“పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్” ఇతివృత్తంగా నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబ్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్-2023లో ప్రకటించిన కార్యక్రమాల సమర్థ అమలుపై సలహాలు-సూచనలు కోరే దిశగా ప్రభుత్వం నిర్వహించిన 12 సదస్సుల పరంపరలో ఇది చిట్టచివరిది కావడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- బడ్జెట్ సమర్పణ తర్వాత అందులోని భాగస్వామ్య వర్గాలన్నిటితో చర్చించే ఆనవాయితీ ఇప్పటికి మూడేళ్లుగా కొనసాగుతోందన్నారు. ఈ మేరకు భాగస్వాములంతా నిర్మాణాత్మకంగా ఇందులో పాలు పంచుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ రూపకల్పనపై చర్చించే బదులు, అందులోగల నిబంధనల అమలుకు సాధ్యమైనన్ని ఉత్తమ మార్గాలపై భాగస్వాములు చర్చించారని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబ్ సదస్సుల పరంపర ఓ కొత్త అధ్యాయమని ప్రధాని వ్యాఖ్యానించారు, పార్లమెంటు సభ్యులు చట్టసభలో నిర్వహించే చర్చలన్నీ భాగస్వాముల స్థాయి సదస్సులలోనూ నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా వారి నుంచి లభించే విలువైన సూచనలు ఎంతో ప్రయోజనకర ఆచరణకు దారి తీస్తాయని చెప్పారు.
నేటి వెబ్ సదస్సు కోట్లాది భారతీయుల నైపుణ్యం-ప్రతిభకు అంకితమైందని ప్రధానమంత్రి అన్నారు. ‘నైపుణ్య భారతం కార్యక్రమం, నైపుణ్య ఉపాధి కేంద్రం’ ద్వారా కోట్లాది యువతకు నైపుణ్యాభివృద్ధితోపాటు ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆయన అన్నారు. ఒక నిర్దిష్ట, లక్షిత విధానం ఆవశ్యకతకు ఇది నిదర్శనమని నొక్కిచెప్పారు. ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన’ లేదా ‘పీఎం విశ్వకర్మ’ పథకం ఈ ఆలోచన దృక్పథం ఫలితమేనని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ పథకం అవసరాన్ని, ‘విశ్వకర్మ’ అనే పేరుకుగల హేతుబద్ధతను ప్రధాని వివరిస్తూ- భారతీయ తాత్త్వికతలో ఉన్నత దైవత్వ స్థితికి విశ్వకర్మ ప్రతీక కాగా- పరికరాలతో హస్త నైపుణ్యంతో పనిచేసే వారిని గౌరవించడానికి ఇంతకన్నా గొప్ప సంకేతం మరొకటి ఉండదన్నారు.
కొన్ని రంగాల హస్తకళాకారులకు ఎంతోకొంత ఆదరణ లభించినప్పటికీ, సమాజంలో అంతర్భాగమైన వడ్రంగులు, కమ్మరులు, శిల్పులు, తాపీ మేస్త్రీలు వంటి అనేక తరగతుల కళాకారులు కాలానుగుణంగా తమను తాము మలచుకుంటూ తమను విస్మరించిన సమాజం అవసరాలను తీరుస్తున్నారని ప్రధాని గుర్తుచేశారు.
“స్థానిక హస్తకళా ఉత్పత్తులలో చిన్న వృత్తిదారుల పాత్ర కీలకం.. వారికి సాధికారత కల్పించడంపైనే ‘పీఎం విశ్వకర్మ పథకం’ దృష్టి సారిస్తుంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రాచీన భారతదేశంలో ఉత్పత్తుల ఎగుమతులకు నిపుణులైన హస్త కళాకారులు తమదైన రీతిలో సహకరిస్తూ వచ్చారని ఆయన తెలిపారు. ఈ నిపుణ కార్మికశక్తి చాలా కాలంపాటు నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. ఆ మేరకు సుదీర్ఘ బానిసత్వంలో వారి నైపుణ్యం ప్రాముఖ్యం లేనిదిగా పరిగణించబడిందని ఆయన విచారం వెలిబుచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వ వైపునుంచి ఎలాంటి కృషి లేదని, పర్యవసానంగా అనేక సంప్రదాయ నైపుణ్యాలు, హస్తకళా ప్రతిభగల కుటుంబాలు తమ వృత్తులను వదిలిపెట్టి, బతుకు తెరువు కోసం వలస బాటపట్టాయని పేర్కొన్నారు. ఈ శ్రామికవర్గం శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులే వారి నైపుణ్యానికి శ్రీరామరక్షగా నిలిచాయని ప్రధాని చెప్పారు. కాబట్టే నేటికీ వారు తమ అసాధారణ నైపుణ్యం, అద్వితీయ సృష్టితో తమదైన ముద్ర వేస్తున్నారని నొక్కిచెప్పారు. “స్వయం సమృద్ధ భారతానికి నిపుణులైన హస్త కళాకారులే నిజమైన స్ఫూర్తి చిహ్నాలు. అందుకే వారిని నవ భారత విశ్వకర్మలుగా మా ప్రభుత్వం పరిగణిస్తుంది” అని ప్రధాని తెలిపారు. ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన’ ప్రత్యేకించి వారికోసమే ప్రారంభించబడిందని ఆయన వివరించారు. ఆ మేరకు గ్రామాలు-పట్టణాల్లో తమ హస్తకళా నైపుణ్యంతో జీవనోపాధిని సృష్టించుకునే నిపుణ కళకారులపై ఈ పథం ప్రధానంగా దృష్టి సారిస్తుందని ప్రకటించారు.
మానవ సామాజిక స్వభావంపై దృష్టి సారిస్తూ- సమాజ అస్తిత్వానికి, ప్రగతికి అవసరమైన సామాజిక జీవన రంగాలున్నాయని ప్రధానమంత్రి అన్నారు. సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం పెరుగుతున్నప్పటికీ ఈ పనులు నేటికీ తమదైన ఔచిత్యం కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు. తదనుగుణంగా అలాంటి చెల్లాచెదరైన కళాకారుల సంక్షేమంపై 'పీఎం విశ్వకర్మ యోజన’ శ్రద్ధ పెడుతుందని ఆయన అన్నారు.
గ్రామ స్వరాజ్యం పేరిట గాంధీజీ ప్రబోధించిన భావనను ప్రస్తావిస్తూ- గ్రామీణ జీవితాల్లో వ్యవసాయంతోపాటు ఈ వృత్తుల పాత్రను ప్రధానమంత్రి ప్రముఖంగా వివరించారు. ఆ మేరకు “ప్రతి గ్రామం అభివృద్ధి నిమిత్తం అక్కడ నివసించే ప్రతి వర్గానికీ సాధికారత కల్పన భారతదేశ ప్రగతి పయనానికి ఎంతో అవసరం” అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి స్వానిధి’ పథకం ద్వారా వీధి వర్తకులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతున్నదో- అదేవిధమైన ప్రయోజనాన్ని ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ చేతివృత్తుల వారికి అందిస్తుందని ప్రధాని అన్నారు.
‘విశ్వకర్మ’ల అవసరాలకు తగినట్లు నైపుణ్య మౌలిక సదుపాయాలను తిరిగి మార్చాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రభుత్వం బ్యాంకుల వద్ద ఎలాంటి పూచీకత్తు లేకుండానే కోట్లాది రూపాయల రుణాలిస్తోందని, ఇందుకు ‘ముద్ర యోజన’ తిరుగులేని ఉదాహరణ అని చెప్పారు. ఈ పథకం ద్వారా మన విశ్వకర్మలకు గరిష్ట ప్రయోజనం అందించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ‘విశ్వకర్మ సాథీ’లకు ప్రాధాన్యంపై డిజిటల్ అక్షరాస్యత ప్రచారాల ఆవశ్యకతను కూడా ప్రస్తావించారు.
హస్తకళా ఉత్పత్తులకుగల నిరంతర ఆకర్షణను ప్రస్తావిస్తూ- దేశంలోని ప్రతి విశ్వకర్మకూ ప్రభుత్వం సంపూర్ణ సంస్థాగత మద్దతునిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దీంతో రుణ సౌలభ్యం, నైపుణ్యం, సాంకేతిక మద్దతు, డిజిటల్ సాధికారత, బ్రాండుకు ప్రచారం, మార్కెటింగ్, ముడిసరుకు వగైరాలు సమకూరుతాయని చెప్పారు. “సంప్రదాయ, హస్త కళాకారులతోపాటు వారి సుసంపన్న సంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ ఆ వర్గాలను ముందుకు నడిపించడమే ఈ పథకం లక్ష్యం” అని ఆయన చెప్పారు. ‘‘నేటి విశ్వకర్మలు రేపటి పారిశ్రామికవేత్తలుగా మారాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం వారి వ్యాపార నమూనాలో స్థిరత్వం చాలా అవసరం” అని ప్రధానమంత్రి అన్నారు. స్థానిక మార్కెట్‌పైనే కాకుండా ప్రపంచ మార్కెట్‌పైనా ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకూ ప్రాధాన్యం ఇస్తుందని ఆయన ఉద్ఘాటించారు. విశ్వకర్మ సహోదరులపై ప్రజల్లో అవగాహన పెంచి, వారు ముందంజ వేయడంలో తోడ్పడాలని అన్నివర్గాల భాగస్వాములనూ ఆయన అభ్యర్థించారు. ఇందుకోసం విశ్మకర్మలకు చేరువ కావాలని, ఆ మేరకు క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు.
హస్తకళాకారులు, చేతివృత్తులవారు విలువ గొలుసులో భాగమైతే మరింత బలోపేతం కాగలరని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతేగాక వారిలో అధికశాతం మన ‘ఎంఎస్‌ఎంఇ’ రంగానికి సరఫరాదారులు, ఉత్పత్తిదారులుగా మారగలరని వివరించారు. సాధనాలు-సాంకేతికత తోడ్పాటుతో ఆర్థిక వ్యవస్థలో వారినొక ముఖ్యమైన భాగం చేయవచ్చని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగం ఈ వ్యక్తులను తమ అవసరాలకు అనుసంధానించి, వారికి నైపుణ్యంతోపాటు నాణ్యమైన శిక్షణ ఇవ్వాలని, తద్వారా పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతందని అన్నారు. బ్యాంకుల ద్వారా ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందేవిధంగా ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “ఇది ప్రతి భాగస్వామికీ సమాన విజయం దక్కే పరిస్థితికి తార్కాణం. కార్పొరేట్ కంపెనీలు నాణ్యమైన ఉత్పత్తులను స్పర్థాత్మక ధరలకు పొందగలుగుతాయి. బ్యాంకుల సొమ్ము విశ్వసనీయ పథకాలలో పెట్టుబడి పెట్టబడుతుంది. తద్వారా ప్రభుత్వ పథకాల విస్తృత ప్రభావం ప్రస్ఫుటం అవుతుంది” అని ప్రధాని వివరించారు.
మెరుగైన సాంకేతికత, డిజైన్, ప్యాకేజింగ్, ఫైనాన్సింగ్ తదితరాల ద్వారా కళా ఉత్పత్తులకు అంకుర సంస్థలు కూడా ఇ-కామర్స్ నమూనాలో భారీ విపణిని సృష్టించగలవని ప్రధాని ప్రముఖంగా పేర్కొన్నారు. ‘పీఎం విశ్వకర్మ’ పథకంతో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం మరింత బలోపేతం కాగలదని, తద్వారా ఆవిష్కరణ శక్తితోపాటు వ్యాపార చాతుర్యాన్ని కూడా గరిష్ఠంగా పెంచుకోవచ్చునని ప్రధాని ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని బలమైన బృహత్ ప్రణాళికను రూపొందించాలని అన్ని భాగస్వామ్య వ్యవస్థలకూ ఆయన సూచించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరువయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీంతో తొలిసారిగా చాలామందికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందుతున్నదని ఉద్ఘాటించారు. అనేకమంది హస్తకళాకారులు దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల వారు లేదా మహిళలేనని, వారికి చేరువై ప్రయోజనాలు చేకూర్చడానికి ఆచరణాత్మక వ్యూహం అవసరమని చెప్పారు. ‘‘ఇందుకోసం నిర్దిష్ట కాలావధితో ఉద్యమ స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది’’ అని ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.