ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసి) 8వ మహాసభను ప్రారంభించిన ప్రధాని;
‘‘భార‌త్‌లో టెలికమ్యూనికేషన్లను మేము సంధాన మాధ్యమంగానేగాక సమన్యాయం.. అవకాశాల మార్గంగానూ మార్చాం’’;
‘‘డిజిటల్ ఇండియా’ నాలుగు మూలస్తంభాలను గుర్తించి వాటి ప్రగతి దిశగా ఏకకాలంలో కృషి చేస్తూ ఫలితాలు కూడా సాధించాం’’;
‘‘చిప్ నుంచి తుది ఉత్పత్తిదాకా పూర్తి ‘మేడ్ ఇన్ ఇండియా’ ఫోన్‌ను ప్రపంచానికి అందించేందుకు కృషి చేస్తున్నాం’’;
‘‘భారత్ కేవలం పదేళ్లలో భూమి-చంద్రుని మధ్యగల దూరానికి 8 రెట్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేసింది’’;
‘‘డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ ప్రజాస్వామ్యీకరించింది’’;
‘‘ప్రపంచంలో సంక్షేమ పథకాలను కొత్త శిఖరాలకు చేర్చగల డిజిటల్ సౌకర్య సముచ్ఛయం నేడు భారత్ సొంతం’’;
‘‘సాంకేతిక రంగ సార్వజనీనత.. సాంకేతిక వేదికల ద్వారా మహిళా సాధికారత లక్ష్య సాధనకు భారత్ కృషి చేస్తోంది’’;
‘‘డిజిటల్ సాంకేతికత కోసం అంతర్జాతీయ చట్రం ప్రాధాన్యాన్ని.. ప్రపంచవ్యాప్త సుపరిపాలన కోసం అంతర్జాతీయ మార్గదర్శకాలను ప్రపంచ సంస్థలన్నీ ఆమోదించాల్సిన తరుణం ఆసన్నమైంది’’;
‘‘మన భవిష్యత్తు సాంకేతిక దృఢత్వం... నైతిక శక్తితో ముడిపడినదిగా మాత్రమేగాక స

నా మంత్రివర్గ సహచరులు జ్యోతిరాదిత్య సింధియా జీ, చంద్రశేఖర్ జీ, ఐటీయూ సెక్రటరీ జనరల్, వివిద దేశాల మంత్రులు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, పరిశ్రమ ముఖ్యులు, టెలికాం నిపుణులు, అంకుర సంస్థలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు, భారత్, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా,


 

ఇండియా మొబైల్ కాంగ్రెస్‌కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం! అంతర్జాతీయ టెలికాం యూనియన్ (ఐటీయూ)కు చెందిన సహచరులందరికీ నేను ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాను. మీరు డబ్ల్యూటీఎస్ఏ కోసం మొదటిసారిగా భారత్‌ను ఎంచుకున్నారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు అలాగే మీ నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను.

 

మిత్రులారా,

టెలికాం, సంబంధిత సాంకేతికతల రంగంలో ప్రపంచంలోనే అత్యంత పురోగతి సాధించిన దేశాల్లో నేడు భారత్ ఒకటిగా ఉంది. భారత్‌లో 120 కోట్లు లేదా 1200 మిలియన్ల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. భారత్‌లో 95 కోట్లు లేదా 950 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోని రియల్-టైమ్ డిజిటల్ లావాదేవీల్లో 40 శాతానికి పైగా భారత్‌లోనే జరుగుతున్నాయి. డిజిటల్ కనెక్టివిటీని భారత్ ఆఖరి వ్యక్తి వరకూ సమర్థమైన సాధనంగా మార్చింది. గ్లోబల్ టెలికమ్యూనికేషన్ ప్రమాణాలు, దాని భవిష్యత్తు గురించి ఇక్కడ చర్చించడం... ప్రపంచానికి మేలు చేసే ఒక మాధ్యమం అవుతుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

డబ్ల్యూటీఎస్ఏ, ఇండియా మొబైల్ కాంగ్రెస్ రెండింటినీ కలిపి నిర్వహించుకోవడం ముఖ్యవిశేషం. డబ్ల్యూటీఎస్ఏ లక్ష్యం ప్రపంచ ప్రమాణాల కోసం కృషి చేయడం, అయితే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సేవల విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువల్ల, నేటి ఈ కార్యక్రమం- ప్రమాణాలు, సేవలు రెండింటినీ ఒకే వేదికపైకి తెచ్చింది. భారత్ ఇప్పుడు నాణ్యమైన సేవలపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. అదే సమయంలో మేం మా ప్రమాణాలను కూడా స్పష్టంగా చేస్తున్నాం. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీఎస్‌ఏ అనుభవం భారత్‌కు కొత్త శక్తిని తెస్తుంది.

 

మిత్రులారా,

ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రపంచాన్ని శక్తిమంతం చేయడం గురించి డబ్ల్యూటీఎస్ఏ మాట్లాడుతుంది. కనెక్టివిటీ ద్వారా ప్రపంచాన్ని శక్తిమంతం చేయడం గురించి ఇండియా మొబైల్ కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఈ సందర్భంలో, ఏకాభిప్రాయం, కనెక్టివిటీ రెండూ కలిసి వస్తున్నాయి. ఈ రోజు పలు సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి ఈ రెండూ ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకున్నారు. వేలాది సంవత్సరాలుగా, భారత్ "వసుధైక కుటుంబం" అనే గొప్ప సందేశానికి అనుగుణంగా జీవనం సాగిస్తున్నది. మేం జీ-20కి నాయకత్వం వహించే అవకాశం పొందినప్పుడు, "ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు" అనే సందేశాన్ని కూడా ఇచ్చాం. ప్రపంచాన్ని అనుసంధానించడానికి, వివాదాలను పరిష్కరించడానికి భారత్ కట్టుబడి ఉంది. పురాతన సిల్క్ రోడ్ నుంచి నేటి సాంకేతిక మార్గాల వరకు, ప్రపంచాన్ని అనుసంధానించడం, పురోగతికి కొత్త దారులు తెరవడం అనే భారత్ లక్ష్యంలో మార్పు లేదు. ఈ సందర్భంలో, డబ్ల్యూటీఎస్ఏ, ఐఎమ్‌సీ భాగస్వామ్యం స్ఫూర్తిదాయకం. స్థానికం, ప్రపంచం కలిస్తే, అది ఒక దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుంది, ఇదే మా లక్ష్యంగా ఉంది.

 

మిత్రులారా,

21వ శతాబ్దంలో, భారత్‌లో మొబైల్, టెలికాం రంగాల్లో పురోగతి మొత్తం ప్రపంచానికి అధ్యయనాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా, మొబైల్, టెలికాం రంగాలను ఒక సౌకర్యంగా భావించారు. కానీ భారత్‌ మోడల్‌ భిన్నంగా ఉంది. భారత్‌లో, మేం టెలికాం రంగాన్ని కేవలం కనెక్టివిటీ సాధనంగా మాత్రమే కాకుండా ఈక్విటీ, అవకాశాల మాధ్యమంగా చూశాం. ఈ మాధ్యమం గ్రామాలు, నగరాల మధ్య అలాగే ధనికులు, పేదల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 10 ఏళ్ల క్రితం డిజిటల్ ఇండియా దార్శనికతను దేశానికి అందించినప్పుడు, మనం సమగ్ర దృక్పథంతో పని చేయాలని నేను పిలుపునిచ్చాను. డిజిటల్ ఇండియాకు నాలుగు మూల స్తంభాలను మేం గుర్తించాం. మొదటిది, పరికరాల ధర తక్కువగా ఉండాలి. రెండోది, డిజిటల్ కనెక్టివిటీ దేశంలోని ప్రతి మూలకూ చేరుకోవాలి. మూడోది, డేటా అందరికీ అందుబాటులో ఉండాలి. నాలుగోది, ‘డిజిటల్ ఫస్ట్’ మా లక్ష్యంగా ఉండాలి. మేం ఈ నాలుగు స్తంభాలపై ఏకకాలంలో పని చేయడం ప్రారంభించి, ఫలితాలను సైతం రాబట్టగలిగాం.

 

మిత్రులారా,

మేం భారత్‌లో ఫోన్లను తయారు చేయడం ప్రారంభించే వరకూ ఫోన్లు అందుబాటు ధరల్లో లేవు. 2014లో భారత్‌లో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండగా, నేడు 200లకు పైగా తయారీ యూనిట్లు ఉన్నాయి. ఇంతకుముందు, మేం చాలా ఫోన్లను దిగుమతి చేసుకున్నాం, కానీ ఇప్పుడు మేం భారత్‌లో ఆరు రెట్లు ఎక్కువ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాం. మొబైల్ ఎగుమతిదారులుగా సైతం మేం గుర్తింపు సాధించాం. అయితే మేం అక్కడితో ఆగలేదు. ఇప్పుడు, చిప్‌ల నుంచి తుది ఉత్పత్తుల వరకు, పూర్తిగా భారత్‌లోనే తయారైన ఫోన్‌ను మేం ప్రపంచానికి అందించేందుకు కృషి చేస్తున్నాం. భారత్‌లో సెమీకండక్టర్ రంగంలో కూడా గణనీయమైన పెట్టుబడులు పెడుతున్నాం.

మిత్రులారా,

కనెక్టివిటీ లక్ష్యంగా పని చేస్తూ, భారత్‌లోని ప్రతి ఇంటినీ అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా బలమైన మొబైల్ టవర్ల వ్యవస్థను మేం నిర్మించాం. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో తక్కువ సమయంలో వేలాది మొబైల్ టవర్లను ఏర్పాటు చేశాం. రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వై-ఫై సౌకర్యాలను కల్పించాం. మేం అండమాన్-నికోబార్, లక్షద్వీప్ వంటి దీవులను సముద్రగర్భ కేబుల్స్ ద్వారా అనుసంధానించాం. కేవలం 10 ఏళ్లలోనే, భూమి-చంద్రుని మధ్య దూరం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ఆప్టికల్ ఫైబర్‌ను భారత్ ఏర్పాటు చేసింది! భారత్ వేగానికి ఒక ఉదాహరణ చెబుతాను. రెండేళ్ల కిందట మొబైల్ కాంగ్రెస్‌లో మేం 5జీని ప్రారంభించాం. నేడు, భారత్‌లోని దాదాపు ప్రతి జిల్లా 5జీ సేవలతో అనుసంధానమైంది. భారత్ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా ఎదిగింది. అలాగే ఇప్పుడు మేం 6జీ సాంకేతికతపై వేగంగా పని చేస్తున్నాం.

 

మిత్రులారా,

భారత్‌లో టెలికాం రంగంలో అనూహ్యమైన, అపూర్వమైన సంస్కరణలు, ఆవిష్కరణలు జరిగాయి. ఫలితంగా డేటా ఖర్చులు గణనీయంగా తగ్గాయి. నేడు, భారత్‌లో ఇంటర్నెట్ డేటా ధర ఒక జీబీ కోసం సుమారుగా 12 సెంట్లు ఉంటే, చాలా దేశాల్లో, ఒక జీబీ డేటా ధర 10 నుంచి 20 రెట్లు ఎక్కువ ఉంది. ప్రతీ భారతీయుడు నెలకు సగటున 30 జీబీ డేటాను వినియోగిస్తున్నాడు.

 

మిత్రులారా,

మా నాలుగో లక్ష్యం- ‘డిజిటల్ ఫస్ట్’ స్ఫూర్తి ఈ ప్రయత్నాలన్నింటినీ కొత్త స్థాయికి తీసుకువెళ్లింది. భారత్ డిజిటల్ టెక్నాలజీని ప్రజాస్వామ్యీకరించింది. మేం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను సృష్టించాం, వాటిలో జరిగిన ఆవిష్కరణలు లక్షలాది కొత్త అవకాశాలను సృష్టించాయి. జేఏఎమ్ త్రయం (జన్ ధన్, ఆధార్, మొబైల్) అనేక ఆవిష్కరణలకు పునాదిగా మారింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అనేక కొత్త కంపెనీలకు అవకాశాలను సృష్టించింది. ఈ రోజుల్లో... ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) గురించి కూడా అదే విధమైన చర్చ నడుస్తున్నది. ఇది డిజిటల్ వాణిజ్యంలో కొత్త విప్లవాన్ని తీసుకువస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో, మా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అవసరమైన వారికి నగదును బదిలీ చేయడం, కోవిడ్-19తో వ్యవహరించే ఉద్యోగులకు సకాలంలో మార్గదర్శకాలను పంపడం, టీకా ప్రక్రియను క్రమబద్ధీకరించడం లేదా డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను అందించడం వంటి ప్రతీ పనినీ సులభతరం చేయడం మనం చూశాం. భారత్‌లో ఈ ప్రక్రియ అంతా సాఫీగా జరిగింది. నేడు, భారత్ సంక్షేమ పథకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాలకు చేర్చే డిజిటల్ బొకేను కలిగి ఉంది. అందుకే, జీ-20 అధ్యక్షత సమయంలో, భారత్ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల గురించి ప్రధానంగా ప్రస్తావించింది. ఈరోజు, భారత్ అన్ని దేశాలతో యూపీఐకి సంబంధించిన అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉందని నేను పునరుద్ఘాటిస్తున్నాను.

 

మిత్రులారా,

డబ్ల్యూటీఎస్ఏలో మహిళల పాత్ర గురించి చర్చ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. మహిళల సారథ్యంలో అభివృద్ధి కోసం భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. జీ-20 అధ్యక్షత సమయంలో, మేం ఈ సమస్య పట్ల మా నిబద్ధతను మరింత పెంచుకున్నాం. సాంకేతిక రంగాన్ని కలుపుకొని, సాంకేతిక వేదికల ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం భారత్ లక్ష్యం. మా అంతరిక్ష యాత్రల్లో మా మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించడం మీరు చూశారు. మా అంకుర సంస్థల్లో మహిళా సహ వ్యవస్థాపకుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. నేడు, భారత్‌లో ఎస్‌టీఈఎమ్ విద్యలో 40 శాతానికి పైగా మన ఆడబిడ్డలే ఉన్నారు. సాంకేతికతకు నాయకత్వం వహించడంలో భారత్ మహిళలకు మరిన్ని అవకాశాలను కల్పిస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న నమో డ్రోన్ దీదీ కార్యక్రమం గురించి మీరు కచ్చితంగా వినే ఉంటారు. ఈ కార్యక్రమం వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. భారత్‌లోని గ్రామాల మహిళలు దీనిని నడిపిస్తున్నారు. గృహాల్లో డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి మేం బ్యాంక్ సఖి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. అంటే మహిళలు డిజిటల్ అవగాహన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. మా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి, శిశు సంరక్షణలో, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. నేడు, ఈ కార్మికులు టాబ్లెట్లు, యాప్‌ల ద్వారా ఈ పనులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. మేం మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ అయిన మహిళా ఇ-హాత్ ప్రోగ్రామ్‌ను కూడా నడుపుతున్నాం. అంటే ఒకప్పుడు ఊహకు సైతం అందని విధంగా నేడు పల్లెటూళ్లలో భారత మహిళలు సాంకేతికతతో పని చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించబోతున్నాం. ప్రతి ఆడబిడ్డ టెక్ లీడర్‌గా మారే భారత్‌ను నేను చూడాలనుకుంటున్నాను.

 

మిత్రులారా,

భారత్ జీ-20కి అధ్యక్షత వహించిన సమయంలో... మేం ప్రపంచానికి ఒక కీలక అంశాన్ని అందించాం. నేను ఈ అంశాన్ని డబ్ల్యూటీఎస్ఏ వంటి ప్రపంచ వేదికపై కూడా ప్రస్తావించాలనుకుంటున్నా. ఆ అంశమే డిజిటల్ టెక్నాలజీ కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్, గ్లోబల్ మార్గదర్శకాలు. గ్లోబల్ గవర్నెన్స్ కోసం దీని ప్రాముఖ్యతను ప్రపంచ సంస్థలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. సాంకేతికత కోసం ప్రపంచవ్యాప్తంగా చేయాల్సినవి, చేయకూడనివి ఏమిటనే విషయంలో స్పష్టత ఉండాలి. నేడు, అన్ని డిజిటల్ సాధనాలు, అప్లికేషన్లు అన్ని దేశాల సరిహద్దులు, పరిమితులకు మించి పనిచేస్తున్నాయి. ఏ ఒక్క దేశం కూడా తన పౌరులను సైబర్ దాడుల నుంచి స్వయంగా రక్షించుకోలేని పరిస్థితి ఉంది. మనమంతా కలిసి పని చేయాలి, ప్రపంచ సంస్థలు బాధ్యత తీసుకోవాలి. విమానయాన రంగంలో నియమ, నిబంధనల కోసం మేం గ్లోబల్ ద‌ృక్పథాన్ని ఏర్పాటు చేసుకున్న విధంగానే, డిజిటల్ ప్రపంచానికి కూడా ఇలాంటి ఫ్రేమ్‌వర్క్ అవసరమని మా అనుభవం ద్వారా మాకు అవగతమైంది. ఈ విషయంలో డబ్ల్యూటీఎస్ఏ మరింత క్రియాశీలంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరి కోసం సురక్షిత టెలికమ్యూనికేషన్ వ్యవస్థను అందించడం గురించి ఆలోచన చేయాలని నేను ప్రతీ డబ్ల్యూటీఎస్ఏ సభ్యుడిని కోరుతున్నాను. ఈ పరస్పర అనుసంధాన ప్రపంచంలో, భద్రత ద్వితీయ ప్రాధాన్యం కానేకాదు. భారత్ అమలు చేస్తున్న డేటా ప్రొటెక్షన్ యాక్ట్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ సురక్షిత డిజిటల్ వ్యవస్థ నిర్మాణం పట్ల మా నిబద్ధతకు నిదర్శనం. సమగ్రమైన, సురక్షితమైన, ప్రతీ భవిష్యత్ సవాలుకు అనుగుణంగా ఉండే ప్రమాణాలు రూపొందించాలని నేను ఈ అసెంబ్లీ సభ్యులందరినీ కోరుతున్నాను. వివిధ దేశాల భిన్నత్వాన్ని గౌరవించే నైతిక ఏఐ, డేటా గోప్యత కోసం మీరంతా ప్రపంచ ప్రమాణాలను అభివృద్ధి చేయాలి.

 

మిత్రులారా,

ఈ సాంకేతిక విప్లవంలో, సాంకేతికతకు మానవ-కేంద్రిత కోణాన్ని జోడించడానికి మనం నిరంతరం కృషి చేయడం చాలా ముఖ్యం. ఈ విప్లవం బాధ్యతాయుతంగా, సుస్థిరంగా ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యత. నేడు మనం రూపొందించుకునే ప్రమాణాలు మన భవిష్యత్తు దిశను నిర్దేశిస్తాయి. కాబట్టి, భద్రత, గౌరవం, ఈక్విటీ సూత్రాలు కేంద్రంగా మన చర్చలు సాగాలి. ఈ డిజిటల్ యుగంలో ఏ దేశం, ఏ ప్రాంతం, ఏ సమాజం వెనుకబడిపోకుండా చూడడమే మన లక్ష్యం. ఆవిష్కరణలు, సమగ్రత ప్రధాన కేంద్రంగా మన భవిష్యత్తు సాంకేతికంగా బలంగా, నైతికంగా దృఢంగా ఉండేలా మనం చూసుకోవాలి.

 

మిత్రులారా,

డబ్ల్యూటీఎస్ఏ విజయం కోసం నా శుభాకాంక్షలను అలాగే నా మద్దతును తెలుపుతున్నాను. అంతా బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు!

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi