11 ల‌క్ష‌ల మంది నూత‌న ల‌క్షాధికార మ‌హిళ‌ల‌కు స‌త్కారం, ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలను పంపిణీ చేసిన ప్ర‌ధాని
రూ.2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ విడుద‌ల‌, రూ. 5,000 కోట్ల బ్యాంకు రుణాల పంపిణీ
మాతృమూర్తుల‌, సోద‌రీమ‌ణుల జీవితాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి మా ప్ర‌భుత్వం పూర్తి నిబ‌ద్ద‌తతో ఉంది: ప్ర‌ధాని శ్రీ మోదీ
మ‌హారాష్ట్ర సంప్ర‌దాయాలు దేశ‌వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందాయి: ప్ర‌ధాని శ్రీ మోదీ
భార‌త‌దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిన‌ మ‌హారాష్ట్ర మాతృశ‌క్తి : ప్ర‌ధాని శ్రీ మోదీ
స‌మాజంతోపాటు దేశ భ‌విష్య‌త్తు నిర్మాణం కోసం ఎల్ల‌ప్పూడూ ఎన‌లేని సేవ‌లందించిన భార‌త‌దేశ మాతృశ‌క్తి: ప్ర‌ధాని శ్రీ మోదీ
ఒక సోద‌రి ల‌క్షాధికారి అయితే (లాఖ్ ప‌తి దీదీ) ఆ కుటుంబం మొత్తానికి ల‌బ్ధి జ‌రిగి వారి జీవితాల్లో మార్పు వ‌స్తుంది: ప్ర‌ధాని శ్రీ మోదీ
ఒక‌ప్పుడు భార‌తీయ మ‌హిళ‌ల్ని దూరం పెట్టిన‌ ప్ర‌తి రంగంలోకి వారికి ప్ర‌వేశం క‌ల్పిస్తున్నాం: ప్ర‌ధాని శ్రీ మోదీ
ప్ర‌భుత్వాలు మార‌వచ్చు, కానీ, ప్ర‌భుత్వ‌ప‌రంగా మా ముఖ్య‌మైన బాధ్య‌త మ‌హిలనీ, వారి జీవితాలనీ , వారి గౌర‌వ మ‌ర్యాద‌లనీ కాపాడ‌డ‌మే: ప్ర‌ధాని శ్రీ మోదీ
మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను నిలువ‌రించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి కేంద్ర‌ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌ల‌ను తీసుకుంటుంది: ప్ర‌ధాని భ‌రోసా

మహారాష్ట్ర సోదర సోదరీమణులకు!

జై శ్రీ కృష్ణ...

రేపు శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఈ సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఈ ప్రాంతానికి చెందిన నా తోటి మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారు, ఈ ప్రాంత ఆడబిడ్డ రక్షా ఖడ్సే గారు.  ఉప ముఖ్యమంత్రులు శ్రీ అజిత్ పవార్ గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చిన తల్లులు, సోదరీమణులు...  నా కళ్ళు చూడగలిగినంతవరకు ఇక్కడ మాతృమూర్తుల సముద్రం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ దృశ్యం మనసుకు ఎంతో  హాయినిస్తోంది.

నేను మాట్లాడే ముందు, నేపాల్ లో జరిగిన బస్సు ప్రమాదం గురించి నా ఆవేదనను వ్యక్తం చేయాలనుకుంటున్నాను. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన, ముఖ్యంగా జలగావ్ కు చెందిన మన స్నేహితులను చాలా మందిని కోల్పోయాం. బాధిత కుటుంబాలన్నింటికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదం జరిగిన వెంటనే భారత ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. వెంటనే నేపాల్ వెళ్లాలని మా మంత్రి రక్షా తాయ్ ఖడ్సేను కోరాం. వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చాం. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను.

 

మిత్రులారా,

నేడు 'లఖ్పతి దీదీల' ఈ మహత్తర సదస్సు జరుగుతోంది. నా 'ప్రియమైన సోదరీమణులు' పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది 'సఖి మండలాలు' (మహిళా స్వయం సహాయక సంఘాలు) కోసం రూ.6,000 కోట్లకు పైగా విడుదలయ్యాయి. అనేక పొదుపు సంఘాలతో అనుబంధం ఉన్న మహారాష్ట్రకు చెందిన మన సోదరీమణులకు కూడా కోట్లాది రూపాయల సాయం అందింది. ఈ డబ్బు లక్షలాది మంది సోదరీమణులను 'లఖ్పతి దీదీలు' చేయడానికి సహాయపడుతుంది. తల్లులు, సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

మీ అందరిలో మహారాష్ట్ర గర్వించదగ్గ సంస్కృతి, విలువలను నేను చూస్తున్నాను. మహారాష్ట్ర, ఈ విలువలు భారతదేశం అంతటా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. నేను నిన్ననే ఒక విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చాను. యూరప్ లోని పోలాండ్ వెళ్లాను. అక్కడ కూడా మహారాష్ట్ర ప్రభావం చూశాను. మహారాష్ట్ర సంస్కృతి, విలువలను చూశాను. పోలండ్ ప్రజలు మహారాష్ట్ర ప్రజలను ఎంతో గౌరవిస్తారు. ఇక్కడ కూర్చొని దీన్ని ఊహించలేం. అక్కడ రాజధానిలో కొల్హాపూర్ మెమోరియల్ ఉంది. కొల్హాపూర్ ప్రజల సేవ, ఆతిథ్యాన్ని గౌరవిస్తూ పోలాండ్ ప్రజలు ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు.

కొల్హాపూర్ రాజకుటుంబం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పోలాండ్ నుండి వేలాది మంది తల్లులు, పిల్లలకు ఆశ్రయం ఇచ్చిందని మీలో కొంతమందికి తెలుసు. ఛత్రపతి శివాజీ మహరాజ్ విలువలకు అనుగుణంగా రాజకుటుంబం, సాధారణ ప్రజలు శరణార్థులకు సేవలందించారు. మహారాష్ట్ర ప్రజల సేవ, మానవత్వం పట్ల చూపుతున్న ప్రేమకు ప్రశంసలు వినగానే నా మనస్సు గర్వంతో ఉప్పొంగింది. మహారాష్ట్రను అభివృద్ధి చేస్తూ అంతర్జాతీయంగా దాని పేరును పెంచాలి.

 

మిత్రులారా,

మహారాష్ట్ర విలువలను ఇక్కడి ధైర్యవంతులు, దృఢ సంకల్పం కలిగిన తల్లులు సృష్టించారు. ఈ భూమిలోని మాతృశక్తి యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చింది. మా జల్గావ్ వార్కారీ సంప్రదాయానికి చెందిన పుణ్యక్షేత్రం. ఇది గొప్ప సాధువు ముక్తాయ్ భూమి. ఆమె ధ్యానం, తపస్సు నేటి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. బహినాబాయి కవితలు ఇప్పటికీ సమాజాన్ని కఠినమైన నిబంధనలకు అతీతంగా ఆలోచించేలా చేస్తున్నాయి. మహారాష్ట్రలోని ఏ మూల అయినా, చరిత్రలో ఏ కాలమైనా మాతృశక్తి సహకారం సాటిలేనిది. ఛత్రపతి శివాజీ జీవితానికి దిశానిర్దేశం చేసింది ఎవరు? మాతా జిజియా ఈ పని చేసింది.

ఆడపిల్లల చదువుకు, పనికి సమాజం ప్రాముఖ్యత ఇవ్వనప్పుడు సావిత్రిబాయి ఫూలే ముందడుగు వేశారు. అంటే, సమాజం, దేశ భవిష్యత్తును రూపొందించడంలో దేశ మాతృశక్తి ఎల్లప్పుడూ గణనీయమైన సహకారాన్ని అందించింది. నేడు, మన దేశం అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నప్పుడు, మన మాతృశక్తి మరోసారి ముందుకు వస్తోంది. రాజమాత జిజియా, సావిత్రిబాయి ఫూలేల ప్రభావం మహారాష్ట్రలోని సోదరీమణులందరిలోనూ కనిపిస్తోంది.

