శివమొగ్గ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం;
రెండు రైల్వే ప్రాజెక్టులు.. పలు రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన;
బహుళ-గ్రామీణ పథకాలకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన;మొత్తం 44 స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం;
“ఇది కేవలం విమానాశ్రయం కాదు.. యువత కలలకు రెక్కలుతొడిగే కార్యక్రమం;
“విమానయానంపై దేశంలో ఎన్నడూ లేనంతగాఉత్సాహంపొంగుతున్న వేళ శివమొగ్గలో విమానాశ్రయం ప్రారంభోత్సవం”;
“విజయ శిఖరాలకు ఎదుగుతున్న నవ భారత సామర్థ్యానికి నేటి ఎయిరిఇండియా ప్రతీక”;
“రైల్వే.. రహదారి.. విమాన-‘ఐ’ మార్గాల ముందడుగుతోకర్ణాటక ప్రగతి బాటలు”;
“ఉత్తమఅనుసంధానంతో కూడిన మౌలిక సదుపాయాలుఈ ప్రాంతమంతటాకొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయి”;
“ఈ ద్వంద్వచోదకప్రభుత్వం మన గ్రామాలు..పేదలు.. తల్లులు.. సోదరీమణులకేఅంకితం”
895 కోట్లతో చేపట్టిన 44 స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.

కర్ణాటక దా, 

ఎల్లా సహోదర సహోదరియారిగే, నన్నా నమస్కారుగల్

ఎల్లా సహోదర సహోదరియారిగే, నన్నా నమస్కారుగల్

సిరిగన్నడం గెల్గె,  సిరిగన్నడం బల్గె 

జయభారత జననీయ తాను జాతే 

జయ హే కర్ణాటక మాతే

"ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్" స్ఫూర్తిని నిలబెట్టిన రాష్ట్రకవి కువెంపు జన్మభూమికి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. నేడు కర్ణాటక అభివృద్ధికి దోహదపడే కోట్లాది రూపాయల విలువ గల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే, ప్రారంభించే అదృష్టం నాకు మరో సారి లభించింది.

 

ఇప్పుడు నేను శివమొగ్గలో ఉన్నాను. ఇక్కడ నుండి బెళగావి వెళ్తాను. నేడు శివమొగ్గకి సొంత విమానాశ్రయం లభించింది. ఎంతో కాలం నాటి ఈ డిమాండ్ నేడు తీరింది. శివమొగ్గ విమానాశ్రయాన్ని ఎంతో అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దారు. కర్ణాటకకు ప్రత్యేకం అయిన సంప్రదాయం, టెక్నాలజీ రెండూ ఈ విమానాశ్రయంలో కనిపిస్తున్నాయి. ఇది ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఈ ప్రాంత యువత కలలకు రెక్కలు కల్పించే అవకాశం. నేడు పలు రోడ్డు, రైలు ప్రాజెక్టులకు శంకుస్థాపన జరుగుతోంది.  ప్రతి ఒక్క కుటుంబానికి పంపు నీరు అందించే ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతున్నాయి. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు పొందుతున్నందుకు శివమొగ్గ, ఇరుగు పొరుగు జిల్లాల ప్రజలకు నేను అభినందనలు తెలుపుతున్నాను.

 

మిత్రులారా,

మరో కారణానికి కూడా ఇది చాలా ప్రత్యేకమైన రోజు.  ప్రముఖ ప్రజా నాయకుడు బి.ఎస్.ఎడియూరప్ప జన్మదినం ఈ రోజు. ఆయనకు దీర్ఘ జీవితం ఉండాలని నేను కోరుతున్నాను. పేదలు, రైతుల సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. గత వారం అసెంబ్లీలో ఎడియూరప్ప ప్రసంగం ప్రజా సేవలో ఉన్న అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ప్రసంగం, ఆయన జీవితం మనకే కాదు భవిష్యత్ తరాల్లో కూడా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. విజయంలో ఉన్నత స్థానానికి చేరిన తర్వాత కూడా ప్రవర్తనలో ఎంత హుందాగా ఉండాలో బోధిస్తుంది.

మిత్రులారా,

మీ అందరినీ ఒకటి అర్థిస్తున్నాను. మీరది చేస్తారా?  మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటె దానిలోని ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఎడియూరప్పకి మీ గౌరవం ప్రకటించండి. ఎడియూరప్ప గౌరవార్థం మీరందరూ ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి. ఎడియూరప్ప గౌరవార్థం మనందరం కలిసి నడవాలి. ఆయన 50-60 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. తన మొత్తం యవ్వనాన్ని ఒకే లక్ష్యానికి అంకితం చేశారు. మీ మొబైల్ లోని ఫ్లాష్ లైట్ ద్వారా ప్రతి ఒక్కరూ గౌరవ ఎడియూరప్పకి మీ గౌరవం తెలియచేయాలి. బాగా చేసారు. భారత్ మాతా కీ జై.

బిజెపి అధికార కాలంలో కర్ణాటక అభివృద్ధి ప్రయాణాన్ని చూసినట్లయితే నాకు "కర్ణాటక రాధాదా మేలే ఈ రథావు ప్రగతి పథాతా మేలే" అనిపిస్తుంది. 

 

గత కొద్ది సంవత్సరాల కాలంలో వృద్ధి రథంఫై కర్ణాటక అభివృద్ధి సాగింది. ఈ వృద్ధి రథం ప్రగతి పథంలో సాగింది. అంటే రైల్వేలు, రోడ్ వేలు. ఐ-వేలు అంటే డిజిటల్ అనుసంధానత ఆధారంగా సాగింది.

 

మిత్రులారా,

ప్రభుత్వం కావచ్చు లేదా వాహనం కావచ్చు దానికి రెండు ఇంజన్లు ఉపయోగిస్తే దాని వేగం కొన్ని రెట్లు పెరుగుతుందని మనందరికీ తెలుసు. కర్ణాటక వృద్ధి రథం అలాంటి డబల్ ఇంజన్ తో అమిత వేగంగా నడుస్తోంది.  బిజెపి డబల్ ఇంజన్ ప్రభుత్వం మరో మార్పును కూడా తెచ్చింది. గతంలో ఎప్పుడు కర్ణాటక అభివృద్ధిని గురించి చర్చించినా అది పెద్ద నగరాలకే పరిమితం. కాని డబల్ ఇంజన్ ప్రభుత్వం నిరంతరం ఈ అభివృద్ధిని గ్రామాలు;  ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్ళింది. ఆ ఆలోచనా ధోరణి ఫలితమే శివమొగ్గ అభివృద్ధి.

సోదర సోదరీమణులారా,

దేశంలో విమానయానం గురించి ఎనలేని ఉత్సాహం కనిపిస్తున్న సమయంలోనే శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభమవుతోంది. ఇటీవల ఎయిరిండియా ప్రపంచంలోనే అతి  పెద్ద విమానం కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం మీరంతా గమనించే ఉంటారు. 2014 సంవత్సరానికి ముందు ఎయిరిండియా గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడే వారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ఎయిరిండియా కుంభకోణాలకు నిలయంగా అందరికీ తెలుసు. నష్టదాయక వ్యాపార నమూనాకు మారుపేరు. నేడు ఎయిరిండియా కొత్త శక్తిని పుంజుకుని ప్రపంచంలోనే ఉన్నత శిఖరాలను తాకుతోంది.

నేడు ప్రపంచం అంతా భారత వైమానిక మార్కెట్ గురించి మాట్లాడుతోంది. భారతదేశానికి సమీప భవిష్యత్తులో వేలాది విమానాలు అవసరం అవుతాయి. ఈ విమానాల్లో వేలాది మంది యువత పని చేయవలసి ఉంటుంది. నేడు మనం విదేశాల నుంచి విమానాలు దిగుమతి చేసుకుంటూ ఉండవచ్చు. కాని దేశ పౌరులు ‘మేడ్ ఇన్ ఇండియా’ విమానాల్లో ప్రయాణించే రోజు ఎంతో దూరంలో లేదు. విమానయాన రంగంలో ఉపాధికి పలు అవకాశాలు తెరుచుకోనున్నాయి.

 

మిత్రులారా,

బిజెపి ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలే నేడు భారతదేశంలో విమానయానం విస్తరణకు మూలం. 2014 సంవత్సరానికి ముందు పెద్ద నగరాల్లో మాత్రమే విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చే వారు. ‘‘చిన్న నగరాలకు కూడా విమాన అనుసంధానత అవసరం’’ అని కాంగ్రెస్ ఎన్నడూ భావించలేదు. ఆ పరిస్థితిని మార్చాలని మేం నిర్ణయించాం. 2014 సంవత్సరానికి ముందు దేశంలో 74 విమానాశ్రయాలుండేవి. అంటే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఏడు దశాబ్దాల తర్వాల కూడా విమానాశ్రయాల సంఖ్య 74 మాత్రమే ఉంది. బిజెపి ప్రభుత్వం 9 సంవత్సరాల్లో మరో 74 విమానాశ్రయాలను నిర్మించింది. నేడు చిన్న నగరాలు కూడా ఆధునిక విమానాశ్రయాలు కలిగి ఉన్నాయి. బిజెపి ప్రభుత్వం ఎంత వేగంతో పని చేస్తోందో మీరే ఊహించుకోవచ్చు. పేదల కోసం పని చేసే బిజెపి ప్రభుత్వం మరో కీలకమైన అడుగేసింది. సగటు మనిషి కూడా విమానంలో ప్రయాణించే అవకాశం కలిగించాలని మేం భావించాం. అందుకే తక్కువ ధరలకు విమాన టికెట్లు అందించేందుకు ఉడాన్ పథకం ప్రారంభించాం. నేడు ఎందరో పేదవారైన సోదర సోదరీమణులు తొలిసారిగా విమానాల్లో అడుగు పెట్టడం చూస్తున్న నాకు ఎనలేని సంతృప్తి కలుగుతోంది. ఈ శివమొగ్గ విమానాశ్రయం కూడా అందుకు సాక్షిగా నిలుస్తుంది.

మిత్రులారా,

ఈ కొత్త విమానాశ్రయం ప్రకృతి, సంస్కృతి, వ్యవసాయ భూమి అయిన శివమొగ్గ అభివృద్ధికి ద్వారాలు తెరుస్తుంది. పడమటి కనుమలకు ప్రసిద్ధి చెందిన మాలెనాడుకు శివమొగ్గ స్వాగత ద్వారం వంటిది. ప్రకృతి విషయానికి వస్తే పచ్చదనం, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, నదులు, కొండకోనలు ఇక్కడి అద్భుతాలు. సుప్రసిద్ధమైన జోగ్  ఫాల్స్  కూడా ఇక్కడే ఉన్నాయి. ఏనుగుల శరణాలయం, సింహధామ్ వంటి సింహాల సఫారీ కూడా  ప్రదేశం ప్రత్యేకతలు. మౌంట్ అగంబీ వద్ద సూర్యాస్తమయం చూసేందుకు ఇష్టపడనివారెవరైనా ఉంటారా?   ఇక్కడ ‘గంగా స్నాన, తుంగా పాన’ అనే నానుడి కూడా ఉంది. ఏ వ్యక్తి జీవితం అయినా గంగలో స్నానం చేయకుండా, తుంగనది నీరు తాగకుండా పరిపూర్ణం కాదని దీని అర్ధం.

మిత్రులారా,

శివమొగ్గలోని తీయని జలాలు రాష్ర్టకవి కువెంపు మాటలకు తీయందనాన్ని అందించాయి. ప్రపంచంలోని ఏకైక సంస్కృత గ్రామం మట్టూరు ఈ జిల్లాలోనే ఉంది. దేవీ సింగదురు చౌడేశ్వరి, శ్రీకోట ఆంజనేయ, శ్రీ శ్రీధర స్వామీజీ ఆశ్రమం శివమొగ్గ విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు చిహ్నాలు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా శివమొగ్గలో ప్రతిధ్వనించిన ‘‘ఏసురు బిట్టరు-ఈసురు బిడేవూ’’ నినాదం అందరికీ  స్ఫూర్తి.

సోదర సోదరీమణులారా,

ప్రకృతి, సంస్కృతితో పాటు శివమొగ్గ వ్యవసాయపరంగా కూడా వైవిధ్యమైన ప్రదేశం. దేశంలోని అత్యంత సారవంతమైన ప్రాంతాల్లో ఇదొకటి. ఇక్కడ పండే విభిన్న రకాల పంటలు దీన్ని ఒక వ్యవసాయ హబ్  గా మార్చాయి.  తేయాకు, వక్క, సుగంధ ద్రవ్యాలు సహా వివిధ రకాల పళ్లు, కూరగాయలు శివమొగ్గ ప్రాంతంలో అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంత ప్రకృతి, సంస్కృతి, వ్యవసాయాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతో ఉంది. మంచి కనెక్టివిటీ అవసరం సైతం ఉంది. డబుల్  ఇంజన్  ప్రభుత్వం ఈ అవసరాలన్నింటినీ తీర్చుతోంది.

విమానాశ్రయం నిర్మాణంతో పాటు స్థానిక ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా అది తేలిగ్గా ఉంటుంది. పర్యాటకులు ఇక్కడకి వచ్చినప్పుడు వారు డాలర్లు, పౌండ్లు తీసుకువస్తారు. ఉపాధి అవకాశాలు  కూడా పెరుగుతాయి. రైల్వే అనుసంధానత మెరుగ్గా ఉన్నప్పుడు రైతులు కూడా కొత్త మార్కెట్ అవకాశాలు పొందగలుగుతారు. తక్కువ వ్యయంతోనే రైతులు సుదూరంలోని మార్కెట్లకు తమ పంటలు పంపగలుగుతారు.

 

మిత్రులారా,

శివమొగ్గ-షికారీపురా-రాణిబెన్నూర్  లైన్  పూర్తయితే శివమొగ్గతో పాటు హవేరి, దేవనగిరి జిల్లాలు కూడా లాభం పొందుతాయి. ఈ లైన్ లో ఎక్కడా లెవెల్  క్రాసింగ్  లేకపోవడం మరో విశేషం. ఈ రైల్వేలైను సురక్షితమే కాకుండా హైస్పీడ్  రైళ్లు కూడా నడవగలుగుతాయి. కొటెగంగూర్  ఇప్పటివరకు ఈ ప్రాంతంలో స్వల్ప సమయం పాటు రైళ్లు నిలిచే స్టేషన్ గా ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని కోచింగ్  టెర్మినల్  గా మార్చడం వల్ల దాని ప్రాధాన్యత మరింతగా పెరుగుతుంది. దాని సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని 4 రైల్వే లైన్లు, 3 ప్లాట్  ఫారంలు, ఒక రైల్వే కోచింగ్ కేంద్రం గల స్టేషన్ గా మార్చడం జరుగుతోంది. దీంతో ఇక్కడ నుంచి  దేశంలోని ఇతర ప్రాంతాలకు కొత్త రైళ్లు నడుస్తాయి. విమాన, రైల్వే రవాణాతో పాటుగా రోడ్లు కూడా మెరుగు పడితే యువత ఎంతో ప్రయోజనం పొందుతారు. శివమొగ్గ ఒక విద్యాకేంద్రంగా కూడా నిలుస్తోంది. చక్కని కనెక్టివిటీ కారణంగా సమీప జిల్లాలకు చెందిన యువ మిత్రులు ఇక్కడకు చేరడం తేలికవుతుంది. కొత్త వ్యాపారాలు, కొత్త పరిశ్రమలకు మార్గం సుగమం అవుతుంది. మంచి అనుసంధానతతో కూడిన మౌలిక వసతుల వల్ల మొత్తం ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.

 

సోదర సోదరీమణులారా,

శివమొగ్గ ప్రాంతంలోని తల్లులు, సోదరీమణులకు జీవితం సరళం చేసే భారీ కార్యక్రమం కూడా ప్రస్తుతం సాగుతోంది. అదే ఇంటింటికీ పైప్ ల ద్వారా మంచినీటి సరఫరా కార్యక్రమం. శివమొగ్గ జిల్లాలో 3 లక్షలకు పైగా కుటుంబాలున్నాయి. జల్  జీవన్  మిషన్  ప్రారంభం కావడానికి ముందు కేవలం 90,000 కుటుంబాలకే నీటి టాప్ ల కనెక్టివిటీ ఉండేది. డబుల్ ఇంజన్  ప్రభుత్వం ఇప్పటివరకు 1.5 లక్షల కొత్త కుటుంబాలకు పైప్ ల ద్వారా నీటి సరఫరా ఏర్పాట్లు చేసింది. మిగతా కుటుంబాలకు కూడా పైప్  ల ద్వారా నీటి సరఫరాకు అనేక ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. గత మూడున్నర సంవత్సరాలుగా కర్ణాటకలోని 40 లక్షల గ్రామీణ కుటుంబాలకు కూడా పైప్  ల ద్వారా నీటి సరఫరా సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

మిత్రులారా,

బిజెపి ప్రభుత్వం గ్రామాలు, పేదలు, రైతుల ప్రభుత్వం. బిజెపి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటు పడే ప్రభుత్వం. తల్లులు, సోదరీమణుల ఆత్మవిశ్వాసం, సాధికారతకు పాటు పడడంతో పాటు మహిళలకు అవకాశాలు కల్పించే ప్రభుత్వం. అందుకే సోదరీమణులు ఎదుర్కొనే ప్రతీ ఒక్క సమస్య పరిష్కరించేందుకు మేం కృషి చేస్తున్నాం.  మరుగుదొడ్లు కావచ్చు...గ్యాస్  కనెక్షన్లు లేదా పైప్  ల ద్వారా నీటి సరఫరా వంటివన్నీ మన సోదరీమణులు, కుమార్తెలకు ఎన్నో కష్టాలకు కారణమయ్యాయి. నేడు మేం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. జల్ జీవన్ మిషన్  తో ప్రతీ ఒక్క ఇంటికీ మంచినీరందించేందుకు ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోంది.

మిత్రులారా,

ఇది ‘‘అమృత కాలం’’ అన్న విషయం కర్ణాటక ప్రజలందరికీ బాగా తెలుసు;  భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాల్సిన తరుణం ఇది. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా ఈ అవకాశం మనకి వచ్చింది. తొలిసారిగా ప్రపంచం యావత్తు భారతదేశ వాక్కును ప్రశంసిస్తోంది. ప్రపంచం అంతటి  నుంచి ఇన్వెస్టర్లు భారతదేశం వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు. పెట్టుబడులు వచ్చినప్పుడు కర్ణాటక మాత్రమే కాదు, యువత కూడా లాభపడతారు. అందుకే కర్ణాటక పదే పదే డబుల్  ఇంజన్ ప్రభుత్వానికి అవకాశాలు కల్పిస్తోంది.  

కర్ణాటక అభివృద్ధి ప్రచారం మరింత వేగం పుంజుకుంటుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి, కలిసికట్టుగా నడవాలి. కర్ణాటక ప్రజల కలలు తీర్చే దిశగా శివమొగ్గ ప్రజలు సహా మనందరం కిలిసికట్టుగా అడుగేయాలి. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు పొందినందుకు మీకు మరోసారి అభినందనలు తెలియచేస్తున్నాను. నాతో కలిసి చెప్పండి – భారత్ మాతా కీ జై!  భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!

ధన్యవాదాలు!

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage