భారత్ మాతా కీ- జై!
భారత్ మాతా కీ- జై!
మహారాష్ట్ర గవర్నరు శ్రీ సీపీ.రాధాకృష్ణన్ గారు, ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, శ్రీ అజిత్ పవార్ గారు.. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహారాష్ట్ర వాసులైన నా ప్రియమైన సోదర సోదరీమణులారా!
మహారాష్ట్ర దివ్య శక్తులకు… మూడున్నర శక్తి పీఠాలైన తుల్జాపూర్‌లోని భవానీ దేవి, కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి దేవి, మహూర్‌లోని రేణుకా దేవి, వాణిలోని సప్తశృంగి దేవీలకు నేను లెక్కలేనన్ని సార్లు నమస్కరిస్తున్నాను. థానే గడ్డపై ఉన్న కోపినేశ్వరుడి పాదాలకు పాదాభివందనం చేస్తున్నాను. ఛత్రపతి శివాజీకి, బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
సోదర సోదరీమణులారా,
ఈ రోజు నేను మీతో గొప్ప వార్తను పంచుకోవడానికి మహారాష్ట్రకు వచ్చాను. కేంద్ర ప్రభుత్వం మరాఠీ భాషకు ప్రాచీన భాష హోదా కల్పించింది. ఇది కేవలం మరాఠీ, మహారాష్ట్రకు దక్కిన గౌరవం మాత్రమే కాదు. జ్ఞానం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, సాహిత్యాలకు సంబంధించి గొప్ప సంస్కృతిని దేశానికి అందించిన సంప్రదాయానికి అందిన గౌరవం. ఈ విషయంలో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరాఠీ మాట్లాడే ప్రజలందరినీ అభినందిస్తున్నాను.
మిత్రులారా,
నవరాత్రుల సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం నా అదృష్టం. థానేకు రాకముందు నేను వాషింలో ఉన్నాను. అక్కడ దేశంలోని 9.5 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయడానికి, అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు నాకు అవకాశం లభించింది. ఇప్పుడు థానేలో మహారాష్ట్ర ఆధునిక అభివృద్ధికి అవసరమైన కీలక ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాం. మహారాష్ట్ర, ముంబయి-ఎంఎంఆర్ (ముంబై మెట్రోపాలిటన్ రీజియన్) అభివృద్ధిలో నేటి సూపర్ ఫాస్ట్ వేగం.. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును తెలియజేస్తోంది. ముంబయి-ఎంఎంఆర్‌లో 30,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను మహాయుతి ప్రభుత్వం ప్రారంభించింది. రూ.12 వేల కోట్లతో థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. వీటికి అదనంగా నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ ఇంపాక్ట్ నోటిఫైడ్ ఏరియా(నైనా ప్రాజెక్ట్), చెడ్డా నగర్ నుంచి ఆనంద్ నగర్ వరకు ఎలివేటెడ్ ఈస్టర్న్ ఫ్రీవే, థానే మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ప్రధాన కార్యాలయం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి.
మిత్రులారా,
నేడు ముంబయిలోని ఆరే నుంచి బీకేసీ (బాంద్రా కుర్లా కాంప్లెక్స్) వరకు ఆక్వా లైన్ మెట్రో కూడా ప్రారంభమైంది. ఈ మెట్రో లైన్ కోసం ముంబయి ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు నేను జపాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ద్వారా జపాన్ ఈ ప్రాజెక్టుకు భారీ సహాయాన్ని అందించి, భారత్, జపాన్ మధ్య స్నేహానికి చిహ్నంగా మార్చింది.
సోదర సోదరీమణులారా,
బాలాసాహెబ్ ఠాక్రేకు థానేతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇది దివంగత ఆనంద్ దిఘే గారి నగరం కూడా. ఈ నగరం దేశానికి మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషిని ఇచ్చింది. నేడు ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ మహనీయుల కలలను సాకారం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుల విషయంలో థానే, ముంబై ప్రజలతో పాటు మహారాష్ట్ర ప్రజలందరినీ నేను అభినందలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
నేడు దేశంలోని ప్రతి పౌరుడికీ ఒక లక్ష్యం ఉంది- అదే 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం). అందుకే మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి ప్రతిజ్ఞ, ప్రతి కల 'వికసిత్ భారత్'కు అంకింతమౌతున్నాయి. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముంబయి, థానే వంటి నగరాలను భవిష్యత్తుకు అనుగుణంగా సిద్ధం చేయాలి. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మిగిల్చిన లోటును పూడ్చుకుంటూ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నందున రెట్టింపు కష్టపడాలి. ముంబయి, థానే వంటి నగరాలను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎలా నడిపించాయో గుర్తుందా? జనాభా పెరుగుతోంది, ట్రాఫిక్ పెరుగుతోంది, కానీ ఆ సమస్యలకు పరిష్కారాలు ఉండేవి కావు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నెమ్మదించటం, నిలిచిపోవటం జరుగుతుందన్న భయం నిజమౌతున్నట్లు ఉండేది. ఈ పరిస్థితిని మార్చడానికి మా ప్రభుత్వం కృషి చేసింది. ప్రస్తుతం ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతంలో దాదాపు 300 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాల నిర్మాణం జరుగుతోంది. మెరైన్ డ్రైవ్ నుంచి బాంద్రాకు ప్రయాణం ఇప్పుడు కోస్టల్ రోడ్డు గుండా 12 నిమిషాల్లో పూర్తవుతుంది. అటల్ సేతు దక్షిణ ముంబయి, నవీ ముంబయి మధ్య దూరాన్ని తగ్గించింది. ఆరెంజ్ గేట్ నుంచి మెరైన్ డ్రైవ్ వరకు భూగర్భ సొరంగం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జాబితాలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, వాటన్నింటిని చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. వెర్సోవా-బాంద్రా సీ బ్రిడ్జ్, ఈస్టర్న్ ఫ్రీవే, థానే-బోరివాలి సొరంగం, థానే సర్క్యులర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ వంటి ప్రాజెక్టులు ఆయా నగరాల రూపురేఖలను మారుస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు ముంబయి ప్రజలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తాయి. అవి ముంబయి, దాని చుట్టుపక్కల నగరాలలో ఇబ్బందులను తగ్గించి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. అంతేకాకుండా పరిశ్రమలను పెంచుతాయి.
మిత్రులారా,
ఒకవైపు మహారాష్ట్ర అభివృద్ధికి అంకితమైన మహాకూటమి ప్రభుత్వం ఉంది. మరోపక్క అవకాశం దొరికినప్పుడల్లా అభివృద్ధి పనులను అడ్డుకునే కాంగ్రెస్, మహా అఘాడీలు ఉన్నాయి. అభివృద్ధి ప్రాజెక్టులను జాప్యం చేయడం, అడ్డుకోవడం, దారి మళ్లించడంలో మహా అఘాడీకి మంచి పేరుంది. ఇందుకు ముంబయి మెట్రోనే సాక్షి. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముంబయి మెట్రో లైన్ 3 పనులు ప్రారంభించారు. 60 శాతం పనులు ఆయన పదవీకాలంలో పూర్తయ్యాయి. కానీ అప్పుడు మహా అఘాడీ ప్రభుత్వం వచ్చి అహంకారంతో ప్రాజెక్టును నిలిపివేసింది. రెండున్నరేళ్ల పాటు నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.14,000 కోట్లు పెరిగింది! ఈ 14 వేల కోట్ల రూపాయలు ఎవరివి? అది మహారాష్ట్ర డబ్బు కాదా? ఇది రాష్ట్ర ప్రజల డబ్బు కాదా? ఇది మహారాష్ట్ర పన్ను చెల్లింపుదారులు కష్టపడి సంపాదించిన సొమ్ము.
సోదర సోదరీమణులారా,
ఒకవైపు పనులు పూర్తి చేసే మహాయుతి ప్రభుత్వం, మరోవైపు అభివృద్ధిని అడ్డుకునే మహా అఘాడీ ప్రజలు ఉన్నారు. మహా అఘాడీ అభివృద్ధి వ్యతిరేకమని తన ట్రాక్ రికార్డ్ ద్వారా నిరూపించింది. వారు అటల్ సేతును వ్యతిరేకించారు. ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలును అడ్డుకునేందుకు కుట్ర పన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముందుకు సాగనివ్వలేదు. మహారాష్ట్రలోని కరవు పీడిత ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులను కూడా అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టులు మహారాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉద్దేశించినవి. కానీ మహా అఘాడి ప్రభుత్వం వీటిని నిలిపివేసింది. మీకు సంబంధించిన పనులన్నీ నిలిపివేశారు. ఇప్పుడు, మీరు వారిని నిలిపివేయాలి. మహారాష్ట్రలో అభివృద్ధి విషయంలో శత్రువులను అధికారానికి దూరంగా ఉంచాలి-వారిని మైళ్ల దూరంలో ఉంచండి!
మిత్రులారా,
భారత్‌లో కాంగ్రెస్ అత్యంత నిజాయితీలేని, అవినీతి పార్టీ. ఏ కాలం అయినా, ఏ పరిస్థితి అయినా కాంగ్రెస్ స్వభావం మారదు! గత వారం జరిగిన సంఘటనలను ఒకసారి పరిశీలిస్తే.. భూకుంభకోణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేరు తెరపైకి వచ్చింది. వారి మంత్రుల్లో ఒకరు మహిళలను దూషిస్తూ, అవమానిస్తున్నారు. హర్యానాలో ఓ కాంగ్రెస్ నేత డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ భారీ స్థాయి హామీలు ఇస్తుంది. కానీ అధికారంలోకి రాగానే ప్రజలను దోపిడీ చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వారి కుంభకోణాలకు నిధులు సమకూర్చడానికి ప్రతిరోజూ కొత్త పన్నులు విధించడం వారి ఎజెండా. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పన్ను విధించింది. అదేమిటో ఊహించలేం. ఈ కొత్త పన్ను ఏమిటి? 'టాయిలెట్ ట్యాక్స్' విధించారు! ఓ వైపు మరుగుదొడ్లు నిర్మించుకోండి అని మోదీ చెబుతుంటే, మరోవైపు మరుగుదొడ్లపై పన్ను విధిస్తాం అంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ నిజంగా దోపిడీ, మోసాల ప్యాకేజి. వాళ్లు మీ భూమిని దొంగిలిస్తారు, యువతను మాదకద్రవ్యాలలోకి నెట్టేస్తారు. మీపై పన్నులు భారం మోపుతారు, మహిళలను దూషిస్తారు. గుర్తుంచుకోండి, నేను ఇటీవలి ఒక సందర్భాన్నే మాత్రమే మీతో పంచుకున్నాను, అది కూడా పరిమితమైన సమయం కారణంగా పూర్తిగా చెప్పలేదు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఇలానే చేస్తోంది.
సోదర సోదరీమణులారా,
ఇప్పటికే మహారాష్ట్రలో తమ నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టారు. మహారాష్ట్ర మహిళల కోసం మహాయుతి ప్రభుత్వం 'లడ్కీ బహిన్ యోజన'ను ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.1,500, ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు లభిస్తాయి. దీన్ని మహా అఘాడీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మహా అఘాడీ ప్రభుత్వానికి అవకాశం రాదు. కానీ ఒకవేళ వస్తే వాళ్లు తీసుకునే మొదటి చర్య షిండేపై తమ ఆగహాన్ని వెళ్లగక్కుతారు, షిండే ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేస్తారు. డబ్బులు అక్కాచెల్లెళ్ల చేతుల్లోకి కాకుండా దళారుల జేబుల్లోకి చేరాలని మహా అఘాడీ కోరుకుంటోంది. అందుకే మన మాతృమూర్తులు, సోదరీమణులు కాంగ్రెస్, మహా అఘాడీ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.
మిత్రులారా,
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశాభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఎందుకు ఇబ్బంది పడుతోందనే ప్రశ్న తరచూ ఉండేది. కానీ వారు అధికారానికి దూరమవడంతో వారే సమాధానం చెప్పారు. నేడు కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. కాంగ్రెస్‌ను ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ పురోగతిని ఆపాలనుకునేవారికి కాంగ్రెస్ ఇప్పుడు బహిరంగంగా మద్దతుగా నిలుస్తోంది. అందుకే ఘోర పరాజయాలు చవిచూసినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కలలు కంటోంది. తమ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఉంటుందని కాంగ్రెస్‌కు తెలుసు, కానీ ఇతరులు సులభంగా చీలిపోతారు. అందువల్ల కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు ఒక లక్ష్యం ఉంది: సమాజాన్ని విభజించడం, ప్రజలను విభజించడం, అధికారాన్ని చేజిక్కించుకోవడం. కాబట్టి గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మన ఐక్యతను దేశ రక్షణ కవచంగా మార్చుకోవాలి, దానికి కారణమైన వాళ్లు సంబరాలు చేసుకుంటారని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్, మహా అఘాడీ సభ్యుల ప్రణాళికలు విజయవంతం కానివ్వం.
మిత్రులారా,
కాంగ్రెస్ ఎక్కడ అడుగు పెట్టినా అది వినాశనానికి దారి తీస్తుంది. దేశాన్ని పేదరికంలోకి నెట్టేశారు! వారు మహారాష్ట్రను నాశనం చేశారు. మహారాష్ట్ర రైతులను నాశనం చేశారు. ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రాష్ట్రాలకు కూడా నాశనం చేశారు. అంతే కాదు వారితో అనుబంధం ఉన్న పార్టీలు కూడా నాశనమౌతున్నాయి. ఒకప్పుడు జాతీయవాదం గురించి మాట్లాడిన వారు ఇప్పుడు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అక్రమ వక్ఫ్ బోర్డు ఆక్రమణల తొలగింపునకు మా ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కాంగ్రెస్ కొత్త శిష్యులు తమ బుజ్జగింపు రాజకీయాలలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకించే పాపం చేస్తున్నారు. అక్రమ వక్ఫ్ బోర్డు ఆక్రమణల తొలగింపును అనుమతించబోమని చెబుతున్నారు. పైగా కాంగ్రెస్ నేతలు వీర్ సావర్కర్‌ను అవమానించడం, చెడుగా మాట్లాడటం చేసినా ఆ పార్టీ అనుచరులు వారికి అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ బాహాటంగానే ప్రకటిస్తుంటే వారి శిష్యులు మాత్రం మౌనంగానే ఉన్నారు. కేవలం కొత్త ఓటు బ్యాంకును సృష్టించుకోవడానికి భావజాలం క్షీణించడం, కాంగ్రెస్‌లో ఈ బుజ్జగింపు ధోరణి, కాంగ్రెస్ ప్రభావానికి లోనయ్యే ప్రతి ఒక్కరి అధోగతి స్పష్టంగా కనిపిస్తోంది.
మిత్రులారా,
నేడు దేశానికి, మహారాష్ట్రకు స్పష్టమైన విధానాలతో గల నిజాయితీ, స్థిరమైన ప్రభుత్వం అవసరం. భాజపా, మహాయుతి ప్రభుత్వం మాత్రమే దీన్ని సాధించగలవు. సామాజిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించింది భాజపా మాత్రమే. రహదారులు, ఎక్స్ ప్రెస్ రహదారులు, విమానాశ్రయాల అభివృద్ధిలో రికార్డులు నెలకొల్పాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మహారాష్ట్రలోని ప్రతి పౌరుడు ఈ సంకల్పానికి కట్టుబడి ఎన్డీయేకు అండగా ఉంటాడని నేను నమ్ముతున్నాను. అందరం కలిసి మహారాష్ట్ర కలలను సాకారం చేసుకుందాం. ఈ ఆత్మవిశ్వాసంతో.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, జరుగుతోన్న విస్తారమైన పనులకు సంబంధించి మీ అందరికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. నాతో పాటుగా అనండి:
భారత్ మాతా కీ- జై!
భారత్ మాతా కీ- జై!
భారత్ మాతా కీ- జై!
చాలా ధన్యవాదాలు!