మాననీయులు.. నాకు మంచి మిత్రులైన మేక్రాన్,
గౌరవనీయులైన పబ్లిసిస్ గ్రూప్ చైర్మన్ మిస్టర్ మారిస్ లెవీ,
ప్రపంచం నలుమూలల నుంచి పాల్గొంటున్న ప్రతినిధులారా...
నమస్తే!
ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ‘వివాటెక్’ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ముందుగా నా అభినందనలు. ప్రాన్స్ సాంకేతిక దార్శనికతను ఈ వేదిక ప్రతిబింబిస్తుంది. అనేక విస్తృత శ్రేణి అంశాలపై భారత్-ఫ్రాన్స్ సన్నిహితంగా కృషి చేస్తున్నాయి. వీటిలో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ రంగాలకు సంబంధించి సహకారం ఆవిష్కృతమవుతోంది. ఈ సహకారం మరింత విస్తృతం కావడం నేటి తక్షణావసరం. ఇది మన దేశాలకు మాత్రమేగాక ప్రపంచం మొత్తానికీ సాయపడుతుంది. ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్ పోటీలను యువత పెద్దసంఖ్యలో చూసి ఉంటారు. ఈ టోర్నమెంటు నిర్వహణకు భారతదేశానికి చెందిన ‘ఇన్ఫోసిస్’ సంస్థ సాంకేతిక మద్దతునిచ్చింది. అదేవిధంగా భారతదేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ రూపకల్పన ప్రాజెక్టులో ఫ్రెంచి కంపెనీ ‘అటోస్’ భాగస్వామిగా ఉంది. ఇక ఫ్రాన్స్‌లోని ‘కేప్‌జెమినీ కావచ్చు... భారత్‌లోని ‘టీసీఎస్, విప్రో’ వంటి కంపెనీలు కావచ్చు... మా సమాచార సాంకేతిక మేధావుల బృందం ప్రపంచంలోని అనేక సంస్థలకు, పౌరులకు సేవలందిస్తోందన్నది వాస్తవం.
మిత్రులారా,
ఎక్కడ సంప్రదాయకత విఫలమవుతుందో అక్కడ ఆవిష్కరణ తోడ్పాటునిస్తుందన్నది నా విశ్వాసం. మన శకంలో అత్యంత విచ్ఛిన్నకర కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి విజృంభణ సమయంలో ఈ సత్యం ప్రస్ఫుటమైంది. అన్నిదేశాలూ అనేక కష్టనష్టాలకు లోనుకావడమేగాక భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. మన సంప్రదాయక విధానాలకు కోవిడ్-19 విషమ పరీక్ష పెట్టినప్పటికీ, ఆవిష్కరణలే మనను ఆదుకున్నాయి.
ఆవిష్కరణలంటే నా అంతరార్థం:
మహమ్మారికి ముందు ఆవిష్కరణలు...
మహమ్మారి సమయాన ఆవిష్కరణలు...
మహమ్మారి మునుపటి ఆవిష్కరణల గురించి మాట్లాడేముందు మనకు సహాయపడిన అప్పటి ఆధునిక సదుపాయాలను నేను ప్రస్తావిస్తాను. ఆనాటికి అందుబాటులోగల డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం మనం కుదుటపడటానికి, సంధానానికి, సౌకర్యానికి, ఊరటకు ఊతమిచ్చింది. మన పని కొనసాగించడమేగాక ఆత్మీయులతో మాట్లాడానికి, ఇతరులకు మనం సాయం చేయడానికి డిజిటల్ మాధ్యమాలు ఎంతగానో తోడ్పడ్డాయి. పేదలకు మేము సకాలంలో ఆర్థిక సహాయం అందించేలా భారతదేశపు సార్వత్రిక, విశిష్ట జీవాధారిత డిజిటల్ గుర్తింపు వ్యవస్థ- ‘ఆధార్’ ఎనలేని రీతిలో అక్కరకొచ్చింది. ఆ మేరకు మేము 800 మిలియన్ల జనాభాకు ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేశాం... అనేక కుటుంబాలకు రాయితీతో వంటగ్యాస్ సరఫరా చేశాం... అలాగే దేశంలోని విద్యార్థులకు తోడ్పాటుగా “స్వయం, దీక్ష” పేరిట రెండు ప్రభుత్వ డిజిటల్ విద్యా కార్యక్రమాలను నిర్వహించగలిగాం.
ఇక రెండో అంకంలో ఆవిష్కరణల విషయానికొస్తే- మానవాళి మొత్తం ఏకతాటిపైకి వచ్చి మహమ్మారిపై పోరును మరింత శక్తిమంతం చేసింది. ఈ సందర్భంగా మా అంకుర సంస్థల రంగం పాత్ర అత్యంత ప్రధానమైనది. ఈ మేరకు భారతదేశంలోని కొన్ని అంశాలను నేనిప్పుడు ఉదాహరిస్తాను... మహమ్మారి మా తీరాలను తాకినప్పుడు రోగ నిర్ధారణ పరీక్ష సదుపాయాలు, మాస్కులు, వ్యక్తిగత రక్షణ సామగ్రి, వెంటిలేటర్ల వంటి ఇతరత్రా పరికరాలకు కొరత ఉండేది. ఈ కొరతను తీర్చడంలో మా ప్రైవేటు రంగం కీలకపాత్ర పోషించింది. మా వైదులు దూరవాణి వైద్య సంప్రదింపుల సాంకేతికతను అందిపుచ్చుకుని, కోవిడ్ సహా కొన్ని కోవిడేతర కేసులనూ వాస్తవిక సాదృశ మార్గంలో పరిష్కరించగలిగారు. భారతదేశంలో రెండు టీకాలు రూపుదిద్దుకోగా, మరికొన్ని ప్రస్తుతం అభివృద్ధి, ప్రయోగదశల్లో ఉన్నాయి. ఇక ప్రభుత్వపరంగా వ్యాధి సోకినవారిని అన్వేషించడంలో మా దేశీయ సమాచార సాంకేతిక వేదిక ‘ఆరోగ్య సేతు’ సమర్థంగా తోడ్పడింది. అలాగే మా ‘కో-విన్” వేదిక ఇప్పటికే లక్షలాది ప్రజలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చి ఉండకపోతే కోవిడ్-19పైమన పోరాటం చాలా బలహీనపడి ఉండేది. కాబట్టి ఈ ఆవిష్కరణ ఉత్సాహాన్ని మనం వదులుకోరాదు... మరోసారి ఇలాంటి సవాలు దాపురిస్తే ఎదుర్కొనేందుకు మెరుగైన సంసిద్ధంగా ఉండగలగాలి.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్త సాంకేతిక, అంకుర సంస్థల రంగంలో భారతదేశం ముందంజ గురించి అందరికీ తెలిసిందే. ఆ మేరకు ప్రపంచంలోనే అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థకు నెలవుగా భారత్ ఆవిర్భవించింది. దేశంలో రూ.100 కోట్ల స్థాయి పెట్టుబడితో అనేక సంస్థలు ఇటీవలి సంవత్సరాల్లో ఆవిర్భవించాయి. తదనుగుణంగా ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు ఆకాంక్షించే సౌకర్యాలను భారత్ కల్పిస్తోంది. దేశంలోగల ప్రతిభ, విపణి, మూలధనం, పర్యావరణ వ్యవస్థ, సార్వజనీన సంస్కృతి అనేక ఐదు మూలస్తంభాల ప్రాతిపదికగల భారతదేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా నేను మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. భారతీయ సాంకేతిక ప్రతిభా నిధి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ప్రపంచాన్ని వేధిస్తున్న అనేక క్లిష్ట సమస్యలకు భారత యువ సాంకేతిక నిపుణులు పరిష్కారం అందించారు. నేడు భారతదేశంలో 118 కోట్ల మొబైల్ ఫోన్లతోపాటు 77.5 కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదారులు కూడా ఉన్నారు. అనేక దేశాల జనాభాకన్నా ఈ సంఖ్య చాలా అధికం. భారతదేశంలో డేటా వినియోగం ప్రపంచంలోనే అత్యంత చౌకైనది మాత్రమేగాక అత్యధికంగానూ ఉంటుంది. సామాజిక మాధ్యమాల వాడంకదారులలో అత్యధికులు భారతీయులే. కాబట్టి వైవిధ్యభరిత, విస్తృత విపణి భారతదేశంలో మీకు సిద్ధం.
మిత్రులారా,
అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా దేశంలో డిజిటల్ రంగ విస్తరణ ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన 5.23 లక్షల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ 1.56 లక్షల గ్రామాల పాలకమండళ్లను అనుసంధానించింది. రాబోయే రోజుల్లో అనేక గ్రామాలు దీని పరిధిలోకి రానున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా బహిరంగ వైఫై నెట్‌ర్కులు కూడా ఏర్పాటు కానున్నాయి. ఇదే తరహాలో ఆవిష్కరణల సంస్కృతిని పెంచిపోషించే దిశగానూ భారత్ చురుగ్గా అడుగులు వేస్తోంది. తదనుగుణంగా ‘అటల్ ఆవిష్కరణల కార్యక్రమం’ కింద దేశంలో నేడు 7,500 పాఠశాలల్లో అత్యాధునిక ఆవిష్కరణహిత ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. హ్యాకథాన్ వంటి పోటీలలో ప్రపంచంలోని ఇతర విద్యార్థులతోపాటు మా విద్యార్థులూ పాల్గొంటున్నారు.
మిత్రులారా,
గడచిన ఏడాది కాలం నుంచీ అనేక రంగాల్లో పెను విచ్ఛిన్నాన్ని మనం చూశాం... ఇది నేటికీ కొనసాగుతోంది. అయినప్పటికీ ఈ విచ్ఛిన్నం మనను నిరాశలో పడవేయరాదు. దానికి బదులుగా “మరమ్మతు, సంసిద్ధత” అనే జంట లక్ష్యాలపై మనం నిశితంగా దృష్టి సారించాలి. నిరుడు ఈ సమయానికి ప్రపంచమంతా టీకాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో నేడు మన చేతిలో ఒకటిరెండు ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలతోపాటు మన ఆర్థిక వ్యవస్థలను బాగుచేసుకునే కృషిని మనం కొనసాగించాలి. ఈ దిశగా ఖనిజాన్వేషణ, అంతరిక్షం, బ్యాంకింగ్, అణుశక్తి వంటి అనేక రంగాల్లో భారత్ భారీ సంస్కరణలు తెచ్చింది. దీన్నిబట్టి భారత్ ఎంతటి అనుకూల దేశమో స్పష్టమవుతోంది. అలాగే మహమ్మారి పరిస్థితుల నడుమ కూడా ఎంత అప్రమత్తంగా ఉన్నదీ తేటతెల్లమవుతోంది. ఆ మేరకు ‘సంసిద్ధత’ అని నేను చెబుతున్న మాటకు అర్థం: రాబోయే మహమ్మారుల నుంచి మన భూగోళానికి రక్షణ కవచం రూపొందించడమే... అంతేగాక సుస్థిర జీవనశైలిపై దృష్టి పెట్టడం, జీవావరణ క్షీణతను అరికట్టడం కూడా ఇందులో భాగంగా ఉండాలి. అదే సమయంలో పరిశోధనలు, ఆవిష్కరణలలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
మిత్రులారా,
భూగోళం ఎదుర్కొనబోయే సవాళ్లను సమష్టి స్ఫూర్తితో, మానవాళి కేంద్రక విధానాలతో మాత్రమే అధిగమించగలం. ఈ దిశగా నేతృత్వం వహించాల్సిందిగా అంకుర సంస్థల సమాజానికి నేను పిలుపునిస్తున్నాను. అంకుర సంస్థల రంగంలో యువతరానిదే ఆధిపత్యం. వీరిపై గతానుభవాల భారమేదీ లేదు... కాబట్టి అంతర్జాతీయ పరివర్తనాత్మకతకు వారే నాయకులు కాగలరు. తదనుగుణంగా మన అంకుర సంస్థలు ఆరోగ్య, పర్యావరణ హిత సాంకేతికతలవైపు పరిశోధనలు సాగించాలి. ఇందులో భాగంగా వ్యర్థాల పునరుపయోగం, వ్యవసాయం, నవతరం అభ్యసన ఉపకరణాలు వంటివాటిపై ప్రధానంగా శ్రద్ధపెట్టాలి.
మిత్రులారా,
ఒక సార్వజనీన సమాజంగా/ఆర్థిక వ్యవస్థగా, అంతర్జాతీయ క్రమానికి కట్టుబడిన దేశంగా భారతదేశానికి భాగస్వామ్యాలు ఎంతో ముఖ్యం. మా కీలక భాగస్వాములలో ఫ్రాన్స్, ఐరోపా దేశాలు ప్రముఖమైనవి. అధ్యక్షులు మేక్రాన్‌సహా పోర్టోలో మే నెలలో జరిగిన ఐరోపా సమాఖ్య నాయకులతో నా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా- అంకుర సంస్థల నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకూ డిజిటల్ భాగస్వామ్యం ప్రధానంగానే మా చర్చలు సాగాయి. నవ్య సాంకేతికతలో ముందంజ వేయడం ఆర్థిక శక్తికి, ఉద్యోగ/ఉపాధికి, సౌభాగ్యానికి చోదకం కాగలదని చరిత్ర రుజువు చేసింది. కానీ, మన భాగస్వామ్యాలు మానవాళి సేవలో మరింత ప్రయోజనకర అంశాలకు విస్తరించాలి. ఈ మహమ్మారి మన సహనశక్తికి మాత్రమే కాకుండా ఊహాశక్తికీ పరీక్ష పెట్టింది. ఆ మేరకు అందరికీ మరింత సార్వజనీన/రక్షణాత్మక సుస్థిర భవిష్యత్తును నిర్మించేందుకు ఇదే మంచి తరుణం. అటువంటి ఉజ్వల భవిష్యత్తు సాధన దిశగా శాస్త్రవిజ్ఞానం, ఆవిష్కరణలకుగల అవకాశాలపై అధ్యక్షులు మేక్రాన్ తరహాలోనే నాకూ ఎనలేని విశ్వాసం ఉంది.
కృతజ్ఞతలు!