నమస్కార్
గౌరవనీయులైన హర్ ఎక్స్ లెన్సీ ఇంగర్ అండర్స్, యుఎన్ ఇ పి గ్లోబల్ హెడ్
గౌరవనీయులైన హిస్ ఎక్స్ లెన్సీ అచిమ్ స్టెయినర్, యుఎన్ డిపి గ్లోబల్ హెడ్
నా స్నేహితులు శ్రీ డేవిడ్ మల్‌పాస్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షులకు
లార్డ్ నికోలస్ స్టెర్న్, శ్రీ కాస్ సన్ స్టెయిన్ లకు
నా స్నేహితుడు శ్రీ బిల్ గేట్స్ కు, శ్రీ అనిల్ దాస్ గుప్తాకు భారతదేశ పర్యావరణశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ లకు నమస్కారాలు..
ఇప్పుడే మీ అందరి ఆలోచనాత్మక అభిప్రాయాలను వినడం జరిగింది.
మీ విలువైన అభిప్రాయాలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను.
లేడస్ అండ్ జెంటిల్మాన్
ప్రియమైన స్నేహితులారా, నమస్తే
ఈ రోజు వచ్చిన ఈ సందర్భం, ఈ తేదీ ఈ రెండు చాలా ప్రాధాన్యతగలవి. ఈ రోజున మనం ఎల్ ఐ ఎఫ్ ఇ..లైఫ్ స్టయిల్ ఫర్ ఎన్విరాన్ మెంట్ మూవ్ మెంట్.. అంటే పర్యావరణం కోసం జీవనశైలి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ నినాదాన్ని తీసుకుంటే అది ఒకే ఒక భూగోళమనే నినాదం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న అంశం ప్రకృతితో కలిసి సమన్వయంతో సుస్థిరంగా జీవించడం. ఈ పదబంధాల్లోనే సమస్య, పరిష్కారం అనేవి ఎంతో అందంగా వుండేలా వీటిని తయారు చేశారు.
స్నేహితులారా,
నేడు మన భూగోళం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మనందరికీ బాగా తెలుసు. ప్రస్తుతం మనందరికీ కావాల్సింది ఏమంటే మానవాళి క్షేమమే ప్రధానం, అందరమూ కలిసి కట్టుగా, దృఢంగా పని చేసినప్పుడే సుస్థిర అభివృద్ధి ముందుకు సాగుతుంది. గత ఏడాది గ్లాస్ గోలో నిర్వహించిన కాప్ 26 సమావేశంలో లైఫ్ కార్యక్రమాన్ని నేను ప్రతిపాదించాను. లైఫ్ అంటే పర్యావరణంకోసం జీవనశైలి. ఈ భారీ కార్యక్రమంకోసం చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. లైఫ్ ఉద్యమ తీర్మానమనేది ఈ రోజున సాకారమవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. రికార్డు స్థాయిలో మద్దతు పలుకుతున్నందుకు అందరికీ నా కతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మెరుగైన భూగోళంకోసం మనందరమూ వ్యక్తిగతంగాను, సమూహంగాను బాధ్యతలు నిర్వహించేలా మిషన్ లైఫ్ మనకు దిశానిర్దేశం చేస్తోంది. ఈ లైఫ్ కార్యక్రమం దార్శనికత ఏమంటే మన జీవన శైలి అనేది మన భూగోళంతో కలిసిపోయి వుంటుంది. భూగోళానికి ఎలాంటి హాని చేయదు. అలాంటి జీవన శైలిని అలవర్చుకున్నవారిని భూగోళ హిత ప్రజలుగా పిలవడం జరుగుతుంది. లైఫ్ ఉద్యమం అనేది గతాన్నించి అవగాహన పెంచుకొని, వర్తమానంలో పని చేస్తూ, భవిష్యత్తుపై దృష్టి పెడుతుంది.
స్నేహితులారా,
ఈ భూగోళానికి సుదీర్ఘ జీవితం వుండడం వెనకగల రహస్యం ఏదంటే మన పూర్వీకులు ప్రకృతితో కలిసిపోయి జీవించారు. సంప్రదాయల గురించి ప్రస్తావించినప్పుడు దాదాపుగా ప్రపంచమంతా గల సంప్రదాయాలను పరి కిస్తే పర్యావరణ సమస్యలకు సులభతరమైన, సుస్థిరమైన పరిష్కారాలను అవి చూపాయి.
ఘనా దేశంలో సంప్రదాయ విధానాలను ఉపయోగించి తాబేళ్లను సంరక్షిస్తున్నారు. టాంజానియాలోని సెరెంగేటి ప్రాంతంలో ఏనుగులను, పొదరకం కొమ్ము జింకలను పవిత్రంగా భావిస్తారు.
దాంతో అక్రమంగా వేటాడేవారు వాటి జోలికి పోవడం లేదు. ఇథియోపియా దేశంలో ఒక్ పగా, ఒగ్రికి చెట్లను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. జపాన్ దేశంలో ప్లాస్టిక్ కు సుస్థిరమైన ప్రత్యామ్నాయంగా ఫరోషికిని వాడతారు. స్వీడన్ దేశానికి చెందిన లాగమ్ తాత్వికత అనేది సమతుల జీవనాన్ని ప్రోత్సహిస్తుంది. మన భారతదేశంలో ప్రకృతిని దైవంతో సమానంగా భావిస్తాము. మన దేవుళ్లు దేవతలెందరికో వృక్షాలు, జంతువులతో అవినాభావ సంబంధముంది. నేను ఇక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. ఇలాంటి విధానాలు అనేకం వున్నాయి. పొదుపుగా వినియోగించడం, పునర్ వినియోగించడం, రీ సైకిల్ చేయడమనే భావనలు మన జీవితంలో భాగంగా వున్నాయి. మన సంస్కృతిలో, జీవనశైలిలో చక్రీయ ఆర్థిక వ్యవస్థ అనేది నిబిడీకృతమై వుంది.
స్నేహితులారా,
దేశంలోని 1.3 బిలియన్ భారతీయులకు అభినందనలు. ఎందుకంటే వారు దేశంలో పర్యావరణంకోసం ఎన్నెన్నో మంచి పనులు చేయగలుగుతున్నారు. మన అటవీ ప్రాంతం విస్తరించింది. ఇక అటవీ జంతువులైన సింహాలు, పులులు, చిరుతలు, ఏనుగులు, నీటి ఏనుగులు మొదలైన వాటి జనాభా పెరుగుతోంది. మనం తయారు చేసుకుంటున్న విద్యుత్తులో శిలాజేతర ఇంధన వనరుల ఆధారంగా తయారయ్యే విద్యుత్తును 40 శాతానికి తీసుకుపోవాలనే లక్ష్యాన్ని చేరుకున్నాం. ఈ పనిని 9 సంవత్సరాలకంటే ముందే అంటే షెడ్యూల్ కంటే చాలా ముందే చేయగలిగాం. గత కొన్ని సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 370 మిలియన్ లెడ్ బల్బులను పంపిణీ చేయడం జరిగింది. దీని వల్ల ప్రతి ఏడాది 50 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేయడం జరుగుతోంది. పెట్రోల్ లో 10 శాతం ఎథనాల్ కలపాలనే లక్ష్యాన్నినవంబర్ 2022 కంటే ముందు అంటే 5 నెలలముందే సాధించగలిగాం.
ఇది మనం సాధించిన ప్రధానమైన విజయం. ఎందుకంటే 2013-14 లో ఈ కలపడమనేది 1.5 శాతమే వుండేది. 2019-20 నాటికల్లా ఇది ఐదు శాతానికి చేరుకుంది. ఇది భారతదేశ ఇంధన భద్రతను పెంచింది. ముడి చమురు దిగుమతుల వ్యయంలో 5.5 బిలియన్ డాలర్లు ఆదా అయ్యాయి. అంతే కాదు ఈ పని చేయడంవల్ల 2.7 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను లేకుండా చేయగలిగాం. అంతే కాదు రైతుల ఆదాయాలు 5.5 బిలియన్ డాలర్ల మేరకు పెరిగాయి. పునర్ ఉత్పత్తి విద్యుత్ అనేది ప్రజాదరణ పొందుతోంది. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంపై మన ప్రభుత్వం భారీ స్థాయిలో కృషి చేస్తోంది.
స్నేహితులారా,
ఆవిష్కరణలు, పారదర్శకత అనేవి మనకు మార్గం చూపిస్తాయి. ప్రతి స్థాయిలోను సుస్థిరమైన అభివృద్ధిని ఆకాంక్షించే ఆవిష్కర్తలను ప్రోత్సహిద్దాం. దీన్ని సాధించడానికిగాను సాంకేతికత అనేది భారీగా సాయం చేస్తుంది. సంప్రదాయం, సాంకేతికత కలిసి ప్రయాణం చేస్తే లైఫ్ ఉద్యమ దార్శనికత అనేది మరింత ముందడుగు వేస్తుంది. విద్యావేత్తలను, పరిశోధకులను, ఉత్సాహంగా పని చేస్తున్న స్టార్టప్ కంపెనీలను ప్రత్యేకంగా కోరుతున్నా మీరు దీని గురించి ఆలోచించండి. ఇలాంటి కీలక సమయంలో మీలో వున్న యువశక్తినే ఈ ప్రపంచం కోరుకుంటున్నది. మన ఉత్తమ విధానాలను ఇతరులతో పంచుకోవడానికి మనం సిద్ధంగా వుండాలి. అదే సమయంలో ఇతరుల విజయవంతమైన విధానాలనుంచి నేర్చుకోవాలి.
చాలా కాలం క్రితమే మహాత్మాగాంధీ జీరో కార్బన్ జీవన విధానం గురించి మాట్లాడారు. నేడు మనం మన దినసరి జీవన అవకాశాల్లో ఉత్తమమైన సుస్థిర అవకాశాలను ఎన్నుకుందాం. అంతే కాదు పునర్ వినియోగం, పొదుపుగా వినియోగం, రీ సైకిల్ అనే సూత్రాలను అనుసరిద్దాం. మనకున్నది ఒకే భూగోళం. మనం చేపట్టే ప్రయత్నాలు మాత్రం అనేకంగా వుండాలి. ఒకే భూమి, పలు ప్రయత్నాలు.
స్నేహితులారా,
మెరుగైన పర్యావరణాన్ని ప్రపంచ ఆరోగ్యాన్ని సాధించడానికిగాను చేసే ప్రతి ప్రయత్నంలో సహకారం అందించడానికిగాను భారతదేశం సదా సిద్దంగా వుంది. మా విజయాలే మా గురించి మాట్లాడతాయి. యోగాకు మరింత ప్రజాదరణ వచ్చేలా చేయడంలో భారతదేశం ముందంజ వేయడంపట్ల మేం గర్వపడుతున్నాం. అంతర్జాతీయ సౌర వేదిక, ఒక సూర్యుడు -ఒక ప్రపంచం- ఒకే గ్రిడ్, ప్రకతి విపత్తులను తట్టుకొని నిలిచే మౌలిక సదుపాయాల కల్పన లాంటి కార్యక్రమాలు భారతదేశం తరఫునుంచి చేసిన కీలక మైన ప్రయత్నాలకు నిదర్శనం. మేం చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచం మద్దతు పలకడం సంతోషంగా వుంది. లైఫ్ ఉద్యమం మనల్ని మరింతగా ఏకం చేస్తుందని నేను భావిస్తున్నాను. ఇది రాబోయే తరాలకు భద్రమైన భవిష్యత్తును అందిస్తుంది. ఈ ప్రయాణంలో భాగం కావాలని మరోసారి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మనందరమూ కలిసి ఐకమత్యంగా నిలిచి ఈ భూగోళాన్ని మెరుగ్గా చేద్దాం. అందరమూ కలిసి పని చేద్దాం. కార్యాచరణ ప్రారంభించడానికి ఇది సరైన సమయం. లైఫ్ కోసం పని చేయడమంటే పర్యావరణంకోసం జీవనశైలిని మార్చుకోవడం.
అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను..