భారత్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ జీ; కేంద్ర న్యాయ శాఖ మంత్రి, నా సహచరుడు శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ జీ; యుకె లార్డ్ చాన్సలర్ అలెక్స్ చాక్, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టుకు చెందిన సుప్రతిష్ఠులై న్యాయమూర్తులు; బార్ కౌన్సిల్ చైర్మన్, సభ్యులు; వివిధ రాష్ర్టాల ప్రతినిధులు, గౌరవనీయ సోదరసోదరీమణులారా,
ప్రపంచ న్యాయ విభాగానికి చెందిన ప్రముఖులందరినీ కలవడం, వారందరి మధ్యన ఉండే అవకాశం రావడం నాకు ఒక అద్భుతమైన అనుభవం. భారత్ లోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు నేడు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడ ఉన్నారు. ఇంగ్లండ్ లార్డ్ చాన్సలర్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇంగ్లండ్ కు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనేందుకు మన మధ్యన ఉన్నారు. అలాగే కామన్వెల్త్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు కూడా వచ్చారు. ఆ రకంగా నేటి ఈ అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు ‘‘వసుధైవ కుటుంబకం’’ (ప్రపంచం అంతా ఒకే కుటుంబం) అనే భారత్ సెంటిమంట్ కు ఒక చిహ్నంగా నిలిచింది. భారత్ లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అంతర్జాతీయ అతిథులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమం చేపట్టే బాధ్యత హృదయపూర్వకంగా స్వీకరించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాను.
మిత్రులారా,
ఏ దేశానికి చెందిన న్యాయ విభాగం అయినా ఆ దేశాభివృద్ధిలో విశేషమైన పాత్ర పోషిస్తుంది. భారత్ లో కూడా ఎన్నో సంవత్సరాలుగా న్యాయ శాఖ, బార్ కౌన్సిల్ న్యాయ వ్యవస్థకు సంరక్షకులుగా ఉన్నాయి. నేడు ఇక్కడ ఉన్న విదేశీ అతిథులకు నేను ఒక ప్రత్యేక విషయం తెలియచేయాలనుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితమే భారత్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించుకుంది. దేశ స్వాతంత్ర్య పోరాటలో న్యాయ వృత్తి నిపుణులు స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించారు. జాతీయోద్యమంలో చురుకైన భాగస్వాములయ్యేందుకు ఎందరో న్యాయవాదులు తమ లీగల్ ప్రాక్టీస్ ను కూడా వదిలివేశారు. మా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, దేశ తొలి రాష్ర్టపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తొలి ప్రధానమంత్రి, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పలేట్, లోకమాన్య తిలక్, వీర్ సావర్కర్ వంటి స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి ఎందరో ప్రముఖులు న్యాయవాదులే. న్యాయవాద వృత్తి నిపుణుల అనుభవాలే స్వతంత్ర భారత్ పునాదులను పటిష్ఠం చేశాయి. నేడు భారతదేశం పట్ల ప్రపంచ విశ్వాసం ఇనుమడిస్తోంది. పక్షపాత రహితమైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఈ విశ్వాస సాధనలో కీలక పాత్ర పోషించింది.
భారత్ ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ఈ సదస్సు జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే లోక్ సభలోను, రాష్ర్టాల అసెంబ్లీల్లోను మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించేందుకు వీలు కల్పించే చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. నారీశక్తి వందన్ అధినియమ్ దేశంలో మహిళా చోదక అభివృద్ధికి కొత్త దిశను కల్పించి కొత్త ఉత్తేజం అందిస్తుంది. కొద్ది రోజుల క్రితమే చారిత్రకమైన జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మా ప్రజాస్వామ్యం, మా జనసంఖ్య, మా దౌత్య శక్తిని ప్రపంచం చవి చూసింది. సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే రోజున చంద్రమండల దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన తొలిదేశంగా భారత్ విజయం నమోదు చేసింది. ఈ విజయాల ద్వారా లభించిన విశ్వాసంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశలో భారత్ విశేషమైన కృషి చేస్తోంది. ఈ లక్ష్యం చేరాలంటే నిస్సందేహంగా భారత్ కు శక్తివంతమైన, నిష్పక్షపాతమైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అవసరం. ఈ దిశగా భారత్ ప్రయాణానికి అంతర్జాతీయ న్యాయవాదుల సమావేశం అత్యంత ప్రయోజనకరం. ఈ సదస్సు సందర్భంగా దేశాలన్నీ పరస్పర అనుభవాల నుంచి ఎన్నో నేర్చుకుంటాయని నేను ఆశిస్తున్నాను.
మిత్రులారా,
మనం నివశిస్తున్నఈ 21వ శతాబ్ది ప్రపంచం అత్యంత అనుసంధాతమైనది. ప్రతీ ఒక్క న్యాయ నిపుణుడు, సంస్థ తమ పరిధి విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. మనం పోరాటం సాగిస్తున్న పలు శక్తులు సరిహద్దులు, ప్రాదేశిక అధికార పరిధి వంటివి లక్ష్యపెట్టవు. ముప్పు అనేది అంతర్జాతీయ స్వభావం కలిగి ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొనే వైఖరి కూడా అంతర్జాతీయంగా ఉండాలి. సైబర్ ఉగ్రవాదం కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, కృత్రిమ మేథ దుర్వినియోగం కావచ్చు ప్రపంచ స్థాయిలో సహకారం అవసరమైన పలు అంశాలున్నాయి. అది ఏ ఒక్క ప్రభుత్వానికి లేదా పాలనా యంత్రాంగానికి పరిమితమైన సమస్య కాదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో మనం ఏ విధంగా సంఘటిత వైఖరి ప్రదర్శిస్తామో అదే విధంగా ఈ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో వివిధ దేశాల న్యాయ వ్యవస్థలు సంఘటితం కావాలి. ఏ విమానం అయినా ఎక్కడైనా దిగదు. అదే విధంగా ‘‘నీ చట్టాలు నీవి, నా చట్టాలు నావి, వాటిని నేను లక్ష్యపెట్టను’’ అని ఎవరూ చెప్పరు. ప్రతీ ఒక్కరూ ఉమ్మడి నిబంధనలు, నిమయాలు, ప్రొటోకాల్స్ కు కట్టుబడి ఉంటారు. అదే విధంగా వివిధ విభాగాల కోసం మనం ప్రపంచ స్థాయి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం అవసరం. అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు ఈ అంశాన్ని లోతుగా పరిశీలించి ప్రపంచానికి కొత్త దిశ కల్పించాలి.
మిత్రులారా,
తుషార్ జీ వివరించినట్టుగా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థ (ఎడిఆర్) ఈ సదస్సులో ప్రధాన చర్చనీయాంశం. వాణిజ్యపరమైన లావాదేవీల సంక్లిష్టతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎడిఆర్ ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ సదస్సు ఈ అంశం పైనే అధికంగా దృష్టి సారించనుందని నాకు తెలిసింది. ఎన్నో శతాబ్దాలుగా పంచాయతీల్లో పరిష్కారాలు సాధించే సాంప్రదాయం భారత్ లో ఉంది. మా సంస్కృతిలో అది ఒక భాగంగా ఉంది. దీన్ని వ్యవస్థీకృతం చేయడానికి మా ప్రభుత్వం మధ్యవర్తిత్వ చట్టం రూపొందించింది. అలాగే లోక్ అదాలత్ (ప్రజా కోర్టులు) వ్యవస్థ కూడా వివాదాల పరిష్కారంలో కీలక సాధనంగా ఉంది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో న్యాయం సాధించే వరకు అయ్యే సగటు వ్యయం 35 పైసలే ఉంది. గత ఆరు సంవత్సరాల కాలంలో లోక్ అదాలత్ ల ద్వారా సుమారు 7 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయి.
మిత్రులారా,
భాష సరళంగా ఉండాలనేది న్యాయ వితరణలో మరో ప్రధానమైన అంశం. రెండు మార్గాల్లో ఈ అంశంపై మేం ఆలోచిస్తున్నాం. అదే మీకు మాత్రమే తెలిసిన భాషలో ఉండాలా లేక ఒక సగటు మనిషికి అర్ధం అయ్యే భాషలో ఉండాలా అనేది. సగటు మనిషి కూడా చట్టాన్ని తనదిగా భావిస్తాడు. ఈ మార్పు తేవడానికి మేము ప్రత్యేకించి నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను. వ్యవస్థ సంస్కరణకు కొంత సమయం పట్టవచ్చు. కాని నాకు సమయం ఉంది, దానిపై నేను కృషిని కొనసాగిస్తాను. చట్టాలు లిఖించిన భాష, కోర్టు వ్యవహారాలు నడుస్తున్న భాష రెండూ న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గతంలో ఏ చట్టం రూపొందించడం అయినా క్లిష్టంగా ఉండేది. కాని ప్రభుత్వం వాటిని వీలైనంత సరళం చేసి దేశంలోని అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉండేలా చేయాలని నేను గతంలోనే చెప్పాను. ఆ దిశగా మేం చిత్తశుద్దితో పని చేస్తున్నాం.
మిత్రులారా,
డేటా రక్షణ చట్టాన్ని మీరు చూసే ఉంటారు. దాన్ని వీలైనంతగా సరళీకరించి అందులోని నిర్వచనాలు సగటు మనిషికి అర్ధం అయ్యేవిగా ఉండాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ ప్రయత్నం మేం ప్రారంభించాం. దేశ న్యాయవ్యవస్థలో ఇది ఒక విశేషమైన మార్పు అని నేను విశ్వసిస్తున్నాను. ఇక నుంచి కోర్టు తీర్పులన్నీ కక్షిదారు భాషలోనే ఉంటాయని చెప్పినందుకు జస్టిస్ చంద్రచూడ్ జీని ఒక సారి నేను బహిరంగంగానే ప్రశంసించాను. ఈ చిన్న అడుగు పడడానికి 75 సంవత్సరాల వ్యవధి పట్టింది. అందులో నేను జోక్యం కూడా చేసుకోవలసివచ్చింది. పలు స్థానిక భాషల్లో తన తీర్పులు అనువాదం చేసినందుకు సుప్రీంకోర్టును కూడా నేను అభినందిస్తున్నాను. ఇది సగటు మనిషికి ఎంతో సహాయకారి అవుతుంది. ఒక వైద్యుడు రోగి భాషలోనే అతనితో సంభాషించినట్టయితే సగం రోగం నయం అయిపోతుంది.
మిత్రులారా,
టెక్నాలజీ, సంస్కరణలు, కొత్త న్యాయ విధానాల ద్వారా న్యాయపరమైన అంశాలను మెరుగుపరిచేందుకు మనం నిరంతరం కృషి చేయాలి. సాంకేతిక పురోగతి న్యాయ వ్యవస్థకు అద్భుతమైన అవకాశాలు అందుబాటులోకి తెచ్చింది. సాంకేతిక పురోగతి మన వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార రంగాలకు మంచి ఉత్తేజం అందించాయి. అందుకే న్యాయవ్యవస్థతో అనుబంధం కలిగిన వారందరూ సాంకేతిక సంస్కరణల కోసం కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా న్యాయవ్యవస్థపై విశ్వాసం పెంచడంలో అంతర్జాతీయ న్యాయవాదుల సమావేశం కీలకంగా నిలుస్తందని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంతో అనుసంధం గల వారందరినీ నేను అభినందిస్తున్నాను.