భారత్ మాతాకీ జై !
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
నైజీరియా నమస్తే!
మీరు ఈ రోజు అబుజాలో ఉల్లాసమైన వాతావరణాన్ని సృష్టించారు. నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న ప్రతి అంశాన్ని నేను గమనిస్తున్నాను. నేను అబుజాలో ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. భారత్‌లోని ఓ నగరంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. లాగోస్, కనో, కడునా, పోర్ట్ హర్కోర్ట్ తదితర విభిన్నమైన ప్రాంతాల నుంచి మీరు అబుజాకి వచ్చారు. మీ ముఖాల్లోని వెలుగు, మీరు చూపిస్తున్న ఉత్సాహం, ఇక్కడకు రావాలనే మీ తపనను తెలియజేస్తున్నాయి. నేను కూడా మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆత్రుతతో ఎదురుచూశాను. మీ ప్రేమాభిమానాలు నాకు గొప్ప నిధి లాంటివి. మీలో ఒకడిగా, మీతో కలసి పంచుకునే ఈ క్షణాలు నాకు జీవితాంతం మరపురాని అనుభవాలుగా మిగిలిపోతాయి.
స్నేహితులారా,
ప్రధానమంత్రిగా నేను నైజీరియాను సందర్శించడం ఇదే మొదటిసారి. నేను ఇక్కడికి ఒక్కడినే రాలేదు, నా వెంట భారత దేశపు మట్టి పరిమళాలను తీసుకువచ్చాను. కోట్లాది మంది భారతీయుల నుంచి శుభాకాంక్షలు మోసుకొచ్చాను. భారత్ అభివృద్ధి పట్ల మీరు మనస్ఫూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మీరు సాధిస్తున్న ఘనతలు చూసి ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగుతోంది. ఎంత గర్వమని అడగండి. చెప్పలేనంత. నా ఛాతీ ‘56 అంగుళాల మేర ఉప్పొగింది’ !
మిత్రులారా,
నాకు అపూర్వమైన స్వాగతం పలికిన నైజీరియా అధ్యక్షుడు టినుబుకు, ఈ దేశ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొంత సేపటి కిందటే నైజీరియా జాతీయ పురస్కారంతో అధ్యక్షుడు టినుబు నన్ను సత్కరించారు. ఇది మోదీకి మాత్రమే లభించిన గౌరవం కాదు. కోట్లాది మంది భారతీయులకు, మీకు, ఇక్కడ నివసిస్తున్న ప్రవాసభారతీయులకు దక్కింది.
స్నేహితులారా,
దీన్ని మీ అందరికీ అంకితమిస్తున్నాను.
స్నేహితులారా,
అధ్యక్షుడు టినుబుతో సంభాషిస్తున్నప్పుడు నైజీరియా అభివృద్ధిలో మీరు అందించిన సహకారం గురించి పదే పదే ప్రస్తావించారు. ఈ విషయం చెబుతున్నప్పుడు ఆయన కళ్లల్లో మెరుపుని చూశాను. నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇంట్లో ఒకరు విజయం సాధిస్తే.. ఆ కుటుంబం మొత్తం సంతోషం, గర్వంతో నిండిపోతుంది. ఒకరు సాధించిన విజయాన్ని తల్లిదండ్రులు, గ్రామస్థులు తమదిగా భావించి ఎలా సంబరాలు చేసుకుంటారో నేను కూడా అలాగే సంతోషపడ్డాను. మీ పని, కృషితో పాటు మీ హృదయాలను కూడా నైజీరియాకు అంకితం చేశారు. నైజీరియా సంతోషాలు, బాధలు పంచుకుంటూ ఈ దేశానికి భారతీయ సమాజం ఎల్లప్పడూ అండగా నిలుస్తుంది. నలభైలు, అరవైల్లో ఉన్న నైజీరియన్లు తమకు పాఠాలు చెప్పిన భారతీయ ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటారు. భారతీయ వైద్యులు ఇక్కడ తమ సేవలను కొనసాగిస్తారు. భారతీయ వ్యాపారవేత్తలు నైజీరియాలో తమ వ్యాపారాలను ప్రారంభించి, జాతీయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కిషిన్ చంద్ రామ్ జీని ఉదాహరణగా తీసుకుంటే స్వాతంత్ర్యానికి పూర్వమే ఆయన ఇక్కడకు వచ్చారు. ఆయన స్థాపించిన సంస్థ ఇక్కడ ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఎన్నో భారతీయ సంస్థలు నైజీరియా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. తోలారామ్ జీ నూడుల్స్‌ను ఈ దేశంలో ప్రతి ఇంట్లోనూ ఆస్వాదిస్తారు. తులసీ చంద్ రాయ్ జీ స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఎంతో మంది నైజీరియన్ల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. భారతీయ సమాజం, స్థానికులతో చేయీచేయీ కలిపి నైజీరియా అభివృద్ధికి తోడ్పడుతోంది. ఈ ఐక్యత, పంచుకొనే స్వభావం భారతీయుల సామర్థ్యాన్ని, విలువలను తెలియజేస్తుంది. మనం ఎక్కడికి వెళ్లినా సరే మన విలువలను పాటిస్తాం. అందరి సంక్షేమం కోసం పాటుపడతాం. శతాబ్ధాలుగా ఈ విలువలు మన నరనరాల్లోనూ ఇంకి, ఈ ప్రపంచాన్ని ఒక కుటుంబంలా భావించమని మనకు బోధిస్తున్నాయి. మనకు ఈ ప్రపంచం నిజంగా ఓ కుటుంబమే.
స్నేహితులారా,
నైజీరియాలో భారతీయ సంస్కృతికి మీరు తీసుకొచ్చిన గౌరవం ప్రతి చోటా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి ప్రజల్లో యోగాకు ఆదరణ పెరుగుతోంది. మీ ఉత్సాహభరితమైన చప్పట్ల ధ్వని ఆధారంగా మీతో పాటు నైజీరియన్లు సైతం యోగసాధన చేస్తున్నారని నేను భావిస్తున్నాను. మిత్రులారా, డబ్బుసంపాదించండి, కీర్తిని పొందండి, మీరు కోరుకున్నది సాధించండి, కానీ యోగాకు కొంత సమయం కేటాయించండి. ఇక్కడ జాతీయ టెలివిజన్‌లో వారానికోసారి యోగా కార్యక్రమం ప్రసారమవుతుందని నేను విన్నాను. బహుశా మీరు స్థానిక టీవీ ఛానళ్లను చూడకపోవచ్చు. భారత్‌లోని వాతావరణం లేదా అక్కడి వార్తలు, సంఘటనలను తెలుసుకొనేందుకు భారతీయ ఛానళ్లను ఎక్కువ చూస్తూ ఉండొచ్చు. నైజీరియాలో కూడా హిందీ ప్రజాదరణ పొందుతోంది.
ఎంతో మంది యువ నైజీరియన్లు ముఖ్యంగా కనో ప్రాంతానికి చెందిన విద్యార్థులు హిందీ నేర్చుకుంటున్నారు. హిందీపై ఆసక్తి ఉన్న కనోవాసులు ‘దోస్తానా’ పేరుతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి స్నేహభావం ఉన్నవారికి భారతీయ సినిమాలంటే మక్కువ కలగడంలో ఆశ్చర్యం లేదు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పడు భారతీయ నటులు, సినిమాల గురించి తెలిసిన స్థానికులతో నేను సంభాషించాను. భారతీయ సాంస్కృతిక ప్రదర్శనల కోసం ఉత్తర ప్రాంతాల్లో ప్రజలు ఒక్కచోట చేరతారు. ఇక్కడ ‘నమస్తే వహాలా’తో పాటు గుజరాతీ భాషలోని ‘మహర్‌వాలా’ లాంటి పదాలు ఇక్కడి వారికి సుపరిచితం. భారత్‌కు చెందిన ‘నమస్తే వహాలా’ లాంటి సినిమాలు, పోస్ట్ కార్డ్ లాంటి వెబ్ సిరీస్ లు నైజీరియాలో ప్రాచుర్యం పొందాయి.
మిత్రులారా,
ఆఫ్రికాలో గాంధీజీ కొన్నేళ్లు గడిపారు. ఇక్కడి ప్రజల సంతోషాలను, బాధలను పంచుకున్నారు. వలసవాద పాలనా కాలంలో సాగిన స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులు, నైజీరియన్లు కీలకపాత్ర పోషించారు. భారత్ సాధించిన స్వాతంత్ర్యం నైజీరియా స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. అలనాటి పోరాట భాగస్వాములుగా భారత్, నైజీరియాలు సంయుక్తంగా ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రజాస్వామానికి తల్లిగా భారత్, ఆఫ్రికాలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా నైజీరియా ఒకే విధమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని, వైవిధ్యాన్ని, జనాభా శక్తిని కలిగి ఉన్నాయి. రెండు దేశాలు అనేక భాషలు, విభిన్న ఆచారాలతో సుసంపన్నమై ఉన్నాయి. ఇక్కడ నైజీరియాలో లాగోస్ జగన్నాథుడు, వెంకటేశ్వరుడు, గణపతి, కార్తికేయ తదితర దేవతామూర్తుల ఆలయాలు సాంస్కృతిక వైవిధ్యానికి గౌరవ చిహ్నాలుగా నిలుస్తున్నాయి. ఈ రోజు మీలో ఒకడిగా ఈ పవిత్ర స్థలాలను నిర్మించడంలో సహకారం అందించిన నైజీరియా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
స్నేహితులారా,
భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో చాలా సవాళ్లు ఎదురయ్యేవి. ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించడానికి మన పూర్వీకులు అవిశ్రాంతంగా కృషి చేశారు. ఫలితంగా నేడు భారతదేశం అభివృద్ధి గురించి ప్రపంచం మాట్లాడుతోంది. అది నిజమా కాదా? ఈ వార్త మీ చెవులకు చేరిందా? మీ పెదవుల నుంచి మీ హృదయానికి చేరుకుందా? భారత్ సాధించిన విజయాల పట్ల మనం గర్విస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా గర్వపడుతున్నారు కదా? చంద్రుడిపై చంద్రయాన్ అడుగుపెట్టినప్పుడు గర్వంతో ఉప్పొంగిపోలేదా? ఆ రోజు మీ కళ్లను పెద్దవిగా చేసి టీవీలకు అతుక్కుపోలేదా? మంగళయాన్ అంగారక గ్రహాన్ని చేరుకున్నప్పుడు అది మీలో సంతోషాన్ని నింపలేదా? దేశీయంగా తయారుచేసిన తేజస్, ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకను చూసి మీకు గర్వం కలగలేదా? ఈ రోజు భారత్ అంతరిక్షం, తయారీ, డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యసంరక్షణ తదితర రంగాల్లో ప్రపంచంలోని అగ్రగామి దేశాలతో సమానంగా నిలబడుతోంది. సుదీర్ఘమైన వలస పాలన మన దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచిందని మనందరికీ తెలుసు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ స్వాతంత్ర్యం సాధించిన 6 దశాబ్దాల తర్వాత ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. దీన్ని సాధించడానికి ఎంత కాలం పట్టిందో తెలుసా? ఆరు దశాబ్ధాలు. అవును ఆరు దశాబ్దాలు. మీకు పాఠాలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. మీకు గుర్తు చేయడానికి వచ్చాను. భారతీయులైన మనం పట్టుదల ఉన్నవాళ్లం. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓహ్.. మీరు ముందే చప్పట్లు కొట్టేశారా? మరోసారి మరింత గట్టిగా చప్పట్లు ఎందుకు కొట్టాలో నేను చెబుతాను. గడచిన దశాబ్దంలోనే జీడీపీకి భారత్ మరో 2 ట్రిలియన్ డాలర్లను జోడించింది. కేవలం పదేళ్లలోనే మన ఆర్థిక వ్యవస్థ రెండింతలు పెరిగింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. మీరు గుర్తుపెట్టుకుంటారా? ఐదు ట్రిలియన్ల విలువతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచే రోజు ఎంతో దూరంలో లేదు.
