“వందే భారత్ రైళ్ల ఆధునికీకరణ, విస్తరణతో వికసిత భారత్ లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న దేశం”
“వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు దక్షిణాది రాష్ట్రాల వేగవంతమైన అభివృద్ధి అత్యావశ్యకం”
‘‘పీఎం గతిశక్తి దార్శనికతకు ఉదాహరణగా నిలుస్తున్న జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్)’’
“భారతీయ రైల్వేల ఆధునికీకరణకు కొత్త రూపం వందే భారత్”

అశ్విని వైష్ణవ్ జీ సహా కేంద్ర ప్రభుత్వంలోని నా గౌరవ సహచరులు; ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ జీ; తమిళనాడు గవర్నర్, ఆర్ ఎన్ రవి, కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్, నా ఇతర క్యాబినెట్ సహచరులు, రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రజా ప్రతినిధులు, సోదర సోదరీమణులారా!

 

నేడు, ఉత్తరం నుండి దక్షిణం వరకు, మన దేశ అభివృద్ధి ప్రయాణంలో మరో ముఖ్యమైన అధ్యాయాన్ని మనం చూస్తున్నాము. నేటి నుండి, మధురై-బెంగళూరు, చెన్నై-నాగర్‌కోయిల్ అలాగే మీరట్-లక్నో మార్గాలలో వందే భారత్ రైళ్లు ప్రారంభమవుతున్నాయి. ఈ విస్తరణ, ఆధునికత స్వీకరణనీ, అలాగే పెరిగిన వందేభారత్ రైళ్ల వేగం 'అభివృద్ధి చెందిన భారతదేశం' లక్ష్యం వైపు మన దేశ సుస్థిరమైన పురోగతినీ సూచిస్తున్నాయి. ఈరోజు ప్రారంభించిన మూడు వందే భారత్ రైళ్లు దేశంలోని ముఖ్య నగరాలు, చారిత్రక ప్రదేశాల అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఆలయాల నగరమైన మధురై వందే భారత్ ద్వారా ఇప్పుడు నేరుగా ఐటీ కేంద్రం బెంగళూరుతో అనుసంధానించారు. పండుగలు, వారాంతాల సమయంలో మదురై - బెంగుళూరుల మధ్య ప్రయాణాన్ని ఈ రైలు మరింత సులభతరం చేస్తూ, యాత్రికుల అవసరాలను కూడా తీర్చనుంది. చెన్నై నుండి నాగర్‌కోయిల్ మార్గంలో నడిచే వందే భారత్ రైలు విద్యార్థులకు, రైతులకు అలాగే ఐటీ నిపుణుల కోసం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వందే భారత్ రైలు నడుస్తున్న ప్రాంతాల్లో ఇప్పటికే పర్యాటకుల సంఖ్య పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. పెరుగుతున్న పర్యాటకం వల్ల స్థానిక వ్యాపారాలు, దుకాణదారుల ఆదాయం పెరుగుతుంది అలాగే కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయి. ఈ కొత్త రైళ్ల ప్రారంభం సందర్భంగా మన దేశ ప్రజలందరికీ అభినందనలు.

 

మిత్రులారా,

అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి మన దక్షిణాది రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరముంది. దక్షిణ భారతదేశంలో ప్రతిభ, వనరులు అలాగే అవకాశాలకు కొదవలేదు. తమిళనాడు, కర్నాటక సహా దక్షిణ భారత ప్రాంతమంతా అభివృద్ధి చేయడం మా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉంది. గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రాల్లో రైల్వేలు సాధించిన ప్రగతి మా నిబద్ధతకు నిదర్శనం. ఈ ఏడాది బడ్జెట్‌లో, తమిళనాడుకు రైల్వే బడ్జెట్‌ కోసం రూ. 6,000 కోట్లకు పైగా కేటాయించాం.  ఇది 2014 బడ్జెట్ కేటాయింపుల కంటే 7 రెట్లు ఎక్కువ. తమిళనాడులో ఇప్పటికే ఆరు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా, ఈ రెండు కొత్త రైళ్లతో కలిపి వాటి సంఖ్య ఎనిమిదికి చేరనుంది. అదేవిధంగా ఈ ఏడాది కర్నాటకకు 2014 బడ్జెట్ కంటే 9 రెట్లు అధికంగా అంటే రూ.7 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించాం. నేడు 8 జతల వందేభారత్ రైళ్లు మొత్తం కర్నాటక రాష్ట్రాన్ని అనుసంధానిస్తున్నాయి.

మిత్రులారా,

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు పెంచిన బడ్జెట్ కేటాయింపుల వల్ల దక్షిణాదిలో రైలు రవాణా మరింత బలోపేతం అవుతుంది. ఈ రాష్ట్రాలలో, రైల్వే మార్గాలను ఆధునీకరిస్తున్నాం. విద్యుదీకరణ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అలాగే అనేక రైల్వే స్టేషన్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఈ పరిణామాలు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా 'వ్యాపార నిర్వహణ సౌలభ్యం'ని మరింత సులభతరం చేశాయి.

మిత్రులారా,

ఈరోజు మీరట్-లక్నో మార్గంలో వందే భారత్ రైలు ప్రారంభం ఉత్తరప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా పశ్చిమ యూపీలోని ప్రజలకు నిజంగా శుభవార్తే. ఒకప్పుడు చారిత్రక విప్లవ భూమిగా పేరొందిన మీరట్, పశ్చిమ యూపీ ప్రాంతాలు ఇప్పుడు కొత్త అభివృద్ధి విప్లవాన్ని చూస్తున్నాయి. ఒకవైపు ఆర్‌ఆర్‌టీఎస్ ద్వారా దేశ రాజధాని ఢిల్లీతో మీరట్ అనుసంధానమైతే, మరోవైపు వందేభారత్ రైలు వల్ల మీరట్ నుండి రాష్ట్ర రాజధాని లక్నోకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. ఆధునిక రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్ అలాగే విమాన సేవల విస్తరణతో, పీఎం గతి శక్తి దార్శనికత దేశ మౌలిక సదుపాయాలను ఎలా మారుస్తుందో చెప్పడానికి ఎన్‌సీఆర్ ఒక ప్రధాన ఉదాహరణగా మారుతోంది.

 

మిత్రులారా,

వందే భారత్ భారతీయ రైల్వేలు ఆధునీకీకరణకు అద్దం పడుతున్నాయి. ప్రతి నగరంలో అలాగే ప్రతి మార్గంలో వందే భారత్‌కు డిమాండ్ పెరుగుతోంది. హై-స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల ప్రజలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడం, ఉద్యోగాలను సృష్టించుకోవడం అలాగే వారి కలలను సాకారం చేసుకోగల విశ్వాసం వారిలో ఏర్పడింది. నేడు, దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి అలాగే ఈ రైళ్లలో ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా ప్రయాణించారు. ఈ గణాంకాలు వందే భారత్ విజయాన్ని మాత్రమే కాకుండా భారతదేశ ఆకాంక్షలు, కలలను సూచిస్తున్నాయి.

మిత్రులారా,

అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్య సాధనలో ఆధునిక రైల్వే మౌలిక వసతులు మూలస్తంభంగా ఉన్నాయి. రైల్వే మార్గాల డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్త రైళ్ల ప్రారంభం లేదా కొత్త మార్గాల నిర్మాణం వంటి వివిధ ప్రాజెక్టులలో గణనీయమైన పురోగతి వచ్చింది. ఈ ఏడాది బడ్జెట్‌లో రైల్వేలకు రూ.2.5లక్షల కోట్లు కేటాయించాం. అత్యాధునిక సేవలతో భారత రైల్వేలను మేము ఎప్పటికప్పుడు పరివర్తన చెందిస్తూ, వాటి సాంప్రదాయిక ప్రతిష్ఠను మించి ముందుకు తీసుకెళ్తున్నాం. వందే భారత్ రైళ్ల విస్తరణతో పాటుగా, అమృత్ భారత్ రైళ్లను కూడా ప్రారంభిస్తున్నాం. అతి త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ప్రారంభం కానున్నాయి. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం, నమో భారత్ రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయి. అలాగే పట్టణ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం కోసం వందే మెట్రో సేవలను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నాం.    

మిత్రులారా,

మన నగరాలకు ఆయా నగరాల్లో గల రైల్వే స్టేషన్ల ద్వారానే గుర్తింపు లభిస్తుంది. అమృత్ భారత్ స్టేషన్ యోజన ద్వారా, ఈ స్టేషన్లను ఆధునీకరించి, ఆయా నగరాలకు కొత్త గుర్తింపును ఇవ్వనున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1300లకు పైగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. అనేక ప్రాంతాలలో రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలకు ధీటుగా అబివృద్ధి చేస్తున్నాం. అలాగే చిన్న స్టేషన్లలో కూడా అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తున్నాం. ఈ పరివర్తన ప్రయాణ సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.

మిత్రులారా,

రైల్వేలు, రోడ్డు మార్గాలు అలాగే జలమార్గాల వంటి కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు బలోపేతం అయినప్పుడు, దేశం మరింత బలపడుతుంది. ఈ అభివృద్ధి సామాన్య పౌరులకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు లభిస్తున్న ఉపాధి అవకాశాలను నేడు దేశమంతా చూస్తోంది. అలాగే మౌలిక సదుపాయాల విస్తరణ గ్రామాలకు కూడా కొత్త అవకాశాలను తీసుకువస్తోంది. పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు, మరుగుదొడ్లు అలాగే కాంక్రీట్ గృహాల నిర్మాణం కారణంగా, నిరుపేదలకు కూడా దేశ పురోగతి ఫలాలు అందుతాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అలాగే పరిశ్రమల వంటి మౌలిక సదుపాయాల పెరుగుదల యువత అభివృద్ధి అవకాశాలను మరింత పెంచుతుంది. ఈ సంఘటిత ప్రయత్నాల వల్ల గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.

 

మిత్రులారా,

ఏళ్లుగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపేందుకు భారతీయ రైల్వే ఎంతో శ్రమించింది. కేవలం సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాకుండా రైల్వే కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. అయితే ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. సమాజంలోని అన్ని వర్గాల వారికీ ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే రైల్వే లక్ష్యం, అప్పటివరకు ఆగేది లేదు. దేశవ్యాప్తంగా ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి పేదరిక నిర్మూలనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మూడు కొత్త వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడు, కర్నాటక అలాగే ఉత్తరప్రదేశ్ ప్రజలకు మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 డిసెంబర్ 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India