చెస్ ఒలింపియాడ్ విజేత: సర్, భారతదేశం రెండు బంగారు పతకాలు గెలవడం ఇదే మొదటిసారి. జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. బాలురు 22 పాయింట్లకు 21 పాయింట్లు, బాలికలు 22 పాయింట్లకు 19 పాయింట్లు సాధించారు. మొత్తం 44 పాయింట్లకు 40 పాయింట్లు సాధించాం. ఇంత భారీ, ఆకట్టుకునే ప్రదర్శన ఇంతకు ముందెన్నడూ జరగలేదు.

ప్రధానమంత్రి: అక్కడ వాతావరణం ఎలా ఉంది?

చెస్ ఒలింపియాడ్ విజేత: మొదటిసారి గెలిచినందున, చాలా సంతోషంగా వేడుక జరుపుకున్నాం. అందరూ ఆనందంతో మాతో కలిశారు. వాస్తవానికి, మా ప్రత్యర్థులు కూడా వచ్చి మాకు అభినందనలు చెప్పారు. మా సంతోషంలో పాలుపంచుకున్నారు. 

చెస్ ఒలింపియాడ్ విజేత: సర్, ఇటీవలి సంవత్సరాలలో చాలా మంది ప్రేక్షకులు మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారని మేం గమనించాం. వారు మ్యాచ్ చూడటానికి చాలా దూరం నుండి వచ్చారు. ఇలా ఇంతకు ముందు జరగలేదని నేను చెప్పగలను. చదరంగానికి పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనం. ప్రజల ఉత్సాహం, ప్రోత్సాహం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఉన్నా ప్రేక్షకుల మమ్మల్ని ఉత్తేజ పరచడం చాలా గొప్పగా అనిపించింది. మేం గెలిచినప్పుడు అందరూ 'ఇండియా, ఇండియా' అని నినదించారు.

చెస్ ఒలింపియాడ్ విజేత: ఈసారి 180 దేశాలు పాల్గొన్నాయి. చెన్నైలో ఒలింపియాడ్ జరిగినప్పుడు భారత పురుషుల, మహిళల జట్లు కాంస్య పతకాలు సాధించాయి. మహిళల జట్టు తరఫున చివరి మ్యాచ్ లో అమెరికాతో ఓడిపోయాం. బంగారు పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయాం. కానీ ఈసారి మళ్లీ వారితో పట్టుదలతో ఆడి భారత్ కు బంగారు పతకం సాధించాం. 

ప్రధాన మంత్రి: మీరు వారిని ఓడించాల్సిందే.

చెస్ ఒలింపియాడ్ విజేత: మ్యాచ్ పోటాపోటీగా జరిగి డ్రాగా ముగిసింది. కానీ మేం స్వర్ణం గెలిచాం. సర్, ఈసారి మన దేశానికి విజయం అందించాల్సిందేనని మేం గట్టిగా నిర్ణయించుకున్నాం. కేవలం ఆ ఒక్క ధృఢ సంకల్పంతోనే మన దేశం కోసం విజయంతో తిరిగి వచ్చాం. 

ప్రధాని: అవును. అలాంటి సంకల్పం ఉంటేనే విజయం లభిస్తుంది. కానీ 22కి 21, 22కి 19 మార్కులు వచ్చినప్పుడు ఇతర ఆటగాళ్లు, నిర్వాహకుల స్పందన ఎలా ఉంది?

చెస్ ఒలింపియాడ్ విజేత: సర్, గుకేష్ దానికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. నేను చెప్పదలిచింది ఏంటంటే, ముఖ్యంగా ఓపెన్ జట్టులో, మేం ఎంతో సునాయాసంగా గెలిచాం. ఎవ్వరూ మాకు దగ్గరగా కూడా రాలేరని అనిపించింది. మహిళల జట్టులో వరుసగా తొలి ఏడు మ్యాచ్ ల్లో విజయం సాధించి, ఆ తర్వాత చిన్న ఎదురుదెబ్బను ఎదుర్కొన్నప్పటికీ ధైర్యం చేసి పుంజుకున్నాం. కానీ ఓపెన్ జట్టు విషయానికొస్తే..సర్, మేం ఎంత పట్టు కలిగి ఉన్నామో చెప్పలేను. మనతో ఉన్న ఉన్న గుకేష్ దానిని బాగా వివరించగలడని నేను అనుకుంటున్నాను.

 

చెస్ ఒలింపియాడ్ విజేత: ఈ అనుభవం నిజంగా  జట్టు గొప్ప ప్రదర్శన. మాలో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాం . అత్యంత ఉత్తేజంతో కూడా ఉన్నాం. 2022 ఒలింపియాడ్‌లో, మేం స్వర్ణ పతకం గెలిచేందుకు చాలా దగ్గరగా వచ్చాం. కాని , నేను ఒక ఆట ఆడినప్పుడు స్వర్ణ పతకాన్ని సాధించగలనని అనిపించింది, కానీ దురదృష్టవశాత్తూ నేను ఆ ఆటలో ఓడిపోయాను. అది అందరికీ బాధాకరమైన విషయం. అందుకే ఈసారి ఎంతో  స్ఫూర్తిగా, మొదటి నుండి గెలవాలన్న పట్టుదలతో ఆడాం.  నిజంగా ఎంతో ఆనందంగా ఉంది!

ప్రధానమంత్రి: చెప్పండి, మీ ఆటను సరిదిద్దడానికి లేదా మీ ప్రత్యర్థి ఆటను అర్థం చేసుకోవడానికి కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ఉపయోగించడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

చెస్ ఒలింపియాడ్ విజేత: అవును సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చదరంగం అభివృద్ధి చెందింది. కొత్త సాంకేతికలు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్లు ఇప్పుడు చాలా బలంగా మారాయి. చదరంగంలో అనేక కొత్త ఆలోచనలను చూపిస్తున్నాయి. మేము దాని నుండి ఇంకా నేర్చుకుంటున్నాం. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని కూడా నేను అనుకుంటున్నాను.

చెస్ ఒలింపియాడ్ విజేత: సర్, నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు  కృత్రిమ మేథో సాధనాలు (ఏఐ టూల్స్) అందరికీ అందుబాటులోకి వచ్చాయి. మేం మా సన్నద్ధతలో వాటిని తప్పకుండా ఉపయోగిస్తాం.

ప్రధానమంత్రి: ఇంకా చెప్పండి.

చెస్ ఒలింపియాడ్ విజేత: పెద్దగా ఏమీ లేదు సార్, ఇది చాలా గొప్ప అనుభవం.

ప్రధానమంత్రి: ఏమీ లేదా ? మీరు దానివల్లే గెలిచారు. లేకుంటే స్వర్ణ పతకం సులభంగా వచ్చిందా?

చెస్ ఒలింపియాడ్ విజేత: లేదు సార్, అది అంత సులభం కాదు. మేం చాలా కష్టపడ్డాం. పురుషులతో సహా నా జట్టు సహచరులందరూ చాలా కష్టపడి చివరకు ఈ స్థాయికి చేరుకున్నారని నేను అనుకుంటున్నాను.

ప్రధానమంత్రి: మీ అమ్మానాన్నల్లో చాలామంది డాక్టర్లు అని నాకు తెలిసింది.  

 

చెస్ ఒలింపియాడ్ విజేత: అవును, నా తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు, నా సోదరి కూడా డాక్టర్. నా చిన్నప్పుడు, తెల్లవారు జామున 2 గంటలకు రోగుల నుండి ఫోన్ కాల్స్ ను వారు అందుకోవడం, వారు ఆ రోగులను చూసేందుకు వెళ్ళడం గమనించే వాడిని. కాబట్టి నేను మరింత స్థిరమైన వృత్తిని ఎంచుకుంటానని అనుకున్నాను. కానీ క్రీడలకు కూడా చాలా పరిగెత్తాల్సిన అవసరం ఉందని తరువాత నేను గ్రహించాను!

చెస్ ఒలింపియాడ్ విజేత:  సర్, మీరు ప్రతి క్రీడను, ప్రతి అథ్లెట్ ను ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం నేను ఎప్పుడూ చూస్తుంటాను. మీకు క్రీడల పట్ల ప్రగాఢమైన అనుబంధం ఉన్నట్టు  నేను గుర్తించాను. దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకోవాలని ఉంది- చెబుతారా ?

ప్రధానమంత్రి: తప్పకుండా చెబుతాను. ఒక దేశం కేవలం దాని సంపద, పరిశ్రమలు లేదా జీడీపీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందదని నేను గట్టిగా నమ్ముతాను. ఏ దేశం అయినా అన్ని రంగాల్లోనూ రాణించాలి. సినిమా పరిశ్రమ అయితే అత్యధిక ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. సైన్సు అయితే అత్యధిక నోబెల్ బహుమతులు లక్ష్యంగా పెట్టుకోవాలి. అదేవిధంగా క్రీడల్లో మన పిల్లలు అత్యధిక బంగారు పతకాలు సాధించాలి. ఒక దేశం ఈ విభాగాల్లో రాణించినప్పుడే అది నిజంగా గొప్ప దేశంగా మారుతుంది. నేను గుజరాత్ లో ఉన్నప్పుడు 'ఖేల్ మహాకుంభ్' (క్రీడా మహోత్సవం) ను ప్రారంభించాను, ఇందులో లక్షలాది మంది పిల్లలు పాల్గొన్నారు. వృద్ధులను కూడా ఆడాలని ప్రోత్సహించాను. ఫలితంగా ప్రతిభావంతులైన పిల్లలు పుట్టుకొచ్చారు. మన యువతకు అపారమైన సామర్థ్యం ఉంది. రెండోది, దేశంలో మంచి సామాజిక వాతావరణం కూడా ఉండాలి. క్రీడాకారులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ జీవితంలోని అన్ని అంశాలలో క్రీడాస్ఫూర్తి ఒక సాంస్కృతిక ప్రమాణంగా ఉండాలని నేను భావిస్తున్నాను.

చెస్ ఒలింపియాడ్ విజేత: మీరు ప్రతిరోజూ చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కోవడం లో మాకు మీరు ఏ సలహా ఇస్తారు?

ప్రధానమంత్రి: శారీరక దృఢత్వం (ఫిజికల్ ఫిట్ నెస్)  చాలా ముఖ్యం. మనలో చాలా మంది శారీరకంగా దారుఢ్యం కలిగినవారమే. మీరు అయితే బహుశా ఒక శిక్షణా నియమావళిని కూడా అనుసరిస్తారు. ఆటకు ముందు ఏం తినాలి, ఎంత తినాలి, ఏం తినకూడదో మీకు చెప్పి ఉంటారు. ఇలాంటి అలవాట్లు అలవర్చుకుంటే అన్ని రకాల సమస్యలను జీర్ణం చేసుకోవచ్చని నా నమ్మకం. సానుకూల మైనా, ప్రతికూల మైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎంతో సమాచారం అవసరం. ఆహ్లాదకరమైనది మాత్రమే వినాలని కోరుకోవడం మానవ నైజం, కానీ అది నిర్ణయాలలో తప్పులకు దారితీస్తుంది. మీరు అన్ని రకాల సమాచారాన్ని వినడానికి,  విభిన్న దృక్పథాలను అర్థం చేసుకోవడానికి, వాటిని మీరే విశ్లేషించడానికి ప్రయత్నించాలి. ఏదైనా అస్పష్టంగా ఉంటే సంకోచం లేకుండా నిపుణులతో నివృత్తి చేసుకోవాలి. అప్పుడే సవాళ్లను అధిగమించడం మీకు సులభం అవుతుంది. కొన్ని విషయాలు అనుభవంతో తెలుస్తాయి. ఇంకా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, యోగా,   ధ్యానం అసలైన శక్తిని అందిస్తాయి. 

చెస్ ఒలింపియాడ్ విజేత: సర్, మేం రెండు వారాలు ఆడాం. ఇప్పుడు అలసిపోయాం. కానీ మీరు ఏళ్ల తరబడి విరామం తీసుకోకుండా రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. నేను అడగాలనుకుంటున్నాను. మీకున్న శక్తి వెనుక రహస్యం ఏమిటి? మీకు చాలా తెలుసు. మీరు ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ప్రతి క్రీడాకారుడు బాగా ఆడేలా వారిలో ఎంతో ఉత్సాహం నింపుతారు. నేను అడగాలనుకున్నాను. మీరు మాకు ఒక సలహా ఇవ్వగలిగితే, మీరు చదరంగాన్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు?

ప్రధానమంత్రి: చూడండి. జీవితంలో తృప్తిని ఎన్నడూ కోరుకోవద్దు. మీరు ఎప్పుడూ దేనితోనూ సంతృప్తి చెందకూడదు. ఎందుకంటే అప్పుడే మీరు అసలైన సంతృప్తి చెందడం ప్రారంభిస్తారు.

 

చెస్ ఒలింపియాడ్ విజేత: అందుకేనా సార్. మీరు మూడు గంటలు మాత్రమే నిద్రపోతారు!

ప్రధానమంత్రి: మనలో ఎప్పుడూ ఒక జిజ్ఞాస ఉండాలి. కొత్తగా ఏదైనా చేయాలని, ఇంకా ఏదైనా చేయాలనే తపన ఉండాలి.

చెస్ ఒలింపియాడ్ విజేత:  మేం అప్పుడే టోర్నమెంట్ గెలిచాం. మేం బస్సులో తిరిగి వస్తుండగా మీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా చూశాం. భారత్ రెండు చరిత్రాత్మక బంగారు పతకాలు సాధించిందని, అందరం కలిసి బస్సులో ఉన్నామని మీరు ప్రపంచానికి ప్రకటించారు. ప్రపంచం ముందు మీరు ఇలా ప్రకటించడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నేను 1998 లో నా మొదటి ఒలింపియాడ్ ఆడాను. ఆ సమయంలో, గ్యారీ కాస్పరోవ్, కార్పోవ్ వంటి క్రీడాకారులు ఆడుతున్నారు. మేం వారి ఆటోగ్రాఫ్ లు తీసుకోవడానికి పరిగెత్తేవాళ్లం. అప్పట్లో భారత్ ర్యాంకింగ్ చాలా తక్కువగా ఉండేది. కానీ ఈసారి నేను కోచ్ గా వెళ్లినప్పుడు గుకేష్, బ్రహ్మానందం, అర్జున్, దివ్య, హారిక రావడం చూశాను. ఇప్పుడు వారి ఆటోగ్రాఫ్ లు తీసుకోవడానికి జనం పరుగులు తీస్తున్నారు. భారతదేశం నంబర్ వన్‌గా ఉండాలి అనే మీ దూరదృష్టి కారణంగానే ఈ మార్పు, కొత్త తరం ఆటగాళ్లపై ఈ విశ్వాసం రావడానికి కారణం. ఇది  ఆ మార్పు జరుగుతోందనిపిస్తోంది, సర్.

చెస్ ఒలింపియాడ్ విజేత: ఇంత తక్కువ సమయంలో మమ్మల్ని కలిసినందుకు ధన్యవాదాలు. మీరు అమెరికాలో ఉన్నా మా కోసం సమయం కేటాయించారు. మాకు  నిజంగా ఇది ఎంతో ఉత్తేజాన్ని ఇస్తోంది. 

ప్రధానమంత్రి: నా విలువ మీ అందరిలో ఉంది. ఇది మనకు మాత్రమే కాదు, చదరంగం ఆడే ఇతరులకు కూడా గొప్ప ప్రేరణగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వారు కూడా బాగా ఆడటానికి,  మిమ్మల్ని చేరుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఇది వారికి మరింత స్ఫూర్తినిస్తుంది. అవును, కొన్నిసార్లు ఇతరులు విజయం సాధించడం చూస్తే, మనం కూడా అలా చేయగలమనే ఉత్సాహం మనకూ వస్తుంది. నేను గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పెద్ద చదరంగం పోటీ నిర్వహించాను.

చెస్ ఒలింపియాడ్ విజేత: అవును సర్, ఆ ఈవెంట్ లో ఇరవై వేల మంది కలిసి చదరంగం ఆడారు,వారిలో చాలా మంది అంతకు ముందు ఎప్పుడూ చదరంగం ఆడలేదు.

ప్రధానమంత్రి: ఆ సమయంలో కొందరు పుట్టి ఉండకపోవచ్చు! మోదీ ఏం చేస్తున్నారని ప్రజలు ఆశ్చర్యపోయారు. 20,000 మందికి కూర్చునే వసతి ఏర్పాటు చేయడానికి పెద్ద స్థలం అవసరం. కాబట్టి నేను ఒక పెద్ద గుడారాన్ని నిర్మించాను. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నారని అధికారులు కూడా ప్రశ్నించారు. "దీనికోసమే ఖర్చు పెడతాను" అని చెప్పాను.

చెస్ ఒలింపియాడ్ విజేత: సర్, ఆ సమయంలో మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించినప్పుడు, నేను చాలా సంతోషించాను. ఆ క్షణం నుంచి చదరంగానికి నా సర్వస్వం అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి భారత్ కు పతకాలు సాధించడమే నా ఆశయంగా చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. 

ప్రధానమంత్రి: అప్పుడు మీరు కూడా ఉన్నారా!

చెస్ ఒలింపియాడ్ విజేత: అవును సర్. మీరు ఆ పోటీ నిర్వహించినప్పుడు అందులో పలువురు అమ్మాయిలు కూడా పాల్గొన్నారు.

 

ప్రధానమంత్రి: వావ్ (ఆశ్చర్యం)! మరి ఆ ఈవెంట్ కి మిమ్మల్ని ఎలా తీసుకొచ్చారు?

చెస్ ఒలింపియాడ్ విజేత:  నేను ఆసియా అండర్-9 ఛాంపియన్ షిప్ గెలిచాను. గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న ఒక పెద్ద ఈవెంట్ గురించి ఎవరో మా అమ్మకు చెప్పారు. అప్పుడే నన్ను ఆహ్వానించారు.

ప్రధానమంత్రి: నేను దీన్ని ఉంచుకోవచ్చా?  

చెస్ ఒలింపియాడ్ విజేత:  తప్పకుండా సర్. ఇది మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వాలనుకున్నా . సర్, కానీ... 

ప్రధానమంత్రి: చింతించకండి. ఇది నాకు చాలా ప్రత్యేకమైన జ్ఞాపకం. నేను ఇచ్చిన శాలువాను నువ్వు ఉంచుకున్నావా?

చెస్ ఒలింపియాడ్ విజేత:  అవును సార్, అది నాతోనే ఉంది.. 

ప్రధానమంత్రి: గ్రేట్. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు. విజయాలు సాధిస్తూనే ఉండండి!

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage