మీ అందరితో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది. నేను మీలో ప్రతీ ఒక్కరితో విడివిడిగా మాట్లాడలేకపోయినా దేశ ప్రజలందరూ మీలో పొంగుతున్న ఉత్సాహాన్ని, ఉత్సుకతను చూస్తూనే ఉన్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం వరకు మీ అందరి కోసం క్రీడా శాఖ మంత్రిగా ఎంతో కృషి చేసిన ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజెజు జీ కూడా ఉన్నారు. అమిత యువకుడైన శ్రీ నిశిత్ ప్రామాణిక్ క్రీడల శాఖ సహాయమంత్రిగా ప్రస్తుతం మా బృందంలో ఉన్నారు. అన్ని క్రీడా సంఘాల అధిపతులు, సభ్యులు, నా సహచరులు, టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న క్రీడాకారులు, వారి కుటుంబాలు అందరితో ఈ వర్చువల్ సమావేశం ఈ రోజు నిర్వహిస్తున్నాం. వాస్తవానికి మీ అందరికీ ఇక్కడ నా ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేది, కాని ఈ సారి వర్చువల్ గా మాత్రమే కలవగలుగుతున్నాను. గతంలో అలాగే ఆతిథ్యం ఇచ్చే వాడిని. అలాంటి సందర్భాలు నాకు చిరస్మరణీయంగా ఉండేవి. కాని కరోనా కారణంగా ఈ సారి అది సాధ్యం కావడంలేదు. మన క్రీడాకారుల్లో సగం మందికి పైగా ఇప్పటికే విదేశాల్లో శిక్షణ పొంది ఉన్నారు. మీరు తిరిగి వచ్చినప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని కలవగలనని హామీ ఇస్తున్నాను. కరోనా పరిస్థితులను ఎంతో మార్చింది. దాని ప్రభావం వల్ల ఒలింపిక్స్ నిర్వహించే సంవత్సరం, ఒలింపిక్స్ కు మీరు తయారయ్యే తీరుతెన్నులు...ఇలా అన్నీ ఎంతగానో మారిపోయాయి. ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఇంక 10 రోజులు మాత్రమే ఉంది. టోక్యోలో కూడా గతంలో ఎన్నడూ లేని భిన్నత్వాన్ని మీరు చూడబోతున్నారు.
మిత్రులారా,
ఈ రోజు మీతో చర్చిస్తున్న సమయంలో అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశం కోసం మీరెంత చెమటోడ్చి శ్రమించారో దేశం యావత్తు తెలుసుకోగలిగింది. “మన్ కీ బాత్” గత ఎపిసోడ్ లో కూడా మీ సహచరులు కొందరి కఠోర శ్రమ గురించి నేను చర్చించాను. మీలో నైతిక స్థైర్యం నింపడం కోసం మీ అందర్నీ హర్షధ్వానాలతో అభినందించాలని నేను దేశ ప్రజలను కోరాను. మీ కోసం దేశం యావత్తు హర్షధ్వానాలు చేయడాన్ని చూసి నేను ఆనందపడుతున్నాను. “చీర్ ఫర్ ఇండియా” హ్యాష్ టాగ్ తో ఇటీవల ఎన్నో చిత్రాలు నేను చూశాను. సామాజిక మాధ్యమాల నుంచి దేశంలోని భిన్న ప్రాంతాలు, జాతి యావత్తు మీకు మద్దతుగా నిలుస్తోంది. 135 కోట్ల మంది భారతీయులు అందిస్తున్న శుభాకాంక్షలు మీరు క్రీడల బరిలో దిగే సమయంలో ఆశీస్సులుగా నిలుస్తాయి. నా వైపు నుంచి నేను కూడా మీ అందరికీ అభినందనలు అందిస్తున్నాను. నమో యాప్ లో కూడా ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో మీకు దేశ ప్రజలందరి అభినందన సందేశాలు అందుతూనే ఉంటాయి.
మిత్రులారా,
యావత్ దేశ మనోభావాలు మీతో ఉంటాయి. మీ అందరినీ ఇలా ఒక్కటిగా చూస్తుంటే మీలో సాహసం, విశ్వాసం, సానుకూల దృక్పథం నాకు కనిపిస్తున్నాయి. క్రమశిక్షణ, అంకితభావం, నిర్ణయాత్మక వైఖరి ఉమ్మడి లక్షణాలుగా నాకు గోచరిస్తున్నాయి. మీలో పోటీ సామర్థ్యంతో పాటు కట్టుబాటు కూడా ఉంది. నవభారతం లక్షణాలు కూడా ఇవే. అందుకే మీరందరూ నవభారతావనికి ప్రతిబింబం, దేశ భవిష్యత్తుకు ప్రతీకలు. మీలో దక్షిణాది, ఉత్తరాది, తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు చెందిన వారున్నారు. మీలో కొందరు గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో ఆటలు ప్రారంభించారు. మరి కొందరు బాల్యం నుంచి స్పోర్ట్స్ అకాడమీలతో అనుబంధం కలిగి ఉన్నారు. కాని ఇప్పుడు మీరందరూ “టీమ్ ఇండియా”లో భాగం. మీరందరూ దేశం కోసం ఆడేందుకు వెళ్తున్నారు. ఈ భిన్నత్వంతో కూడిన “టీమ్ స్పిరిట్” దేశం అనుసరిస్తున్న ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ (ఒకే భారతం, పటిష్ఠ భారతం) సిద్ధాంతానికి గుర్తింపు.
మిత్రులారా,
దేశం యావత్తు కొత్త ఆలోచన, కొత్త వైఖరితో మీలో ప్రతీ ఒక్కరి వెంట నిలవడం మీరు చూస్తున్నారు. ఈ రోజు మీలోని స్ఫూర్తి దేశానికి అత్యంత కీలకం. మీలోని క్రీడా నైపుణ్యాలను, సాంకేతికతను పెంచుకుని స్వేచ్ఛగా ఆడుతూ మీలోని శక్తి సామర్థ్యాలు పూర్తిగా ప్రదర్శించగలిగే వాతావరణం కల్పించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. చాలా కాలం క్రితమే ఒలింపిక్స్ సంసిద్ధత కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం కింద క్రీడాకారులందరికీ అన్ని విధాలా సహకారం అందించడం జరిగింది. మీకు అది కూడా అనుభవంలోకి వచ్చింది. గతానికి భిన్నమైన కొత్త మార్పు మీ అందరూ అనుభవించి ఉంటారు.
నా మిత్రులారా,
మీరు దేశం కోసం చెమటోడ్చారు, దేశ పతాకను భుజాన మోస్తున్నారు. ఇలాంటి సమయంలో మీ అందరి వెనుక దృఢంగా నిలబడడం దేశ బాధ్యత. క్రీడాకారులందరికీ మెరుగైన శిక్షణ శిబిరాలు, మెరుగైన పరికరాలు అందించడానికి కృషి చేశాం. ఈ రోజు క్రీడాకారులందరికీ అంతర్జాతీయంగా తమ సామర్థ్యం నిరూపించుకునే అవకాశం వచ్చింది. క్రీడా సంస్థలన్నీ మీ సలహాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి కృషి చేయడం వల్లనే స్వల్పకాలంలోనే ఈ మార్పు అంతా సాధ్యమయింది.
మిత్రులారా,
సంఘటిత శ్రమతో కూడిన వ్యూహమే క్రీడా మైదానంలో విజయాన్ని అందిస్తుంది. క్రీడా మైదానం వెలుపల కూడా ఇదే వర్తిస్తుంది. “ఖేలో ఇండియా”, “ఫిట్ ఇండియా” పేరిట ఉద్యమ స్ఫూర్తితో క్రీడా ప్రచారం నిర్వహించిన ఫలితం మీరందరూ చూడగలుగుతారు. చరిత్రలోనే తొలిసారిగా మన దేశం నుంచి ఇంత అధిక సంఖ్యలో క్రీడాకారులు ఒలింపిక్స్ అర్హత సాధించారు. చరిత్రలో తొలి సారిగా మన దేశ క్రీడాకారులు ఎన్నో క్రీడల్లో పాల్గొంటున్నారు. దేశం తొలిసారిగా అర్హత సాధించిన ఎన్నో క్రీడలున్నాయి.
మిత్రులారా,
“అభ్యాసాత్ జయతే నృణామ్ దైవితీయ ప్రకృతిః” అనే సూక్తి మన దేశంలో ఉంది. మనం అభ్యాసం చేసిన కొద్ది అది మన స్వభావంలో భాగంగా మారిపోతుంది అనేది దాని అర్ధం. మీరందరూ ఎంతో కాలంగా విజయం కోసం ఎంతో అభ్యాసం చేస్తున్నారు. మీ అందరి శక్తి చూస్తుంటే మీరు విజయం సాధించగలరన్న విషయంలో ఎలాంటి అనుమానానికి తావుండదనిపిస్తోంది. మీలోని, దేశ యువతలోని ఉత్సాహం చూస్తుంటే నవభారతానికి గెలుపు అనే అలవాటు అలవడే రోజు ఎంతో దూరంలో లేదన్న నమ్మకం కలుగుతోంది. ఇది ఆరంభం మాత్రమే. మీరు టోక్యో వెళ్లి మన జాతీయ పతాక ఎగురవేయడాన్ని ప్రపంచం యావత్తు చూస్తుంది. అయితే విజయం కోసం మాత్రమే ఆడాలనే ఒత్తిడికి లోను కాకూడదన్న విషయం మీరు గుర్తుంచుకోండి. నా శక్తి సామర్థ్యాల మేరకు ఆడాలి అనేది మాత్రమే మీ మనసులో పెట్టుకోండి. చీర్ ఫర్ ఇండియా పేరిట మరోసారి అభినందనలు తెలపాలని నేను మరోసారి పిలుపు ఇస్తున్నాను. మీరందరూ దేశం కోసం ఆడి దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తారని, కొత్త శిఖరాలను అధిరోహిస్తారన్న పూర్తి నమ్మకం నాకుంది. ఆ విశ్వాసంతోనే మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీ కుటుంబ సభ్యులకు, నా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాను. ధన్యవాదాలు.