మీ అందరికీ అనేకానేక అభినందనలు!
మానవత కోసం మహోన్నత కార్యం పూర్తి చేసుకొని మీరంతా తిరిగి వచ్చారు. ఎన్డీ ఆర్ ఎఫ్ కావచ్చు, సైన్యం కావచ్చు, వైమానిక దళం కావచ్చు, ఇతర సేవా బృందాలు కావచ్చు.. ‘ఆపరేషన్ దోస్త్’ లో పాలుపంచుకున్న మీ మొత్తం బృందం చాలా గొప్ప పని చేసింది. మన నోరు లేని మూగ జీవాలైన శునక బృందం కూడా అద్భుతమైన ప్రతిభ కనబరచింది. దేశం మీ అందరినీ చూసి గరవిస్తోంది.
మిత్రులారా,
మన సంస్కృతి మనకు వసుధైవ కుటుంబకమ్ ( ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే భావన ఇచ్చింది. ఇది చాలా యస్ఫూర్తిదాయకమైన మంత్రం.
అయం నిజః పరోవేతి గుణనా లఘుచేతసామ్, ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకమ్
అంటే, విశాల హృదయం ఉన్నవారికి తన, పర భేదం ఉండదు. వాళ్ళకు ప్రపంచమంతా ఒక కుటుంబం. అందుకే అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రతి జీవినీ తమ కుటుంబంలో ఒకరిగానే భావిస్తారు.
మిత్రులారా,
తుర్కియా కావచ్చు, సిరియా కావచ్చు.. మొత్తం బృందం ఒక విధంగా ఈ భారతీయ విలువలను పాదుకొల్పింది. మనం మొత్తం ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావిస్తాం. ఈ కుటుంబంలో ఏ ఒక్కరికీ ఆపద వచ్చినా, తక్షణ సాయం అందించటం భారత దేశం తన విధిగా భావిస్తుంది. దేశం ఏదైనా సరే, మానవతాదృక్పథమే కీలకమని భావిస్తూ భారతదేశం స్పందిస్తుంది.
మిత్రులారా,
ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఎంత త్వరగా సహాయం అందించగలిగామన్నది చాలా ముఖ్యం. ప్రమాద సమయాల్లో స్వర్ణ గంట (గోల్డెన్ అవర్) అంటారు కదా, అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా స్వర్ణ సమయం ఉంటుంది. సహాయక బృందం ఎంత వేగంగా చేరుకున్నాదనేది చాలా ముఖ్యం. తుర్కియాలో భూకంపం సంభవించిన తరువాత మీరు అత్యంత వేగంగా అక్కడికి చేరుకున్న తీరు యావత్ ప్రపంచం దృష్టినీ ఆకట్టుకుంది. మీ సంసిద్ధతకు, మీ శిక్షణ తీరుతెన్నులకు అది అద్దం పడుతోంది. మీరు పది రోజులపాటు నిర్విరామంగా చేసిన కృషి నిజంగా స్ఫూర్తిదాయకం. అక్కడి ఫోటోలన్నీ చూశాం. శిథిలాలకింద ఉన్న ప్రాణాన్ని వెలికితీసి మళ్ళీ చిరునవ్వులు చిందింపజేసినందుకు మీ నుదుటిని ముద్దాడి ఒక తల్లిని చూశాం. అది మీ కృషి వల్లనే జరిగింది. ఒక విధంగా మీరు కూడా ప్రాణాలొడ్డి శిథిలాలు తొలగించారు. కానీ, అక్కడి నుంచి వస్తున్న ఫోటోలు చూసినప్పుడు యావత్ దేశం గర్వంతో పొంగిపోయింది. వృత్తినైపుణ్యంతో మానవ సున్నితత్వాన్ని ప్రదర్శించిన భారత బృందం నిరుపమానమైనది. అంతా కోల్పోయినవ్యక్తి మళ్ళీ స్పృహలోకి వస్తున్నప్పుడు, బాధతో విలవిలలాడుతున్నప్పుడు చేసే సాయం మరింత విశిష్టమైనది. ఆర్మీ ఆస్పత్రి, దాని సిబ్బంది అలాంటి పరిస్థితుల్లో ప్రదర్శించిన సున్నితత్వం కూడా అభినందనీయం.
మిత్రులారా,
తుర్కియాలోనూ, సిరియాలోనూ వచ్చిన భూకంపం 2001 లో గుజరాత్ ను ధ్వంసం చేసిన భూకంపం కంటే చాలా రేట్లు ఎక్కువ తీవ్రమైనది. అది గత శతాబ్దపు అతిపెద్ద భూకంపం. గుజరాత్ లో భూకంపం సంభవించినప్పుడు చాలాకాలం ఒక వాలంటీరుగా పాల్గొన్నాను. శిథిలాల తొలగింపులో, శిథిలాల కింద మనుషులను గుర్తించటంలో, అక్కడి ఆహార కొరత, మందులు, ఆస్పత్రులవంటి చాలా సమస్యలుంటాయి. గుజరాత్ భూకంపం సమయంలో భుజ లోని ఆస్పత్రి మొత్తం ధ్వంసమైంది. ఒక విధంగా వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. నేను స్వయంగా చూశాను. అదే విధంగా 1979 లో మోర్బీలో మచ్చు డామ్ కూలిపోయినప్పుడు మొత్తం గ్రామం కొట్టుకుపోయింది. మోర్బీ నగరమంతా ధ్వంసమైంది. వందలాది మంది చనిపోయారు. నేనక్కడ సహాయక చర్యలలో వాలంటీరుగా నెలల తరబడి పనిచేశాను. నా అనుభవాలు గుర్తు చేసుకుంటూ మీరు అక్కడ చేసిన శ్రమను, అంకితభావాన్ని, మీ అనుభూతులను అర్థం చేసుకోగలను. మీరు సహాయక చర్యలలో నిమగ్నమైనప్పుడు మీ అనుభవాన్ని ఊహించగలను. అందుకే మీకు అభివాదం చేస్తున్నా.
మిత్రులారా,
ఎవరైనా తనకు తాను సాయం చేసుకుంటే అది స్వయం సమృద్ధి. కానీ, ఇతరులకు సాయం చేయగలిగితే నిస్వార్థపరుడు అని అర్థం. అది వ్యక్తులకే కాదు, దేశానికీ వర్తిస్తుంది. గడిచిన కొన్నేళ్లలో భారతదేశం తన స్వయం సమృద్ధితోబాటు నిస్వార్థతను కూడా బలోపేతం చేసుకుంది. భారత బృందాలు త్రివర్ణ పతాకంతో ఎక్కడికి చేరుకున్నా, సాయం అందుతుందని, పరిస్థితి మెరుగుపడుతుందని అక్కడి ప్రజలలో ధీమా వస్తుంది. సిరియాలో ఒక పెట్టె మీద భారత త్రివర్ణ పతాకం తలక్రిందులు కావటం చూసి ఒక పౌరుడు సరిదిద్ది భారత్ ను గౌరవించటాన్ని మీరు గుర్తు చేశారు. కొంత కాలం కిందట ఉక్రెయిన్ లోనూ త్రివర్ణ పతాకం అలాంటి పాత్రే పోషించింది. అక్కడి నుంచి తరలిస్తున్నప్పుడు భారత పౌరులతోబాటు అనేక దేశాలవారికి మన త్రివర్ణ పతాకం ఒక కవచంలా పనిచేసింది. అందరికీ ఆశాజనకంగా నిలిచిన ‘ఆపరేషన్ గంగ’ అందుకు ఒక ఉదాహరణ. ‘ఆపరేషన్ దేవి శక్తి’ పేరుతో మన వాళ్ళను అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య ఆఫ్ఘనిస్తాన్ నుంచి సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చాం. కోవిడ సంక్షోభ సమయంలోనూ మనం అదే విధమైన అంకితభావం ప్రదర్శించాం. అలాంటి అనిశ్చిత వాతావరణంలో ఇతరదేశాల్లో చిక్కుబడిపోయిన భారతీయులందరినీ వెనక్కి తీసుకు వచ్చాం. ఇతర దేశాల ప్రజలకు కూడా ఎంతోమందికి సాయం చేశాం. వందలాది దేశాలలో అవసరమున్నవారికి అత్యవసర మందులు, టీకాలు అందజేశాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠ పెరిగింది.
మిత్రులారా,
మానవతావాద సాయం చేయటంలో భారతదేశ అంకితభావాన్ని, నిస్సహాయ స్థితిలో ఉన్న దేశాలకు సాయం చేయటానికి ముందుకు వచ్చే స్వభావాన్ని ‘ఆపరేషన్ దోస్త్’ ద్వారా చాటుకున్నాం. ప్రపంచంలో ఏ విపత్తు వచ్చినా, ముందుగా భారతదేశం స్పందిస్తుందనే విషయాన్ని ప్రపంచం గ్రహించింది. అది నేపాల్ భూకంపం కావచ్చు, మాల్దీవులలోనో, శ్రీలంకలోనో సంక్షోభం కావచ్చు భారత్ తక్షణం స్పందిస్తుంది. దేశంతోబాటు ఇతర దేశాలు కూడా భారత దళాలమీద, ఎన్డీఆర్ ఎఫ్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కొన్నేళ్ళుగా దేశ ప్రజలలో ఎన్డీ ఆర్ ఎఫ్ ఎంతో పేరు సంపాదించింది. దేశంలో ఏదైనా తుపాను లాంటి సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజలు మీ పట్ల విశ్వాసంతో ఉండగలుగుతున్నారు. తుపానులో, వరదలో, భూకంపాలో వచ్చినప్పుడు అక్కడికి మీ ఎన్ డీఆర్ ఎఫ్ సభ్యులు చేరుకోగానే ప్రజల్లో విశ్వాసం పెరుగుతాయి. ఇదొక పెద్ద సాధన. సున్నితత్వానికి నైపుణ్యం తోడైనప్పుడు దళం బలం అనేక రేట్లు పెరుగుతుంది. ఈ అద్భుత విన్యాసం చేసిన ఎన్ డీఆర్ ఎఫ్ కు ప్రత్యేక అభినందనలు.
మిత్రులారా,
మీ ఏర్పాట్ల మీద దేశానికి విశ్వాసముంది. కానీ మనం ఇక్కడ ఆగిపోకూడదు. విపత్తుల సమయంలో మన సహాయక చర్యల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలి. మానవత కోసం మనం బాధ్యతాయుతంగా పనిచేశాం. అదే సమయంలో అలాంటి భారీ విపత్తుల నుంచి మనం ఎంతో నేర్చుకున్నాం. ఆలా పనిచేసే క్రమంలో పది కొత్త విషయాలు కూడా నేర్చుకుంటాం. మరింత మెరుగ్గా చేసి ఉండగలమనే విషయం గ్రహిస్తాం. ఇతరులు అనుసరించే విధానం కూడా నేర్చుకుంటాం. అది మన సామర్థ్యాన్ని పెంచుతుంది. మనం తుర్కియా లో పది రోజుల పాటు మన బాధ్యత నెరవేర్చాం. కానీ అక్కడి మన అనుభవాలను నిక్షిప్తం చేయాల్సి ఉంది. ఈ విపత్తు నుంచి కొత్తగా మనం ఏం నేర్చుకున్నాం? అలాంటి సవాళ్ళు ఎదురైనప్పుడు మన సామర్థ్యం ఎలా మెరుగుపరచుకోవాలి? ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన ఆడ బిడ్డలు అక్కడికి వెళ్ళారు. మన ఆడపిల్లల ఉనికి వల్ల అక్కడి మహిళల్లో నమ్మకం పెరిగింది. వాళ్ళ బాధలు, వాళ్ళ ఫిర్యాదులు మొహమాటం లేకుండా నేరుగా చెప్పుకోగలుగుతున్నారు. అలాంటి క్లిష్టమైన పనులకు మహిళలను పంపి ఇబ్బంది పెట్టటం ఎందుకని అనుకున్నాం. కానీ ఆ తరువాత పంపాలని నిర్ణయించారు. సంఖ్యా పరంగా తక్కువే అయినా, ఈ చొరవ వల్ల అక్కడ సంబంధాలు ఏర్పరచుకోవటం సాధ్యమవుతుంది.
మిత్రులారా,
మీరు ఎంతగానో కృషి చేశారని, ఎంతో నేర్చుకున్నారని నమ్ముతున్నా. మీరు చేసిన కృషి వల్ల దేశ గౌరవం పెరిగుంది. మీ సంక్షేమం గురించి ఎప్పటికప్పుడు కనుక్కుంటా. అలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా పనిచేసి మీరు దేశ గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడింపజేశారు. మీరు ఎంతో నేర్చుకున్నారు. అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. మీకు మరోమారు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ రోజే రావటం వలన మీరు బాగా అలసిపోయి ఉంటారు. అయినాసరే, గత పది రోజులుగా మీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా. ఆవిధంగా మానసికంగా మీతో అనుబంధం సాగుతూనే ఉంది. మీరు చేసిన అసాధారణ కృషికి గాను మిమ్మల్ని ఇక్కడికి పిలిచి అభినందించాలనుకున్నా. మీకు మరోసారి నా అభినందనలు. ధన్యవాదాలు!