా లక్షలాది గిరిజనులు లబ్ధి పొందుతున్నారు. దేశంలో ఏర్పాటయ్యే స్వయం సహాయ బృందాల పెద్ద నెట్‌వర్క్ ద్వారా గిరిజన సమాజం కూడా ప్రయోజనం పొందుతోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 80 లక్షలకుపైగా ఇలాంటి బృందాలు పనిచేస్తుండగా, వాటిలో మన తల్లిదండ్రుల వంటివారు సహా 1.25 కోట్ల మందికిపైగా గిరిజన సభ్యులున్నారు. తద్వారా గిరిజన మహిళలకూ అధిక ప్రయోజనం కలుగుతోంది.

సోదరసోదరీమణులారా!

   గిరిజన కళలను ప్రోత్సహించడం, గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంపైనా ప్రభుత్వం ఇవాళ ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా సంప్రదాయ చేతివృత్తుల వారికోసం ఈ ఏడాది బడ్జెట్‌లో ‘పీఎం-విశ్వకర్మ’ పథకం ప్రకటించబడింది. ఈ పథకం కింద మీకు ఆర్థిక సహాయం అందుతుంది. అంతేకాకుండా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు మీ ఉత్పత్తుల విక్రయానికి మద్దతు కూడా లభిస్తుంది. తద్వారా మీ యువతరం ఎంతో ప్రయోజనం పొందుతుంది. అంతేకాదు మిత్రులారా! ఈ కృషి కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం కాదు. దేశవ్యాప్తంగా వందలాది గిరిజన సమాజాలున్నాయి. వాటన్నిటిలోనూగల విభిన్న సంప్రదాయాలు, నైపుణ్యాలకు తగిన అపార అవకాశాలు అందివస్తాయి. తదనుగుణంగా సరికొత్త గిరిజన పరిశోధన సంస్థలు దేశవ్యాప్తంగా ఏర్పాటవుతాయి. ఈ కృషి ఫలితంగా గిరిజన యువతకు వారి ప్రాంతాల్లోనే వినూత్న అవకాశాలు చేరువ కాగలవు.

మిత్రులారా!

   గుజరాత్ ముఖ్యమంత్రిగా 20 ఏళ్ల కిందట నేను పదవీ బాధ్యతలు చేపట్టినపుడు ఒక వాస్తవాన్ని గుర్తించాను. రాష్ట్రంలో ఇంత పెద్ద గిరిజన సమాజం ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు వారి ప్రాంతాల్లోగల పాఠశాలలకు విజ్ఞానశాస్త్ర కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ, ఇప్పుటి పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి! గిరిజన బిడ్డలు విజ్ఞానశాస్త్రం చదవకపోతే వారు డాక్టర్లు లేదా ఇంజనీర్లు కావడం సాధ్యమా? అందుకే గిరిజన ప్రాంతాలన్నిటా పాఠశాలల్లో విజ్ఞానశాస్త్ర విద్యకు చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సవాలును మేం పరిష్కరించాం. దేశంలోని ప్రతి మూలనగల గిరిజన బాలల చదువు-భవిష్యత్తుకు నేనెంతో ప్రాధాన్యం ఇస్తాను.

   దేశంలో ఇవాళ ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల సంఖ్య  ఐదురెట్లు పెరిగింది. ఈ మేరకు 2004-14 మధ్య పదేళ్లలో 90 పాఠశాలలు మాత్రమే ప్రారంభించారు. కానీ, 2014-22 మధ్య ఎనిమిదేళ్లలో 500కుపైగా పాఠశాలలకు ఆమోదం ఇవ్వగా, ఇప్పటికే 400కుపైగా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త పాఠశాలల్లో లక్ష మందికిపైగా గిరిజన విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పాఠశాలలకు 40 వేల మందికిపైగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల నియామకం చేపట్టనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించబడింది. షెడ్యూల్డ్ తెగల యువతకు విద్యార్థి ఉపకారవేతనం కూడా రెండు రెట్లు పెరిగింది. ప్రస్తుతం 30 లక్షల మంది విద్యార్థులు దీనిద్వారా ప్రయోజనం పొందుతున్నారు.

మిత్రులారా!

   భాషాపరమైన అవరోధాలతో గిరిజన యువత ఎన్నో కష్టనష్టాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం మాతృభాషలో విద్యాబోధనకు జాతీయ విద్యావిధానంలో వీలు కల్పించబడింది. ఇకపై మన గిరిజన బాలలు, యువతరం వారి సొంత భాషలో చదుకుంటూ ముందడుగు వేయగలుగుతారు.

మిత్రులారా!

   మాజంలో అట్టడుగున ఉన్నవారికి దేశం ప్రాధాన్యమిస్తే ప్రగతి ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయి. కాబట్టే, ‘బడుగు-బలహీన వర్గాలకు ప్రాధాన్యం’ మంత్రంతో మా ప్రభుత్వం దేశాభివృద్ధికి కొత్త కోణాలను జోడిస్తోంది. ప్రగతికాంక్షిత జిల్లాలు, సమితుల అభివృద్ధికి  ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో అధికశాతం గిరిజన ప్రాబల్యంగల ప్రాంతాలే. తదనుగుణంగా ఈసారి బడ్జెట్‌లో షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి కేటాయింపులు 2014తో పోలిస్తే 5 రెట్లు పెరిగాయి. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన, ఆధునిక మౌలిక వసతుల కల్పన కొనసాగుతోంది. ఆధునిక అనుసంధానంతో పర్యాటకంతోపాటు ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదంతో కునారిల్లిన దేశంలోని వేలాది గ్రామాలు ఇవాళ 4జీ సమాచార సంధానంలో భాగమయ్యాయి. ప్రధాన జీవన స్రవంతికి దూరంగా ఉండటంవల్ల వేర్పాటువాద ఎరకు చిక్కిన యువతరం నేడు ఇంటర్నెట్‌, మౌలిక సదుపాయాల ద్వారా అనుసంధానం కాగలుగుతున్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ సబ్‌కా ప్రయాస్’ అన్నదే దీనికి తారకమంత్రం. నేడు ఇది దేశంలోని మారుమూల ప్రాంతాల్లో  ప్రతి పౌరునికీ చేరువవుతోంది. ఇది ప్రాచీనత-ఆధునికతల సంగమం.. ఈ పునాదిపైనే సమున్నత నవ భారత సౌధం సగర్వంగా నిలుస్తుంది.

మిత్రులారా!

   మానత్వం, సామరస్యాలకు దేశమిస్తున్న ప్రాధాన్యం ఎంతటిదో 8-9 ఏళ్లుగా సాగుతున్న గిరిజన సమాజ ప్రయాణం సాక్ష్యమిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో తొలిసారి దేశ నాయకత్వం గిరిజనం ప్రతినిధి చేతికి అందింది. తొలిసారిగా ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని చేపట్టి భారతదేశానికి గర్వకారణమైంది. దేశంలోనే తొలిసారిగా ఇవాళ గిరిజన చరిత్రకు ఇంతటి గుర్తింపు దక్కుతోంది.

   దేశ స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన సమాజం పోషించిన కీలకపాత్ర గురించి మనందరికీ తెలుసు! కానీ, దశాబ్దాల తరబడి చరిత్రలోని ఆ సువర్ణాధ్యాయాలతోపాటు ఆ వీరులను, వారి త్యాగాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు సాగుతూ వచ్చాయి. నేడు అమృత మహోత్సవం సందర్భంగా చరిత్రలో కలసిపోయిన అధ్యాయాలను ప్రజల ముందుంచడానికి దేశం చొరవ చూపుతోంది.

   అలాగే భగవాన్‌ బిర్సా ముండా జయంతిని దేశం తొలిసారి గిరిజన ఆత్మగౌరవ దినోత్సవంగా నిర్వహించుకుంటోంది. తొలిసారిగా వివిధ రాష్ట్రాల్లో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల ప్రదర్శనశాలలు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా గత సంవత్సరంలోనే రాంచీ, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో భగవాన్‌ బిర్సా ముండా ప్రత్యేక మ్యూజియాలను ప్రారంభించే అవకాశం నాకు లభించింది. ఇది దేశంలోనే తొలిసారి అయినప్పటికీ, రాబోయే అనేక తరాలపై దీని ముద్ర కనిపిస్తుంది. ఈ స్ఫూర్తి అనేక శతాబ్దాలపాటు దేశానికి దిశానిర్దేశం చేస్తుంది.

మిత్రులారా!

   మనం మన గతాన్ని కాపాడుకుంటూ వర్తమానంలో కర్తవ్య స్ఫూర్తిని శిఖరాగ్రానికి చేర్చాలి. తద్వారా భవిష్యత్‌ స్వప్నాల సాకారానికి కృషి చేయాలి. ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆది మహోత్సవ్ వంటి కార్యక్రమాలు బలమైన మాధ్యమం. దీన్నొక కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లి ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలి. ఆ దిశగా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలి.

మిత్రులారా!

   భారతదేశం చొరవతో ఈ ఏడాది ప్రపంచం మొత్తం అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం నిర్వహించుకుంటోంది. ‘ముతక ధాన్యాలు’గా పిలిచే చిరుధాన్యాలు శతాబ్దాలుగా మన ఆరోగ్య సంరక్షకాలు మాత్రమేగాక మన గిరిజనం ఆహారంలో ప్రధాన భాగం. ఇవాళ భారతదేశం ఈ ముతక ధాన్యాన్ని ఓ రకమైన అద్భుత ఆహారం ‘శ్రీ అన్న’గా గుర్తించింది. ‘శ్రీ అన్న సజ్జ, శ్రీ అన్న జొన్న, శ్రీ అన్న రాగి తదితరాలను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. ఆది మహోత్సవం నేపథ్యంలో ఇక్కడి ఆహార విక్రయ స్టాళ్లలో ‘శ్రీ అన్న’ రుచి, సువాసనను కూడా మనం తెలుసుకోవచ్చు. గిరిజన ప్రాంతాల ఆహారాన్ని మనమూ వీలైనంతగా ప్రోత్సహించాలి.

    చిరుధాన్యాలతో ప్రజలకు ఆరోగ్య ప్రయోజనాలతోపాటు గిరిజన రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సమష్టి కృషితో మనం వికసిత భారతం కలను సాకారం చేసుకోగలమని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఇవాళ కేంద్ర మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఒక ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన గిరిజన సోదరీసోదరులు తాము తయారుచేసిన విభిన్న వస్తువులను ఇక్కడకు తెచ్చారు, ముఖ్యంగా తాజా వ్యవసాయ ఉత్పత్తులను అందరికీ అందించడానికి వచ్చారు. ఢిల్లీసహా సమీపంలోని హర్యానాలోగల గుర్గావ్, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ వేడుకలను సందర్శించాలని నేను బహిరంగంగా అభ్యర్థిస్తున్నాను. మరికొన్ని రోజులపాటు సాగే ఈ వేడుకల్లో మారుమూల అడవుల నుంచి వచ్చిన విభిన్న రకాల శక్తిమంతమైన ఉత్పత్తులు దేశ భవిష్యత్తును ఎలా నిర్మిస్తాయో గమనించండి.

   రోగ్య స్పృహగల, భోజనాల బల్లవద్ద ప్రతి అంశంపైనా జాగ్రత్త వహించేవారు.. ముఖ్యంగా తల్లులు, సోదరీమణులకు నాదొక విజ్ఞప్తి. ఒక్కసారి ఇక్కడకు వచ్చి చూడండి… మన అడవులు అందించే ఉత్పత్తులు ఎంత ఆరోగ్యకరమైనవో, మరెంత పోషకాలుగలవో నేరుగా గమనించండి. మీరు తప్పకుండా ముగ్ధులవుతారని నా విశ్వాసం. అంతేకాదు… రాబోయే రోజుల్లోనూ మీరు ఆ ఉత్పత్తుల కోసం ఆర్డర్ చేస్తూనే ఉంటారు. ఉదాహరణకు ఈశాన్య ప్రాంతాల్లో.. ముఖ్యంగా మేఘాలయ నుంచి మనకు పసుపు వస్తుంది. ఇందులోగల పోషక విలువలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో దొరికే పసుపులో ఉండకపోవచ్చు. మనం దీన్నొకసారి వాడితే ఆ వాస్తవం మనకు తెలిసివస్తుంది. ఆ తర్వాత మన వంటింట్లో ఈ పసుపునే వాడాలనే స్థిర నిశ్చయానికి వస్తాం. ఈ నేపథ్యంలో ఇక్కడికి దగ్గరలోగల ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ప్రజలు ఇక్కడికి రావాలని నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను. అంతేకాకుండా మన గిరిజన సోదరసోదరీమణులు ఇక్కడకు తెచ్చిన ఏ ఒక్క వస్తువూ వారు వెనక్కు తీసుకెళ్లే అవసరం రాకుండా చూడండి. మీ ఆదరణతో ప్రతి వస్తువూ అమ్ముడయ్యేలా చేయండి. ఇది కచ్చితంగా వారిలో కొత్త ఉత్సాహం నింపుతుంది… అంతేగాక మనకు ఎనలేని సంతృప్తినిస్తుంది.

   రండి… మనమంతా ఒక్కటై ఈ ఆది మహోత్సవాన్ని చిరస్మరణీయ రీతిలో విజయవంతం చేద్దాం. మీకందరికీ నా శుభాకాంక్షలు!

అనేకానేక ధన్యవాదాలు!

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi