మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం.వి.శ్రేయమ్స్ కుమార్ జీ, మాతృభూమి బృందం అదరికి, పాఠలకు, గౌరవ అతిథులకు
నమస్కారం!
మాతృభూమి శతవార్షికోత్సవ వేడుకల సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రసంగించడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ఈ పత్రికతో అనుబంధం గల వారందరికీ నా అభినందనలు తెలియచేస్తున్నాను. అలాగే గతంలో ఈ మీడియా సంస్థలో పని చేసిన వారందరి సేవలను గుర్తు చేస్తున్నాను. శ్రీ కె.పి.కేశవ మీనన్, శ్రీ కె.ఎ.దామోదర్ మీనన్, కేరళ గాంధీ శ్రీ కె.కేలప్పన్, శ్రీ కరూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్ వంటి ఎందరో ప్రముఖులు మాతృభూమితో అనుబంధం కలిగి ఉన్నారు. మాతృభూమి వేగవంతమైన వృద్ధికి దోహదపడిన శ్రీ ఎం.పి.వీరేంద్ర కుమార్ ను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎమర్జెన్సీ కాలంలో భారత ప్రజాస్వామిక విలువల పరిరక్షణకు ఆయన చేసిన ప్రయత్నాలు ఎన్నటికీ మరిచిపోలేం. ఆయన మంచి వక్త, పండితుడు, పర్యావరణ ప్రేమికుడు.
మిత్రులారా,
మహాత్మాగాంధీ ఆదర్శాల స్ఫూర్తితో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని పటిష్ఠం చేయడానికి మాతృభూమి జన్మించింది. వలసవాద పాలకుల కాలంలో జాతిని ఐక్యం చేయడానికి దేశవ్యాప్తంగా ఉద్భవించిన పలు వార్తాపత్రికలు, జర్నల్స్ మహోజ్వల సంప్రదాయంలో మాతృభూమి కీలక భాగస్వామి. మనం ఒక సారి చరిత్రలోకి తొంగి చూసినట్టయితే ఎంతో మంది ప్రముఖులు పలు పత్రికలతో అనుబంధం కలిగి ఉన్నారు. లోకమాన్య తిలక్ కేసరి, మహ్రాటాలను ప్రారంభించారు. గోపాలకృష్ణ గోఖలే హితవాదతో అనుబంధం కలిగి ఉన్నారు. ప్రబుద్ధ భరత్... స్వామి వివేకానందతో అనుబంధం కలిగి ఉన్నారు. మహాత్మా గాంధీని గుర్తు చేసుకున్నట్టయితే యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్ లతో ఆయన కృషి గుర్తులోకి వస్తుంది. స్వామీజీ కృష్ణ వర్మ ద ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. నేను కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పాను. ఈ జాబితాకు అంతే ఉండదు.
మిత్రులారా,
మాతృభూమి పత్రిక భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రారంభమైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ కాలంలో శతవార్షికోత్సవాలు నిర్వహించుకుంటోంది. స్వరాజ్య కోసం పోరాడిన కాలంలో మనలో ఎవరికీ దేశం కోసం త్యాగం చేసే అవకాశం కలగలేదు. కాని అమృత కాలం శక్తివంతమైన, అభివృద్ధి చెందిన, సమ్మిళిత భారత్ కోసం కృషి చేసే అవకాశం మనందరికీ ఇచ్చింది. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా మంచి విధానాల రూపకల్పన ఒక ప్రధానాంశం. కాని ఏ విధానాలు ఆచరణీయం కావాలన్నా, భారీ పరివర్తన చోటు చేసుకోవాలన్నా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఇందులో మీడియా పాత్ర అత్యంత కీలకం. గడిచిపోయిన సంవత్సరాల్లో మీడియా చూపిన సానుకూల ప్రభావాన్ని నేను వీక్షించాను. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయం అందరికీ తెలిసిందే. ప్రతీ ఒక్క మీడియా సంస్థ చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపింది. అదే విధంగా యోగాను, ఫిట్ నెస్ ను ప్రాచుర్యంలోకి తేవడంలోను, బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం విజయంలోనూ మీడియా అత్యంత ప్రోత్సాహకరమైన పాత్ర పోషించింది. ఇవన్నీ రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతమైన కార్యక్రమాలు. ఇవన్నీ రాబోయే కాలంలో దేశాన్ని మెరుగైన జాతిగా తీర్చి దిద్దుతాయి. వీటన్నింటికీ తోడు ప్రస్తుత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో చేయడానికి ఆస్కారం ఉంది. ఈ రోజుల్లో చరిత్రలో అంతగా ప్రాచుర్యంలోకి రాని స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి సంఘటనలు, వెలుగులోకి రాని స్వాతంత్ర్య యోధుల కథనాలు ప్రచారంలోకి రావడాన్ని మనం చూస్తున్నాం. దీన్ని మరింతగా విస్తరించడానికి మీడియా పెద్ద పాత్ర పోషించాల్సి ఉంది. అదే విధంగా ప్రతీ ఒక్క పట్టణంలోను, గ్రామంలోను స్వాతంత్ర్యోద్యమంతో అనుబంధం ఉన్న ప్రదేశాలున్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి ప్రదేశాలను మనం ప్రచారంలోకి తెచ్చి ప్రజలు వాటిని సందర్శించేలా చేయాలి. మనం మీడియా నేపథ్యం లేని ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించి వారి రచనా నైపుణ్యాలు ప్రదర్శించగలిగే వేదిక సృష్టించగలమా? భారతదేశానికి అతి పెద్ద బలం భిన్నత్వం. ఇతర భాషల్లోని ముఖ్యమైన పదాలు మీడియాలో ప్రాచుర్యం కల్పింగలమా?
మిత్రులారా,
ప్రస్తుత కాలంలో ప్రపంచం మొత్తానికి భారతదేశంపై ఎన్నో అంచనాలున్నాయి. కోవిడ్-19 మహమ్మారి మన దేశాన్ని తాకినప్పుడు దాన్ని దీటుగా ఎదుర్కొనగల సామర్థ్యం మనకు లేదని చాలా మంది అనుమానించారు. కాని వారందరూ అనుకుంటున్నది తప్పు అని భారత ప్రజలు నిరూపించారు. గత రెండేళ్ల కాలంలో సమాజం, ఆర్థిక వ్యవస్థ స్వస్థత మెరుగుపరిచేందుకు మనం కృషి చేశాం. రెండేళ్లుగా దేశంలోని 80 కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. ఇప్పటికి 180 కోట్ల వ్యాక్సినేషన్ డోస్ లు అందించగలిగాం. చాలా దేశాలు వ్యాక్సిన్ పట్ల వ్యతిరేకతను అధిగమించలేక సతమతమవుతుండగా భారత ప్రజలు మాత్రం సరైన బాట చూపారు. దేశానికి చెందిన ప్రతిభావంతులైన యువత బలంగా దేశం ఆత్మనిర్భరత లేదా స్వయం సమృద్ధి బాటలో పురోగమిస్తోంది. దేశీయ, ప్రపంచ అవసరాలు తీర్చగల ఆర్థిక శక్తిగా దేశాన్ని మార్చడం వీటన్నింటి ప్రధాన సిద్ధాంతం.ఆర్థిక పురోగతికి ఉత్తేజం అందించగల అసాధారణ సంస్కరణలు ఎన్నో చేశాం. స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విభిన్న రంగాలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. భారత స్టార్టప్ వ్యవస్థ ఇప్పుడున్నంత చలనశీలంగా గతంలో ఎన్నడూ లేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామాల యువత కూడా అద్భుత కృషి చేస్తున్నారు. నేడు సాంకేతిక పురోగతిలో భారత్ ప్రపంచ దేశాల్లోనే ముందువరుసలో ఉంది. గత నాలుగు సంవత్సరాల కాలంలోనే యుపిఐ లావాదేవీలు 70 రెట్లు పెరిగాయి. సానుకూల మార్పులను ఆచరణీయం చేసేందుకు ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉంటారో తెలియచేసే ఉదాహరణ ఇది.
మిత్రులారా,
కొత్తతరం మౌలిక వసతుల ప్రాధాన్యం మాకు పూర్తిగా తెలుసు. నేషనల్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ పైప్ లైన్ పై రూ.110 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిఎం గతిశక్తి మౌలిక వసతులు నిర్మించడంతో పాటు, పాలన ఎలాంటి అవరోధాలు లేకుండా సాగేలా చూస్తుంది. దేశంలోని ప్రతీ ఒక్క గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించే దిశగా చురుగ్గా పని చేస్తున్నాం. ప్రస్తుత తరంతో పోల్చితే భవిష్యత్ తరాలు మరింత మెరుగైన జీవనం కలిగి ఉండాలన్నదే మా ప్రయత్నాలకు మార్గదర్శక సూత్రం.
మిత్రులారా,
కొన్నేళ్ల క్రితం మహాత్మాగాంధీ మాతృభూమిని సందర్శించిప్పుడు మాతృభూమి తన కాళ్లపై తాను బలంగా నిలబడిన సంస్థ. దేశంలోని కొన్ని వార్తాపత్రికలు మాత్రమే ఇది సాధించగలవు. అందుకే భారతదేశంలోని వార్తాపత్రికల్లో మాతృభూమికి ప్రత్యేక స్థానం ఉంది అన్నారు. బాపూజీ మాటలకు అనుగుణంగానే మాతృభూమి మనుగడ సాగిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నేను మరోసారి శతవార్షికోత్సవ వేడుకల సందర్భంగా మాతృభూమికి అభినందనలు తెలియచేస్తున్నాను. మాతృభూమి పాఠకులందరికీ నా శుభాభినందనలు.
ధన్యవాదాలు.
జైహింద్
నమస్కారం