భారత్ మాతా కి జై 

భారత్ మాతా కి జై  

నమస్కార్ ! కెమ్ చో (ఎలా ఉన్నారు) ! వణక్కం ! సత్ శ్రీ అకాల్ ! జిన్ దోబ్రే(అందరికీ శుభదినం)!

ఇక్కడి దృశ్యం నిజంగా అద్భుతం... మీ ఉత్సాహం కూడా అమోఘం. నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి, మీరు అలసిపోలేదు. మీరందరూ పోలాండ్‌లోని వివిధ భాషలు, మాండలికాలు, వివిధ ఆహారపు అలవాట్లున్న ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ భారతీయతే మిమ్మల్ని ఒకటిగా కలిపింది. మీరు ఇక్కడ నాకు స్వాగతం పలికారు... మీరు చూపిన ఈ ఆదరణకు మీ అందరికీ, ముఖ్యంగా పోలాండ్ ప్రజలకు చాలా కృతజ్ఞతలు.

మిత్రులారా, 

గత వారం రోజులుగా మీరంతా భారతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. పోలాండ్ ప్రజల గురించి చాలా చర్చ జరిగింది. ఓ శీర్షిక కూడా చక్కర్లు కొడుతోంది, 45 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని పోలాండ్ వచ్చారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలా మంచి విషయాలు నాకు తారస పడ్డాయి. కొన్ని నెలల క్రితం, నేను ఆస్ట్రియాకు వెళ్లాను, అక్కడ కూడా భారత ప్రధాని పర్యటించి నాలుగు దశాబ్దాలు గడిచింది. దశాబ్దాలుగా ఏ భారత ప్రధాని పర్యటించని దేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. దశాబ్దాలుగా అన్ని దేశాలకూ సమదూరం పాటించాలనేది భారత విధానం. అన్ని దేశాలతో సమాన సాన్నిహిత్యాన్ని కొనసాగించడమే నేటి భారత విధానం. నేటి భారత్ అందరితో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నది. నేటి భారత్ అందరి అభివృద్ధి గురించి మాట్లాడుతుంది, నేటి భారత్ అందరితో కలిసి సాగుతుంది. అందరి ఆసక్తుల గురించి ఆలోచిస్తుంది. నేడు ప్రపంచం భారత్‌ను ‘విశ్వ బంధు’ (ప్రపంచ మిత్రుడు)గా గౌరవిస్తున్నందుకు మనం గర్విస్తున్నాం. ఇది మీ అనుభవంలో కూడా ఉంటుంది. నాకున్న సమాచారం సరైనదే. కాదంటారా?

మిత్రులారా!

భౌగోళిక రాజకీయాలు పక్కన పెడితే ఇది విలువలు, సంప్రదాయాలకు సంబంధించినది. మరెక్కడా చోటు లేని వారికి భారత్ తన గుండెల్లో, తన భూభాగంలో చోటు కల్పించింది. ఇది మన వారసత్వం, ప్రతి భారతీయుడు గర్వించదగినది. శాశ్వతమైన భారతదేశ స్ఫూర్తికి పోలాండ్ సాక్షి. నేటికీ, పోలాండ్‌లోని ప్రతి ఒక్కరికీ మన జామ్ సాహెబ్‌... ‘డోబ్రే’గా లేదా మంచి మహారాజాగా తెలుసు. రెండో  ప్రపంచయుద్ధంలో పోలాండ్‌ను కష్టాలు చుట్టుముట్టినప్పుడు, వేలాది మంది పోలిష్ మహిళలు, పిల్లలు దిక్కు తోచక ఆశ్రయం కోసం తిరిగారు. అప్పుడు జామ్ సాహెబ్ గా పేరున్న దిగ్విజయ్ సింగ్ రంజిత్‌సిన్హ్ జడేజా వారిని ఆడుకోడానికి ముందుకు వచ్చారు. అతను పోలిష్ మహిళలు, పిల్లల కోసం ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జామ్ సాహెబ్, శిబిరంలో ఉన్న పోలిష్ పిల్లలతో మాట్లాడుతూ నవనగర్ ప్రజలు నన్ను బాపు (తండ్రి) అని పిలుస్తారు. నేను కూడా మీకు బాపునే అంటూ వారిని అక్కున చేర్చుకున్నారు. 

