నమస్కార్
కాశీగా సుప్రసిద్ధమైన వారణాసికి మీ అందరికీ స్వాగతం. నా పార్లమెంటరీ నియోజకవర్గం అయిన వారణాసిలో మీరు సమావేశం కావడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. కాశీ ప్రపంచంలోనే అతి పురాతన నగరమే కాదు, భగవాన్ బుద్ధుడు తొలిసారిగా బోధలు చేసిన సారనాథ్ కు సమీపంలోని నగరం. కాశీ ‘‘జ్ఞానసంపద, ధర్మం, సత్యరాశి’’ గల నగరంగా ప్రసిద్ధి చెందింది. అది భారతదేశానికి వాస్తవమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక రాజధాని. మీరంతా గంగా హారతిని తిలకించేందుకు, సారనాథ్ సందర్శనకు, కాశీ రుచులు చవి చూసేందుకు కొంత సమయం కేటాయించుకున్నారని నేను ఆశిస్తున్నాను.
మహోదయులారా,
సంస్కృతికి సమాజాన్ని ఐక్యం చేసే అంతర్గత సామర్థ్యం ఉంది. అది వైవిధ్యభరితమైన నేపథ్యాలు, భావనలను అర్ధం చేసుకునేందుకు మనందరికీ ఉపయోగపడుతుంది. ఆ దిశగా మీ అందరి కృషి యావత్ మానవాళి సంక్షేమం దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. మా వైవిధ్యభరితమైన, శాశ్వతంగా నిలిచే సంస్కృతి పట్ల మేమందరం గర్వపడతాం. సాంస్కృతిక వారసత్వానికి మేం భారతదేశంలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచే ప్రదేశాల సంరక్షణ, పునరుజ్జీవానికి మేం తీవ్రంగా కృషి చేస్తున్నాం. దేశంలో జాతీయ స్థాయిలోనే కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా మా సాంస్కృతిక ఆస్తులు, కళాకారులను మేం మ్యాపింగ్ చేశాం. మా సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే అనేక కేంద్రాలను మేం నిర్మించాం. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియంలు వాటిలో ప్రధానమైనవి. ఈ మ్యూజియంలో గిరిజన తెగల శాశ్వతమైన సంస్కృతిని సమాజం అంతటి ముందూ ప్రదర్శిస్తాయి. న్యూఢిల్లీలో మేం ప్రధానమంత్రి మ్యూజియం ఏర్పాటు చేశాం. భారతదేశ ప్రజాస్వామిక వారసత్వాన్ని ప్రదర్శించే ఒక ప్రయత్నం ఇది. ‘‘యుగే యుగే భారత్’’ పేరిట జాతీయ మ్యూజియం కూడా మేం నిర్మిస్తున్నాం. పూర్తయితే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియంగా నిలుస్తుంది. 5000 సంవత్సరాల విస్తృతి గల భారతదేశ చరిత్ర, సంస్కృతికి పట్టం కడుతుంది.
మహోదయులారా,
సాంస్కృతిక ఆస్తుల పునరుజ్జీవం మరో ప్రధానమైన అంశం. ఈ దిశగా మీ అందరి కృషిని నేను ప్రశంసిస్తున్నాను. చెక్కు చెదరని వారసత్వానికి భౌతిక విలువ మాత్రమే కాదు; చరిత్రను, జాతి గుర్తింపును అది ఇనుమడింపచేస్తుంది. సాంస్కృతిక వారసత్వం అందుకుని, ఆనందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. 2014 సంవత్సరం నుంచి భారత పురాతన నాగరికతకు చిహ్నం అయిన వందలాది సంవత్సరాల క్రితం నాటి కళాఖండాలను మేం వెనక్కి తెచ్చాం. ‘‘సజీవ వారసత్వానికి’’, ‘‘సాంస్కృతిక జీవితానికి’’ పట్టం కట్టే దిశగా మీ ప్రయత్నాలను నేను ప్రశంసిస్తున్నాను. సాంస్కృతిక వారసత్వం అనేది కేవలం శిల్పాలకే పరిమితం కాదు... సంప్రదాయం, ఆచారాలు, పండుగలను ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ చేస్తుంది. మీ కృషి సుస్థిర ఆచరణలు, జీవనశైలిని ఉద్దీపింపచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
మహోదయులారా,
ఆర్థిక వృద్ధికి, వైవిధ్యానికి కూడా వారసత్వం అత్యంత విలువైన ఆస్తి అని మేం విశ్వసిస్తాం. ‘‘వికాస్ భీ విరాసత్ భీ’’ – వారసత్వంతో కూడిన అభివృద్ధి అనేది మా మంత్రం. 2000 సంవత్సరాల కళావారసత్వం, 3000 ప్రత్యేకత సంతరించుకున్న కళలు, కళాఖండాల పట్ల మేం గర్వపడుతున్నాం. మేం అనుసరిస్తున్న ‘‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’’ కార్యక్రమం భారత కళల ప్రత్యేకతను చాటి చెప్పడంతో పాటు స్వయం-సమృద్ధిని ప్రోత్సహిస్తుంది. సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమల ప్రోత్సాహం విషయంలో మీ అందరి కృషికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇది సమ్మిళిత ఆర్థిక వృద్ధికి దోహదపడడంతో పాటు సృజనాత్మక, ఇన్నోవేషన్ కు మద్దతు ఇస్తుంది. రాబోయే నెలల్లో మేం పిఎం విశ్వకర్మ యోజనను ప్రారంభించనున్నాం. 180 కోట్ల డాలర్ల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ పథకం సాంప్రదాయిక కళాకారులను ప్రోత్సహించేందుకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తుంది. కళాకారులు తమ కళల్లో రాణించేందుకు, సమున్నతమైన సాంస్కృతిక సాంప్రదాయ పరిరక్షణకు దోహదపడుతుంది.
మిత్రులారా,
సాంస్కృతిక వైభవాన్ని వేడుకగా చేసుకోవడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశం జాతీయ డిజిటల్ జిల్లా రిపోజిటరీ ఏర్పాటు చేశాం. స్వాతంత్ర్య సమర కాలం నాటి కథనాలు పునశ్చరణ చేసుకునేందుకు ఇది సహాయకారిగా నిలుస్తుంది. మా సాంస్కృతిక చిహ్నాలను పరిరక్షించుకోవడంలో టెక్నాలజీని మెరుగ్గా ఉపయోగించుకుంటున్నాం. అలాగే సాంస్కృతిక ప్రదేశాలను పర్యాటక మిత్రంగా తీర్చి దిద్దేందుకు కూడా మేం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం.
మహోదయులారా,
‘‘సంస్కృతి అందరినీ ఐక్యం చేస్తుంది’’ అనే ప్రచారాన్ని మీ గ్రూప్ చేపట్టడం కూడా నాకు ఆనందం కలిగిస్తోంది. వసుధైవ కుటుంబకం సిద్ధాంతం స్ఫూర్తితో మేం ప్రతిపాదించిన ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ సూత్రాన్ని కూడా ఇది బలపరుస్తుంది. విశిష్టమైన ఫలితాలు రాబట్టగల విధంగా జి-20 కార్యాచరణ ప్రణాళిక తీర్చి దిద్దడంలో మీ పాత్ర కీలకమైనదని నేను ప్రశంసిస్తున్నాను. ‘‘మీ కృషి నాలుగు సిల - కల్చర్ (సంస్కృతి), క్రియేటివిటీ (సృజనాత్మకత), కామర్స్ (వాణిజ్యం), కొలాబొరేషన్ (సహకారం) - కీలక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. సామరస్యపూర్వకం, సమ్మిళితం, శాంతియుతమైన భవిష్యత్తును నిర్మించడంలో సాంస్కృతిక శక్తిని ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీ సమావేశం ఉత్పాదకంగాను, విజయవంతంగాను సాగాలని నేను ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.