ఉపాధ్యాయురాలు - గౌరవనీయ ప్రధాన మంత్రి గారూ, నమస్కారం! నా పేరు ఆశారాణి, జార్ఖండ్ లోని బొకారోలోని చందన్కియారీలోని '12 హైస్కూల్' లో పని చేస్తున్నాను.
ఉపాధ్యాయురాలు: సర్, ఒక సంస్కృత ఉపాధ్యాయురాలిగా, మన విలువలను, జీవన ఆదర్శాలను నిర్ణయించే మన సంస్కృతులన్నింటినీ ప్రతిబింబించే భారతీయ సంస్కృతిని పిల్లలకు పరిచయం చేయాలనేది నా కల. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని నా విద్యార్థుల్లో సంస్కృతం పట్ల ఆసక్తిని పెంపొందించి నైతిక విద్యకు పునాదిగా మార్చుకున్నాను. వివిధ శ్లోకాల ద్వారా వారికి జీవన విలువలను బోధించే ప్రయత్నం చేశాను.
ప్రధాన మంత్రి: వారిని సంస్కృతం వైపు ఆకర్షించడం ద్వారా, మీరు వారిని విస్తారమైన జ్ఞాన సంపద వైపు నడిపిస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మన దేశంలో లోతుగా అధ్యయనం చేయబడిన విషయం. వైదిక గణితం అంటే ఏమిటో మీరు ఎప్పుడైనా ఈ పిల్లలకు వివరించారా? ఒక సంస్కృత ఉపాధ్యాయురాలిగా, లేదా మీరు ఉపాధ్యాయుల గదిలో ఉన్న సమయంలో కూడా, మీ సహోద్యోగుల మధ్య ఎప్పుడైనా వేద గణితం గురించి చర్చ జరిగిందా? ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు కదా..!
ఉపాధ్యాయురాలు: లేదు సార్. ఇంకా లేదు.
ప్రధాన మంత్రి: సరే, మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా ప్రయత్నించండి. ఎవరికి తెలుసు, ఇది మీ అందరికీ కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. వైదిక గణితానికి ఆన్లైన్ తరగతులు కూడా అందుబాటులో ఉన్నాయి. యూకేలో ఇప్పటికే కొన్ని చోట్ల వేద గణితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చారు. గణిత శాస్త్రం పట్ల ఆసక్తి లేని పిల్లలకు కూడా ఇది ఆకర్షణీయంగా అనిపించవచ్చు, దాదాపు ఇంద్ర జాలం లాగా, ఒకసారి వారు దాని గురించి ఒక సంగ్రహావలోకనం పొందుతారు. వారు మరింత తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు.కాబట్టి, సంస్కృతం ద్వారా, మీరు వారికి మన దేశంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను పరిచయం చేయవచ్చు.
ఉపాధ్యాయురాలు: సర్, ఇది అద్భుతమైన సూచన. తప్పకుండా ముందుకు తీసుకెళ్తాను.
ప్రధాన మంత్రి: మీకు శుభాకాంక్షలు.
ఉపాధ్యాయురాలు: ధన్యవాదాలు సార్.
ఉపాధ్యాయుడు: గౌరవనీయులైన ప్రధాన మంత్రి, మీకు నా నమస్కారాలు. రాజర్షి షాహు జీ జన్మించిన మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుంచి నేను వచ్చాను.
ప్రధాన మంత్రి: ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు గొంతునొప్పి వచ్చిందా, లేక సహజంగానే అలా ఉందా?
ఉపాధ్యాయుడు: లేదు సార్, నా స్వరం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.
ప్రధాన మంత్రి: అయ్యో, మీ స్వరం సహజంగానే అలా ఉందా?
ఉపాధ్యాయుడు: అవును సార్, నేను మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుంచి వచ్చాను, నేను సామలవియా స్కూల్లో ఆర్ట్ ఉపాధ్యాయుడు ని . కొల్హాపూర్ రాజర్షి షాహు జన్మస్థలం.
ప్రధాన మంత్రి: అంటే, మీరు కళ కు సంబంధించిన విషయాలు బోధిస్తారా?
ఉపాధ్యాయుడు: అవును సార్. చిత్రలేఖనం, నృత్యం, నాటకం, సంగీతం, గానం, వాయిద్యాలు వాయించడం, హస్తకళలు, ఇతర కళారూపాలను నేను బోధిస్తాను.
ప్రధాన మంత్రి: అవును, అదైతే కనిపిస్తోంది ఇక్కడ.
ఉపాధ్యాయుడు: బాలీవుడ్ లేదా హిందీ సినిమా నృత్యాలు ప్రతిచోటా ఆధిపత్యం చెలాయిస్తాయి, కానీ నేను 23 సంవత్సరాలుగా బోధిస్తున్న నా పాఠశాలలో, జానపద, శాస్త్రీయ నృత్యాలతో సహా భారతీయ సంస్కృతి ఆధారంగా ప్రదర్శనలకు కొరియోగ్రఫీ చేశాను. శివ తాండవ స్తోత్రం కూడా చేశాను. 200-300 మంది కుర్రాళ్లతో పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తూ, విశ్విక్రాం వంటి కార్యక్రమాలను నిర్వహించాను. ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా విశ్విక్రాం లో రికార్డ్ చేసిన ప్రదర్శనకు కొరియోగ్రఫీ కూడా చేశాను. శివ తాండవం, హనుమాన్ చాలీసా, అమ్మవారికి అంకితం చేసిన భక్తి గీతాలు చేశాను. ఈ ప్రదర్శనల వల్ల నాట్యంలో నా కృషికి గుర్తింపు లభించింది.
ప్రధాన మంత్రి: మీరు గొప్ప పని చేస్తున్నారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.
ఉపాధ్యాయుడు: అవును సార్, నేనే చేస్తాను, నా విధ్యార్థులు కూడా ప్రదర్శనలో పాల్గొంటారు.
ప్రధాన మంత్రి: నిజమే, కానీ మీరు మీ జీవితాన్ని అంకితం చేసిన విద్యార్థుల కోసం ఇంతకుమించి ఏమి చేస్తారు?
ఉపాధ్యాయుడు: సర్ , విధ్యార్థులే అన్నీ చేస్తారు కదా!
ప్రధాన మంత్రి: ఏం చేస్తారు?
ఉపాధ్యాయుడు: ఒకే కొరియోగ్రఫీలో 300 నుంచి 400 మంది పిల్లలు పనిచేస్తారు. కేవలం మా పాఠశాల విధ్యార్థులు మాత్రమే కాదు.. చుట్టుపక్కల మురికివాడల పిల్లలు, సెక్స్ వర్కర్ల పిల్లలు, వీల్ చైర్లలో ఉన్న పిల్లలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నాను. వారిని గెస్ట్ పెర్ఫార్మర్స్ గా ఆహ్వానిస్తున్నాను.
ప్రధాన మంత్రి: కానీ ఈ రోజుల్లో పిల్లలకు సినిమా పాటలంటే ఎక్కువ ఆసక్తి ఉండాలి కదా?
ఉపాధ్యాయుడు: అవును సార్. ఏదేమైనా, జానపద నృత్యంలో కనిపించే గొప్పతనం, లోతును నేను వారికి వివరిస్తాను, వారు నా మాట వినడం నా అదృష్టం.
ప్రధాన మంత్రి: దాని గురించి విందాం.
ఉపాధ్యాయుడు: అవును, నేను గత 10 సంవత్సరాలుగా ఇదంతా చేస్తున్నాను.
ప్రధాన మంత్రి: ఒక పిల్లవాడు తమ గురువు చెప్పేది వినకపోతే, వారు ఇంకెవరి మాట వింటారు? మీరు ఎంతకాలంగా బోధిస్తున్నారు?
ఉపాధ్యాయుడు: దాదాపు 30 ఏళ్లు అయింది సార్.
ప్రధాన మంత్రి: మీరు పిల్లలకు నృత్యం ద్వారా బోధించినప్పుడు, మీరు దాని ద్వారా ఒక రకమైన సందేశాన్ని ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఏ రకమైన సందేశాలను పిల్లలతో పంచుకుంటారు?
ఉపాధ్యాయుడు: అవును, నేను సామాజిక సందేశాలతో ప్రదర్శనలు సృష్టిస్తాను. ఉదాహరణకు, నేను మద్యపానం, డ్రైవింగ్ ప్రమాదాలపై ఒక నృత్య నాటకాన్ని నిర్వహించాను, దీనిని నేను వీధి నాటకంగా నగరం అంతటా ప్రదర్శించాను. మరో ఉదాహరణ నేను దర్శకత్వం వహించిన 'స్పర్శ్' అనే లఘుచిత్రం, ఇందులో సాంకేతిక బృందం మొత్తం నా విద్యార్థులే.
ప్రధాన మంత్రి: అయితే, గత కొన్ని రోజులుగా, మీరు వేర్వేరు వ్యక్తుల ఇళ్లను సందర్శించి ఉంటారు- ఈ వ్యక్తి ఇల్లు, ఆ వ్యక్తి ఇల్లు అని. మీరు చాలా అలసిపోయి ఉంటారు. మీరు ఎవరినైనా ప్రత్యేకంగా కలిశారా? మీ సందర్శన వల్ల ఎవరైనా ఏవైనా ప్రయోజనాలను పొందారా?
ఉపాధ్యాయుడు: అవును సార్, చాలా మంది, ముఖ్యంగా ఉన్నత విద్యలో ఉన్నవారు. పిలిస్తే తమ కాలేజీలకు రావడానికి నేను సిద్ధమేనా అని కూడా కొందరు అడిగారు.
ప్రధాని: కాబట్టి, మీరు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మీరు కూడా వాణిజ్యపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారా?
ఉపాధ్యాయుడు: అవును, నేను వాణిజ్యపరమైన పనుల్లో నిమగ్నమై ఉంటాను, కానీ—
ప్రధాన మంత్రి: అప్పుడు మీకు పెద్ద మార్కెట్ ఉండాలి.
ఉపాధ్యాయుడు: లేదు సార్, నేను స్పష్టంగా చెప్తాను. నేను వాణిజ్యపరంగా పని చేస్తున్నప్పుడు, నేను ఆ సంపాదనను ఒక ప్రయోజనం కోసం ఉపయోగిస్తాను. నేను సినిమాలకు కొరియోగ్రఫీ చేశాను, నేను 11 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాను. వాళ్లకు అండగా ఉండడానికి వాణిజ్యపరంగా పనిచేస్తాను.
ప్రధాన మంత్రి: వారి కోసం మీరు ఎలాంటి పని చేస్తారు?
ఉపాధ్యాయుడు: అనాథాశ్రమంలో ఉంటున్న ఈ పిల్లలకు కళలపై ఆసక్తి ఉండేది. పదోతరగతి తర్వాత వారిని యథావిధిగా ఐటీఐకి పంపాలని అనాథాశ్రమం భావించింది. నేను ఆ నిబంధనను ఉల్లంఘించాలనుకున్నాను, కాని వారు మొదట నిరాకరించారు. అలా పిల్లలను అనాథాశ్రమం నుంచి బయటకు తీసుకెళ్లి, వారికి ఉండటానికి స్థలం కల్పించి, వారి కళాత్మక ప్రతిభను పెంపొందించాను. ఎదిగే కొద్దీ తమ నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. వీరిలో ఇద్దరు ఆర్ట్ టీచర్లుగా, మరో ఇద్దరు సీబీఎస్ఈ బోర్డు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్లుగా పనిచేస్తున్నారు.
ప్రధాన మంత్రి: ఇది నిజంగా విశేషమే. చివరికి, ఇది మీరు చేసిన నమ్మశక్యం కాని పని. వేరే వారు అయితే ఆ పిల్లలను వదిలేసి ఉండవచ్చు, కానీ మీరు అలా చేయలేదు; మీరు వారిని దగ్గరికి తీసుకొని దత్తత తీసుకున్నారు. ఎంత గొప్ప పని ఇది.
ఉపాధ్యాయుడు: సర్, ఇది నా వ్యక్తిగతం. నేను స్వయంగా ఒక అనాథాశ్రమంలో పెరిగాను, కాబట్టి అది ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకున్నాను. అప్పట్లో నా దగ్గర ఏమీ లేదు. కాబట్టి, ఇప్పుడు, నేను అదృష్టం తక్కువ ఉన్న వారికి ఏదైనా ఇవ్వగలిగితే, అది నా గొప్ప అదృష్టం.
ప్రధాన మంత్రి: మీరు కళల ద్వారా జీవించడమే కాదు, విలువలతో జీవించారు. ఇది నిజంగా విశేషం.
ఉపాధ్యాయుడు ధన్యవాదాలు సార్.
ప్రధాన మంత్రి: సాగర్, మీ పేరు మీకు సరిగ్గా సరిపోతుంది.
ఉపాధ్యాయుడు: అవును సార్, మిమ్మల్ని కలుసుకునే అవకాశం రావడం, మీతో మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది గొప్ప గౌరవం.
ప్రధాన మంత్రి: మీకు నా శుభాకాంక్షలు.
ఉపాధ్యాయుడు: ధన్యవాదాలు సార్.
ఉపాధ్యాయుడు: నమస్కారం, గౌరవనీయ ప్రధాన మంత్రి.
ప్రధాని: నమస్తే.
ఉపాధ్యాయుడు: నా పేరు డాక్టర్ అవినాష్ శర్మ, హర్యానా విద్యా శాఖ లో ఇంగ్లిష్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. గౌరవనీయులైన సర్, ఆంగ్ల భాషను వినడం, అర్థం చేసుకోవడం చాలా సవాలుగా ఉన్న నేపథ్యాల నుండి వచ్చిన హర్యానాలోని నిరుపేద వర్గాల పిల్లల కోసం నేను ఒక భాషా ప్రయోగశాలను స్థాపించాను. ఈ భాషా ప్రయోగశాల కేవలం ఆంగ్లం మీద మాత్రమే దృష్టి పెట్టలేదు. ఇందులో ప్రాంతీయ భాషలు, మాతృభాషలు కూడా ఉన్నాయి.
జాతీయ విద్యావిధానం 2020 లో పిల్లల అభ్యసనను మెరుగుపరచడానికి కృత్రిమ మేధ, యంత్ర అభ్యాసాన్ని (మెషిన్ లెర్నింగ్) ఉపయోగించడంపై దృష్టి పెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కృత్రిమ మేధను ప్రయోగశాలలో పొందుపరిచాను. 'స్పీకోమీటర్' ,'టాక్పాల్' వంటి సాధనాలు ఏఐ ఆధారితమైనవి, ఇవి విద్యార్థులు సరైన ఉచ్చారణను నేర్చుకోవడానికి, ప్రావీణ్యం పొందడానికి సహాయపడతాయి. యునెస్కో, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ వేదికలతో పాటు ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో నా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించానని మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. ఈ అనుభవాల ప్రభావం నా తరగతి గదిలో కనిపించింది. నేడు, హర్యానాలోని ఒక ప్రభుత్వ పాఠశాల ఇండోనేషియాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులతో కనెక్ట్ అయ్యి, జ్ఞానం, అనుభవాలను పంచుకునే ప్రపంచ తరగతి గదిగా మారింది.
ప్రధాన మంత్రి: మీ అనుభవం గురించి, మీరు దీన్ని ఎలా సాధించారు అనే దాని గురించి మరింత పంచుకోగలరా, తద్వారా ఇతరులు కూడా దాని నుండి నేర్చుకోవచ్చు?
ఉపాధ్యాయుడు: సర్, మైక్రోసాఫ్ట్ స్కార్ప్టెన్ అనేది నేను నా విద్యార్థులకు పరిచయం చేసిన ప్రోగ్రామ్. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లతో వారి సంభాషణల ద్వారా, మన పిల్లలు వారి సంస్కృతి, వారి భాష, వారు విద్యాపరంగా పురోగమించే మార్గాల గురించి తెలుసుకోగలుగుతారు. ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను సార్. నేను ఉజ్బెకిస్తాన్ ను సందర్శించినప్పుడు, నేను నా అనుభవాలను నా విద్యార్థులతో పంచుకున్నాను, ఉజ్బెకిస్థాన్ లో ఆంగ్లం వారి విద్యా భాషగా ఉన్నట్లే, ఉజ్బెకిస్థాన్ లో ప్రజలు తమ మాతృభాష ఉజ్బెక్ మాట్లాడతారు, రష్యన్ అధికారిక, జాతీయ భాషగా ఉంది. ఆంగ్లం వారి విద్యావిషయక (అకడమిక్) భాష, ఇది విస్తృత ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి వారికి సహాయపడుతుంది. వారికి ఆంగ్లం అనేది కేవలం పాఠ్యప్రణాళికలో ఒక భాగం మాత్రమే కాదు. ఈ అవగాహన ఆంగ్లం నేర్చుకోవడంలో నిజమైన ఆసక్తిని రేకెత్తించింది, ఎందుకంటే వారు ఇప్పుడు విదేశాలలో మాత్రమే ఆంగ్లం మాట్లాడటం లేదని చూస్తున్నారు- ఇది వారికి సౌకర్యవంతంగా, సుపరిచితంగా మారుతోంది. అయితే ఆంగ్లం నేర్చుకోవడం మన భారతీయ విద్యార్థులకు ఎంత సవాలుతో కూడుకున్నదో వారికి కూడా అంతే సవాలుతో కూడుకున్నది.
ప్రధాన మంత్రి: మీరు పిల్లలను ప్రపంచానికి పరిచయం చేయడం అద్భుతంగా ఉంది, కానీ మీరు కూడా వారి స్వంత దేశం గురించి వారికి పరిచయం చేస్తున్నారా?
ఉపాధ్యాయుడు: తప్పకుండా సార్.
ప్రధాన మంత్రి: కాబట్టి, మన దేశంలో ఆంగ్లం నేర్చుకోవడానికి ప్రేరేపించే అంశాలు ఏమైనా ఉన్నాయా?
ఉపాధ్యాయుడు: సార్, ఈ ప్రయోగశాలలో భాషా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాను. ఆంగ్లం ఎల్లప్పుడూ పాఠ్యప్రణాళికలో భాగం, కానీ ఒక భాషను ఎలా నేర్చుకుంటారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నేను బోధించే విద్యార్థులు విభిన్న హరియాన్వి నేపథ్యాల నుండి వచ్చారు. ఉదాహరణకు, రోహ్ తక్ కు చెందిన ఒక పిల్లవాడు నుహ్ నుండి వచ్చిన పిల్లవాడి కంటే పూర్తిగా భిన్నమైన మాండలికాన్ని మాట్లాడతాడు.
ప్రధాన మంత్రి: అవును, ఇది మన ఇంట్లో టెలిఫోన్లు ఉన్న రోజులను గుర్తు చేస్తుంది.
ఉపాధ్యాయుడు: అవును సార్.
ప్రధాన మంత్రి: ఆ బాక్స్ ఒక ఫోన్. మా ఇంట్లో అప్పుడప్పుడు పేద కుటుంబానికి చెందిన ఓ మహిళ పనిలో సాయం చేయడానికి వచ్చేది. ఒకరోజు ఫోన్ మోగింది, ఆమె దాన్ని ఎత్తి సమాధానం చెప్పగానే "హలో" అంది. అది ఆమె ఎలా నేర్చుకుంది?
ఉపాధ్యాయుడు: సార్, అది భాషా నైపుణ్యాభివృద్ధిలో భాగం. వినడం, ఉపయోగించడం ద్వారా భాష సంపాదించబడుతుంది.
ప్రధాన మంత్రి: నిజమే! అందుకే భాషను మాట్లాడటం ద్వారా అంత త్వరగా నేర్చుకోవచ్చు. నేను గుజరాత్ లో ఉన్నప్పుడు, మహారాష్ట్ర నుండి ఒక కుటుంబం పని కోసం నడియాడ్ లోని నా ఇంటికి వచ్చింది. ఆ వ్యక్తి ప్రొఫెసర్ కావడంతో వృద్ధురాలైన తన తల్లిని వెంట తెచ్చుకున్నాడు. రోజంతా స్కూళ్లు, కాలేజీల్లోనే గడిపిన ఆయన ఆరు నెలలు గడుస్తున్నా స్థానిక భాషను నేర్చుకోలేదు. మరోవైపు చదువుకోని అతని తల్లి గుజరాతీ బాగా మాట్లాడటం నేర్చుకుంది. ఒక రోజు, నేను వారి ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు, ఆమె ఎలా నేర్చుకుందని అడిగాను. గుజరాతీ మాత్రమే మాట్లాడే ఇంటి పనిమనిషి నుంచి తాను దాన్ని నేర్చుకున్నానని ఆమె చెప్పింది. మాట్లాడటం ద్వారా భాషను నేర్చుకుంటారు.
ఉపాధ్యాయుడు: తప్పకుండా సార్.
ప్రధాన మంత్రి: ఇది నా పాఠశాల రోజులను గుర్తుకు తెస్తుంది. మా గురువు గారు చాలా కఠినంగా ఉండేవారు, మేము అతని పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్లం. రాజాజీ 'రామాయణం', 'మహాభారతం' రాశారని, 'రామాయణం'లోని డైలాగులు అందరికీ తెలుసు. భాష బాగా రాకపోయినా రాజాజీ 'రామాయణం' నెమ్మదిగా చదవాలని గురువు గారు పట్టుబట్టేవారు. నాకు కథ తెలుసు కానీ భాష తెలియదు. అయినా సాధన తో ముక్కలు, ముక్కలుగా (బిట్స్ అండ్ పీసెస్ ను) అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఒకట్రెండు మాటలు గుర్తుపట్టినా అతను సీతామాత గురించే మాట్లాడుతున్నాడని చెప్పగలను.
ఉపాధ్యాయుడు: తప్పకుండా సార్.
ప్రధాన మంత్రి: సరే, చాలా బాగుంది.
ఉపాధ్యాయుడు: ధన్యవాదాలు సార్.
ప్రధాన మంత్రి: హర హర మహదేవ్.
ఉపాధ్యాయుడు: హర హర మహదేవ్.
ప్రధాన మంత్రి: కాశీ ప్రజలకు ఈ రోజు ఎప్పుడూ 'హర హర మహదేవ్'తోనే ప్రారంభమవుతుంది.
ఉపాధ్యాయుడు: సార్, ఈ రోజు మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను వ్యవసాయ శాస్త్రాల సంస్థ (అగ్రికల్చరల్ సైన్స్ ఇన్ స్టిట్యూట్ )లో మొక్కల వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నాను. నా ప్రాధమిక దృష్టి స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై ఉంది. దురదృష్టవశాత్తూ క్షేత్రస్థాయిలో ఇంకా సక్రమంగా అమలుకు నోచుకోలేదు. పొలాల్లో అపూర్వ ఫలితాలను ఇచ్చే సులభమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు నేర్పించడమే నా లక్ష్యం. ఈ ప్రయత్నంలో పిల్లలు, విద్యార్థులు, మహిళలను భాగస్వామ్యం చేయడం కూడా కీలకమని నేను నమ్ముతున్నాను. అందుకే విద్యార్థులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ, రైతులతో కలిసి పనిచేస్తూ మహిళలను కూడా భాగస్వాములను చేస్తున్నాను. మేము అభివృద్ధి చేసిన సరళమైన పద్ధతులతో, మేము సుస్థిరత వైపు వెళుతున్నాం, రైతులు ఇప్పటికే ప్రయోజనాలను చూస్తున్నారు.
ప్రధాన మంత్రి: మీరేం చేశారో చెప్పగలరా?
ఉపాధ్యాయుడు: సార్, మేము విత్తన శుద్దీకరణ కోసం ఒక సాంకేతికతను అభివృద్ధి చేశాం. మేము కొన్ని స్థానిక సూక్ష్మజీవులను గుర్తించాం, వీటితో విత్తనాలను శుద్ధి చేసినప్పుడు, అభివృద్ధి చెందుతున్న వేర్లు అప్పటికే బాగా ఏర్పడతాయి. ఈ పంట చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మొక్కకు వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ ఎందుకంటే వేర్లు చాలా బలంగా ఉంటాయి, ఇది తెగుళ్ళు, వ్యాధులతో పోరాడటానికి అంతర్గత బలాన్ని ఇస్తుంది.
ప్రధాన మంత్రి: మీరు ప్రయోగశాలలో చేసిన పనిని వివరిస్తున్నారు. మీరు దీన్ని భూమిపై ఎలా వర్తింపజేస్తారు? ల్యాబ్ నుంచి భూమికి? రైతుల వద్దకు స్వయంగా వెళ్తున్నామని చెబుతున్నారు. వారు దానిని ఎలా అమలు చేస్తారు,వాటిని ఎలా ప్రారంభిస్తారు?
ఉపాధ్యాయుడు: సార్, మేము ఒక 'పౌడర్ ఫార్ములేషన్' సృష్టించాం, దానిని మేము రైతులకు పంపిణీ చేస్తాం. వారు తమ విత్తనాలను శుద్ధి చేయడానికి దీనిని ఉపయోగిస్తారు, మేము చాలా సంవత్సరాలుగా ఈ విధంగానే చేస్తున్నాం. ఇప్పటివరకు వారణాసి చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టాం, ప్రస్తుతం 3,000 మందికి పైగా మహిళలు ఈ సాంకేతికను నేర్చుకొని ఉపయోగిస్తున్నారు.
ప్రధాన మంత్రి: మరి ఈ రైతులు ఇతర రైతులకు కూడా నేర్పించగలరా?
ఉపాధ్యాయుడు: తప్పకుండా సార్. ఒక రైతు పౌడర్ సేకరించడానికి వచ్చినప్పుడు, వారు తరచుగా మరో నలుగురు రైతులకు కూడా తగినంత తీసుకుంటారు. రైతులు ఒకరినొకరు గమనించడం ద్వారా నేర్చుకుంటారు, మేము మొదట నేర్పిన వారి కంటే ఎక్కువ మంది ఈ పద్ధతిని అవలంబించారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర కచ్చితమైన సంఖ్య లేదు.
ప్రధాన మంత్రి: దీని వల్ల ఏ పంటలకు ఎక్కువ ప్రయోజనం చేకూరింది?
ఉపాధ్యాయుడు: ప్రధానంగా కూరగాయలు, గోధుమలు.
ప్రధాన మంత్రి: సేంద్రియ వ్యవసాయంపై, ముఖ్యంగా కూరగాయలు, గోధుమలపై మా దృష్టి ఉంది. భూమాతను పరిరక్షించడం గురించి ఆందోళన చెందుతున్న వారు భూమాత ఆరోగ్యానికి మనం ఎలా హాని కలిగిస్తున్నామోనని ఆందోళన చెందుతున్నారు. భూమిని రక్షించడం కీలకంగా మారింది, సేంద్రీయ వ్యవసాయం మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ విధానం గురించి శాస్త్రవేత్తల మధ్య చర్చ కొనసాగుతోంది.
ఉపాధ్యాయుడు: అవును సార్, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ రసాయనాల వాడకాన్ని నిలిపివేయాలని రైతులను పూర్తిగా ఒప్పించడానికి మేము ఇప్పటికీ కష్టపడుతతున్నాం . రసాయనాలు వాడకపోతే తమ పంటలు దెబ్బతింటాయని వారు భయపడుతున్నారు.
ప్రధాన మంత్రి: దానికి పరిష్కారం ఉంది. ఒక రైతుకు నాలుగు బిగాల భూమి ఉందనుకుందాం. అతను 25% -ఒక బిఘాపై ప్రయోగాలు చేయగలడు, మిగిలిన మూడింటిపై సంప్రదాయ పద్ధతులను కొనసాగించగలడు. సేంద్రియ వ్యవసాయానికి కొద్ది భాగాన్ని కేటాయించడం ద్వారా రైతుకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ చిన్న నష్టం జరిగినా, 10% లేదా 20% అనండి, ఆ నష్టాన్ని భరించవచ్చు, అతను తన మిగిలిన పంట సురక్షితంగా ఉండేలా చూస్తాడు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు ఈ విషయంలో ఎంతో నిబద్ధతతో పనిచేశారు. మీరు ఆయన వెబ్సైట్ను సందర్శిస్తే- మీలో చాలా మంది వ్యవసాయ నేపథ్యాల నుండి వచ్చారు కాబట్టి- మీరు సేంద్రీయ వ్యవసాయం గురించి చాలా సమాచారాన్ని కనుగొంటారు. ఇక్కడ మీరు చూసే LKM వద్ద ప్రతిదీ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి చేయబడుతుంది, ఎటువంటి రసాయనాలు అనుమతించబడవు. ఆచార్య దేవవ్రత్ గారు గోమూత్రాన్ని ఉపయోగించి ఒక అద్భుతమైన ఫార్ములాను అభివృద్ధి చేశారు, ఆ ఫలితాలు ఆకట్టుకున్నాయి. మీ విశ్వవిద్యాలయం దీనిని కూడా అధ్యయనం చేస్తే, మీరు ఏమి చేయవచ్చో అన్వేషించవచ్చు.
ఉపాధ్యాయుడు: తప్పకుండా సార్.
ప్రధాన మంత్రి: సరే, శుభాకాంక్షలు.
ఉపాధ్యాయుడు: ధన్యవాదాలు సార్.
ప్రధాన మంత్రి: వనక్కం (శుభాకాంక్షలు).
ఉపాధ్యాయుడు: వనక్కం, ప్రధానమంత్రి గారూ. నా పేరు ధౌట్రే గండిమతి. తమిళనాడులోని సేలంలోని త్యాగరాజ్ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి వచ్చిన నేను 16 ఏళ్లుగా పాలిటెక్నిక్ కాలేజీలో ఆంగ్ల భాష బోధిస్తున్నాను. నా పాలిటెక్నిక్ విద్యార్థుల్లో ఎక్కువ మంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారే. వారు తమిళ మీడియం పాఠశాలల నుండి వచ్చారు, కాబట్టి వారు ఆంగ్లంలో మాట్లాడటం లేదా కనీసం నోరు తెరవడం కష్టం.
ప్రధాన మంత్రి: కానీ తమిళనాడులో ప్రతి ఒక్కరికీ ఆంగ్ల భాష తెలుసు అనే అపోహ మనకు తరచుగా ఉంటుంది.
ఉపాధ్యాయుడు: నిజమే సార్, వారు ప్రాంతీయ భాషా మాధ్యమం నుండి చదివే గ్రామీణ ప్రజలు. కాబట్టి వారికి కష్టంగా ఉంది సార్. వారి కోసం బోధిస్తాం.
అందుకే నూతన విద్యావిధానం మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
ఉపాధ్యాయుడు: కాబట్టి ఆంగ్ల భాష నేర్పిస్తున్నాం సార్. ఎన్ఈపీ 2020 ప్రకారం, మేము ఇప్పుడు మాతృభాషతో సహా కనీసం మూడు భాషలను అభ్యసనలో చేర్చాం. మా స్వయంప్రతిపత్తి సంస్థలో దీన్ని ప్రవేశపెట్టి, ఇప్పుడు సాంకేతిక విద్యను మాతృభాషలో కూడా బోధిస్తున్నాం.
ప్రధాన మంత్రి: మీలో ధైర్యంగా ప్రయోగాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఉదాహరణకు, ఒక పాఠశాలలో 30 మంది పిల్లలు పూర్తిగా ఆంగ్లంలో చదువుతున్నట్లయితే, అదే వయస్సు గల మరో 30 మంది పిల్లలు వారి మాతృభాషలో అదే విషయాన్ని (సబ్జెక్టును) అభ్యసిస్తున్నట్లయితే, ఏ గ్రూపు మెరుగ్గా పనిచేస్తుంది? మీ అనుభవం ఏమిటి? మాతృభాషలో నేర్చుకున్నప్పుడు, పిల్లవాడు భావనను నేరుగా గ్రహిస్తాడు, అయితే ఆంగ్లంలో, పిల్లవాడు మానసికంగా ఆలోచనను ఆంగ్లం నుండి వారి మాతృభాషలోకి అనువదిస్తాడు, ఇది చాలా శక్తిని తీసుకుంటుంది. పిల్లలకు ముందుగా మాతృభాషలో బోధించాలి, ఆ తర్వాత ఆంగ్ల భాషను ఒక సబ్జెక్టుగా క్షుణ్ణంగా బోధించాలి.
ఒక సంస్కృత ఉపాధ్యాయుడు తరగతిలో ఉన్నప్పుడు సంస్కృతం మాత్రమే మాట్లాడినట్లుగా, ఆంగ్ల ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోకి ప్రవేశించిన క్షణం నుండి వారు వెళ్ళే వరకు ఆంగ్ల భాష మాత్రమే మాట్లాడుతారని నేను ఆశిస్తున్నాను. ఆంగ్లం లో కూడా అంతే ప్రావీణ్యం ఉండాలి. ఆంగ్లం లో ఒక వాక్యం, మాతృభాషలో మూడు వాక్యాల కలయిక ఉండకూడదు. పిల్లవాడు భాషను ఆ విధంగా గ్రహించలేడు. భాషలను బోధించడానికి మనం ఇంత అంకితభావంతో ఉంటే, అది ప్రయోజనకరంగా ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలనే ఆకాంక్షను పిల్లల్లో పెంపొందించాలి. ఉదాహరణకు, ఈ సంవత్సరం, వారు ఐదు వేర్వేరు రాష్ట్రాల నుండి పాటలను బోధించాలని పాఠశాలలు నిర్ణయించాలి. ఏడాదికి ఐదు పాటలు నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అస్సామీ పాట, లేదా మలయాళ పాట లేదా పంజాబీ పాట నేర్చుకోవచ్చు. వాస్తవానికి, పంజాబీ కష్టం కాదు. సరే, మీకు నా శుభాకాంక్షలు!
ఉపాధ్యాయుడు: ప్రధాన మంత్రి గారూ, నా పేరు ఉత్పల్ సైకియా, నేను అస్సాం నుంచి వచ్చాను. ప్రస్తుతం గౌహతిలోని నార్త్ ఈస్ట్ స్కిల్ సెంటర్ లో ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ లో శిక్షకుడిగా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ ఆరేళ్లు పూర్తి చేసుకున్నాను, నా మార్గదర్శకత్వంలో 200 కి పైగా సెషన్లను విజయవంతంగా నిర్వహించాను. నా ట్రైనీల్లో చాలా మంది ఇప్పుడు దేశవిదేశాల్లోని ఫైవ్ స్టార్ హోటళ్లలో పనిచేస్తున్నారు.
ప్రధాన మంత్రి: మీ కోర్సు ఎంతకాలం?
ఉపాధ్యాయుడు: ఇది ఏడాది కోర్సు సార్.
ప్రధాన మంత్రి: ఆతిథ్య శిక్షణ గురించి మీకు తెలుసా?
ఉపాధ్యాయుడు: అవును సర్. హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీసెస్.
ప్రధాన మంత్రి: ఫుడ్ అండ్ బేవరేజెస్(ఆహారం, పానీయాలు), అందులో మీరు ఏ నిర్దిష్ట నైపుణ్యాలను బోధిస్తారు?
ఉపాధ్యాయుడు: అతిథులతో ఎలా సంభాషించాలో, ఆహారాన్ని ఎలా వడ్డించాలో, పానీయ సేవను ఎలా అందించాలో మేము విద్యార్థులకు నేర్పుతాం. మేము తరగతి గదిలో విద్యార్థులను సిద్ధం చేస్తాం, అతిథి సమస్యలను పరిష్కరించడం, అతిథులతో వివిధ పరిస్థితులలో ఎలా మసలుకోవాలో వంటి వివిధ పద్ధతులను వారికి నేర్పుతాం, సర్.
ప్రధాన మంత్రి: మీరు కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా? ఇంట్లో, పిల్లలు తరచుగా, "నేను దీనిని తినాలని అనుకోవడం లేదు" లేదా "నేను దానిని తినాలనుకుంటున్నాను" అని చెబుతారు. కాబట్టి, పరిస్థితిని అదుపులో పెట్టడానికి మీరు అవలంభించే పద్ధతులను ( టెక్నిక్) నేర్పండి.
ఉపాధ్యాయుడు: పిల్లల కోసం నా దగ్గర ప్రత్యేకమైన పద్ధతులు అంటూ లేవు సార్, కానీ హోటల్లో అతిథుల పరంగా, మేము విద్యార్థులతో మర్యాదగా, వినయంగా వ్యవహరించడానికి శిక్షణ ఇస్తాం, వారి అవసరాలను వింటాం.
ప్రధాన మంత్రి: కాబట్టి, మీ దృష్టి ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్ పైనే ఉంది?
ఉపాధ్యాయుడు: అవును సార్. కచ్చితంగా సార్. సాఫ్ట్ స్కిల్స్.
ప్రధాన మంత్రి: మీ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు ఎక్కడ దొరుకుతాయి?
ఉపాధ్యాయుడు: భారతదేశం అంతటా, ఢిల్లీ, ముంబై వంటి ప్రదేశాలలో.
ప్రధాన మంత్రి: ప్రధానంగా పెద్ద పెద్ద హోటళ్లలో?
ఉపాధ్యాయుడు: అవును, పెద్ద హోటళ్లలో. 100 శాతం ప్లేస్ మెంట్ కు హామీ ఇస్తున్నాం. మా దగ్గర ఒక ప్రత్యేకమైన ప్లేస్మెంట్ బృందం ఉంది, అది దానిని చూసుకుంటుంది.
ప్రధాన మంత్రి: మీరు గౌహతిలో ఉన్నారు కాబట్టి, హిమంత జీని, ఆయన మంత్రులందరినీ వారి సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి, వారి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి మిమ్మల్ని అనుమతించమని నేను కోరితే- ఎందుకంటే అతిథులు వారిని సందర్శిస్తారు మరియు వారికి ఎడమ చేతితో లేదా కుడి చేతితో నీరు ఇవ్వాలో కూడా తెలియకపోవచ్చు- అది సాధ్యమేనా?
ఉపాధ్యాయుడు: అవును, కచ్చితంగా. అది చేయవచ్చు.
ప్రధాన మంత్రి: నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ హోటల్ మేనేజ్ మెంట్ స్కూల్ ఉండేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. శని, ఆదివారాల్లో మంత్రులు, వారి వ్యక్తిగత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని చెప్పాను. వారు బోధించాలని నిర్ణయించుకున్నారు . నాతో పనిచేసే పిల్లలు, నా వద్ద పనిచేసే తోటమాలి లేదా వంటవారు, ఇతర మంత్రులు కూడా శిక్షణ పొందుతున్నారు. మాకు 30 నుంచి 40 గంటల సిలబస్ ఉండేది. ఆ తర్వాత వారి పనితీరులో గణనీయమైన మార్పు కనిపించింది. వారు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు, అది వెంటనే కనిపించింది. వారి కుటుంబాలు బహుశా గమనించకపోవచ్చు, కానీ వారు ఈ కొత్త నైపుణ్యాలను ఎలా నేర్చుకున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా విశేషమైనది.
ఆ అనుభవం నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ విధానాన్ని మనం మరింత తరచుగా అవలంబించాలని నేను అనుకుంటున్నాను, ఇది ఒక బ్రాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మారుతుంది. ప్రజలు లోపలికి ప్రవేశించిన వెంటనే మర్యాదగా పలకరించడం లేదా ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులు టెలిఫోన్ లో ఎలా సమాధానం ఇస్తారు వంటి చిన్న విషయాలు కూడా ముఖ్యమైనవి. ఉదాహరణకు, కొంతమంది సమాధానం ఇచ్చినప్పుడు "జై హింద్" లేదా "నమస్తే" అని చెప్పడానికి శిక్షణ పొందుతారు, మరికొందరు "మీకు ఏమి కావాలి?" అని దురుసుగా అడగవచ్చు. అక్కడే తప్పు జరుగుతుంది. అటువంటి పరిస్థితులను సరిగ్గా నిర్వహించడానికి మీరు వారికి శిక్షణ ఇస్తారా?
ఉపాధ్యాయుడు: అవును సార్! నేను వారికి ఈ విషయాలు నేర్పుతాను.
ప్రధాన మంత్రి: మీకు అభినందనలు!
ఉపాధ్యాయుడు: ధన్యవాదాలు సార్!
ప్రధాని: బోరిసాగర్ తో మీకు ఏమైనా సంబంధం ఉందా?
ఉపాధ్యాయుడు: అవును సార్. మా తాతగారు బోరిసాగర్!
ప్రధాన మంత్రి: అయ్యో, ఆయన మీ తాతయ్యనా? అలాగా! ఆయన మా సమాజంలో ఒక ప్రసిద్ధ హాస్య రచయిత. అయితే, మీరు ఏమి చేస్తారు?
ఉపాధ్యాయుడు: సార్, నేను అమ్రేలీలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని, ఒక గొప్ప పాఠశాలను నిర్మించడం ద్వారా గొప్ప దేశాన్ని నిర్మించాలనే జీవిత మంత్రంతో నేను గత 21 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నాను.
ప్రధాని: మీ ప్రత్యేకత ఏంటి?
ఉపాధ్యాయుడు: సార్, జానపద గేయాల్లో నాకు ప్రావీణ్యం ఉంది.
ప్రధాన మంత్రి: మీరు చాలా పెట్రోల్ వాడుతున్నారని విన్నాను?
ఉపాధ్యాయుడు: అవును సార్! 2003 నుండి, మీ చొరవకు ధన్యవాదాలు, మా పాఠశాల 'ప్రవేశ్ ఉత్సవ్' వేడుక (వార్షిక పాఠశాల నమోదు ఉత్సవం) బైకులపై ఉపాధ్యాయులకు విజయవంతమైన కార్యక్రమం. సర్, నేను మా సాంప్రదాయ గార్బా పాటలు పాడతాను, కానీ నేను వాటిని విద్యా ఇతివృత్తాలను చేర్చడానికి స్వీకరించాను. ఉదాహరణకు "పంఖేడా". మీ అనుమతితో నేను పాడవచ్చా?
ప్రధాన మంత్రి: అవును, తప్పకుండా!
ప్రధాన మంత్రి: ఇది చాలా ప్రసిద్ధి చెందిన గుజరాతీ జానపద గీతం, కాదా?
ఉపాధ్యాయుడు: అవును సార్. ఇది గార్బా పాట.
ప్రధాన మంత్రి: పిల్లలను బడికి వెళ్ళడానికి, చదువుకోవడానికి ప్రోత్సహించడానికి- వారికి మీ స్వంత ప్రత్యేకమైన రీతిలో బోధించడానికి మీరు సాహిత్యం (లిరిక్స్) మార్చారు.
ఉపాధ్యాయుడు: అవును సార్. సర్, నేను 20 విభిన్న భాషల్లో పాడగలను.
ప్రధాన మంత్రి : 20? అరే వా !
ఉపాధ్యాయుడు: అవును సార్. నేను కేరళ గురించి బోధిస్తున్నట్లయితే, నేను తమిళంలో పాడతాను, ఉదాహరణకు, "వా" అంటే రండి, రాజస్థానీలో 'పధారో' అంటే స్వాగతం. నేను మరాఠీ, కన్నడతో పాటు ఇతర భాషలలో పాడటం నేర్పుతాను. భరతమాతకు నమస్కరిస్తున్నాను సార్!
ప్రధాన మంత్రి : అద్భుతం! చాలా బాగా చేశారు!
గురువు: ధన్యవాదాలు సార్.. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' అనేది నా జీవిత మంత్రం సార్!
ప్రధాన మంత్రి: అద్భుతం!
ఉపాధ్యాయుడు: సార్, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించడానికి నేను మరింత శక్తితో పని చేస్తూనే ఉంటాను.
ప్రధాన మంత్రి : చాలా బాగుంది!
ఉపాధ్యాయుడు: ధన్యవాదాలు సార్.
ప్రధాన మంత్రి: మీ ఇంటిపేరు చూడగానే వెంటనే నా రాష్ట్రంలో అద్భుతమైన హాస్య రచయిత అయిన మీ తాతగారు గుర్తుకొచ్చారు. అతను బాగా ప్రసిద్ది చెందాడు, కానీ మీరు అతని వారసత్వాన్ని కొనసాగిస్తారని నేను ఊహించలేదు. ఇది చూస్తుంటే నిజంగా ఆనందంగా ఉంది!
మిత్రులారా, మీ కోసం నాకు ప్రత్యేకమైన సందేశం ఏమీ లేదు, కానీ ఈ ఎంపిక ఒక ముఖ్యమైన విజయం అని నేను కచ్చితంగా చెబుతాను, ఇది సుదీర్ఘమైన, కఠినమైన ప్రక్రియ తర్వాత వస్తుంది. గతంలో ఏం జరిగిందో నేను చర్చించను, కానీ నేడు దేశంలో కొత్తగా ఏదైనా చేస్తున్న ప్రతిభావంతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాను. దీని అర్థం మనకంటే మంచి ఉపాధ్యాయులు లేరని కాదు, లేదా ఇతరులు వివిధ విషయాల్లో రాణించడం లేదని కాదు. ఇది ఒక దేశం, రత్నాల భూమి. కోట్లాది మంది ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారు, కానీ దృష్టి మీపై పడింది, ఇది మీకు కొన్ని ప్రత్యేక లక్షణాలను సూచిస్తుంది.
ముఖ్యంగా నూతన విద్యావిధానానికి సంబంధించి మీ కృషి ఎంతో విలువైనది. మన విద్యావ్యవస్థలో ఒక సబ్జెక్టు మన ఆర్థిక వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేయగలదు, కానీ భారతదేశం ఆ అవకాశాన్ని కోల్పోయింది. మనం దానిని తిరిగి పొందాలి, అది మన పాఠశాలలలో ప్రారంభం కావచ్చు- పర్యాటకంతో మొదలు పెట్టవచ్చు.
ఇప్పుడు, మేము విద్యార్థులకు బోధించాలా లేదా పర్యాటకంలో నిమగ్నం కావాలా అని మీరు అడగవచ్చు. మీరు పర్యాటకం (టూరిజం)లో పాల్గొనాలని నేను సూచించడం లేదు, కానీ దీనిని పరిగణించండి: చాలా పాఠశాల పర్యటనలు ఎక్కడ జరుగుతాయి? సాధారణంగా, వారు విద్యార్థి అనుభవించాల్సిన వాటి కంటే ఉపాధ్యాయుడు చూడని ప్రదేశాలను సందర్శిస్తారు. ఒక ఉపాధ్యాయుడు ఉదయ్ పూర్ ని సందర్శించకపోతే, వారు అక్కడ పాఠశాల పర్యటనను ప్లాన్ చేస్తారు, టిక్కెట్లు, ప్రయాణాల కోసం నిధులను సేకరిస్తారు , వారు వెళ్లిపోతారు.
బదులుగా, ప్రతి తరగతి విద్యార్థులకు నిర్దిష్ట గమ్యస్థానాలను నిర్దేశించి, ఒక సంవత్సరం మొత్తాన్ని ముందుగానే ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు 2024-2025 విద్యాసంవత్సరంలో 8, 9 తరగతుల విద్యార్థులు నిర్దిష్ట గమ్యస్థానానికి చేరుకుంటారు. బహుశా పాఠశాల సంవత్సరానికి 3 నుండి 5 గమ్యస్థానాలను ఎంచుకుంటుంది. ఈ గమ్యస్థానాల ఆధారంగా విద్యార్థులకు ప్రాజెక్టులను కేటాయిస్తుంది. ఎంచుకున్న గమ్యస్థానం కేరళ అనుకుందాం. 10 మంది విద్యార్థుల బృందాలకు వివిధ ప్రాజెక్టులను అప్పగించవచ్చు-కొందరు కేరళ సామాజిక ఆచారాలు, మరికొందరు దాని మత సంప్రదాయాలు, ఇంకొందరు దాని దేవాలయాలు, వాటి చరిత్రలను పరిశోధించారు. సంవత్సరం పొడవునా కేరళ గురించి చర్చలు జరుగుతాయి, విద్యార్థులను వారి సందర్శనకు సిద్ధం చేస్తాయి. వారు నిజంగా కేరళకు ప్రయాణించే సమయానికి, వారు చదివినదానికి, వారు చూసినదానికి సంబంధం కలిగి, ఆ ప్రదేశం గురించి లోతైన అవగాహన కలిగి ఉంటారు.
ఇప్పుడు, గోవా ఈ సంవత్సరం, అన్ని పాఠశాలలు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించాలని నిర్ణయించుకుంటే ఊహించండి. గోవా నలుమూలల నుంచి 1,000 నుంచి 2,000 మంది విద్యార్థులు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తుంటారని అనుకుందాం. ఇది విద్యార్థులను కొత్త ప్రాంతానికి పరిచయం చేయడమే కాకుండా, ఈశాన్యంలో పర్యాటకాన్ని కూడా పెంచుతుంది. స్థానిక ప్రజలు సందర్శకుల రాకను గమనించి, టీ స్టాల్స్ లేదా చిన్న దుకాణాలు వంటి మరిన్ని సేవల అవసరాన్ని గుర్తిస్తారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
భారతదేశం చాలా సువిశాల దేశం, మనం విద్యా రంగంలో పని చేస్తున్నాం. ప్రస్తుత ఆన్ లైన్ పోటీలో పాల్గొనడానికి మీ విద్యార్థులను మీరు ప్రోత్సహించవచ్చు, అక్కడ వారు తమ రాష్ట్రంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలపై ఓటు వేయవచ్చు. అయితే, అవి కేవలం టిక్ బాక్సులు మాత్రమే కాదు; వారు కొంత పరిశోధన చేసిన తరువాత పాల్గొనాలి. 'దేఖో అప్నా దేశ్' కింద పబ్లిక్ ఓటింగ్ ద్వారా ప్రతి రాష్ట్రంలోని ప్రధాన ఆకర్షణలను గుర్తించే ప్రయత్నంలో ఇది భాగం. దీంతో ఓటింగ్ ద్వారా గమ్యస్థానాలకు ఆన్లైన్ ర్యాంకింగ్ లభిస్తుంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది.
కానీ పర్యాటకం ఎలా పనిచేస్తుంది? ఇది పురాతన చర్చ: ఏది మొదట వస్తుంది, చికెన్ లేదా గుడ్డు? అభివృద్ధి జరగకపోవడం వల్లే పర్యాటకం లేదని కొందరు అంటుంటే, పర్యాటకమే అభివృద్ధికి దారితీస్తుందని మరికొందరు వాదిస్తున్నారు. అలాంటి గమ్యస్థానాలకు విద్యార్థుల పర్యటనలు నిర్వహించడం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు. బాగా ప్రణాళికాబద్ధమైన, రాత్రిపూట బస స్థానిక నివాసితులను హోమ్ స్టేలు లేదా ఇతర చిన్న వ్యాపారాలను తెరవడానికి ప్రోత్సహిస్తుంది, ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. పాఠశాలలుగా మనం సమష్టిగా పర్యటనలను ప్రణాళికా చేసుకుంటే, రెండేళ్లలో భారతదేశంలోని 100 ఉత్తమ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయవచ్చు. ఇది ఉపాధ్యాయుల విప్లవాత్మక సామర్థ్యానికి నిదర్శనం.
మీ రోజువారీ పాఠశాల కార్యకలాపాలలో, పర్యటనలు తరచుగా నిర్వహించబడతాయి, కానీ సరైన అధ్యయనం లేదా సన్నాహము లేకుండా. ఏడాది పొడవునా ఒక ప్రదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఆ తర్వాత సందర్శిస్తే, అది విద్యార్థుల విద్యను సుసంపన్నం చేయడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. మీ 8 లేదా 9 వ తరగతి విద్యార్థులను ఏదో ఒక సమయంలో సమీపంలోని విశ్వవిద్యాలయాన్ని సందర్శించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. విశ్వవిద్యాలయాన్ని సంప్రదించండి, మీ విద్యార్థులు దానిని చూడాలనుకుంటున్నారని వారికి తెలియజేయండి.
నేను గుజరాత్ లో ఉన్నప్పుడు ఒక నియమం ఉండేది. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి నన్ను ఆహ్వానిస్తే, నేను హాజరు కావడానికి అంగీకరిస్తాను, కాని నేను నాతో 50 మంది అతిథులను తీసుకువస్తాను. ఈ అతిథులు ఎవరు అని విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ ఆశ్చర్యపోయేది. ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా చెప్పినప్పుడు, వారు తరచుగా దానిని అనుచరులు లేదా మద్దతుదారులు అని భావిస్తారు. అయితే ఆ 50 మంది అతిథులు సమీప ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పిల్లలు, ముఖ్యంగా పేద ప్రాంతాలకు చెందిన పిల్లలని నేను స్పష్టం చేస్తున్నాను. స్నాతకోత్సవం సందర్భంగా ఈ చిన్నారులు ముందు వరుసలో కూర్చుంటారు.
నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ పిల్లలు స్నాతకోత్సవాన్ని చూసినప్పుడు, అది వారి మనస్సులో ఒక కలను నాటుతుంది-ఏదో ఒక రోజు, నేను కూడా టోపీ, గౌను ధరించి అవార్డును అందుకుంటాను. ఈ భావన వారి చైతన్యంలో లోతుగా పాతుకుపోతుంది. మీరు మీ విద్యార్థులను ఒక విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి అటువంటి సంఘటనల ప్రాముఖ్యతను వారికి చూపిస్తే, అది మీరు ఊహించలేని విధంగా వారికి స్ఫూర్తినిస్తుంది.
అదేవిధంగా, క్రీడా ఈవెంట్ల కోసం, దీనిని పరిగణించండి: బ్లాక్-స్థాయి క్రీడా పోటీ జరిగినప్పుడు, తరచుగా పిటి ఉపాధ్యాయుడు, పాల్గొనే విద్యార్థులు హాజరవుతారు. ఏదేమైనా, పాఠశాల మొత్తం చూడటానికి, మద్దతు ఇవ్వడానికి ఆదర్శవంతంగా ఉండాలి. కబడ్డీ మ్యాచ్ అయినా సరే పక్కనే ఉత్సాహభరితంగా ఉండిపోవాలి. ఈ సంఘటనలను గమనించడం వల్ల విద్యార్థులు స్వయంగా క్రీడాకారులుగా మారడానికి ప్రేరణ పొందవచ్చు, క్రీడాకారులు గర్వంగా భావిస్తారు, వారు తమకు మాత్రమే కాకుండా వారి సమాజానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని నమ్ముతారు.
ఉపాధ్యాయులుగా, అటువంటి అనుభవాలను పెంపొందించడానికి మనం నిరంతరం వినూత్న మార్గాలను అన్వేషించాలి. ఇప్పటికే ఉన్నదానికి కొంచెం అదనపు శ్రమను జోడించడం ద్వారా, ప్రభావాన్ని గణనీయంగా పెంచవచ్చు. ఈ విధానం పాఠశాలను మరింత ప్రసిద్ధి చెందడానికి మాత్రమే కాకుండా ఉపాధ్యాయులను చూసే విధానాన్ని కూడా మారుస్తుంది.
అంతేకాక, ఇతరులు ఎందుకు పురస్కారాలు (అవార్డులు) అందుకున్నారో మీ అందరికీ తెలియకపోవచ్చు. ఒక వ్యక్తి పురస్కారాన్ని అందుకున్నట్లయితే, ఇతరులు ఇలాంటి కారణాల వల్ల దానిని సంపాదించి ఉంటారని మీరు అనుకోవచ్చు. దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్న ఆ వ్యక్తుల్లోని ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకోవడం, వారి నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఆ గుణాలను మనం కూడా నేర్చుకోగలమా? ఇతరులు ఎలా శ్రేష్ఠతను సాధిస్తారనే దానిపై అంతర్దృష్టులను పొందడానికి ఈ నాలుగైదు రోజులను అధ్యయన పర్యటనగా ఉపయోగించండి.
నేను మీతో సంభాషిస్తున్నాను కాబట్టి, ఈ ప్రక్రియలో నేను మీ నుండి కూడా నేర్చుకుంటున్నాను. మీరు మీ పనిని ఎలా అనుసరిస్తారో చూడటం నాకు సంతోషంగా ఉంది. గతంలో మాకు పెన్ను స్నేహితులు ఉండేవారు. ఇప్పుడు, సోషల్ మీడియాతో, ఆ భావన ఇప్పుడు లేదు. కానీ మీ అందరితో వాట్సప్ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? సరే ఇది ఎప్పుడు సృష్టించబడింది? నిన్న? సరే ఇది 8-10 రోజులు, అంటే ఇది మంచి ప్రారంభం. మీ అనుభవాలను పంచుకోండి, ఒకరికొకరు మద్దతు ఇవ్వండి. మీరు ఇక్కడ తమిళనాడుకు చెందిన ఒక ఉపాధ్యాయుడిని కలిశారనుకుందాం. మీరు తమిళనాడు పర్యటన వెళ్దాం అనుకుంటే, అక్కడి ఉపాధ్యాయుడు తో మాట్లాడండి. అది మీకు ఎంత పెద్ద బలం అవుతాయో మీరు గ్రహిస్తారు. మీరు కేరళ, జమ్మూ కాశ్మీర్ లేదా మరొక ప్రాంతానికి చెందిన వ్యక్తిని కనుగొనవచ్చు. వారు మీకు సహాయం చేయడానికి సంతోషంగా ఉంటారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. అటువంటి నెట్వర్క్ ను సృష్టించడం ఐక్యతా భావాన్ని పెంపొందిస్తుంది. మన సమష్టి ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది. తామిద్దరం ఒకే కుటుంబం అని భావించే వ్యక్తుల సమూహాన్ని మీరు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను.
'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పంచుకున్న ఈ అనుభవాన్ని మించిన అనుభవం మరొకటి ఉండదు. చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా ఉపాధ్యాయులు గణనీయమైన మార్పును ఎలా పొందవచ్చో ఇది ప్రదర్శిస్తుంది.
"గురువు అంటే ఇది, గురువు అంటే అదే" వంటి వాక్యాలను నిరంతరం వింటూ మీరు అలసిపోవచ్చు. ఇది ఆగిపోవాలని మీరు కోరుకునేలా చేస్తుంది. నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను నా స్వార్థం కోసం ఈ మాట చెప్పడం లేదు. ఏదేమైనా, ఉపాధ్యాయులను అతిగా ప్రశంసించినప్పుడు, అది సరిపోతుందని మీకు అనిపించవచ్చు, అంతులేని ప్రశంసలు అవసరం లేదని నేను కూడా నమ్ముతున్నాను.
దానికి బదులుగా విద్యార్థిపై, వారి కుటుంబం మనపై ఉంచిన అపారమైన నమ్మకంపై దృష్టి పెడదాం. మంచి పరీక్షా ఫలితాల కోసం పెన్ను పట్టుకోవడం, కంప్యూటర్ వాడటం లేదా సిలబస్ గుర్తుంచుకోవడం నేర్చుకోవడానికి మాత్రమే ఆ కుటుంబం తమ బిడ్డను మనకు అప్పగించలేదు. తల్లిద౦డ్రులు తమ పిల్లలను మన దగ్గరకు పంపుతారు, ఎ౦దుక౦టే వారు పునాదిని ఇవ్వగలిగినప్పటికీ, ఆ 'ప్లస్ వన్'ను జోడించగలిగేది ఉపాధ్యాయుడేనని వారు నమ్ముతారు— తమ పిల్లవాడు నిజ౦గా ఎదగడానికి అవసరమైన అదనపు విలువ.
పిల్లల చదువుకు 'ప్లస్ వన్' ఎవరు జోడిస్తారు? అది ఉపాధ్యాయుడు. పిల్లల సాంస్కృతిక విలువలను (సంస్కారం) ఎవరు పెంచుతారు? ఉపాధ్యాయుడు.. వారి అలవాట్లను మెరుగుపరచడానికి ఎవరు సహాయపడతారు? మళ్లీ ఉపాధ్యాయుడే. కాబట్టి, మన బాధ్యత కేవలం సిద్ధాంతానికి అతీతమైనది— పిల్లలు ఇంట్లో పొందేదానికి మించి, వారి జీవితంలో అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి మనం అదనంగా ఏదైనా జోడించడానికి ప్రయత్నించాలి.
మీరు ఈ ప్రయత్నం చేస్తే, మీరు విజయం సాధిస్తారనే నమ్మకం నాకు ఉంది. మీరు ఈ పనిలో ఒంటరిగా లేరు- ఇతర ఉపాధ్యాయులతో నిమగ్నం అవ్వండి, మీ ప్రాంతం, రాష్ట్రంలోని వారితో సహకరించండి. నాయకత్వ పాత్రను స్వీకరించి మన దేశంలోని కొత్త తరాన్ని సిద్ధం చేయండి. ఈ రోజు మీరు బోధిస్తున్న పిల్లలు, కొన్ని సంవత్సరాలలో, శ్రామిక శక్తిలో ప్రవేశిస్తారు, వారికి 25 లేదా 27 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి, భారతదేశం ఇకపై ఈ రోజులా ఉండదు- అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.
ఆ అభివృద్ధి చెందిన భారతదేశంలో మీరు మీ రిటైర్మెంట్ పెన్షన్ పొందే అవకాశం ఉంది, కానీ ఈ రోజు మీరు పెంచుతున్న విద్యార్థులే ఆ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారు. ఇది ఒక పెద్ద బాధ్యత, గుర్తుంచుకోండి, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం కేవలం మోడీ విజన్ మాత్రమే కాదు- ఇది మనందరి సమిష్టి మిషన్.
ఈ అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మనమంతా కలిసి సమర్థులైన తరాన్ని సిద్ధం చేయాలి. నైపుణ్యం, బాధ్యతాయుతమైన పౌరులను పెంపొందించాలి. భవిష్యత్ క్రీడా పోటీల్లో 25 నుంచి 50 బంగారు పతకాలు సాధించాలని భావిస్తే ఆ అథ్లెట్లు ఎక్కడి నుంచి వస్తారు? ఈ రోజు మీరు బోధిస్తున్న విద్యార్థుల నుంచే అవి పుట్టుకొస్తాయి.
మీకు చాలా కలలు ఉన్నాయి, వాటిని సాకారం చేయడానికి ప్రయోగశాల మీ ముందు ఉంది-ముడిసరుకు, మీ తరగతి గదిలోని పిల్లలు. ఈ 'ప్రయోగశాల'లోనే మీరు ప్రయోగాలు చేయవచ్చు, ఆవిష్కరణలు చేయవచ్చు, అంతిమంగా భవిష్యత్తును రూపొందించవచ్చు. మీ ప్రయత్నాలతో మీరు కోరుకున్న ఫలితాలను సాధించవచ్చు.
మీ అందరికీ నా శుభాభినందనలు.
ధన్యవాదాలు!