 

మిత్రులారా!

జామ్ సాహెబ్ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధం ఉంది, వారు నా పట్ల అపారమైన ప్రేమను కనబరిచారు. కొన్ని నెలల కిందట ప్రస్తుత జామ్ సాహెబ్ ని కలవడానికి వెళ్లాను. అతని గదిలో పోలాండ్‌కు సంబంధించిన ఒక చిత్రం ఇప్పటికీ ఉంది. జామ్ సాహెబ్ వేసిన మార్గాన్ని పోలెండ్ సజీవంగా ఉంచడం నాకు సంతోషాన్ని ఇస్తోంది. రెండు దశాబ్దాల కిందట జామ్‌నగర్‌తో సహా గుజరాత్‌లో విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు, సహాయం చేయడానికి ముందుకు వచ్చిన తొలి దేశాల్లో పోలాండ్ ఒకటి. పోలాండ్ ప్రజలు కూడా జామ్ సాహెబ్ కీ, అతని కుటుంబానికీ గొప్ప గౌరవం ఇచ్చారు.

వార్సాలోని ‘గుడ్ మహారాజా స్క్వేర్’లో ఈ ప్రేమ సుస్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే, దోబ్రే మహారాజా మెమోరియల్, కొల్హాపూర్ మెమోరియల్‌ని సందర్శించే అదృష్టం కూడా కలిగింది. ఈ మరపురాని క్షణంలో, నేను కొంత సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జామ్ సాహెబ్ మెమోరియల్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించబోతోంది. ఈ కార్యక్రమం కింద, ప్రతి సంవత్సరం 20 మంది పోలిష్ యువకులను భారత్‌కు ఆహ్వానిస్తారు. ఇది భారత్‌ను అర్థం చేసుకోవడానికి పోలిష్ యువతకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది.

మిత్రులారా,

ఇక్కడ కొల్హాపూర్ మెమోరియల్ ఉంది. అది కూడా కొల్హాపూర్ గొప్ప రాజ కుటుంబానికి పోలాండ్ ప్రజలు అందించిన నివాళి. ఇది మహారాష్ట్ర, మరాఠీ సంస్కృతి పౌరుల పట్ల పోలాండ్ ప్రజలు వ్యక్తం చేసిన గౌరవం. మరాఠీ సంస్కృతిలో మానవత్వానికి పెద్దపీట వేస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో కొల్హాపూర్ రాజకుటుంబం పోలిష్ మహిళలు, పిల్లలకు వాలివాడేలో ఆశ్రయం ఇచ్చింది. అక్కడ పెద్ద శిబిరం కూడా ఏర్పాటు చేశారు. పోలిష్ మహిళలు, పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మహారాష్ట్ర ప్రజలు పగలు రాత్రి శ్రమించారు.

మిత్రులారా!

ఈరోజు, మోంటే క్యాసినో మెమోరియల్‌ వద్ద నివాళులర్పించే అవకాశం కూడా నాకు లభించింది. ఈ స్మారక చిహ్నం వేలాది మంది భారతీయ సైనికుల త్యాగాలను కూడా గుర్తు చేస్తుంది. ప్రపంచంలోని ప్రతి మూలలో భారతీయులు తమ విధులను ఎలా నిర్వర్తించారనే దానికి ఇది నిదర్శనం.

21వ శతాబ్దపు భారత్ తన ప్రాచీన విలువలు, వారసత్వం గురించి గర్విస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. భారతీయులు ప్రపంచానికి ఆచరించి చూపిన గుణాలు, నేడు ప్రపంచం భారత్‌ను గుర్తించేలా చేసాయి. భారతీయులమైన మనం మన కష్టపడే గుణం, శ్రేష్ఠత, సానుభూతికి మారుపేరుగా ప్రసిద్ధి చెందాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, భారతీయులమైన మనం కష్టపడుతూనే ఉంటాం.

అది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా కావచ్చు, సంరక్షకులుగా లేదా సేవా రంగం కావచ్చు.. భారతీయులు తమ కృషితో తమకీ, తమ దేశానికీ పేరు తెస్తున్నారు. నేను మీ గురించే మాట్లాడుతున్నాను. నేను మూడో దేశం గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా సామర్ధ్యం కలిగిన వారుగా గుర్తింపు పొందారు. ఐటీ రంగమైనా, భారతీయ వైద్యులైనా సరే, అందరూ తమ నైపుణ్యంతో ప్రకాశిస్తున్నారు. ఇక్కడ నా ముందే చాలా పెద్ద సమూహం ఉంది. 

 

స్నేహితులారా!

భారతీయులకు సహానుభూతిపరులు అన్న పేరు తెచ్చుకున్నారు. ఏ దేశంలోనైనా సంక్షోభం తలెత్తినప్పుడల్లా సాయం చేసే మొదటి దేశం భారత్. 100 ఏళ్లలోనే అతిపెద్ద విపత్తు అయిన కోవిడ్‌ వచ్చినపుడు ‘హ్యూమానిటీ ఫస్ట్’ అని భారత్ చెప్పింది.  మేం150 దేశాలకు మందులు, వ్యాక్సిన్‌లను పంపాము. ప్రపంచంలో ఎక్కడైనా భూకంపం సంభవించినా, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, భారత్ మంత్రం ‘మానవత్వం ముందు.’ అది యుద్ధమైనా, ‘ముందు మానవత్వం’ అని భారత్ చెబుతుంది. ఈ స్ఫూర్తితో భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సహాయం చేస్తుంది. భారత్ ఎల్లప్పుడూ మొదటి ప్రతిస్పందనగా ముందుంటుంది.

భారత్ బుద్ధుని వారసత్వ భూమి. బుద్ధుడు అంటేనే శాంతి,  యుద్ధం కాదు. అందువల్ల, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి కోసం భారత్ బలమైన గొంతును వినిపిస్తుంది. భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది - ఇది యుద్ధ శకం కాదు. మానవాళి అతిపెద్ద ముప్పును పరిష్కరించడానికి ఏకం కావాల్సిన సమయం. అందువల్ల  దౌత్యం, పరస్పర చర్చలను భారత్  నొక్కి చెబుతుంది.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మన పిల్లలకు మీరు సహాయం చేసిన తీరు మేమంతా చూశాం. మీరు వారికి బాగా సేవ చేసారు. మీరు లంగర్‌ (ఉచిత ఆహారం)లను ఏర్పాటు చేసారు, మీ ఇళ్లను, మీ రెస్టారెంట్‌లను కూడా తెరిచారు. పోలిష్ ప్రభుత్వం మన విద్యార్థులకు వీసా పరిమితులను కూడా మాఫీ చేసింది. పోలాండ్ మన పిల్లలకు మనస్పూర్తిగా తలుపులు తెరిచి వారిని ఆదుకుంది. ఈ రోజు కూడా, నేను ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన పిల్లలను కలిసినప్పుడు, వారు పోలాండ్ ప్రజలను, మిమ్మల్ని (భారతీయులు) చాలా ప్రశంసించారు. అందువల్ల, ఈ రోజు నేను 140 కోట్ల మంది భారతీయుల తరపున మీ అందరినీ, పోలాండ్ ప్రజలను అభినందిస్తున్నాను. నేను మీకు నమస్కరిస్తున్నాను.

మిత్రులారా!

భారత్, పోలాండ్ సమాజాల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ఒక ప్రధాన సారూప్యత మన ప్రజాస్వామ్యం. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి మాత్రమే కాదు, కలిసిపోయేతత్వం ఉన్న శక్తివంతమైన ప్రజాస్వామ్యం కూడా. భారత ప్రజలకు ప్రజాస్వామ్యంపై అచంచల విశ్వాసం ఉంది. ఈ విశ్వాసాన్ని ఇటీవల ఎన్నికల్లో చూశాం. చరిత్రలో ఇవి అతి పెద్ద ఎన్నికలు. ఇటీవల, యూరోపియన్ యూనియన్‌కు కూడా ఎన్నికలు జరిగాయి, ఇక్కడ సుమారు 180 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు వేశారు. భారత్‌లో దాదాపు 640 మిలియన్ల ఓటర్లు. దాని కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ఓటర్లు పాల్గొన్నారు.

భారత్‌లో జరిగిన ఎన్నికల్లో వేలాది రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. దాదాపు 8 వేల మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 5 మిలియన్లకు పైగా ఓటింగ్ యంత్రాలు, ఒక మిలియన్ కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు, 15 మిలియన్లకు పైగా ఉద్యోగులు, ఇంకా నిర్వహణ, సమర్థతతో కూడిన ఈ ఎన్నికల ప్రక్రియపై ఉన్న విశ్వాసం భారతదేశానికి గొప్ప బలం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ సంఖ్యలను విని ఆశ్చర్యపోతారు.

మిత్రులారా,

వైవిధ్యంతో ఎలా జీవించాలో, ఎలా ఉత్సాహవంతంగా ఉండాలో భారతీయులమైన మనకు తెలుసు. అందుకే మనం ఏ సమాజంలోనైనా సులభంగా కలిసిపోతాం. పోలాండ్‌లో, భారతదేశం గురించి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా కాలంగా ఒక సంప్రదాయం ఉంది. ఇక్కడి యూనివర్సిటీల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. మీలో చాలామంది వార్సా విశ్వవిద్యాలయం ప్రధాన లైబ్రరీని సందర్శించి ఉండాలి. అక్కడ ఉన్న భగవద్గీత, ఉపనిషత్తుల నుండి తీసుకున్న ఉల్లేఖనాలు మనందరినీ పలకరిస్తాయి. తమిళం, సంస్కృతం వంటి భారతీయ భాషలను అభ్యసించే వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడి అద్భుతమైన యూనివర్సిటీల్లో భారతీయ అధ్యయన పీఠాలు ఉన్నాయి. కబడ్డీ విషయంలో- పోలాండ్, భారతీయులకు మధ్య సంబంధం ఉంది. భారత్‌లోని ప్రతి గ్రామంలో కబడ్డీ ఆడతారని మీకు తెలుసు. ఈ ఆట భారత్ నుండి పోలాండ్‌కు చేరుకుంది. పోలాండ్ ప్రజలు కబడ్డీని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. పోలాండ్ వరుసగా రెండేళ్లుగా యూరోపియన్ కబడ్డీ ఛాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 24 నుంచి మళ్లీ కబడ్డీ ఛాంపియన్‌షిప్ జరగబోతోందని, తొలిసారి పోలాండ్ ఆతిథ్యమిస్తోందని నాకు సమాచారం అందింది. మీ ద్వారా పోలిష్ కబడ్డీ జట్టుకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా, 

మీరు ఇటీవలే ఇక్కడ స్వాతంత్ర్య వేడుకను జరుపుకున్నారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో మన స్వాతంత్ర్య సమరయోధులు సుసంపన్నమైన భారతదేశాన్ని స్వప్నించారు. నేడు ఆ కలను సాకారం చేసే దిశగా భారతీయులంతా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. 2047 నాటికి ‘వికసిత భారత్’గా పరివర్తన చెందాలని భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మన దేశం ఆ దిశగా పయనిస్తోంది. అందుకే, నేటి భారత్ అపూర్వమైన స్థాయిలో, వేగంగా, పరిష్కారాత్మకంగా పనిచేస్తోంది. భారతదేశంలో పరివర్తన జరుగుతున్న స్థాయి, వేగం మిమ్మల్ని గర్వించేలా చేస్తాయి.

మీకు నేను వేరే చెప్పాలా? గత పదేళ్లలో భారత్ లో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఆ సంఖ్య ఫ్రాన్స్, జర్మనీ, యూకేల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. గత పదేళ్లలో, పేదల కోసం 4 కోట్ల నాణ్యమైన గృహాలను నిర్మించాం, మరో 3 కోట్ల ఇళ్లను నిర్మించబోతున్నాం. పోలాండ్ లో ఇప్పుడు 1.4 కోట్ల గృహాలు ఉంటే, మేము కేవలం దశాబ్ద కాలంలో దాదాపు మూడు కొత్త పోలాండ్లతో సమానంగా ఇళ్లు నిర్మించాం. ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి అందరినీ తెచ్చే పనిని అనూహ్యస్థాయికి తీసుకువెళ్లాం. పదేళ్లలో భారత్ లో 50 కోట్ల జనధన్ బ్యాంకు ఖాతాలు తెరిచాం. ఈ సంఖ్య యూరోపియన్ యూనియన్ మొత్తం జనాభా కన్నా ఎక్కువ. యూపీఐ ద్వారా భారత్ లో జరిగే రోజువారీ డిజిటల్ లావాదేవీలు యూరోపియన్ యూనియన్ జనాభాతో సమానంగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ మొత్తం జనాభా కన్నా ఎక్కువ మంది భారతీయులు రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాను పొందుతున్నారు. గత దశాబ్ధ కాలంలో భారతదేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 6 కోట్ల నుంచి 94 కోట్లకు పెరిగింది. యూరప్, అమెరికా జనాభాలతో దాదాపు సమానమైన సంఖ్యలో భారత్ ప్రజలు నేడు బ్రాడ్ బ్యాండ్ ను ఉపయోగిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో దాదాపు 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ సౌకర్యాన్ని విస్తరించాం. దాంతో భూమిని 70 సార్లు చుట్టొచ్చు. రెండేళ్లలోనే ప్రతి జిల్లాకు 5జీ నెట్ వర్క్ ను భారత్ అందించింది. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా 6జీ నెట్ వర్క్ ల దిశగా కృషిచేస్తున్నాం.

మిత్రులారా,

భారత్ లో పరివర్తన స్థాయి ప్రజా రవాణాలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 2014లో భారతదేశంలోని 5 నగరాలలోనే మెట్రోలు నడిచేవి. ప్రస్తుతం 20 నగరాల్లో మెట్రోలు నడుస్తున్నాయి. భారతదేశంలో ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పోలాండ్ జనాభాలో మూడో వంతుకు సమానం.

మిత్రులారా,

భారత్ ఏం చేసినా అదిప్పుడు ఓ కొత్త రికార్డును నెలకొల్పుతుంది, చరిత్ర సృష్టిస్తుంది. భారత్ ఒకేసారి వందకు పైగా ఉపగ్రహాలను ప్రయోగించడాన్ని చూశారు. అదొక రికార్డు. మరో రెండు రోజుల్లో, అంటే ఆగస్టు 23న భారత జాతీయ అంతరిక్ష దినోత్సవం జరగనుంది. అది మీకు కూడా తెలుసు కదా? మీకు గుర్తుందా? అదే రోజున భారత్ తన చంద్రయాన్ ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై దింపింది. ఏ దేశం చేరుకోని ప్రదేశానికి భారత్ చేరింది. ఆ ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టాం. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థలున్న వ్యవస్థ.

మిత్రులారా,

ప్రపంచ జనాభాలో భారత్ వాటా 16-17 శాతం. కానీ, జనాభా పరంగా అంతర్జాతీయ వృద్ధిలో భారత వాటా మునుపటిలా లేదు. ప్రస్తుతం పరిస్థితి వేగంగా మారుతోంది. 2023లో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 16 శాతానికి మించింది. నేడు, అంతర్జాతీయ సంస్థలన్నీ భారత్ కు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని అంచనా వేస్తున్నాయి. వాళ్లు జ్యౌతిషులేమీ కాదు. గణాంకాలు, క్షేత్రస్థాయి వాస్తవాలపైనే వారి అంచనాలు ఆధారపడి ఉంటాయి. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి మరెంతో దూరంలో లేదు. నేను మూడోసారి ప్రధానిగా ఉండగానే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నా దేశ ప్రజలకు హామీ ఇచ్చాను. కొన్నేళ్లలో, భారతదేశ అద్భుతమైన ఆర్థిక ఎదుగుదలను ప్రపంచం చూడబోతోంది. డిజిటలైజేషన్ కారణంగా ఈ దశాబ్దం చివరి నాటికి భారత్ 8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని నాస్కామ్ అంచనా వేసింది. వచ్చే మూణ్నాలుగేళ్లలో భారత ఏఐ మార్కెట్ 30-35 శాతం వేగంతో వృద్ధి చెందుతుందని నాస్కామ్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేస్తున్నది. భారత్ పై ప్రతిచోటా అపూర్వమైన సానుకూలత కనిపిస్తోంది. నేడు భారత్ సెమీకండక్టర్ మిషన్, అగాధ సముద్ర (డీప్ ఓషన్) మిషన్, జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, జాతీయ క్వాంటమ్ మిషన్, కృత్రిమ మేధ మిషన్లపై కృషిచేస్తోంది. ఇవన్నీ భారత్ కొన్ని దశాబ్ధాల ముందున్నదని చాటుతున్నాయి. సమీప భవిష్యత్తులోనే తన అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత్ సన్నాహాలు చేస్తోంది. దేశీయంగా రూపొందించిన గగనయాన్ లో భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి ప్రయాణించడాన్ని త్వరలోనే మీరు చూడబోతున్నారు.

 

మిత్రులారా,

నాణ్యమైన తయారీ, నాణ్యమైన మానవవనరులపై భారత్ నేడు దృష్టి సారించింది. ఇవి రెండూ అంతర్జాతీయ సరఫరా శ్రేణికి అత్యావశ్యకం. ఇటీవలి బడ్జెట్ లో యువతలో నైపుణ్యాభివృద్ధి, వారికి ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేశాం. మన యువత పెద్ద సంఖ్యలో విద్య కోసం ఇక్కడికి వచ్చారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్ ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మేం కృషి చేస్తున్నాం.

మిత్రులారా,

సాంకేతికత, వైద్యం, విద్య ఇలా ప్రతి రంగంలోనూ నైపుణ్యం గల మానవ వనరులను ప్రపంచానికి అందించే బాధ్యతను భారత్ తీసుకుంది. ఆరోగ్య రంగం నుంచి మీకో ఉదాహరణ చెప్తాను. గత పదేళ్లలో భారత్ లో 300కు పైగా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేశాం. గత పదేళ్లలో భారత్ లో వైద్య విద్య సీట్ల సంఖ్య రెట్టింపైంది. ఈ పదేళ్లలో 75 వేల కొత్త సీట్లను వైద్య వ్యవస్థలో అదనంగా అందుబాటులోకి తెచ్చాం. వచ్చే ఐదేళ్లలో మరో 75 వేల వైద్య విద్య సీట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో భారత్ పాత్రను ఇది బలోపేతం చేస్తుంది. ప్రపంచానికి మేమందిస్తున్న సందేశమిదే — ‘‘భారత్ లో స్వస్థత పొందండి’’ అని త్వరలోనే మేం చెప్పబోతున్నాం. అందుకోసం సన్నద్ధమవుతున్నం.

మిత్రులారా,

ఆవిష్కరణ, యువత.. ఈ రెండే భారత్, పోలాండ్ రెండింటి అభివృద్ధికి చోదక శక్తులు. నేడు ఓ శుభవార్తతో మీ ముందుకొచ్చాను. భారత్, పోలాండ్ మధ్య సామాజిక భద్రత ఒప్పందానికి అంగీకారం కుదిరింది. ఇది మీలాంటి స్నేహితులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

మిత్రులారా,

భారతదేశ జ్ఞానం విశ్వ వ్యాప్తం, భారతదేశ దార్శనికత విశ్వ వ్యాప్తం, భారత సంస్కృతి విశ్వ వ్యాప్తం, భారతదేశ శ్రద్ధ, కరుణ విశ్వ వ్యాప్తం. ‘వసుధైవ కుటుంబం’ అనే మంత్రాన్ని మన పూర్వీకులు మనకందించారు. మేము ఎప్పుడూ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించాం. ఇది నేడు భారత విధానాలు, నిర్ణయాలలో ప్రతిబింబిస్తుంది. జీ-20 సందర్భంగా భారత్ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ కోసం పిలుపునిచ్చింది. ఈ స్ఫూర్తి 21వ శతాబ్దపు ప్రపంచానికి మంచి భవిష్యత్తు దిశగా భరోసా ఇస్తుంది. ‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’ అనే భావనతో ప్రపంచాన్ని అనుసంధించాలని భారత్ భావిస్తోంది. ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం భరోసాగా ‘ఒక భూమి, ఒక ఆరోగ్యం’ భావనను పరిగణిస్తున్న దేశమేదైనా ఉంటే అది భారత్. ఒకే ఆరోగ్యం అంటే సంపూర్ణ శ్రేయో విధానం. అందులో మన జంతువులు, మొక్కలు, ప్రతి ఒక్కరి ఆరోగ్యమూ ఉంటుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ‘ఒకే ఆరోగ్యం (వన్ హెల్త్)’ సూత్రం మరింత కీలకంగా మారింది. భారత్ మిషన్ లైఫ్ (పర్యావరణ హిత జీవన శైలి) నమూనాను ప్రపంచానికి అందించింది. భారత్ లో జరుగుతున్న ఒక పెద్ద కార్యక్రమం గురించి మీరు వినే ఉంటారు. అది– ఏక్ పేడ్ మాకే నామ్ (తల్లి పేరు మీద ఒక మొక్కను నాటాలనే కార్యక్రమం). లక్షలాది మంది భారతీయులు తమ తల్లుల పేరిట మొక్కలు నాటుతూ భూమాతను కూడా సంరక్షిస్తున్నారు.

మిత్రులారా,

ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం మధ్య సమతౌల్యం నేడు భారత్ కు అత్యంత ప్రధాన అంశం. అభివృద్ధి చెందిన దేశంగా, నికర శూన్య ఉద్గార దేశంగా ఉండాలన్న సంకల్పంతో భారత్ ముందుకెళ్తోంది. హరిత భవిష్యత్తు కోసం సంపూర్ణ విధానం దిశగా భారత్ కసరత్తు చేస్తోంది. చాలక రంగంలో పర్యావరణ హిత పరివర్తన దీనికి ప్రధాన ఉదాహరణ.  20 శాతం ఇథనాలు కలిసిన పెట్రోలు విక్రయానికి చేరువలో ఉన్నాం. భారత్ లో ఎలక్ట్రిక్ రవాణా రంగం విస్తరిస్తోంది. ప్రస్తుతం భారత్ లో ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. గతేడాది భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు 40 శాతానికి పైగా పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆవిష్కరణలకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా నిలిచే రోజు మరెంతో దూరంలో లేదు. సమీప భవిష్యత్తులోనే గ్రీన్ హైడ్రోజన్ లో భారత్ ప్రధాన అంతర్జాతీయ కేంద్రంగా ఆవిర్భవించబోతోంది.

 

మిత్రులారా,

నూతన సాంకేతిక పరిజ్ఞానం, శుద్ధ ఇంధనం వంటి రంగాల్లో భారత్, పోలాండ్ మధ్య భాగస్వామ్యం నిరంతరం వృద్ధి చెందుతుండడం సంతోషదాయకం. అనేక భారతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలను సృష్టించాయి. పోలాండ్ కు చెందిన అనేక కంపెనీలు భారత్ లో అవకాశాలను సృష్టించాయి. రేపు అధ్యక్షుడు దుడా, ప్రధాని టస్క్ ను కలుస్తాను. ఈ సమావేశాలు భారత్, పోలాండ్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ప్రధాని టస్క్ భారత్ కు మంచి మిత్రుడు. ఆయన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలాసార్లు కలిశాను.

మిత్రులారా,

అభివృద్ధి చెందిన దేశంగా తన భవిష్యత్తును లిఖించుకునే దిశగా నేటి భారత్ కృషిచేస్తోంది. ఆ దిశగా అందరిదీ ఒకే మాట, ఒకే భావం. నేడు భారత్ అవకాశాలకు నిలయం. భారతవృద్ధి గాథలో మీరు కూడా మరింత తాదాత్మ్యం చెందాలి. భారత పర్యాటకానికి మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. అంటే ఏమిటి? తాజ్ మహల్ ముందు మీరు కూర్చుని ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలి. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడమంటే - మీరు ఏటా కనీసం అయిదు పోలాండ్ కుటుంబాలను భారతదేశ సందర్శనకు పంపాలి. అది మీరు చేస్తారా? నేను మీకు ఈ మాత్రం హోంవర్క్ అయినా ఇవ్వాలి కదా? మీ ప్రతి ప్రయత్నమూ మీ భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా పరివర్తన చెందడానికి దోహదపడుతుంది.

మిత్రులారా,

ఇక్కడికి వచ్చి, అద్భుతంగా స్వాగతం పలికినందుకు మరోసారి మీ అందరికీ నా ధన్యవాదాలు.

నాతో కలిసి నినదించండి:

భారత్ మాతాకీ.. జై!

భారత్ మాతాకీ.. జై!

భారత్ మాతాకీ.. జై!

ధన్యవాదాలు. 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi