Quoteఇది ఉత్తరాఖండ్ దశాబ్దం: ప్రధానమంత్రి
Quoteసుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో మొదటి స్థానంలో ఉత్తరాఖండ్: ప్రధానమంత్రి
Quoteసులభతర వాణిజ్య విభాగంలో విజేతగా, అంకుర సంస్థల విభాగంలో నాయకత్వ స్థానంలో ఉత్తరాఖండ్ నిలిచింది: ప్రధాని
Quoteబహుముఖాభివృద్ధి కోసం రాష్ట్రానికి ఇపుడు కేంద్ర సాయం రెట్టింపైంది: ప్రధాని
Quoteరాష్ట్రంలో ఇప్పటికే రూ. 2 లక్షల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిన కేంద్రం - శరవేగంగా పూర్తి అవుతున్న అనుసంధాన ప్రాజెక్టులు: ప్రధానమంత్రి
Quote‘వైబ్రంట్ విలేజ్’ పథకం ద్వారా సరిహద్దు గ్రామాలను దేశానికి ‘తొలి గ్రామాలు’గా భావిస్తున్న ప్రభుత్వం: ప్రధానమంత్రి
Quoteఉత్తరాఖండ్ అమలు చేసిన ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది: ప్రధానమంత్రి
Quoteరాష్ట్ర అభివృద్ధి కోసం, అస్తిత్వాన్ని మరింత బలంగా చాటడం కోసం 9 అభ్యర్థనలు చేస్తున్నాను - వాటిలో 5 ఉత్తరాఖండ్ ప్రజల కోసం, మరో 4 యాత్రికులు, పర్యాటకుల కోసం: ప్రధానమంత్రి

నేటి నుంచి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం మొదలవుతుంది. అంటే ఉత్తరాఖండ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రానికి ఉజ్వలమైన, జాజ్వల్యమానమైన భవిష్యత్తును నిర్మించే దిశగా అంకితభావంతో మనముందున్న వచ్చే 25 సంవత్సరాల ప్రస్థానాన్ని మనం ప్రారంభించాలి. యాదృచ్ఛికమే అయినా, సంతోషకరమైన విషయమొకటి ఇందులో ఉంది: జాతీయవృద్ధి కోసం అంకితం చేసిన 25 ఏళ్ల విశేష సమయమైన భారత అమృత్ కాల్, మనం సాధించబోయే ఈ పురోగతి ఏకకాలంలో తటస్థించబోతున్నాయి. అభివృద్ధి చెందిన భారత్‌లో అభివృద్ధి చెందిన ఉత్తరాఖండ్ భావనను ఈ కలయిక దృఢపరుస్తుంది. ఈ కాలంలో మనందరి ఆకాంక్షలు నెరవేరతాయి. ఉత్తరాఖండ్ ప్రజలు రానున్న 25 ఏళ్ల లక్ష్యాలపై దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా ఉత్తరాఖండ్ ఘనతను చాటడంతోపాటు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనే భావన రాష్ట్ర ప్రజలందరిలో ప్రతిధ్వనిస్తుంది. దృఢ సంకల్పాన్ని స్వీకరించిన ఈ ముఖ్య సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రెండు రోజుల కిందటే ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్ విజయవంతంగా నిర్వహించారు. మన ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో గణనీయమైన పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

ఉత్తరాఖండ్ ప్రజలు తమ ఆశలు, ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘంగా పోరాడవలసి వచ్చింది. గౌరవనీయులైన అటల్ గారి నాయకత్వంలో, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ పోరాటం విజయవంతమైంది. ఉత్తరాఖండ్ ఏర్పాటు స్వప్నం క్రమంగా సాకారం కావడం నాలో సంతోషాన్ని నింపింది. దేవభూమి ఉత్తరాఖండ్ మా అందరిపైనా, బీజేపీ పైనా ఎల్లప్పుడూ అపారమైన ప్రేమ, ఆప్యాయతలను కురిపించింది. ప్రతిగా... ఉత్తరాఖండ్ నిరంతర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఈ దేవభూమి సేవలో మా అంకిత భావమే మమ్మల్ని నడిపిస్తుంది.

మిత్రులారా,

కొన్ని రోజుల కిందట కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు మూసేశారు. కొన్నేళ్ల కిందట బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న అనంతరం ఆయన పాదాల చెంత కూర్చుని.. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దే అని నేను నమ్మకంగా ప్రకటించాను. నా నమ్మకానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో పరిస్థితులున్నాయి. కొన్నేళ్లలో నా నమ్మకం సరైందే అని నిరూపితమైంది. అభివృద్ధిలో నేడు ఉత్తరాఖండ్ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. గతేడాది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌)లో ‘విజేత’గా, అంకుర సంస్థల విభాగంలో ‘లీడర్’గా గుర్తింపు పొందింది. గత ఏడాదిన్నరలో.. ఉత్తరాఖండ్ అభివృద్ధి రేటు 1.25 రెట్ల కన్నా ఎక్కువ పెరిగింది. జీఎస్టీ వసూళ్లు 14 శాతానికి పైగా పెరిగాయి. ఏటా దాదాపు రూ. 1.25 లక్షలుగా ఉన్న ఉత్తరాఖండ్ తలసరి ఆదాయం ప్రస్తుతం రూ. 2.60 లక్షలకు పెరిగింది. అదేవిధంగా, 2014లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) దాదాపు రూ. 1.5 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడది దాదాపు రూ. 3.5 లక్షల కోట్లకు పెరిగి రెండింతలైంది. ఉత్తరాఖండ్ యువతకు కొత్త అవకాశాల కల్పన, పారిశ్రామిక వృద్ధిలో రాష్ట్ర పురోగతిని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి.

 

|

ప్రభుత్వ చర్యల ద్వారా ఉత్తరాఖండ్ ప్రజలకు, ముఖ్యంగా మా తల్లులు, సోదరీమణులు, బిడ్డలకు జీవన సౌలభ్యం కలిగింది. 2014లో 5 శాతం కుటుంబాలకే కుళాయి నీరు అందగా, అదిప్పుడు 96 శాతానికి పెరిగింది. త్వరలోనే అన్ని కుటుంబాలకూ ఈ సదుపాయాన్ని అందించబోతున్నాం. అదేవిధంగా, 2014కు ముందు రాష్ట్రంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద కేవలం 6,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను మాత్రమే నిర్మించారు. ఇప్పుడు, ఈ రోడ్ల మొత్తం పొడవు 20,000 కిలోమీటర్లకు చేరింది. పర్వతాలలో రహదారులను నిర్మించడంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో, ఆ రహదారులు ఎంత ఆవశ్యకమో నాకు బాగా తెలుసు. వేలాదిగా టాయిలెట్లను నిర్మించడం ద్వారా, ఇంటింటికీ విద్యుత్ ను సరఫరా చేయడం ద్వారా, ఉజ్వల పథకం కింద అనేక కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించడం ద్వారా, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచితంగా వైద్యచికిత్సలు అందించడం ద్వారా మా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకూ తోడుగా నిలుస్తోంది.

మిత్రులారా,

డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయోజనాలను ఉత్తరాఖండ్‌లో మనం స్పష్టంగా చూడవచ్చు. కేంద్రం నుంచి ఉత్తరాఖండ్‌కు అందుతున్న ఆర్థిక సాయం దాదాపు రెట్టింపైంది. రాష్ట్రానికి ఎయిమ్స్, ఏఐఐఎంఎస్ ఉపగ్రహ కేంద్రం మంజూరైంది. ఈ సమయంలోనే, డెహ్రాడూన్ లో దేశంలో మొదటి డ్రోన్ ప్రయోగ పరిశోధనా కేంద్రం ఏర్పాటైంది. ఉధమ్‌సింగ్‌ నగర్‌లో చిన్న పరిశ్రమల టౌన్‌షిప్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నేడు ఉత్తరాఖండ్ వ్యాప్తంగా దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. అనుసంధానతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు 2026 నాటికి పూర్తికావచ్చు. ఉత్తరాఖండ్‌లోని 11 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. డెహ్రాడూన్-ఢిల్లీ ఎక్స్ ప్రెస్ మార్గం పూర్తయితే ఆ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండున్నర గంటలు మాత్రమే పడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి భారీ కృషి జరుగుతోంది. ఈ దేవభూమి వైభవాన్ని పెంపొందించడంతోపాటు పర్వత ప్రాంతాల నుంచి వలసలను గణనీయంగా తగ్గించడంలో ఈ చర్యలు దోహదపడతాయి.

మిత్రులారా,

అభివృద్ధిలో ముందుకు సాగుతూనే వారసత్వ సంపదను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేవభూమి సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ కేదార్‌నాథ్ ధామ్ ను అద్భుతంగా, దివ్యంగా పునర్నిర్మిస్తున్నాం. బదరీనాథ్ ధామ్ లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మానస్ ఖండ్ మందిర్ మాల మిషన్ మొదటి దశలో 16 ప్రాచీన ఆలయ ప్రాంతాలను పునరుద్ధరించారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అనువుగా ఉండేలా రూపొందించిన రహదారులు చార్ ధామ్ యాత్రను మరింత సులభతరం చేశాయి. పర్వతమాల ప్రాజెక్ట్ కింద ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను రోప్‌వేలు అనుసంధానం చేస్తున్నాయి. మనా గ్రామాన్ని సందర్శించిన విషయం నాకు గుర్తుంది. అక్కడ సరిహద్దులో మా సోదరీ సోదరుల అమితమైన ప్రేమాభిమానాలు నాకు దక్కాయి. ఆ గ్రామం నుంచే ‘వైబ్రంట్ విలేజ్’ పథకాన్ని ప్రారంభించాం. సరిహద్దు గ్రామాలను శివారు ప్రాంతాలుగా కాకుండా, దేశానికి తొలి గ్రామాలుగా ప్రభుత్వం భావిస్తోంది. నేడు ఉత్తరాఖండ్‌లోని దాదాపు 50 గ్రామాల్లో ఈ కార్యక్రమం కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ చర్యల ద్వారా ఉత్తరాఖండ్‌లో పర్యాటక అవకాశాలు ఊపందుకున్నాయి. పర్యాటకం అభివృద్ధి చెందడం ద్వారా, రాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది దాదాపు 6 కోట్ల మంది పర్యాటకులు, యాత్రికులు ఉత్తరాఖండ్‌ను సందర్శించినట్లు కొన్ని వారాల కిందట ఓ నివేదిక పేర్కొన్నది. 2014కు ముందు చార్ ధామ్ యాత్రికుల సంఖ్య 24 లక్షలు. గతేడాది 54 లక్షల మందికి పైగా యాత్రికులు చార్ ధామ్ యాత్ర చేపట్టారు. హోటళ్లు, వసతిగృహాల నుంచి టాక్సీ డ్రైవర్లు, వస్త్ర వ్యాపారుల వరకూ అందరికీ ఇది లబ్ది చేకూర్చింది. కొన్నేళ్లలో 5,000కు పైగా వసతి గృహాలు (హోమ్ స్టేలు)  నమోదయ్యాయి.

 

|

మిత్రులారా, 

నేడు ఉత్తరాఖండ్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసింది. దానిని నేను లౌకిక పౌరస్మృతిగా సూచిస్తున్నాను. దేశం మొత్తం ఇప్పుడు దానిపై చర్చిస్తూ, దాని ప్రాధాన్యానన్ని గుర్తిస్తోంది. రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడడం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం చీటింగ్ నిరోధక చట్టాన్ని కూడా ఆమోదించింది. చీటింగ్ మాఫియాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం నియామకాలు పూర్తి పారదర్శకతతో సకాలంలో జరుగుతున్నాయి. ఈ రంగాల్లో ఉత్తరాఖండ్ సాధించిన విజయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

మిత్రులారా, 

ఈ రోజు నవంబర్ 9వ తేదీ. శక్తికి ప్రతీక తొమ్మిది. ఈ శుభదినాన నేను 9 అభ్యర్థనలు చేయాలనుకుంటున్నాను – అయిదు ఉత్తరాఖండ్ ప్రజలకు, మిగతా నాలుగు అభ్యర్థనలు పర్యాటకులు, యాత్రికులకు.

మిత్రులారా,

ఉత్తరాఖండ్ మాండలికాలు, ఘర్వాలీ, కుమవోని, జౌన్సారి వంటివి సుసంపన్నమైనవి. వాటిని కాపాడుకోవడం అత్యావశ్యకం. ఉత్తరాఖండ్ ప్రజలు రాష్ట్ర సాంస్కృతిక అస్తిత్వాన్ని కొనసాగించడానికి భవిష్యత్ తరాలకు ఈ మాండలికాలను నేర్పించాలన్నది నా మొదటి అభ్యర్థన. ప్రకృతి, పర్యావరణాలను అమితంగా గౌరవించడం ఉత్తరాఖండ్ ప్రత్యేకత. ఇది గౌరా దేవీ నిలయం. ఇక్కడ ప్రతి స్త్రీ... నంద మాతకు ప్రతిరూపం. ప్రకృతిని కాపాడుకోవడం కీలకం. కాబట్టి, తల్లి పేరిట మొక్కలు నాటే ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమానికి సహకరించాలన్నది నా రెండో అభ్యర్థన. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఉత్తరాఖండ్ క్రియాశీల భాగస్వామ్యం వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో దోహదపడుతుంది. ‘నౌల్ ధార’ను పూజించే సంప్రదాయాన్ని తప్పక పాటించాలి. మీరంతా నదులను, జలవనరులను సంరక్షించాలని, నీటి స్వచ్ఛత కోసం చేపట్టే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలన్నది నా మూడో అభ్యర్థన. మీ గ్రామాలను తరచుగా, ప్రత్యేకించి ఉద్యోగ విరమణ అనంతరం సందర్శిస్తూ మూలాలతో అనుసంధానం కావాలన్నది నా నాలుగో అభ్యర్థన. తద్వారా  అనుబంధం బలోపేతమవుతుంది. తివారీ గృహాలుగా పిలిచే పాత గ్రామీణ గృహాలను సంరక్షించాలన్నది నా అయిదో అభ్యర్థన. వాటిని వదిలిపెట్టే బదులు వసతి గృహాలు (హోమ్ స్టే)గా మార్చి ఆదాయం సమకూర్చుకోండి.

మిత్రులారా,

ఉత్తరాఖండ్‌లో పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులు వస్తున్నారు. పర్యాటకులకు నేను నాలుగు అభ్యర్థనలు చేస్తున్నాను. మొదటిది, మీరు పవిత్రమైన హిమాలయాలను సందర్శించే సమయంలో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకండి. రెండోది, ‘స్థానికత (వోకల్ ఫర్ లోకల్)’ అన్న నినాదాన్ని మంత్రప్రదంగా భావించి ప్రయాణం కోసం మీరు కేటాయించిన బడ్జెట్ లో కనీసం 5 శాతాన్ని స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులపై ఖర్చు చేయండి. మూడోది, భద్రత అత్యంత ప్రధానమైనది కాబట్టి, పర్వత ప్రాంతాల్లో ట్రాఫిక్ నియమాలకు కట్టుబడి ఉండండి. నాలుగోది, సందర్శనకు ముందే ఆధ్యాత్మిక ప్రదేశాల ఆచారాలు, నియమాలను తెలుసుకుని ఆ నియమాలను పాటించండి. ఈ విషయంలో ఉత్తరాఖండ్ ప్రజలు మీకు సంతోషంగా సహకరిస్తారు. ఉత్తరాఖండ్ ప్రజలకు చేసిన అయిదు అభ్యర్థనలు, సందర్శకులకు చేసిన నాలుగు అభ్యర్థనలు ఈ దేవభూమి అస్తిత్వాన్ని గణనీయంగా బలోపేతం చేయడంతోపాటు దాని అభివృద్ధికి దోహదం చేస్తాయి.

మిత్రులారా, 

మనం ఉత్తరాఖండ్‌ను వేగిరం.. ప్రగతి పథంలో ముందుకు నడిపించాలి. దేశ లక్ష్యాలను సాధించడంలో మన ఉత్తరాఖండ్ పోషిస్తున్న కీలకపాత్రను కొనసాగిస్తుందన్న విశ్వాసం నాకుంది. ఉత్తరాఖండ్ ఆవిర్భావ రజతోత్సవ సందర్భంగా అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబా కేదార్ మీ అందరికీ శ్రేయస్సును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. 

 

  • Jitendra Kumar March 15, 2025

    🙏
  • rastriyaparvashi akhil mother lok Sanskriti bharti bjp jansang chalak bjp March 06, 2025

    आदरणीय पीएम मोदी जी को विजय दिवस कि पावन अवसर पर शुभकामनाएं भव उतराखड के श्री धामी सीएम वरिष नेताओ को हादिक शुभकामनाएं शुभकामनाएं @सेन बाला राष्ट्रीय प्रवासी अखिल भारतीय मदर लोकतंत्र भारतीय संस्कृति भारती अधिवेशन हरियाणा जनजाति छतिस बिरदरीगौरव शुभकामनाएं
  • Adv Girjesh Kumar Kushwaha Raisen 8878019580 vidisha loksabha March 05, 2025

    जय भारत जय भाजपा
  • Adv Girjesh Kumar Kushwaha Raisen 8878019580 vidisha loksabha March 05, 2025

    जय हिंद जय भारत
  • Rajni Gupta March 05, 2025

    जय श्री राम!🙏💐
  • Dheeraj Thakur January 31, 2025

    जय श्री राम।
  • Dheeraj Thakur January 31, 2025

    जय श्री राम
  • Mahesh Kulkarni January 10, 2025

    ओम नमः शिवाय
  • Vivek Kumar Gupta December 30, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta December 30, 2024

    नमो ..............................🙏🙏🙏🙏🙏
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How PMJDY has changed banking in India

Media Coverage

How PMJDY has changed banking in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 మార్చి 2025
March 25, 2025

Citizens Appreciate PM Modi's Vision : Economy, Tech, and Tradition Thrive