మిత్రులారా, నమస్కారం.
సుదీర్ఘ విరామం తరువాత ఈ రోజున మీతో భేటీ అవుతున్నాను. మీరంతా బాగున్నారనుకుంటాను. మీ కుటుంబంలో ఎలాంటి కష్టం లేదని తలుస్తాను. మంచిది, ఆ ఈశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.
ప్రత్యేక పరిస్థితుల లో ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి. ఒక వైపు కరోనా మహమ్మారి ఉంటే, మరో వైపు మనం మన కర్తవ్యాన్ని నెరవేర్చవలసి ఉంది; పార్లమెంటు సభ్యులందరూ కర్తవ్య నిర్వహణ బాటనే ఎంచుకున్నారు. ఈ చొరవ కు గాను ఎంపీలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి నా ధన్యవాదాలు.
బడ్జెట్ సమావేశాల ను నిర్ణీత సమయాని కన్నా ముందే ముగించవలసి వచ్చింది. ఈ సారి పార్లమెంటు రోజు కు రెండు సార్లు పని చేస్తుంది. ఒకసారి రాజ్య సభ, మరొకసారి లోక్ సభ కార్యకలాపాల ను నిర్వహిస్తాయి. షిఫ్ట్ వేళల ను కూడా మార్చవలసి వచ్చింది. శని, ఆది వారాల లో ఇచ్చే వారాంతపు విరామాలను సైతం ఈ సారి రద్దు చేయడం జరిగింది. అయితే సభ్యులు దీనిని ఆమోదించి, స్వాగతించారు. వారు కర్తవ్య నిర్వహణ పథంలో ముందుకు సాగాలనే నిర్ణయించుకున్నారు.
ఈ సమావేశాల లో అనేక ముఖ్యమైన నిర్ణయాల ను తీసుకోవడం తో పాటు, వివిధ అంశాల ను చర్చించడం జరుగుతుంది. లోక్ సభ లో మనం ఎంత ఎక్కువగా చర్చలను చేపడితే, సభ లో అంత వైవిధ్యభరితమైన, క్షుణ్నమైన చర్చలు చోటుచేసుకొంటాయి; దీనితో చేపట్టిన అంశాల ను పరిష్కరించడమే కాకుండా, దేశాని కి కూడా మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని మన అనుభవం చెబుతోంది.
ఈ సారి కూడా ఆ ఘనమైన సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఎంపీలందరూ కలసికట్టుగా ముందుకు వచ్చి, ఈ సమావేశాలకు విలువ ను జోడిస్తారని నేను నమ్ముతున్నాను. కరోనా తో తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో, మనం నియమాల ను పాటిస్తూ, ఎన్నో ముందు జాగ్రత్తల ను తీసుకుంటూ ముందుకు సాగాలి. మందు రానంతవరకు మన వైఖరి లో ఎలాంటి లోటు ను మనం రానీయబోమన్నది కూడా స్పష్టం. సాధ్యమైనంత త్వరలో ప్రపంచం లో ఏదో ఒక ప్రాంతం లో టీకా మందు వస్తుందని మనమంతా ఆశిస్తున్నాం. సాధ్యమైనంత త్వరలో మన శాస్త్రవేత్తలు ఈ దిశ లో విజయాన్ని సాధిస్తారని, ప్రతి ఒక్కరినీ ఈ సంక్షోభం లో నుంచి బయటకు తీసుకురావడంలో మనం సఫలం అవుతామన్న ఆశ ఉంది.
ఈ సభకు, మరీ ముఖ్యంగా ఈ సమావేశాలకు, మరొక కీలక బాధ్యత కూడా ఉంది. ప్రస్తుతం మన సైన్యంలోని పరాక్రమవంతులైన జవానులు దేశ సరిహద్దుల్లో మోహరించి ఉన్నారు. వారు దుర్గమ కొండ ప్రాంతాల్లో గొప్ప ధైర్య, సాహసాలతో సరిహద్దులను కాపు కాస్తున్నారు. కొద్ది కాలం తర్వాత వర్షాలు కూడా మొదలవుతాయి. మాతృభూమి ని రక్షించాలనే విశ్వాసంతో, దృఢ దీక్షతో వారు అక్కడ జంకు లేకుండా నిలబడి ఉన్నారో, అదే విధంగా ఈ ఉభయ సభల సభ్యులు అందరు ముక్త కంఠంతో ఈ దేశం భారతీయ సైన్యానికి మద్దతుగా నిలుస్తుందన్న సంకల్పాన్ని సభాముఖంగా చాటిచెప్తూ ఒక సందేశాన్ని పంపించనున్నారు. యావత్తు సభ ఒకే స్వరం తో దేశ శూర సైనికుల వెన్నంటి నిలబడనుంది. ఈ సభ తో పాటు గౌరవ సభ్యులందరూ అత్యంత బలమైన సందేశాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను. కరోనా సమయం లో మనం ఇదివరకటి మాదిరిగా ప్రతి చోటా స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని చేజిక్కించుకోలేం, దయచేసి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి అంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్క సమాచారాన్నీ అందుకుంటారు; అది మీకు కష్టమైన పనేమీ కాదు. కానీ, దయచేసి మీరంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోండి. మీలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా నేను చేస్తున్న మనవి ఇది.
మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదాలు.