నమస్కారం!
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసిన మీ అందరికీ శుభాభినందనలు. వచ్చే పాతికేళ్లలో నూరేళ్ళ స్వాతంత్ర్యం జరుపుకుంటున్న భారతదేశానికి శాస్త్ర పరిజ్ఞానపు శక్తి చాలా కీలకం. దేశానికి సేవ చేయాలన్న పట్టుదల, సైన్స్ పట్ల ప్రేమ ఉన్నప్పుడు అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. దేశ శాస్త్రవేత్తలు 21 వ శతాబ్దపు భారతదేశానికి తగిన స్థానం సాధించటంలో సాయపడతారని నాకు గట్టి నమ్మకముంది. ఈ నమ్మకానికి కారణాలేంటో కూడా మీకు చెబుదామనుకుంటున్నాను. పరిశీలనే సైన్సుకు పునాది అని మీకందరికీ తెలుసు. శాస్త్రవేత్తలు ఒక క్రమాన్ని అనుసరిస్తూ ఆ క్రమాన్ని విశ్లేషించిన తరువాత ఒక నిర్థారణకు వస్తారు.
అడుగడుగునా, సమాచారాన్ని సేకరించి విశ్లేషించటం శాస్త్రవేత్తలకు చాలా ముఖ్యం. 21 వ శతాబ్దపు భారతదేశంలో రెండు పుష్కలంగా ఉన్నాయి. మొదటిది డేటా, రెండోది టెక్నాలజీ. భారతదేశపు శాస్త్ర రంగాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటానికి రెండింటికీ తగిన శక్తి ఉంది. దత్తాంశ విశ్లేషణ రంగం చాలా వేగంగా పురోగతి సాధిస్తోంది. సమాచారాన్ని ఆలోచనలుగా, విశ్లేషణను కార్యాచరణకు అవసరమైన జ్ఞానంగా మార్చటానికి అది ఉపయోగపడుతుంది. అది సంప్రదాయజ్ఞానం కావచ్చు, లేదా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు- శాస్త్రీయ నవకల్పనలో రెండూ బాగా ఉపయోగపడతాయి. అందుకే మనం వివిధ అంశాల పట్ల పరిశోధక దృక్పథం పెంచుకోవటం ద్వారా శాస్త్ర పురోగతిని బలోపేతం చేసుకోవాలి.
మిత్రులారా,
ఈ రోజు భారతదేశం ముందడుగు వేయటంలో మన శాస్త్రీయ వైఖరిని , దాని ఫలితాలను కూడా మనం చూస్తున్నాం. శాస్త్ర రంగంలో భారతదేశం అత్యంత వేగంగా ప్రపంచపు అత్యుత్తమ దేశాలలో ఒకటిగా ఎదుగుతోంది. అంతర్జాతీయ నవకల్పనల సూచికలో 130 దేశాలలో మనం 2015 నాటికి 81 వ స్థానంలో ఉన్నాం. కానీ మనం 2022 నాటికల్లా 40వ స్థానానికి దూకాం. ఈ రోజు భారత దేశం పీఎచ్ డీల సంఖ్యాపరంగా చూస్తే ప్రపంచంలో మొదటి మూడు దేశాలలో ఒకటిగా ఉంది. అంకుర సంస్థల పర్యావరణం విషయానికొస్తే, భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో మొదటి మూడు దేశాలలో ఒకటిగా ఉంది .
మిత్రులారా,
ఈ సారి ఇండియన్ కాంగ్రెస్ థీమ్ ఇప్పుడు ప్రపంచ మంతటా చర్చించుకునే విషయం కావటం నాకు సంతోషంగా ఉంది. సుస్థిరాభివృద్ధి ద్వారా మాత్రమే ప్రపంచ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. మీరు సుస్థిరాభివృద్ధి అనే అంశాన్ని మహిళా సాధికారతతో అనుసంధానం చేశారు. ఈ రెండూ పరస్పరం ఆచరణలో కూడా ఒక దానితో మరొకటి సంబంధం ఉన్నవనే నేను కూడా నమ్ముతున్నాను. ఈ రోజు దేశం శాస్త్రాభివృద్ధి ద్వారా మాత్రమే మహిళా సాధికారతను సాధించగలుగుతోంది. మన లక్ష్యమేంటంటే, మహిళల భాగస్వామ్యం పెంచటం ద్వారా సైన్స్ ను సాధికారం చేయాలి. ఆ విధంగా సైన్స్ అభివృద్ధికి, పరిశోధనకు మరింత వేగాన్ని జోడించాలి. ఈ మధ్యనే భారతదేశానికి జీ -20 సారధ్య బాధ్యతలు వచ్చాయి. జీ-20 ప్రధాన అంశాలలో మహిళల నాయకత్వంలో అభివృద్ధి సాధించటం కూడా ఒక ప్రాధాన్యత. గడిచిన ఎనిమిదేళ్లలో పాలన మొదలు సమాజం దాకా, ఆర్థిక వ్యవస్థ దాకా అలాంటి అసాధారణ అంశాలలో భారతదేశం సాధించిన ప్రగతిని నేడు చర్చించు కుంటున్నాం. ముద్ర యోజన ద్వారా చిన్న పరిశ్రమలు, వ్యాపారాలలో పాల్గొనటం కావచ్చు, లేదా అంకుర సంస్థలలో నాయకత్వం కావచ్చు... భారతదేశంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. పరిశోధన, అభివృద్ధి రంగంలో మహిళల భాగస్వామ్యం గత ఎనినిదేళ్ళలో రెట్టింపయింది. ఇలా వారి భాగస్వామ్యం పెరగటమే సమాజం, సైన్స్ కూడా పురోగతి చెందుతున్నాయనటానికి నిదర్శనం.
మిత్రులారా,
ఏ శాస్త్రవేత్తకయినా ఎదురయ్యే అసలైన సవాలు ఏంటంటే, తన జ్ఞానాన్ని వాడకంలోకి తెచ్చి ప్రపంచానికి సాయపడటం. ఒక శాస్త్రవేత్త తన ప్రయోగాలలో ఉన్నప్పుడు అతని మనసులో ఉండే ఆలోచన ఒక్కటే.. అది ప్రజల జీవితాన్ని సరళతరం చేస్తుందా , ప్రపంచపు అవసరాల్లో ఒక్కటైనా తీర్చగలుగుతుందా? అనే. శాస్త్రీయ కృషి గొప్ప సాధనాలుగా గుర్తింపు పొందాలంటే అవి క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇచ్చినప్పుడే సాధ్యం. పత్రికల వ్యాసాల స్థాయి నుంచి నిజ జీవితంలో వాటి ఫలాలు అందినప్పుడే సాధ్యం.
మిత్రులారా,
సైన్స్ లో అద్భుతమైన సాధనాలు ప్రయోగ దశనుంచి ప్రజల అనుభవంలోకి వచ్చినప్పుడే ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపినట్టు లెక్క. ఇది యువతను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. వాళ్ళు కూడా సైన్స్ ద్వారా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలమని భావిస్తారు. అలాంటి యువతను ప్రోత్సహించటానికి సంస్థాగత నిర్మాణం అవసరం. అప్పుడే వాళ్ళ ఆకాంక్షలు విస్తరించి వాళ్ళకు కొత్త అవకాశాలు ఇవ్వగలుగుతాం. అలాంటి సంస్థాగత నిర్మాణాన్ని అందించాల్సిందిగా ఇక్కడున్న శాస్త్రవేత్తలను కోరుతున్నా. అప్పుడే యువతను ఆకట్టుకొని వాళ్ళ పురోగతికి ఒక అవకాశం ఇచ్చినవాళ్ళమవుతాం. ఉదాహరణకు టాలెంట్ హంట్స్, హాకథాన్ ఈవెంట్స్ లాంటివి నిర్వహించి పిల్లల్లో శాస్త్రీయ మేథస్సును పసిగట్టవచ్చు. సరైన దిశానిర్దేశం ద్వారా వాళ్ళ ఆలోచనావిధానాన్ని ముందుకు నడిపించవచ్చు. సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో సహాయపడగలరు. ఈ రోజు భారతదేశం క్రీడారంగంలో కొత్త శిఖరాలు అధిరోహిస్తోంది. దీని వెనుక రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, క్రీడల అభివృద్ధికోసం క్రీడారంగంలో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయటం. రెండోది, గురు -శిష్య సంప్రదాయాన్ని ఉపయోగించి క్రీడలను అభివృద్ధి చేస్తూ కొత్త ప్రతిభను గుర్తించటం, వారిని సుశిక్షితులను చేయటం. దీనివల్ల శిష్యుడి విజయాన్ని గురువు చూస్తాడు. ఇదే సంప్రదాయయాన్ని సైన్స్ లోనూ విజయమంత్రంగా స్వీకరించాలి.
మిత్రులారా,
ఈ రోజు కొన్ని అంశాలు మీముందు ఉంచబోతున్నా. అవి భారతదేశంలో సైన్స్ దిశను నిర్దేశిస్తాయి. భారత ప్రజల అవసరాలు తీర్చటమనే లక్ష్యం నుంచే మన శాస్త్రవేత్తల ప్రధాన ఆలోచనాధోరణి మొదలవ్వాలి. భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేయటానికి సైన్స్ ఉపయోగపడాలి. ప్రపంచ జనాభాలో 17-18 శాతం భారతదేశంలోనే నివసిస్తున్నదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. శాస్త్రజ్ఞుల కృషి వల్ల భారతదేశ అవసరాలు తీరటంతో బాటు ప్రపంచ మానవాళిని ప్రోత్సహించేలా ఉండాలి. ఆ విధంగా దాని ప్రభావం యావత్ మానవాళి మీద ఉంటుంది. అందుకే ప్రపంచం మీద ప్రభావం చూపగలిగేలా మన సైన్స్ పనిచేయాలి. ఉదాహరణకు మనం ఇంధనం విషయం తీసుకుంటే, భారత ఇంధన అవసరాలు బాగా పెరిగే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితిలో మన శాస్త్రవేత్తలు ఇంధన అవసరాల మీద కొత్త ఆలోచనలు చేయాలి, నవకల్పనలు తీసుకురావాలి. అది దేశానికి ఎంతో ప్రయోజనకరం. హైడ్రోజెన్ ఇంధనం మీద పనిచేయటానికి భారతదేశం నేషనల్ హైడ్రోజెన్ మిషన్ చేపట్టింది. దీన్ని విజయవంతం చేయాలంటే ఎలక్ట్రోలైజర్స్ లాంటి అనేక పరికరాల అవసరముంది. అవి దేశంలోనే తయారు కావాలి. ఈ దిశలో ఏ మాత్రం అవకాశం ఉన్నా, పరిశోధన కూడా సాగాలి. మన శాస్త్రవేత్తలు, పరిశ్రమ ఈ దిశలో ముందడుగు వేయాలి.
మిత్రులారా ,
ఈ రోజు మానవాళి కొత్త వ్యాధుల భయం మధ్య మనుగడ సాగిస్తోంది. ఒకవైపు ఇలాంటి కొత్త వ్యాధులను సమర్థంగా ఎదుర్కోగలిగే టీకాల తయారీ మీద దృష్టి సారిస్తూనే వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. సమీకృత వ్యాధి నిఘా వ్యవస్థ ద్వారా వ్యాధులను సకాలంలో గుర్తించాల్సిన అవసరముంది. అప్పుడే తగిన చర్యలు తీసుకోగలుగుతాం. వివిధ మంత్రిత్వశాఖలు కలసికట్టుగా కృషి చేసి ఈ లక్ష్యం సాధించాలి. ఈ విషయంలో మన శాస్త్రవేత్తల కృషి అవసరం.
మిత్రులారా,
ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని, అంటే 2023 ను భారతదేశ పిలుపు మేరకు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఇది ప్రతి భారతీయుడికీ గర్వ కారణం. భారత చిరుధాన్యాలను మెరుగుపరచటానికి, వినియోగానికి తగిన కృషి జరగాలి. శాస్త్రవేత్తలు తగిన చర్యలు తీసుకోవటం ద్వారా బయో టెక్నాలజీని వాడుకుంటూ, పంటవచ్చిన తరువాత వచ్చే నష్టాన్ని బాగా తగ్గించగలగాలి.
మిత్రులారా,
ఈ రోజు భారతదేశం అంతరిక్ష రంగంలోనూ కొత్త శిఖరాలు అధిరోహిస్తోంది. తక్కువ ఖర్చులో ఉపగ్రహ ప్రయోగాల ద్వారా మన సామర్థ్యం పెరిగి మన సేవలు వాడుకోవటానికి ప్రపంచం మనవైపు చూస్తోంది. ఈ అవకాశాలను ప్రైవేట్ కంపెనీలతో బాటు అంకుర సంస్థలు కూడా వాడుకోవచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మరో రంగం. ఇందులోనూ భారతదేశం యావత్ ప్రపంచానికీ మార్గదర్శిగా నిలుస్తోంది. క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ కెమిస్ట్రీ, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సర్స్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ తదితర అంశాలలో ముందున్నది. మన యువ శాస్త్రవేత్తలు ఈ రంగంలో తగిన నైపుణ్యం సాధించాలి.
మిత్రులారా,
మీ అందరికీ తెలుసు, సైన్స్ లో చొరవ తీసుకున్నవాడే నాయకుడవుతాడు. అందుకే, ప్రపంచంలో ఏం జరుగుతున్నదో గమనించటం ఒక్కటే కాదు, ఎక్కడా జరగనివి, భవిష్యత్తులో కీలకమయ్యేవి ఏవో కూడా గుర్తించాలి. ఈ రోజు కృత్రిమ మేధ మీద, అగ్ మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ మీద ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది. ఈ దిశగా దేశం అనేక చర్యలు తీసుకుంటోంది. సెమీ కండక్టర్ చిప్స్ మీద దృష్టి సారించింది. ముందు ముందు వీటిమీద కూడా మరిన్ని పరిశోధనలు అవసరమవుతాయి. అందుకే భవిష్యత్తుకు తగినట్టుగా మనం సిద్ధం కావాలి. ఇలాంటి విషయాల్లో చొరవ తీసుకున్నప్పుడే దేశం పరిశ్రమ 4.0 కు నాయకత్వం వహించగలుగుతుంది.
మిత్రులారా,
ఈ సారి ఇండియన్ కాంగ్రెస్ సమావేశంలో అనేక నిర్మాణాత్మక లక్ష్యాలతో ఒక స్పష్టమైన రోడ్ మాప్ తయారవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ అమృత కాలంలో ఆధునిక సైన్స్ కు భారతదేశం ఒక అత్యాధునిక ప్రయోగశాలగా తయారయ్యేట్టు చూద్దాం. ఈ ఆకాంక్షతో మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నా. నమస్కారం