స్నేహితులారా,
సౌకర్యవంతమైన వాతారణం నుంచి బయటకు వచ్చి కష్టాలకు వెరవని వారే గొప్ప విజయాలు సాధిస్తారని మనం తరచూ వింటూనే ఉంటాం. మీరు ఇప్పటికే చాలా సాధించారు కాబట్టి దాన్ని మీకు వివరించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భారత్, యువత అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాయి. అందుకే నూతన రంగాల్లో సైతం భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. 10-15ఏళ్ల క్రితం ‘‘స్టార్టప్’’ అనే పదాన్ని మీరు విని ఉండకపోవచ్చు. ఒకసారి అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు నేను ఓ సమావేశాన్ని నిర్వహించాను. దానికి అంకుర సంస్థలకు చెందినవారు 8 – 10 మంది మాత్రమే ఉన్నారు. మిగతావారంతా అసలు అంకుర సంస్థ అంటే ఏమిటో తెలుసుకోవడానికి అక్కడకు వచ్చారు. బెంగాల్ కు చెందిన ఓ యువతి తన అనుభవాన్ని పంచుకుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెబుతున్నానంటే, ఈ కొత్త ప్రపంచం ఏమిటో మీకు వివరించాల్సిన అవసరం ఉంది. ఆమె బాగా చదువుకుంది, మంచి ఉద్యోగానికి అర్హురాలు, బాగానే స్థిరపడింది. వాటన్నింటినీ వదులుకున్న ఆమె తన ప్రయాణం గురించి వివరించింది. వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఉద్యోగంతో సహా అన్నీ వదిలేశానని స్వగ్రామానికి వెళ్లి తన తల్లితో చెప్పింది. ఆశ్చర్యపోయిన ఆమె తల్లి ‘మహావినాశ్’ అని అంది. కానీ ఈ రోజు, ఈ తరం తమ సౌకర్యవంతమైన వాతావరణాన్ని వదులుకొని నూతన భారత్ నిర్మాణానికి సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ముందుకు వస్తోంది. దాని ఫలితం అద్భుతంగా ఉంది. దేశంలో రిజిస్టరయిన అంకుర సంస్థలు 1.5 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు ‘మహావినాశ్’ అని బాధపడ్డ తల్లుల నోటి నుంచే ‘మహావికాస్’ (గొప్ప అభివృద్ధి) అని వచ్చేలా ‘‘స్టార్టప్’’ అనే పదం చేసింది. గడచిన దశాబ్దంలో భారత్ 100 యూనికార్న్ సంస్థలకు జన్మనిచ్చింది. యూనికార్న్ అంటే 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయల విలువైన సంస్థ. అలాంటి 100 కంపెనీలను భారత యువత నిర్మించారు. వారే భారతీయ అంకుర సంస్థల సంస్కృతికి మార్గదర్శకులుగా నిలిచారు. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే భారత్ తన మూస ధోరణి నుంచి బయటకు వచ్చింది కాబట్టి.
మిత్రులారా,
మీకు మరో ఉదాహరణ ఇస్తున్నాను. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలస్థంభమైన సేవారంగంలో భారత్ ఎప్పుడో గుర్తింపు సాధించింది. మనం దానితోనే సరిపెట్టుకోలేదు. కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి భారత్‌ను అంతర్జాతీయ స్థాయి తయారీ క్షేత్రంగా మార్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. మన తయారీ రంగాన్ని బాగా విస్తరించాం. ఏడాదికి 30 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుల్లో ఒకటిగా భారత్ ఈ రోజు తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ సంఖ్య నైజీరియా అవసరాల కంటే ఎక్కువే. గడచిన దశాబ్ధంలో మన మొబైల్ ఫోన్ నిపుణులు 75 రెట్లు పెరిగారు. అదే సమయంలో రక్షణ రంగ నిపుణులు 30 రెట్లు పెరిగాయి. ఈ రోజు మనం రక్షణ రంగ ఉత్పత్తులను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.
మిత్రులారా,
అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను మెచ్చుకుంటోంది. వాటి నుంచి నేర్చుకుంటోంది. గగన్‌యాన్ మిషన్ ద్వారా భారతీయులను అంతరిక్షంలోకి పంపించాలనే లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుంది. అలాగే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు భారత్ సిద్ధమవుతోంది.
స్నేహితులారా,
సౌకర్యవంతమైన వాతావరణాన్ని విడిచిపెట్టడం, ఆవిష్కరణలు, నూతన మార్గాలను ఏర్పాటు చేయడం భారత్‌ను నిర్వచించే లక్షణాలుగా మారాయి. గడచిన దశాబ్దంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. పెద్ద మొత్తంలో పేదరికాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచింది. భారత్ సాధించింది కాబట్టి ఇతర దేశాలూ సాధిస్తాయనే నమ్మకాన్ని కలిగించింది. నూతనంగా సమకూర్చుకున్న ఆత్మవిశ్వాసంతో భారత్ అభివృద్ధి దిశగా పయనం ప్రారంభించింది. మనం వందేళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకునే 2047 ఏడాది నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం. పదవీవిరమణ తర్వాత హాయిగా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్న మీ భవిష్యత్తు కోసం ఇప్పుడే నేను పునాది వేస్తున్నాను. 2047 లక్ష్యం దిశగా అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించేందుకు ప్రతి భారతీయుడు కృషి చేస్తున్నాడు. నైజీరియాలో ఉన్న మీరు సైతం ఈ కల సాకారం దిశగా గణనీయమైన పాత్రను పోషిస్తున్నారు.
మిత్రులారా,
వృద్ధి, శాంతి, సంక్షేమం, ప్రజాస్వామ్యంలో భారత్ ప్రపంచానికి ఆశారేఖగా ఉద్భవించింది. మీరెక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలు మిమ్మల్ని గౌరవభావంతో చూస్తారు. ఇది నిజమే కదా? నిజాయతీగా మీ అనుభవాలు చెప్పండి? మీరు ఇండియా నుంచి వచ్చారని చెప్పగానే, ఇండియా, హిందూస్థాన్, భారత్ ఏ పేరుతో పిలిచినా - మీ చేతిని స్పృశించినప్పడు వారికి బలం చేకూరినట్టుగా, ఏదో శక్తిని అనుభూతి చెందుతున్నట్టుగా, ఏదో అనుబంధం ఉందన్న భావనకు లోనవుతారు.
స్నేహితులారా,
ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభం ఎదురైనప్పుడు విశ్వబంధుగా మొదట స్పందించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కరోనా మహమ్మారి సమయంలో ఎదురైన ఇబ్బందులను మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో ప్రతి దేశం వ్యాక్సీన్ల కొరతను ఎదుర్కొంది. అలాంటి సంక్షిష్ట సమయంలో వీలైనన్ని ఎక్కువ దేశాలకు టీకాలను భారత్ అందించింది. ఇది వేల సంవత్సరాలుగా మన సంప్రదాయం, సంస్కృతిలో నిండిన విలువల్లో భాగమే. ఫలితంగా భారత్ వ్యాక్సీన్ల ఉత్పత్తిని పెంచి నైజీరియాతో సహా150 కంటే ఎక్కువ దేశాలకు ఔషధాలను, వ్యాక్సీన్లను సరఫరా చేసింది. ఇదేమీ చిన్న విజయం కాదు. ఈ ప్రయత్నాలకు కృతజ్ణతలు, నైజీరియాతో సహా ఇతర ఆఫ్రికా దేశాల్లో ఎన్నో ప్రాణాలను కాపాడగలిగాం.
స్నేహితులారా,
నేటి భారత్ ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ విధానాన్ని అనుసరిస్తుంది. భవిష్యత్తులో జరిగే అభివృద్ధికి నైజీరియాతో సహా ఆఫ్రికాను కీలక ప్రాంతంగా నేను భావిస్తున్నాను. గడచిన అయిదేళ్లలో ఆఫ్రికాలో 18 నూతన రాయబార కార్యాలయాలను భారత్ ఏర్పాటు చేసింది. ప్రపంచ వేదికలపై ఆఫ్రికా వాణిని బలంగా వినిపించేందుకు భారత్ నిర్విరామంగా కృషి చేస్తోంది. గతేడాది భారత్ అధ్యక్షతన నిర్వహించిన జీ 20 సమావేశాలు దీనికి ప్రధాన నిదర్శనం. ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని చేసిన ప్రయత్నాల్లో మనం విజయం సాధించాం. జీ20లోని ప్రతి సభ్యదేశం భారత్ ఆలోచనకు పూర్తి మద్ధతు ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. భారత్ ఆహ్వానాన్ని మన్నించి ఆహ్వాన దేశంగా విచ్చేసిన నైజీరియా ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. అధ్యక్షునిగా టినుబు బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో భారత్‌ను సందర్శించారు. అలాగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందుగా హాజరైన నాయకుల్లో ఆయన కూడా ఒకరు.
మిత్రులారా,
మీలో చాలా మంది వేడుకలు, పండగలు, సంతోషకరమైన లేదా బాధను కలిగించే సందర్భాల్లో మీ కుటుంబంతో గడపడానికి తరచూ భారత్‌కు వెళుతూ ఉంటారు. భారత్ నుంచి మీ బంధువులు తరచుగా మీకు ఫోన్ చేస్తారు లేదా సందేశాలు పంపిస్తారు. మీ కుటుంబంలో ఒక సభ్యునిగా, ఇక్కడ నిలబడి మీకు ప్రత్యేక ఆహ్వానాన్ని నేను అందిస్తున్నాను. వచ్చే ఏడాది జనవరిలో భారత్ వరుసగా ప్రధానమైన పండగలను జరుపుకొంటోంది. ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఢిల్లీలో జరుపుకొంటాం. జనవరి రెండో వారంలో ప్రవాస భారతీయ దివస్‌ను నిర్వహించుకొంటాం. ఈ సారి ఈ కార్యక్రమం జగన్నాథుడు కొలువై ఉన్న ఒడిశాలో నిర్వహిస్తున్నాం. ప్రపంచం నలుమూలల్లో ఉన్న స్నేహితులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
వీటికి అదనంగా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా జరుగుతుంది. ఈ అద్భుతమైన కార్యక్రమాల నేపథ్యంలో భారత్ ను సందర్శించడానికి మీకు ఇదే సరైన సమయం. భారత్ స్ఫూర్తిని ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు మీ పిల్లలను, మీ నైజీరియన్ స్నేహితులను మీతో పాటు తీసుకురండి. ప్రయాగరాజ్ అయోధ్యకు చేరువగా ఉంటుంది. కాశీ కూడా అంత దూరంలో ఏమీ లేదు. కుంభమేళాను మీరు సందర్శిస్తే.. ఈ రెండు పవిత్ర స్థలాలను దర్శించుకునే అవకాశాన్ని వదులుకోకండి. కాశీలో నూతనంగా నిర్మించిన విశ్వనాథ ధామ్ అద్భుతంగా ఉంటుంది. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరామునికి గొప్ప దేవాలయాన్ని నిర్మించుకున్నాం. దానిని చూసేందుకు మీరు మీ పిల్లలను తీసుకురావాలి. ప్రవాసీ భారతీయ దివస్‌తో ప్రారంభమయ్యే ఈ ప్రయాణం మహాకుంభమేళా, ఆ తర్వాత గణతంత్ర దినోత్సవంతో ‘త్రివేణి’గా మారుతుంది. భారత్ అభివృద్ధి, సుసంపన్నమైన సంస్కృతితో అనుసంధానమయ్యే అద్భుతమైన అవకాశం. మీరు ఇంతకు ముందే చాలా సార్లు భారత్‌ను సందర్శించి ఉంటారు. కానీ నా మాటలను గుర్తుంచుకోండి.. ఈ సారి మాత్రం మరచిపోలేని జ్ఞాపకాలను, అంతులేని ఆనందాన్ని మూటకట్టుకుంటారు. నిన్న నేను వచ్చినప్పటి నుంచి మీ ఆప్యాయత, ఉత్సాహం, ప్రేమ నన్ను ఆనందంలో ముంచెత్తుతోంది. మిమ్మల్ని కలుసుకోవడం అదృష్టం. మీ అందరికీ కృతజ్ఞుడను.
అందరూ నాతో కలసి చెప్పండి
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
ధన్యవాదాలు.