మ‌నం అంతా క‌లిసిక‌ట్టుగా ఉన్న‌ప్పుడు బ‌లంగా, మెరుగ్గా ఉన్నామ‌ని బోధించిన కోవిడ్ : ప్ర‌ధాన‌మంత్రి
"ప్ర‌తీ ఒక్క అంశంలోనూ మాన‌వ స‌మాజం చూపిన సంయ‌మ‌నాన్ని త‌ర‌త‌రాలు గుర్తుంచుకుంటాయి"
"పేద‌లు అన్నింటికీ ప్ర‌భుత్వాల‌పై ఆధార‌ప‌డేలా ఉంచి పేద‌రికంపై పోరాటం సాగించ‌లేం. ప్ర‌భుత్వాన్నిపేద‌లు విశ్వ‌స‌నీయ భాగ‌స్వాములుగా చూసే ప‌రిస్థితిలో పేద‌రికంపై పోరాడ‌లేం"
"పేద‌ల‌ను సాధికారం చేసేందుకు అధికారాన్ని ఉప‌యోగించిన‌ట్ట‌యితే పేద‌రికంపై పోరాడే శ‌క్తి పేద‌ల‌కు వ‌స్తుంది"
"ప్ర‌కృతికి హానిక‌రం కాని జీవ‌న విధానాలు సాగించ‌డం ఒక్క‌టే వాతావ‌ర‌ణ మార్పుల ప‌రిష్కారానికి తేలిక‌పాటి, విజ‌య‌వంత‌మైన మార్గం"
"ప్ర‌పంచంలోని అతి పెద్ద ప‌ర్యావ‌ర‌ణవేత్త మ‌హాత్మాగాంధీ. మేం క‌ర్బ‌న్ వ్య‌ర్థాల‌కు తావు లేని జీవ‌నశైలి అనుస‌రిస్తున్నాం. మన భూమండ‌లం సంక్షేమం మాత్రమే అన్నింటి క‌న్నా ప్ర‌ధానం అని ఆయ‌న భావించే వారు."
"గాంధీజీ ట్ర‌స్టీ సిద్ధాంతాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించే వారు. మ‌న‌మంతా భూమండ‌లాన్ని కాపాడే ట్ర‌స్టీలుగా ఉండాల‌న్న‌దే దాని ప్ర‌ధానాంశం"
మ‌నం అంతా క‌లిసిక‌ట్టుగా ఉన్న‌ప్పుడు బ‌లంగా, మెరుగ్గా ఉన్నామ‌ని బోధించిన కోవిడ్ : ప్ర‌ధాన‌మంత్రి

నమస్తే!

   ఈ చురుకైన, యువ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడంపై నేనెంతో సంతోషిస్తున్నాను. మన భూగోళంలోని సుందర వైవిధ్యభరిత అంతర్జాతీయ కుటుంబం ఇప్పుడు నా కళ్లముందుంది. ప్రపంచాన్ని ఏకం చేయడానికి ‘అంతర్జాతీయ పౌర ఉద్యమం’ సంగీతాన్ని, సృజనాత్మకతలను ఉపకరణాలుగా వినియోగిస్తోంది. క్రీడల తరహాలోనే అందర్నీ ఏకం చేయగల సహజ సామర్థ్యం సంగీతానికీ ఉంది. అందుకే మహనీయుడైన హెన్రీ డేవిడ్ థోరూ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తున్నాను. ‘‘నేను సంగీతం వింటున్నపుడు ఎంతటి ప్రమాదం వచ్చిపడినా నాకు భయం వేయదు.. నేను ముప్పులకు అతీతుణ్ని.. నాకు శత్రువులెవరూ కనిపించరు.. నేను ప్రాచీన-ఆధునిక కాలాలు రెండింటికీ చెందినవాడినని భావిస్తాను’’ అని ఆయన అన్నారు. సంగీతం మన జీవితాల్లో ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. మన మనసునే కాకుండా శరీరం మొత్తాన్నీ నిశ్చల స్థితిలోకి తీసుకెళ్తుంది. భారత దేశం అనేక సంగీత సంప్రదాయాల నిలయం. ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతంలో దేనికదే ప్రత్యేకమైన సంగీత శైలీ సంప్రదాయాలున్నాయి. ఒకసారి భారతదేశాన్ని సందర్శించి, మా సంగీత సంప్రదాయాల ఉత్తేజాన్ని, వైవిధ్యాన్ని చవిచూడాలని మిమ్మల్నందర్నీ నేను ఆహ్వానిస్తున్నాను.

మిత్రులారా!

   న జీవితకాలంలో ఒకసారి ముంచుకొచ్చే ప్రపంచ మహమ్మారితో దాదాపు రెండేళ్లుగా మానవాళి పోరాడుతోంది. మనమంతా సమష్టిగా ఉంటేనే శక్తిమంతంగా, మరింత మెరుగ్గా జీవించగలమని మహమ్మారితో ఈ పోరాట అనుభవం మనకు పాఠం నేర్పింది. మహమ్మారితో యుద్ధంలో మన వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది వంటి ముందువరుస కోవిడ్-19 యోధుల అంకితభావం ఈ సామూహిక స్ఫూర్తి తళక్కున మెరిసింది. అలాగే రికార్డు సమయంలో కొత్త టీకాలను సృష్టించిన మన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలలోనూ ఇదే స్ఫూర్తిని మనమంతా చూశాం. మహమ్మారి సమయాన ప్రతి అంశంలోనూ మానవాళి ప్రతీఘాత శక్తి పెల్లుబికిన తీరును రానున్న తరాలు కచ్చితంగా స్మరించుకుంటాయి.

మిత్రులారా!

   కోవిడ్ ఒక్కటే కాకుండా మనముందు ఇంకా చాలా సవాళ్లున్నాయి. వీటిలో అత్యంత నిరంతర సమస్య పేదరికం... అయితే, పేదలు మరింతగా ప్రభుత్వాలపై ఆధారపడేలా చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు మనం పోరాడజాలం. ప్రభుత్వాలు తమ విశ్వసనీయ భాగస్వాములని పేదలు చూడగలిగినప్పడే పేదరికంపై సమర్థంగా పోరాడగలం. ఆ మేరకు పేదరికం విషపు కోరలనుంచి గట్టెక్కించగల సమర్థ మౌలిక వసతులు వారికి ఇవ్వగలిగితేనే వారికి మనం విశ్వసనీయ భాగస్వాములం కాగలం.

మిత్రులారా!

   ధికారాన్ని మనం పేదల సాధికారత కోసం ఉపయోగిస్తే పేదరికంపై పోరాడగల శక్తి వారికి లభిస్తుంది. కాబట్టే ఆ దిశగా- ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా, లక్షలాది మందికి సామాజిక భద్రత కల్పన, 5 కోట్ల మంది భారతీయులకు ఉచిత-నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ వంటివి మా ప్రయత్నాల్లో భాగంగా ఉన్నాయి. అలాగే మా నగరాలు, గ్రామాల్లో ఇళ్లులేని వారికోసం 3 కోట్ల పక్కాఇళ్లు నిర్మించడాన్ని మీరు నిశ్చయంగా హర్షిస్తారు. ఇల్లంటే ఓ గూడువంటిది కాదు... సొంత ఇల్లంటే ప్రజలకు ఓ గౌరవం. ఇంటింటికీ కొళాయి కనెక్షన్ ద్వారా మంచినీటి సరఫరా అన్నది భారతదేశంలో సాగుతున్న మరో ఉద్యమం. అంతేకాకుండా భవిష్యత్తరం మౌలిక సదుపాయాల కల్పన కోసం మా ప్రభుత్వం లక్షకోట్ల డాలర్లకుపైగా ఖర్చు చేస్తోంది. గత సంవత్సరంతోపాటు ఈ ఏడాది కూడా మా 80 కోట్లమంది పౌరులకు ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేశాం. ఇవేకాకుండా మేం చేపట్టిన ఇతరత్రా కార్యక్రమాలు పేదరికంపై పోరాటంలో ఎంతో బలం చేకూరుస్తున్నాయి.

మిత్రులారా!

   వాతావరణ మార్పు ముప్పు నేడు మనముందు అతిపెద్ద సవాలుగా ఉంది. అంతర్జాతీయ వాతావరణంలో ఎలాంటి మార్పు సంభవించినా అది మనతోనే మొదలవుతుందన్న వాస్తవాన్ని ప్రపంచం గుర్తించాల్సి ఉంది. కాబట్టి జీవనశైలిలో మార్పుతోపాటు ప్రకృతితో సామరస్యం పెంచుకోవడమే వాతావరణ మార్పు ముప్పునుంచి ఉపశమనం పొందగల అత్యంత సరళ, విజయవంతమైన మార్గం. మహనీయుడైన మహాత్మా గాంధీ శాంతి-అహింసల గురించి ప్రబోధించారని ప్రపంచం మొత్తానికీ తెలుసు. కానీ, గొప్ప అంతర్జాతీయ పర్యావరణ వేత్తలలో ఆయన ఒకరనే సంగతి మీకు తెలుసా! శూన్య కర్బన ఉద్గార జీవనశైలిని ఆయన స్వయంగా అనుసరించారు. తాను చేసే ప్రతి పనిలోనూ ఈ భూగోళం సంక్షేమానికే అన్నిటికన్నా ప్రాధాన్యం ఇచ్చారు. ఆ మేరకు ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దీని ప్రకారం... ఈ భూగోళానికి ధర్మకర్తలుగా మనమంతా దాని సంరక్షణ బాధ్యతను నిర్వర్తించాలని ప్రబోధించారు.

   ఈ నేపథ్యంలో జి-20 దేశాలన్నిటిలోనూ పారిస్ సదస్సు హామీల బాటలో సాగుతున్నది నేడు భారతదేశం ఒక్కటే. అంతేకాదు... విపత్తు ప్రతీఘాతక మౌలిక సదుపాయాల దిశగా ‘అంతర్జాతీయ సౌరశక్తి కూటమి’ ఛత్రం కింద ప్రపంచాన్ని ఏకతాటిపై తెచ్చింది మేమేనని భారత్ సగర్వంగా చాటుకుంటోంది.

మిత్రులారా!

   మానవాళి ప్రగతి కోసం భారత దేశాభివృద్ధి ఆవశ్యకతను మేం విశ్వసిస్తున్నాం. ఈ సందర్భంగా బహుశా ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన రుగ్వేదంలోని ఒక అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. అందులోని శ్లోకాలు నేటికీ అంతర్జాతీయ పౌర ప్రగతికి స్వర్ణ ప్రమాణాలు.

రుగ్వేదం ఇలా చెబుతుంది:

సంగచ్ఛద్వం సంవదత్వం సంవోమనాసిజానతాం

దేవాభాగం యథాపూర్వే సజ్జనానా ఉపాసతే

సమానో మంత్రః సమితిఃసమాన్ సమానంమనః సహజిత్త మేషాం

సమానం మంత్రం అభిమంత్రయేవః సమానేనవో హవిషాగృహోం

సమానివ ఆకూతిః సమానాహృదయానివః

సమానమస్తువోమనోయథావః సుసహాసతి

అంటే....

‘‘రండి... మనమంతా ముక్తకంఠంతో ముందుకు సాగుదాం;

దేవతలంతా పరస్పరం పంచుకున్నట్లు ఏకమనస్కులమై మనకున్నదాన్ని పంచుకుందాం;

సామూహిక లక్ష్యం... సమష్టి ఆలోచనలతో అటువంటి ఐక్యతా భావన కోసం ప్రార్థిద్దాం;

మనందర్నీ ఒకేతాటిపైకి చేర్చే సామూహిక ఆశలు-ఆకాంక్షలతో సాగుదాం’’

మిత్రులారా!

   ఇంతకన్నా మానవాభివృద్ధి ప్రణాళిక ప్రపంచ పౌరులకు మరేముంది? కరుణ, సమానత, సార్వజనీనతతో కూడిన భూగోళం కోసం మనమంతా ఒక్కటిగా ముందడుగు వేద్దాం పదండి!

 

కృతజ్ఞతలు...

వేనవేల కృతజ్ఞతలు...

నమస్తే!

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi