మాన్య ప్రధాని కిషిడా ,
ఉభయ దేశాల ప్రతినిధులు
మీడియా మిత్రులు,
నమస్కారం !
ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న జపాన్ ప్రధానమంత్రి కిషిడా కు, ఆయన వెంట వచ్చిన ప్రతినిధివర్గానికి ముందుగా సాదర స్వాగతం. గత ఏడాది కాలంలో జపాన్ ప్రధానితో నేను చాలాసార్లు సమావేశమయ్యాము. నేను ఆయనను కలసిన ప్రతిసారి ఆయనలో సకారాత్మక వైఖరి, ఇండియా - జపాన్ సంబంధాలపట్ల నిబద్ధత నాకు కనిపించాయి. అందువల్ల, ఈ రోజు ఆయన రాక మన రెండు దేశాల మధ్య సహకారం నిలబెట్టుకోవడాని, అదే ఉరవడిలో కొనసాగడానికి ఎంతో ఉపయోగపడగలదు.
మిత్రులారా,
ఈ రోజు మా ఇద్దరి సమావేశం ప్రత్యేకమైనది అని చెప్పడానికి మరో కారణం ఉంది. ఈ ఏడాది ఇండియా జి20 దేశాల బృందానికి అధ్యక్షత వహిస్తుండగా, జపాన్ జి7 దేశాల బృందానికి అధ్యక్షత వహిస్తున్నది. అందువల్ల, రెండు దేశాలు తమ తమ ప్రాధాన్యత, ప్రయోజనాలకు అనుగుణంగా పని చేయడానికి ఇది మంచి అవకాశం. జి20 అధ్యక్షా హోదాలో ఇండియా ప్రాధాన్యతలు ఏమిటో ఈ రోజు నేను ప్రధానమంత్రి కిషిడా కు సవివరంగా తెలియజేశాను. ప్రపంచంలోని దక్షిణ దేశాల ప్రాధాన్యతలను తెలియజెప్పడమే జి20 అధ్యక్షతకు ముఖ్యమైనది. భారతీయ సంస్కృతి 'వసుధైక కుటుంబం' అనే భావనను నమ్ముతుంది. అందువల్లనే మేము ఇందుకు ఉపక్రమించాము.
మిత్రులారా,
రెండు దేశాలు పరస్పరం విశ్వసించే ప్రజాస్వామ్య విలువలపై మరియు అంతర్జాతీయ రంగంలో న్యాయపాలనను గౌరవించడంపై ఇండియా - జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక మరియు అంతర్జాతీయ భాగస్వామ్యం ఆధారపడి ఉంది. ఈ భాగస్వామ్యాన్ని పటిష్ఠపరచవలసిన ఆవశ్యకత మన రెండు దేశాలకు మాత్రమే ముఖ్యం కాదు, అది ఇండో - పసిఫిక్ ప్రాంతంలో శాంతిని, సంపదను, సుస్థిరతను పెంపొందించడానికి తోడ్పడుతుంది.
మా సమావేశంలో ఈ రోజు, మన రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో జరిగిన ప్రగతిని మేము సమీక్షించాము. రక్షణ సామగ్రి మరియు టెక్నాలజీ సహకారం, వ్యాపారం, ఆరోగ్యం మరియు డిజిటల్ భాగస్వామ్యం గురించి పరస్పరం అభిప్రాయాలు తెలియజేసుకున్నాము. అర్ధవాహకం (సెమీకండక్టర్) మరియు ఇతర క్లిష్టమైన/విశేష టెక్నాలజీల విశ్వసనీయ సరఫరా శృంఖల ప్రాముఖ్యత గురించి మేము ఫలవంతమైన చర్చ జరిపాము. వచ్చే ఐదేళ్లలో ఇండియాలో జపాన్ పెట్టుబడులు 5 ట్రిలియన్ల యెన్లు చేరాలని అంటే 3 లక్షల 20 వేల కోట్ల పెట్టుబడులు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ దిశలో మంచి ప్రగతిని సాధించడం సంతృప్తికలిగించే విషయం.
ఇండియా - జపాన్ మధ్య పోటీతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ , ఎం ఎస్ ఎం ఈ, జవుళి, యంత్ర పరికరాలు మరియు ఉక్కు రంగాలలో భారతీయ పరిశ్రమలో పోటీని పెంచుతున్నాము. భాగస్వామ్యం క్రియాశీలకపాత్ర పట్ల కూడా మేము ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేశాము. ముంబై - అహమ్మదాబాద్ హై స్పీడ్ రైల్ నిర్మాణం పనులను కూడా మేము వేగంగా చేపడుతున్నాము. ఈ ఏడాది 2023ను మేము పర్యాటక మార్పిడి సంవత్సరంగా ఆచరిస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇందుకోసం మేము " హిమాలయాల పర్వతాలను ఫ్యూజీ పర్వతంతో జత కలపడం" అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నాము
మిత్రులారా,
మే నెలలో హిరోషిమా లో జరిగే జి7 దేశాల నాయకుల శిఖరాగ్ర సమావేశానికి రావలసిందిగా ప్రధానమంత్రి కిషిదా నన్ను ఆహ్వానించారు. ఇందుకు నేను ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి కిషిదాను ఇండియాకు జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించే అవకాశం నాకు కూడా మరికొన్ని నెలల్లో సెప్టెంబర్ మాసంలో రానున్నది. ఈ సమావేశాలు, చర్చల పరంపర అదేవిధంగా కొనసాగి, ఇండియా - జపాన్ సంబంధాలు ఎడతెగకుండా ముందుకు సాగి సమున్నత శిఖరాలకు చేరగలవనే అభిలాషతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
ధన్యవాదములు