 

మిత్రులారా,

లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను మీ వద్దకు వచ్చినప్పుడు 3 కోట్ల మంది సోదరీమణులను 'లఖ్పతి దీదీలు'గా మార్చాలని చెప్పాను. అంటే స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తూ ఏడాదికి లక్ష రూపాయలకు పైగా సంపాదించే 3 కోట్ల మంది సోదరీమణులు. గత పదేళ్లలో కోటి మంది లఖపతి దీదీలు సృష్టించగలిగాం . గత రెండు నెలల్లోనే మరో 11 లక్షల మంది లఖపతి దీదీలు చేరారు. వీరిలో మహారాష్ట్ర నుంచి కొత్తగా లక్ష 'లఖ్పతి దీదీలు' పుట్టుకొచ్చారు. ఇక్కడి మహాయుతి ప్రభుత్వం ఈ విజయం కోసం ఎంతో కృషి చేసింది. ఏక్ నాథ్ జీ, దేవేంద్ర జీ, అజిత్ దాదా ల బృందం మొత్తం తల్లులు, సోదరీమణుల సాధికారతకు అంకితం చేయబడింది. తల్లులు, సోదరీమణులు, యువత, రైతుల కోసం మహారాష్ట్రలో అనేక పథకాలు, కొత్త కార్యక్రమాలు అమలవుతున్నాయి.

మిత్రులారా,

'లఖ్పతి దీదీలు' అనే ప్రచారం కేవలం అక్కాచెల్లెళ్ల ఆదాయాన్ని పెంచడమే కాదు. ఇది మొత్తం కుటుంబాలను, భవిష్యత్ తరాలను శక్తివంతం చేసే గొప్ప ప్రచారం. ఇది గ్రామాల మొత్తం ఆర్థిక వ్యవస్థను మారుస్తోంది. ఇక్కడ ఉన్న ప్రతి సోదరి, కుమార్తె సంపాదన ప్రారంభించినప్పుడు, ఆమె హక్కులు పెరిగి, కుటుంబంలో ఆమె గౌరవం పెరుగుతుందని బాగా తెలుసు. సోదరి ఆదాయం పెరిగినప్పుడు, కుటుంబం ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బు ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, ఒక సోదరి కూడా 'లఖ్పతి దీదీ'గా మారినప్పుడు, అది కుటుంబం మొత్తం తలరాతను మారుస్తుంది.

ఇక్కడికి రాకముందు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సోదరీమణుల అనుభవాలను వింటున్నాను. లఖ్పతి దీదీలందరిలోనూ ఆత్మవిశ్వాసం అమోఘం. నేను వారిని లఖ్పతి దీదీస్ అని పిలుస్తాను, కాని కొందరు రెండు లక్షలు, కొందరు మూడు లక్షల రూపాయలు, మరికొందరు ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. గత కొద్ది నెలల్లోనే వారు ఈ విజయాన్ని సాధించారు.

 

మిత్రులారా,

నేడు, భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని మీరు ప్రతిచోటా వింటున్నారు. ఈ విజయంలో మన సోదరీమణులు, కూతుళ్లది కీలక పాత్ర. అయితే కొన్నేళ్ల క్రితం ఈ పరిస్థితి ఉండేది కాదు. సోదరీమణులు ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో సంతోషానికి గ్యారంటీ. కానీ వారికి ఎలాంటి సాయం అందుతుందనే గ్యారంటీ ఎవరూ లేరు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది సోదరీమణుల పేరిట ఎలాంటి ఆస్తులు లేవు. వారికి బ్యాంకు నుంచి రుణం కావాలంటే అది లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కుదరలేదు. అందుకే మీ సోదరుడు, మీ కొడుకు ఒక తీర్మానం చేశారు. నా దేశం లోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు ఎదుర్కొంటున్న సమస్యలను నేను ఏ విధంగానైనా పరిష్కరించాలని నిర్ణయించుకున్నాను. అందుకే మోదీ ప్రభుత్వం మహిళలకు అనుకూలంగా నిర్ణయాలు ఒకదాని తర్వాత మరొకటి తీసుకుంది. ఒక వైపు గత ప్రభుత్వాల ఏడు దశాబ్దాలను మరొక వైపు మోదీ ప్రభుత్వ పది సంవత్సరాలతో పోల్చమని నేను మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. దేశంలోని సోదరీమణులు, కుమార్తెల కోసం మోదీ ప్రభుత్వం చేసిన పని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఏ ఇతర ప్రభుత్వం చేయలేదు.

 

మిత్రులారా,

పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది మా ప్రభుత్వమే. ఇప్పటివరకు నిర్మించిన 4 కోట్ల ఇళ్లలో ఎక్కువ భాగం మహిళల పేరిటే ఉన్నాయి. మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించబోతున్నాము, వీటిలో చాలా వరకు మన తల్లులు, సోదరీమణుల పేరిటనే ఉంటాయి. మేము చేసిన రెండవ ప్రధాన మార్పు బ్యాంకింగ్ వ్యవస్థలో. మొదట, మేము జన్ ధన్ ఖాతాలను ప్రారంభించాము, ఈ ఖాతాల్లో ఎక్కువ శాతం సోదరీమణుల పేరిటనే తెరిచారు. ఆ తర్వాత ముద్ర యోజనను ప్రారంభించి, పూచీకత్తు లేకుండా రుణాలు అందించాలని బ్యాంకులను ఆదేశించాం. అవసరమైతే మోదీ హామీగా అక్కడే ఉన్నారు. ఈ పథకం లబ్ధిదారుల్లో 70 శాతం మంది తల్లులు, సోదరీమణులే. దేశంలో కొందరు మహిళలకు రుణాలు ఇవ్వకూడదని, ఎందుకంటే అవి డిఫాల్ట్ (బకాయిలు చెల్లించలేరు)అవుతాయని, ఇందులో ప్రమాదం ఉందని చెప్పారు. కానీ నేను భిన్నంగా ఆలోచించాను. మీ మీద, మా మాతృశక్తి మీద, మీ నిజాయితీ మీద, మీ సామర్ధ్యాల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మా తల్లులు, సోదరీమణులు కష్టపడి నిజాయితీగా అప్పులు తీర్చారు.

ఇప్పుడు ముద్రా రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం. మేము వీధి వ్యాపారుల కోసం పిఎం స్వనిధి పథకాన్ని కూడా ప్రారంభించాము, పూచీకత్తు లేకుండా రుణాలను అందిస్తాము. ఈ పథకం మన సోదరీమణులు, కుమార్తెలకు కూడా చాలా ప్రయోజనం చేకూర్చింది. మా సోదరీమణులలో చాలా మంది హస్తకళలు చేసే విశ్వకర్మ సమాజంలో భాగం, మా ప్రభుత్వం వారికి హామీలు ఇచ్చింది.

 

మిత్రులారా,

స్వయం సహాయక సంఘాలు లేదా సఖి మండలాల గురించి నేను మాట్లాడినప్పుడు, వాటి ప్రాముఖ్యతను చూడగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ నేడు ఈ గ్రూపులు భారత ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన శక్తిగా మారుతున్నాయి. గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో సఖి మండలాలు తెచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత పదేళ్లలో 10 కోట్ల మంది సోదరీమణులు ఈ ఉద్యమంలో చేరారు, ఈ సంఖ్య చాలా పెద్దది. వాటిని బ్యాంకులతో అనుసంధానం చేశాం. వారికి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు పొందేలా చేశాం.

మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక గణాంకాన్ని నేను మీకు చెప్తాను, మన దేశం ఇంతకు ముందు ఎలా పనిచేసింది అనే దాని గురించి చెప్తే మీకు కోపం రావచ్చు. 2014 వరకు సఖి మండలాలకు రూ.25 వేల కోట్ల బ్యాంకు రుణాలు మాత్రమే ఇచ్చారు. గుర్తుంచుకోండి, నేను మహిళా స్వయం సహాయక సంఘాల గురించి మాట్లాడుతున్నాను- కేవలం 25,000 కోట్లు మాత్రమే. గత పదేళ్లలో దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. 25,000 కోట్లు, 9 లక్షల కోట్లు పోల్చండి. అంతేకాకుండా ప్రభుత్వం అందించే ప్రత్యక్ష ఆర్థిక సహాయం దాదాపు 30 రెట్లు పెరిగింది. ఫలితంగా గ్రామాల్లోని మన సోదరీమణులు తమ ఆదాయాన్ని పెంచుకుంటూ దేశాన్ని బలోపేతం చేస్తున్నారు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అక్కాచెల్లెళ్ల పాత్రను మరింత విస్తరిస్తున్నాం. ప్రస్తుతం 1.25 లక్షలకు పైగా బ్యాంకింగ్ కరస్పాండెంట్లు లేదా బ్యాంక్ సఖీలు గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారు. కొందరు సోదరీమణులు కోటి రూపాయల వరకు లావాదేవీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

డ్రోన్ పైలట్లుగా మారేందుకు మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో రైతులకు తోడ్పడేలా మహిళా సంఘాలకు లక్షల రూపాయల విలువైన డ్రోన్లను ఇస్తున్నాం. పశు పోషకులకు సహాయం చేయడానికి మేము 2 లక్షల పశు సఖీలకు (పశువుల పెంపకంలో నిమగ్నమైన మహిళలు) శిక్షణ ఇస్తున్నాము. ఆధునిక, ప్రకృతి సేద్యానికి నాయకత్వం వహించడానికి మహిళలకు సాధికారత కల్పిస్తున్నాం. ఇందుకోసం కృషి సఖి (అగ్రికల్చర్ ఫ్రెండ్) కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా గ్రామాల్లో లక్షలాది కృషి సఖిలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాలు ఆడపిల్లలకు ఉపాధి కల్పిస్తాయి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, ఆడపిల్లల సామర్థ్యానికి సంబంధించి సమాజంలో కొత్త మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి.

మిత్రులారా,

గత నెలలోనే దేశం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. తల్లులు, సోదరీమణులు, కూతుళ్లకు సంబంధించిన పథకాలకు బడ్జెట్ లో రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. ఎక్కువ మంది ఆడపిల్లలు పనిచేసేందుకు వీలుగా కార్యాలయాలు, కర్మాగారాలకు ప్రత్యేక సౌకర్యాలు ప్రకటించారు. పని చేసే మహిళలకు వారి పిల్లల కోసం హాస్టళ్లు, శిశుగృహాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఒకప్పుడు ఆంక్షలు ఎదుర్కొన్న ఆడపిల్లల కోసం మా ప్రభుత్వం ప్రతి రంగాన్ని తెరుస్తోంది. ప్రస్తుతం త్రివిధ దళాల్లో మహిళా అధికారులను నియమించి, మహిళలను ఫైటర్ పైలట్లుగా నియమిస్తున్నారు. కుమార్తెలు సైనిక్ స్కూల్స్, మిలటరీ అకాడమీల్లో ప్రవేశం పొందుతున్నారు. మన పోలీసు బలగాలు, పారామిలిటరీ యూనిట్లలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. గ్రామాల్లో వ్యవసాయం, పాడిపరిశ్రమల నుంచి స్టార్టప్ విప్లవం వరకు ఎంతోమంది ఆడపిల్లలు నేడు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో ఆడబిడ్డల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నారీ శక్తి వందన్ చట్టాన్ని తీసుకొచ్చాం.

మిత్రులారా,

తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు సాధికారత కల్పించడంతో పాటు, వారి భద్రత కూడా జాతీయ ప్రాధాన్యత. ఎర్రకోట నుంచి నేను ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించాను. మన అక్కాచెల్లెళ్లు ఏ స్థితిలో ఉన్నా వారి బాధలు, కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. మహిళలపై నేరాలు క్షమించరాని పాపాలని ప్రతి రాజకీయ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరుతున్నాను. దోషులు ఎవరే అయినా తప్పించుకోలేరు.. వారికి ఏ రూపంలో సహాయం చేసిన వారు కూడా తప్పించుకోకూడదు. అది ఆసుపత్రి అయినా, పాఠశాల అయినా, కార్యాలయం అయినా, పోలీస్ స్టేషన్ అయినా- ప్రతి స్థాయిలో జవాబుదారీతనం ఉండాలి. ఈ పాపం క్షమించరానిదని పై నుంచి కింది వరకు సందేశం స్పష్టంగా ఉండాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతాయి, కానీ ప్రాణాలను కాపాడటం, మహిళల గౌరవాన్ని కాపాడటం ఒక సమాజంగా, ప్రభుత్వంగా మనకు ముఖ్యమైన బాధ్యత.

 

మిత్రులారా,

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా మా ప్రభుత్వం చట్టాలను నిరంతరం బలోపేతం చేస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు ఈ రోజు ఇక్కడ ఉన్నందున, ఈ విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఎఫ్ఐఆర్లు సకాలంలో నమోదు కావడం లేదని, విచారణలు ఆలస్యమవుతున్నాయని, కేసులు ఎక్కువ కాలం నడుస్తున్నాయని గతంలో ఫిర్యాదులు వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో ఇలాంటి ఎన్నో అడ్డంకులను పరిష్కరించాం. ఇందులో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి మొత్తం అధ్యాయాన్ని కేటాయించారు. బాధిత మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లలేకపోతే ఇంటి నుంచే ఈ-ఎఫ్ ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. ఈ-ఎఫ్ఐఆర్తో పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎలాంటి జాప్యం, ట్యాంపరింగ్ జరగకుండా చూశాం. దర్యాప్తు వేగవంతం కావడానికి, దోషులను కఠినంగా శిక్షించడానికి ఇది దోహదపడుతుంది.

మిత్రులారా,

కొత్త చట్టాల్లో మైనర్లపై లైంగిక నేరాలకు మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి. ఆడపిల్లలను పెళ్లి పేరుతో మోసం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో దీనిపై స్పష్టమైన చట్టం లేదు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో పెళ్లి పేరుతో తప్పుడు వాగ్దానాలు, మోసాలు స్పష్టంగా నిర్వచించబడ్డాయి. మహిళలపై అఘాయిత్యాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. భారతీయ సమాజం నుంచి ఈ పాపపు మనస్తత్వాన్ని నిర్మూలించే వరకు మనం విశ్రమించకూడదు.

 

అందుకని మిత్రులారా,

నేడు, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే మార్గంలో ముందుకు సాగుతోంది, ఇందులో మహారాష్ట్ర గణనీయమైన పాత్ర పోషిస్తుంది. మహారాష్ట్ర 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) కి ప్రకాశవంతమైన నక్షత్రం. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు మహారాష్ట్ర ఆకర్షణీయమైన కేంద్రంగా  మారుతోంది. మరిన్ని పెట్టుబడులు, కొత్త ఉద్యోగావకాశాలపైనే మహారాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.

మహాయుతి ప్రభుత్వం పెట్టుబడులు, ఉద్యోగాలకు హామీ ఇస్తుంది. మహారాష్ట్రకు సుస్థిరమైన మహాయుతి ప్రభుత్వం చాలా సంవత్సరాలు అవసరం. మహారాష్ట్రకు ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సహించే ప్రభుత్వం అవసరం. యువత విద్య, నైపుణ్యాలు, ఉపాధిపై దృష్టి సారించే ప్రభుత్వం మహారాష్ట్రకు అవసరం. మహారాష్ట్ర సుస్థిరత, శ్రేయస్సు కోసం ఇక్కడి తల్లులు, సోదరీమణులు ముందుకు వచ్చి నాకు మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను.

సోదరీమణులారా, మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వ పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇస్తూనే, మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

నాతో పాటు చెప్పండి -

భారత్ మాతా కీ - జై

రెండు చేతులూ పైకెత్తి, పిడికిలి బిగించి, పూర్తి శక్తితో చెప్పండి. -

భారత్ మాతా కీ - జై

భారత్ మాతా కీ - జై

భారత్ మాతా కీ - జై

భారత్ మాతా కీ - జై

భారత్ మాతా కీ - జై

చాలా ధన్యవాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Government announces major projects to boost capacity at Kandla Port with Rs 57,000-crore investment

Media Coverage

Government announces major projects to boost capacity at Kandla Port with Rs 57,000-crore investment
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
President of the European Council, Antonio Costa calls PM Narendra Modi
January 07, 2025
PM congratulates President Costa on assuming charge as the President of the European Council
The two leaders agree to work together to further strengthen the India-EU Strategic Partnership
Underline the need for early conclusion of a mutually beneficial India- EU FTA

Prime Minister Shri. Narendra Modi received a telephone call today from H.E. Mr. Antonio Costa, President of the European Council.

PM congratulated President Costa on his assumption of charge as the President of the European Council.

Noting the substantive progress made in India-EU Strategic Partnership over the past decade, the two leaders agreed to working closely together towards further bolstering the ties, including in the areas of trade, technology, investment, green energy and digital space.

They underlined the need for early conclusion of a mutually beneficial India- EU FTA.

The leaders looked forward to the next India-EU Summit to be held in India at a mutually convenient time.

They exchanged views on regional and global developments of mutual interest. The leaders agreed to remain in touch.