ధర్మంలో అభిధమ్మ ఉంది, ధర్మసారాన్ని అర్థం చేసుకోవడానికి పాళీ భాషలో ప్రావీణ్యం అవసరం: పీఎం
భాష కేవలం సమాచార సాధనం కాదు, నాగరికత, సంస్కృతికి ఆత్మ: పీఎం
ప్రతి దేశం తన గుర్తింపును వారసత్వంతో ముడిపెడుతుంది. దురదృష్టవశాత్తూ ఈ అంశంలో భారత్ వెనకబడి ఉంది, ఇప్పుడు ఆత్మన్యూనత నుంచి బయటపడి, పెద్ద నిర్ణయాలు తీసుకొంటోంది: పీఎం
నూతన విద్యా విధానం ద్వారా యువతకు మాతృభాషలో చదివే అవకాశం దొరకడంతో భాషలు మరింత బలోపేతమవుతాయి: పీఎం
నేటి భారత్ వేగవంతమైన అభివృద్ధిని, సుసంపన్నమైన వారసత్వాన్ని ఏకకాలంలో నిర్వర్తించే పనిలో నిమగ్నమైంది : పీఎం
బుద్ధ భగవానుని పునరుజ్జీవనంలో భారత్ తన సంస్కృతి, నాగరికతను తిరిగి ఆవిష్కరిస్తోంది: పీఎం
భారత్ ప్రపంచానికి బుద్ధుడినిచ్చింది.. యుద్ధాన్ని కాదు: పీఎం
ఈ రోజు అభిధమ్మ పర్వదినం సందర్భంగా యుద్ధాన్ని వదలి బుద్ధుడు సూచించిన శాంతి మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రపంచాన్ని కోరుతున్నాను: పీఎం
అందరికీ శ్రేయస్సు అనే బుద్ధుని సందేశమే మానవత్వానికి మార్గం: పీఎం
భారత అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికలో బుద్ధుని బోధనలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి: పీఎం

నమో బుద్ధాయ!

సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, భదంత్ రాహుల్ బోధి మహాథెరో జీ, గౌరవ జాంగ్‌చుప్ చోడెన్ జీ, మహాసంఘ గౌరవ సభ్యులు, ప్రముఖులు, దౌత్య సంఘం సభ్యులు, బౌద్ధ పండితులు, బుద్ధుని బోధనలను ఆచరిస్తున్నవారు, సోదరసోదరీమణులారా.

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ కార్యక్రమంలో భాగమయ్యే గౌరవం మరోసారి నాకు దక్కింది. దయ, సద్భావనల ద్వారా మాత్రమే మనం ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చగలమనే బుద్ధుని సందేశాన్ని అభిధమ్మ దివస్ మనకు గుర్తు చేస్తుంది. 2021లో కుశీనగర్‌లో ఇలాంటి కార్యక్రమం జరిగింది. అందులో నేను కూడా పాల్గొన్నాను. బుద్ధ భగవానుడితో అనుబంధ యాత్ర నా పుట్టుకతో ప్రారంభమై నిరంతరాయంగా కొనసాగడం నా అదృష్టం. నేను బౌద్ధమతానికి గొప్ప కేంద్రంగా ఉన్న గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో జన్మించాను. ఈ స్ఫూర్తితో జీవిస్తూ, బుద్ధుని ధర్మం, బోధనలను వ్యాప్తి చేయడంలో నేను అనేక అనుభవాలు పొందాను.

గడచిన 10 ఏళ్లలో, భారత్‌లోని చారిత్రక బౌద్ధ పుణ్య క్షేత్రాలను సందర్శించడం నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్లిన సందర్భాలలో... బుద్ధుని జన్మస్థలమైన నేపాల్‌లోని లుంబినీని సందర్శించడం, మంగోలియాలో ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించడం, శ్రీలంకలో వెసాక్ వేడుకలో పాల్గొనడం... ఇంకా అనేక పవిత్ర కార్యక్రమాలలో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ఈ సంఘ, సాధకుల కలయిక బుద్ధ భగవానుని ఆశీర్వాదాల ఫలితమని నేను నమ్ముతున్నా. ఈ రోజు అభిధమ్మ దివస్ సందర్భంగా, మీ అందరికీ, అలాగే బుద్ధ భగవానుడిని అనుసరిస్తున్న వారందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు పవిత్రమైన శరద్ పూర్ణిమ పండుగ కూడా. ఈరోజు భారతీయ చైతన్యానికి మూలమైన గొప్ప జ్ఞాని వాల్మీకీజీ జయంతి కూడా. శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు.

 

గౌరవ మిత్రులారా,

ఈ సంవత్సరం, అభిదమ్మ దివస్ వేడుకతో పాటుగా మనం ఒక చారిత్రాత్మక విజయాన్ని కూడా జరుపుకుంటున్నాం. బుద్ధ భగవానుడి అభిధమ్మ వారసత్వం, అతని మాటలు, అతని బోధనలను ప్రపంచానికి అందించిన పాళీ భాషను ఈ నెలలో భారత ప్రభుత్వం ప్రాచీన భాషగా ప్రకటించింది. అందువల్ల, నేటి సందర్భం మరింత ప్రత్యేకమైనది. పాళీని ప్రాచీన భాషగా గుర్తించడం బుద్ధ భగవానుడి గొప్ప వారసత్వానికి దక్కిన గౌరవం. అభిధమ్మం ధర్మంలో అంతర్లీనంగా ఉందని మీకందరికీ తెలుసు. ఈ ధర్మం సారాంశాన్ని అర్థం చేసుకోవడం కోసం పాళీ భాషా జ్ఞానం అవసరం. ధర్మం అంటే బుద్ధుని సందేశం, బుద్ధుని సూత్రాలు... ధర్మం అంటే మానవ ఉనికికి సంబంధించిన ప్రశ్నలకు పరిష్కారం... ధర్మం అంటే మానవాళికి శాంతి మార్గం... ధర్మం అంటే అనాదిగా బుద్ధుని బోధలు... ధమ్మం అంటే సమస్త మానవాళి సంక్షేమం కోసం తిరుగులేని భరోసా! బుద్ధ భగవానుడి ధర్మ బోధలతోనే ప్రపంచానికి జ్ఞానోదయం అయింది.

కానీ మిత్రులారా,

బుద్ధుడు స్వయంగా తన బోధనలు అందించిన ప్రాచీన పాళీ భాష నేడు సాధారణ వ్యవహారికంలో లేకపోవడం బాధాకరం. భాష కేవలం సంభాషణల మాధ్యమం మాత్రమే కాదు! భాష నాగరికత, సంస్కృతిల ఆత్మ. ప్రతి భాష దాని సొంత సారాన్ని కలిగి ఉంటుంది. అందుకే బుద్ధ భగవానుని మాటలను వాటి అసలైన స్ఫూర్తితో సజీవంగా ఉంచడానికి పాళీ భాషను సజీవంగా ఉంచడం మనందరి బాధ్యత. మన ప్రభుత్వం ఈ బాధ్యతను సవినయంగా నిర్వర్తించినందుకు సంతోషంగా ఉంది. మా ఈ వినయపూర్వకమైన ప్రయత్నం బుద్ధుని అడుగుజాడల్లో నడుస్తున్న లక్షలాది మంది అనుచరుల, వేలాది మంది బౌద్ధ భిక్కుల అంచనాలను నెరవేర్చింది. ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్న సందర్భంగా మీ అందరికీ అభినందనలు.

 

గౌరవ మిత్రులారా,

భాష, సాహిత్యం, కళ, ఆధ్యాత్మికత అనే దేశ సంపదలు ఆ దేశపు ఉనికిని తెలియజేస్తాయి. అందుకే, ప్రపంచంలోని ఏ దేశమైనా కొన్ని వందల ఏళ్ల నాటి విషయాన్ని గుర్తించినప్పటికీ, దానిని సగర్వంగా ప్రపంచానికి తెలియజేస్తుంది. ప్రతి దేశం తన వారసత్వాన్ని దాని గుర్తింపుతో అనుసంధానిస్తుంది. దురదృష్టవశాత్తూ, ఈ విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉంది. స్వాతంత్ర్యానికి ముందు, ఆక్రమణదారులు భారతదేశ గుర్తింపును చెరిపివేసే ప్రయత్నాలు చేశారు. అలాగే స్వాతంత్య్రానంతరం, బానిసల మనస్తత్వం ఉన్న పాలకులు ఆ ప్రయత్నాలను కొనసాగించారు. భారత్‌లో కొన్నేళ్ల పాటు ఒక వ్యవస్థ మనల్ని వ్యతిరేక దిశలో నడిపించింది. భారతదేశ ఆత్మలో నివసించే బుద్ధుడు, అలాగే స్వాతంత్య్రం సాధించిన సమయంలో భారత చిహ్నాలుగా స్వీకరించిన బుద్ధుని చిహ్నాలు, తరువాతి దశాబ్దాలలో క్రమంగా మరుగునపడిపోయాయి. పాళీ భాషకు సముచిత స్థానం లభించడానికి ఏడు దశాబ్దాలు పట్టింది.

కానీ మిత్రులారా,

దేశం ఇప్పుడు ఆ న్యూనతా భావాల నుంచి విముక్తి పొంది ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఫలితంగా దేశం పెద్ద నిర్ణయాలను తీసుకుంటోంది. అందుకే నేడు పాళీకి ప్రాచీన భాష హోదా లభించింది. అయితే ఇదే సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌తో మంచి అనుబంధం కలిగి ఉన్న మరాఠీ భాషకు కూడా ఈ గౌరవం దక్కడం అందమైన యాదృచ్చికం. బౌద్ధమతాన్ని ఆచరించిన గొప్ప వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ధమ్మ దీక్షను పాళీలో స్వీకరించారు అలాగే ఆయన మాతృభాష మరాఠీ. మా ప్రభుత్వం బెంగాలీ, అస్సామీ, ప్రాకృత భాషలకు కూడా ప్రాచీన భాష హోదా కల్పించింది.

 

మిత్రులారా,

ఈ భారత భాషలు మన దేశ వైవిధ్యాన్ని పెంపొందిస్తాయి. గతంలో, మన ప్రతీ భాష దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. నేడు, దేశం ఆమోదించిన కొత్త జాతీయ విద్యా విధానం కూడా ఈ భాషలను పరిరక్షించే సాధనంగా మారుతోంది. దేశ యువత కోసం మాతృభాషలో విద్యాభ్యాసం ప్రారంభించినందున, ఈ భాషలు మరింత బలపడుతున్నాయి.

మిత్రులారా,

మేం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎర్రకోటపై నుంచి ‘పంచ్ ప్రాణ్’ (అయిదు ప్రతిజ్ఞలు) దార్శనికతను దేశానికి అందించాం. పంచ ప్రాణ్ అంటే – ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) నిర్మించడం! బానిసల మనస్తత్వం నుంచి విముక్తి! జాతి ఐక్యత! కర్తవ్యాలను నెరవేర్చడం! మన వారసత్వం పట్ల గర్వం! అందుకే నేడు, భారత్ వేగవంతమైన అభివృద్ధినీ, తన గొప్ప వారసత్వాన్ని కాపాడుకునే నిబద్ధతనూ రెండింటినీ సాధించేందుకు కృషి చేస్తోంది. బుద్ధ భగవానుడితో అనుబంధం ఉన్న వారసత్వ సంపద పరిరక్షణ ఈ మిషన్ ప్రాధాన్యంగా ఉంది. బుద్ధ సర్క్యూట్‌లో భాగంగా భారత్, నేపాల్‌లో బుద్ధ భగవానుడికి సంబంధించిన స్థలాలను అభివృద్ధి చేస్తున్న విధానం మీరు చూడవచ్చు. కుశీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించుకున్నాం. లుంబినీలో... మేం బౌద్ధ సంస్కృతి, వారసత్వం కోసం భారతదేశ అంతర్జాతీయ కేంద్రాన్ని నిర్మిస్తున్నాం. లుంబినీలోని బౌద్ధ విశ్వవిద్యాలయంలో బౌద్ధ అధ్యయనాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పీఠాన్ని స్థాపించాం. బోధ్ గయ, శ్రావస్తి, కపిలవస్తు, సాంచి, సాత్నా, రేవా వంటి బౌద్ధ ప్రదేశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడు రోజుల్లో అంటే ఈనెల 20న నేను వారణాసిని సందర్శిస్తాను. అక్కడ సారనాథ్‌లో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నాం. కొత్త నిర్మాణాలను చేపట్టడంతో పాటుగా మన గతాన్ని కూడా కాపాడుకుంటున్నాం. గత 10 ఏళ్ల కాలంలో, మేం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 600లకు పైగా పురాతన వారసత్వ కళాఖండాలు, కళాకృతులు, స్మారక చిహ్నాలను తిరిగి మన దేశానికి తీసుకువచ్చాం. వీటిలో చాలా స్మారక చిహ్నాలు బౌద్ధమతానికి సంబంధించినవే. మరో మాటలో చెప్పాలంటే, బుద్ధుని వారసత్వ పునరుజ్జీవనంలో భారత్ తన సంస్కృతిని, నాగరికతను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నది.

 

గౌరవ మిత్రులారా,

బుద్ధుని పట్ల భారత్‌ విశ్వాసం తనకోసమే కాకుండా, సమస్త మానవాళికి సేవ చేసే మార్గం కూడా అవుతుంది. ప్రపంచ దేశాలనూ, బుద్ధుని గురించి తెలిసిన, విశ్వసిస్తున్న వారందరినీ మేం ఈ మిషన్‌లో ఒకచోటకు చేర్చాం. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ దిశగా అర్థవంతమైన ప్రయత్నాలు చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ వంటి దేశాల్లో పాళీ భాషలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. భారత్‌లోనూ అలాంటి ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నాం. సంప్రదాయ పద్ధతులతో పాటుగా, మేం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ ఆర్కైవ్‌లు, యాప్‌ల ద్వారా కూడా పాళీ భాషకు ప్రచారం కల్పిస్తున్నాం. బుద్ధ భగవానుని గురించి నేను ఇంతకు ముందు చెప్పినట్లు - “బుద్ధ్ బోధ్ భీ హై, ఔర్ బుద్ధ్ శోధ్ భీ హై” (బుద్ధుడే జ్ఞానం, బుద్ధుడే పరిశోధన). అందువల్ల, బుద్ధ భగవానుడి గురించి తెలుసుకోవడానికి మేం అంతర్గత, విద్యాసంబంధమైన పరిశోధనల అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాం. మన సంఘం, మన బౌద్ధ సంస్థలు, మన బౌద్ధ భిక్షువులు ఈ దిశగా యువతను ముందుకు నడిపిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

 

గౌరవ మిత్రులారా,

ఈ 21వ శతాబ్దంలో నేటి భౌగోళిక రాజకీయ పరిస్థితి... మరోసారి అనేక అనిశ్చితులు, అస్థిరతలు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. ఇటువంటి సమయాల్లో, బుద్ధుడు సంబంధితంగా మాత్రమే కాకుండా అవసరంగా ఉన్నారు. ఐక్యరాజ్యసమితిలో నేను ఒకసారి ఇలా అన్నాను: భారతదేశం ప్రపంచానికి యుద్ధాన్ని కాదు, బుద్ధుడిని ఇచ్చింది. అలాగే ప్రపంచం మొత్తం యుద్ధంలో కాదు, బుద్ధుడిలో పరిష్కారాలను కనుగొంటుందని ఈరోజు నేను నమ్మకంగా చెబుతున్నాను. ఈ అభిధమ్మ దివస్ సందర్భంగా, నేను ప్రపంచానికి పిలుపునిస్తున్నాను: బుద్ధుని నుంచి నేర్చుకోండి... యుద్ధానికి దూరంగా ఉండండి... శాంతికి మార్గం సుగమం చేయండి... ఎందుకంటే బుద్ధుడు “నత్థి-సంతి-పరమ్-సుఖం” అని చెప్పాడు అంటే "శాంతి కంటే గొప్ప ఆనందం లేదు."

బుద్ధ భగవానుడు ఇలా బోధించారు:

“నహీ వేరేన వైరాని సమ్మత్నీధ్ కుదాచనమ్

అవేరేన చ సమ్మత్ని యెస్ ధమ్మో సనత్నతో”

అంటే, శత్రుత్వం శత్రుత్వంతో అంతం కాదు. ద్వేషం ప్రేమతో, మానవ కరుణతో ముగుస్తుంది అని బుద్ధుడు చెప్పాడు. అలాగే బుద్ధుడు "భవతు-సబ్బ-మంగళం", అంటే, "అందరూ సంతోషంగా ఉండండి, అందరికీ ఆశీర్వదాలు లభించాలి." అని చెప్పాడు. ఇదే బుద్ధుని సందేశం, ఇదే మానవత్వానికి మార్గం.

 

గౌరవ మిత్రులారా,

 

రాబోయే 25 ఏళ్లు అంటే 2047 వరకు కాలాన్ని అమృత్ కాల్ అంటున్నాం. ఈ అమృత్ కాల్ సమయంలో భారత్ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది. ఇది వికసిత్ భారత్ నిర్మాణ యుగం అవుతుంది. భారత్ అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికకు బుద్ధ భగవానుడి బోధనలు మార్గనిర్దేశం చేస్తాయి. ఈ బుద్ధ భూమిపై గల జనాభాలో చాలామంది వనరుల వినియోగం పట్ల స్పృహ ఉన్నవారే. వాతావరణ మార్పుల రూపంలో నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సంక్షోభాన్ని చూడండి. భారత్ ఈ సవాళ్లకు స్వయంగా పరిష్కారాలను కనుగొనడమే కాకుండా వాటిని ప్రపంచంతో పంచుకుంటుంది. మేం అనేక దేశాలను కలుపుకొంటూ మిషన్ లైఫ్‌ని ప్రారంభించాం. "అత్తాన్ మేవ పఠమన్// పతి రూపే నివేసయే" అని బుద్ధ భగవానుడు చెప్పారు, దీని అర్థం, "ఏ మంచినైనా మనతోనే ప్రారంభించాలి." బుద్ధుని ఈ బోధన మిషన్ లైఫ్‌లో కీలకమైనది, అంటే సుస్థిర భవిష్యత్తుకు మార్గం ప్రతీ వ్యక్తి సుస్థిరమైన జీవనశైలి నుంచే లభిస్తుంది.

 

భారత్ అంతర్జాతీయ సౌర కూటమి వంటి వేదికను ప్రపంచానికి అందించినప్పుడు, జీ-20కి అధ్యక్షత వహిస్తూ ప్రపంచ జీవఇంధన కూటమిని ఏర్పాటు చేసినప్పుడు, ఒక సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్‌ దార్శనికతను అందించినప్పుడు, వాటన్నింటిలోనూ బుద్ధుని ఆలోచనలే ప్రతిబింబించాయి. మా ప్రతీ చొరవ ప్రపంచానికి సుస్థిరమైన భవిష్యత్తును అందించడం కోసమే. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ అయినా, మన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అయినా, 2030 నాటికి భారతీయ రైల్వేల కర్బన ఉద్గారాలను నికరంగా సున్నాకు తగ్గించాలన్న లక్ష్యం అయినా, లేదా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని 20 శాతానికి పెంచడం అయినా, ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా ఈ భూమిని రక్షించడం పట్ల మా బలమైన నిబద్ధతను చాటుతూనే ఉన్నాం.

 

మిత్రులారా,

మా ప్రభుత్వ నిర్ణయాల్లో చాలా వరకు బుద్ధుడు, ధర్మం, సంఘ స్ఫూర్తితో తీసుకున్నవే. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ సంక్షోభం వచ్చినా భారత్ మొదట స్పందిస్తున్నది. ఇది బుద్ధుని కరుణ అనే సూత్రాన్ని ఆచరించడమే. టర్కీలో భూకంపం వచ్చినా, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చినా, కోవిడ్-19 మహమ్మారి సమయంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనా అన్ని కష్ట సమయాల్లోనూ సహాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. ‘విశ్వ బంధు’ (ప్రపంచ మిత్రుని)లా అందరినీ భారత్ అక్కున చేర్చుకుంటుంది. అది యోగా ఉద్యమం అయినా, చిరుధాన్యాలు, ఆయుర్వేదం, ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ప్రచారం అయినా, మా ప్రయత్నాలన్నింటి వెనుక బుద్ధ భగవానుడి ప్రేరణ ఉంది.

 

గౌరవ మిత్రులారా,

 

భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంతోపాటు, దాని మూలాలను కూడా బలోపేతం చేస్తోంది. భారత్‌లోని యువత తమ సంస్కృతి, విలువల పట్ల గర్విస్తూనే, శాస్త్రసాంకేతికతలో ప్రపంచానికి నాయకత్వం వహించాలనేది మా లక్ష్యం. ఈ ప్రయత్నాలలో, బౌద్ధమత బోధనలు మనకు గొప్పగా మార్గనిర్దేశం చేస్తున్నాయి. మన బౌద్ధ సాధువులు, సన్యాసుల మార్గదర్శనంతో, బుద్ధ భగవానుడి బోధనలను ఆచరిస్తూ మనం ఐక్యంగా అభివృద్ధిని కొనసాగిస్తామని నేను విశ్వసిస్తున్నాను.

 

ఈ పవిత్రమైన రోజున, ఈ కార్యక్రమ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాళీ ప్రాచీన భాషగా అవతరించడం గర్వకారణమే అయినా, ఈ భాషను పరిరక్షించుకోవడం, ప్రోత్సహించడం మనందరి సమష్టి బాధ్యత. ఆ సంకల్పాన్ని తీసుకొని దానిని నెరవేర్చేందుకు కృషి చేద్దాం. ఈ అంచనాలతో, మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నమో బుద్ధాయ!

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage